29, ఏప్రిల్ 2022, శుక్రవారం

'అమ్మ ..' పద్యాలు

#కందము 

అమ్మను మించిన దైవము

కమ్మని లాలన గల యొడి కలదా జగతిన్..

అమ్మకదా మన సర్వము

నమ్మే తొలి గురువు నయ్యె నక్షరమగుచున్..!!


#కందము 

తన్మయమును బొందు జనని

చిన్మయ రూపుడని ముద్దు సేయుచు శిశువున్..

జన్మ తరింపగ నవ్వులె

సన్మానమదియని తలచి సాకుచు మురియున్.!!


#కందము 

పెంచును ప్రేమను మమతలు 

పంచుచు నమ్మే సకలము పాపకు చూడన్

యెంచదు భారముననుచును

కంచెగ మారుచునుతాను కాచును శిశువున్..!!


#కందము 

తల్లి యొడిన జేరగనే

త్రుళ్ళుచునాడును శిశువులు దోగాడుచునే...

మెల్లన యడుగుల ముద్దుగ

మళ్లించును దృష్టి నంత మాటల తోడన్..!!

Sujathanagesh..✍️✍️

 

9, ఏప్రిల్ 2022, శనివారం

దేవదేవుడెక్కినదె దివ్యరథము మావంటివారికెల్ల మనోరథము - అన్నమయ్య కీర్తన


 



దేవదేవుడెక్కినదె దివ్యరథము

మావంటివారికెల్ల మనోరథము


జలధి బాలులకై జలధులు వేరఁజేసి
పగటునఁ దోలెనదె పైడిరథము
మిగులగ కోపగించి మెరయురావణుమీద
తెగియెక్కి తోలెనదె దేవేంద్ర రథము
దిక్కులు సాధించి సీతాదేవితో నయోధ్యకు
పక్కన మరలిచె పుష్పకరథము
నిక్కు నరకాసురుపై నింగిమోవ నెక్కి తోలె
వెక్కసపు రెక్కలతో విష్ణు రథము
బలిమి రుఖ్మిణి దెచ్చి పరులగెల్చి యెక్కె
అలయేగుబెండ్లి కల్యాణరథము
యెలమి శ్రీవేంకటాద్రి నలమేలుమంగ గూడి
కలకాలమును నేగె ఘనమైన రథము!

డా. ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల గారు ఇచ్చిన విశ్లేషణ :

తెలిసినంతలో విశ్లేషణ
******************
చిన్నపిల్లల అక్షరమాల పుస్తకాలలో కూడ ర- దగ్గర రథము బొమ్మ ఉంటుంది. రథము అనే పదం వినగానే మనఊరి గుడి రథంనుంచి ,శ్రీవారి బ్రహ్మోత్స వాలలో వాడే స్వర్ణరథం, దారువు( కొయ్యరథం) వరకూ ఎన్నోగుర్తొస్తాయి। స్వామినీ , అమ్మవార్లను రథం మీద ఊరేగించడంఅన్నిటికన్నా గొప్ప సేవ అని చెబుతారు. రథోత్సవంతో సాధారణంగా ఉత్స వాలు ముగుస్తాయి. రథం పదం మనకు అనేక పురాణ గాథలను గుర్తు చేస్తుంది. ఉదాహరణకు రామాయణంలో సీతారాములు నూతన దంపతులుగా రథంలో అయోధ్యకు రావడం, సుమంత్రుడు వారిని అయోధ్య పొలిమేరలలో దింపి రావడం , యుద్ధంలో రాక్షసుల రథాలు, భారతంలో కంసుడు దేవకీ వసుదేవులను రథం మీద తీసుకొని వెళుతుంటే ఆకాశవాణి మాటలు, రుక్మిణీ కల్యాణం, నరకాసుర వథ, కర్ణుని రథ చక్రాలు భూమిలోకి కుంగడం, భీష్మ పర్వంలో ఘట్టాలు …. అన్నిటికన్నా కురుక్షేత్ర ప్రారంభంలో నిర్వీర్యుడైన అర్జునునికి భగవానుడు గీతబోధించడం ….. ఎన్నో వందల కథలున్నాయి.
బ్రహ్మోత్సవాలను తిరుమల శ్రీవేంకట నాథునికి మొదటగా జరిపినవాడు బ్రహ్మ. ఈనాటికీ ఉత్సవానికి ముందు బ్రహ్మరథం నడపడం ఆనవాయితీ।
మనస్సులోని బలమైన కోరిక, చాలా గౌరవించటం అనే అర్థంలో మనోరథం, బ్రహ్రరథం అనే పేర్లు మీరు వినే ఉంటారు।
ఇక మన్మథుడిని శివుడిమీదకు యుద్ధానికి పంపుతూ కామధేనువు పూలరథం ఇచ్చిందంటారు పోతనగారు. ఇట్లా రథాలగురించి పెద్ద గ్రంథమే వ్రాయవచ్చు।
ఇక అన్నమయ్య కీర్తనలో విశేషాలు చూద్దాం.
తిరుమల శ్రీనివాసుని రథోత్సవం చూసిన అన్నమయ్యకు గుర్తొచ్చిన రథాలే కీర్తనగా రూపొందాయి.
మొట్టమొదట అంతా నీరే ఉండేది. ఆ జలధిని విభజించి భూ భాగాలను ఏర్పరచి వాటిని పరిపాలించే పాలకులను ఏర్పాటు చేసిన నియామకుడైన నారాయణుడు అదుగో బంగారు రథమెక్కి ఊరేగుతున్నాడు. ఇది స్వామికి దివ్యరథం, మనకు మనోరథం. (మన మనోరథములను తీర్చగలడని భావం)
రామరావణ యుద్ధం జరుగుతోంది.
రావణుడు రథంమీద ఉండటం , రాముడు నేలమీద ఉండటం సహించలేని దేవేంద్రుడు మాతలితో తన రథాన్ని, రథంతో పాటు ధనువు, కవచము, శక్తి కూడ పంపించాడు. దేవేంద్రుని కోరిక మన్నించి రాముడు రథమధిరోహించి రావణునితో సమరం సాగించాడు. ఆ దేవేంద్ర రథమే ఇది… అని అన్నమయ్య శ్రీవారి బంగరు తేరును చూచి పరవశిస్తున్నాడు.
విజయుడైన శ్రీరాముడు పత్ని సీతమ్మతో అయోధ్యకు వెళ్ళడానికి ఎక్కింది పుష్పక రథం. ఈ రథం ఆరథాన్ని తలపిస్తోంది.
ఇక నిక్కు( గర్వం) గల నరకాసురుడిని చంపడానికి బయలుదేరిన కృష్ణుడితో పాటు బయలుదేరింది సత్యభామ। అప్పుడు రథంనడిపే దారుకుడిని రావద్దని తానే నడిపింది సత్యభామ।అది రెక్కలుగల రథం!
ఇక రుక్మిణిని తనకు అడ్డుపడిన వారందరినీ గెలిచి తెచ్చుకున్నది రథం మీదనే. అలమేలు మంగమ్మతో ఊరేగే ఈ శ్రీనివాసుని ఘనమైన రథం నాటి రథానికి ప్రతిబింబంలా ఉంది.
అంటున్నాడు అన్నమయ్య.
ఈ దేహమే రథం. ఆ రథసారథి మన బుద్ధి. ఇంద్రియాలే గుర్రాలు. పాప పుణ్యాలే చక్రాలు. మనస్సే పగ్గం. రథం పదంలో ఇంత పరమార్థముంది.
ఇదే తేటగీతిగా వ్రాసాను చూడండి.
తే.గీ॥
తనువరదము, నింద్రియములు దాని తురగ
ములగు, సారథి జూడగ బుద్ధి , మాన
సమగు పగ్గము లద్దాని చక్రములన
పాప పుణ్యములని దెలిసి బ్రతుక వలయు
స్వస్తి🙏

చిత్రకారులు శ్రీ పొన్నాడ మూర్తి గారికి కృతజ్ఞతలు🙏
~~~~~~~~~~~~~॥
డా. ఉమాదేవి జంధ్యాల


6, ఏప్రిల్ 2022, బుధవారం

వినోబా భావే - భూదానోద్యమ నేత

charcoal pencil sketch

భారతదేశంలోని పల్లెల్లో జీవించే సగటుజీవి అనుభవించే కష్టాలకు సమస్యలను అన్వేషించడంలో చాలా కృషిని సలిపారు. కొన్నింటికి ఆధ్యాత్మిక ధోరణి సమంజసం అని కూడా భావించారు. ఈ ధోరణి క్రమేణా సర్వోదయా ఉద్యమానికి దారితీసింది. వినోబా భావేతో మమేకం చెందిన మరొక మహత్తర కార్యక్రమం భూదానోద్యమం. నూతన తరహాలో నడచిన ఈ భూదానోద్యమ ప్రచారంలో భాగంగా, దేశం నలుమూలలు పాదయాత్ర చేశాడు. ప్రతీ భూకామందుని వ్యక్తిగతంగా, తనను కొడుకుగా భావించి, కొంతైనా భూమిని యివ్వాలని ప్రార్థించాడు. అలా సేకరించిన భూమిని పేదలకు దానం ద్వారా పంచి పెట్టాడు. అహింసప్రేమలను మేళవించిన విధానం ఆయన తత్వం. వినోబా అంటే వెంటనే స్ఫురించే అంశం - గోహత్య విధాన నిర్మూలనం.


మరిన్ని వివరాలు క్రింది లింక్ క్లిక్ చేసి చదవండి. 


https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8B%E0%B0%AC%E0%B0%BE_%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B5%E0%B1%87



పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...