22, జులై 2022, శుక్రవారం

ఏమని చెప్పఁగవచ్చు నిదివో నీ ప్రతాపము రామ రామభద్ర సీతారమణ సర్వేశ -- అన్నమయ్య కీర్తన


 


ఏమని చెప్పఁగవచ్చు నిదివో నీ ప్రతాపము రామ రామభద్ర సీతారమణ సర్వేశ            //పల్లవి // 

వెరవున హరువిల్లు విరుఁగఁ దీసిననాఁడే అరయ విరిగె వీపు లసురలకు వరుస వనవాసపు వ్రతము వట్టినపుడె పరులమతుల భీతి వట్టె రఘురామ         //ఏమని // 

వచ్చి నీవు దండకావనము చొచ్చిననాఁడే చొచ్చిరి పాతాళ మసురలెల్లాను ముచ్చటాడి చుప్పనాతిముక్కు గోసిననాఁడే కొచ్చి దైత్యు లాసదెగఁ గోసిరి శ్రీరామ        //ఏమని // 

అడరి మారీచుపై నమ్ము విడిచిననాఁడే విడిచిరి దానవులు వేడుకలెల్లాను బడి విభీషణునిఁ జేపట్టితే రక్కసులెల్లా చిడిసి మల్లెవట్టిరి శ్రీవేంకటరామ              //ఏమని //

 

భావము

ఉపాయముతో నీవు శివధనుస్సును విఱిచినపుడే వీరులైన రాక్షసుల వెన్నెముకలు విఱిగిపోయాయి. వనవాసం చేయుట అనే వ్రతానికి నీవు పూనినపుడే శత్రువులైన అసురుల మనస్సులలో భయం జనించింది

నేర్పుతో దండక అనే అడవిలోనికి నీవు ప్రవే శించినపుడే రక్కసులు భీతిచెంది బలిచక్రవర్తి నివాసమైన పాతాళం చేరి దాగుకొన్నారు

అవక తవకగా మాటాడిన సూర్పణఖ  పొడుగుపాటి ముక్కును నీవు తెగగోయించినపుడే దుర్మార్గులైన దానవుల ఆశలన్నీ తెగిపోయినవి. విజృంభించి నీవు మారీచునిపై బాణం వేసిననాడే దైత్యులు తమ సంబరములు మాని వేసినారు. శరణాగతుడైన విభీషణునికి నీవు ఆశ్రయ మొసగినపుడే సీతా పతీ !శ్రీనివాసా !దనుజులకు చీడ పట్టినది

(భావమూలము :విద్వాన్ ముదివర్తి కొండమాచార్యుల వారి అమృత సారము) అన్నమయ్య సంకీర్తన సంఖ్య 281సంపుటం 4 స్వర కర్త :శ్రీ జోశ్యభట్ల రాజశేఖర శర్మ గారు


(కీర్తన SVBCTTD APP వారి సౌజన్యంతో )


చిత్రాలు : పొన్నాడ మూర్తి 

ఈ క్రింది లింక్ క్లిక్ చేసి ఈ కీర్తనను అద్భుతంగా గానం చేసిన చి. జొన్నలగడ్డ శ్రీకర్ గొంతులో వినవచ్చును.

https://www.youtube.com/watch?v=LQHnCTorloU


ధన్యవాదాలు 

 


 

కామెంట్‌లు లేవు:

మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి

  'మహామహోపాధ్యాయ' వైణికుడు ఈమని శంకరశాస్త్రి - నా చిత్ర నివాళి (వివరాలు WhatsApp ద్వారా సేకరణ.. అందించిన అజ్ఞాత వ్యక్తికి నా ధన్...