17, జులై 2022, ఆదివారం

ఆకటి వేళల అలపైన వేలల తేకువ హరినామమే దిక్కు మరి లేదు - అన్నమయ్య కీర్తన


ఈ వారం అన్నమయ్య కీర్తన - ఆకటి వేళల అలపైన వేళలను :
చిత్రం : పొన్నాడ మూర్తి
సహకారం : శ్రీమతి Ponnada Lakshmi.
ఆకటి వేళల అలపైన వేళల
తేకువ హరినామమే దిక్కు మరి లేదు
కొఱమారియున్న వేళ కులము చెడిన వేళ
చెఱవడి వొరుల చేజిక్కినవేళ
వొఱపైన హరినామమొక్కటే గతి గాక
మఱచి తప్పిననైన మఱి లేదు తెరగు
ఆపద వచ్చిన వేళ ఆరడి బడిన వేళ
పాపపు వేళల భయపడిన వేళ
వోపినంత హరినామ మొక్కటే గతి గాక
మాపు దాకా పొరలిన మరిలేదు తెరగు
సంకెల బెట్టిన వేళ చంప బిలిచిన వేళ
అంకిలిగా నప్పుల వారాగిన వేళ
వేంకటేశు నామమే విడిపించ గతినాక
మంకు బుద్ది పొరలిన మరిలేదు తెరగు

భావం :

విశ్వాత్ముడు, విశ్వేసుడు, విశ్వమయుండైన ఆ విధాత తప్ప అన్యులెవరూ మనల్ని కష్టాల నుంచి, కన్నీళ్ళ నుంచి తప్పించలేడు. ఆర్తితో ఒక్కమారు ఆ ఆపద్బాంధవుణ్ణి వేడుకుంటే చాలు. ఎన్ని బాధల బంధాల నుంచైనా విడుదల చేయించగలడు.
అదే విశ్వాసాన్ని అన్నమయ్య ఈ కీర్తనలో పరమాత్ముని ప్రార్ధించాడు.
ఆకలిగా ఉన్నవేళ అలసిపోయిన వేళ ఇలా ఎప్పుడైనా ఆ శ్రీహరి నామమే మనకు శరణ్యం. ఆ దివ్య నామమే “తేకువ” అంటే ధైర్యమని గుర్తుచేస్తున్నాడు.
‘కొరమాలి ఉన్నవేళ, కులము చెడిన వేళ … అన్న చరణంలో ఎందుకూ కొరగాని దుస్ఠితి దాపురించినప్పుడు, కులము చెడినప్పుడు, ఇతరుల చెరలో చిక్కి కష్టాలు అనుభవిస్తున్నప్పుడు, ఒరపైన అంటే ప్రకాశవంతమైన శ్రీహరి నామమే శరణమని, అంతకు మించిన మార్గమే లేదని ఆంటున్నాడు అన్నమయ్య.
ఆపద వచ్చిన వేళ ఆరడి పడిన వేళ .. అనే చరణంలో అహంకారాన్ని విడిచి బాధ్యతనంతా ఆ భగవానుడిపైనే వేస్తే తనే మన చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు అని అన్నమయ్య భావన.
"సంకెళబెట్టిన వేళ చంపబిలిచిన వేళ" .. ఈ చరణంలో సంకెళ్ళు వేసినా, చంపడానికి శత్రువులు దరిదాపులోకి వచ్చినా, పాప పుణ్యాలనే అప్పులు తీర్చమని కాలపురుషుడే అడ్డంగా నిలబడినా ఆ దీనబాంధవుడైన వేంకటేశుని నామమే గతియని, దానిని వదలి మంకుబుధ్ధితో అంటే మూర్ఖత్వంతో ఎంత ప్రయత్నించినా మరో దారి లేదని ముగుంపు పలుకుతున్నాడు అన్నమయ్య,

(శ్రీమతి బి. కృష్ణకుమారి గారి వ్యాఖ్యానం ఆధారంగా)

Sudershanacharya Tulasi
Like
Comment
Share

0

 

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...