4, అక్టోబర్ 2022, మంగళవారం

ఎదురా రఘుపతికి నీ విటు రావణా! నేడిదేమి బుధ్ధి తెలిసి తిట్లాయె బ్రతుకు. !! - ఆన్నమయ్య కీర్తన


 మిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. విజయదశమి సందర్భంగా ఉత్తరాదిన 'రావణ సంహారం' ఘట్టం చాలా ఘనంగా చేస్తారు. ఈ సందర్భంగా ఓ అన్నమయ్య కీర్తన మననం చేసుకుందాం. భావం సౌజన్యం : డా. ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల.

ఎదురా రఘుపతికి నీ విటు రావణా!
నేడిదేమి బుధ్ధి తెలిసి తిట్లాయె బ్రతుకు. !!
హరుని పూజలు నమ్మిహరితో మార్కొనగ
విరసమై కూలితివి వెర్రి రావణా!
వరుసతోడ బ్రహ్మ వరము నమ్మి
రాముని శరణనకుండానే సమసెగా కులము. !!
జపతపములు నమ్మి సర్వేశు విడువగా
విపరీతమాయెగా వెర్రి రావణా!
వుపమలన కడు తానున్న జలనిధి నమ్మి
కపుల పాలైతివిగా కదనరంగమున.. !!
బంటతనము నమ్మి పైకొన్న రాఘవు
వింట బొలసితివిగా వెర్రి రావణా!
యింటనే శ్రీ వేంకటేశ్వరుని గొలిచి
వెంటనే సుఖియాయె విభీషణుడు. !!
ఈ వారం అన్నమయ్య కీర్తన
‘ఎదురా రఘుపతికి నీవిటు రావణా!’
విశ్లేషణ-డా. ఉమాదేవి జంధ్యాల
~~🔹🙏🏼🔹~~
‘దసరా పండగ’ను శ్రీరామచంద్రుడు దశకంఠుని సంహరించి, సీతాదేవిని రక్షించి, లంకకు విభీషణుడిని ప్రభువును చేసి సీతాసమేతుడై, లక్ష్మణునితో అయోధ్యకు తరలివెళ్ళి జరుపుకున్న విజయోత్సవంగా కొన్ని ప్రాంతాలలో జరుపుతారు. ఆరోజు రావణుని చిత్రాన్ని బాణసంచాతో దహిస్తారు. జై శ్రీరామ్ అనే నినాదాలు మిన్నంటుతాయి.
అందువలన ఆ రావణుడి వైఖరిని తలుచుకుంటూ అన్నమయ్య వ్రాసిన
“ఎదురా రఘుపతికి నీవిటు రావణా!”అనే కీర్తన గురించి నాకు అర్థమైన భావం మీతో పంచుకుంటాను.
🔹శ్రీమద్రామాయణంలో శ్రీరామునితో వైరం పెట్టుకున్న రావణుడిని తలుచుకుంటే అన్నమయ్యకు ఆ దశకంఠుడి వెర్రితనానికి అయ్యో పాపం … అనిపించింది.
తలలు పదిఉంటేనేం ఆ తలలలో
తెలివేది?! ఆయన ఆలోచనలే ఈ కీర్తనగా రూపుదిద్దుకున్నాయి.
“రావణా! ఎంత మతిలేని వాడవైనావయ్యా! పులస్త్యబ్రహ్మ పౌత్రుడివి , అన్నీ తెలిసిన వాడివి… శిరస్సులనే సమిధలుగా వ్రేల్చి అనన్య సాధ్యమైన తపస్సు చేసి బ్రహ్మనే మెప్పించి, రప్పించి వరాలను పొందిన వాడివి… ఇప్పుడీ విధంగా బుద్ధిహీనుడవై ఆ శ్రీరాముడితోనే వైరం పెట్టుకున్నావా? ఆ రఘుకులతిలకునికి ఎదురేముంది! ఆయన తలుచుకుంటే నువ్వెంత … నీ లంకెంత? తెలివి తక్కువ వాడివి కాదే! అపారమైన శివభక్తి కలవాడివి. ఆ పరమశివుని ఆత్మలింగాన్నే సంపాదించిన వాడివి! ‘ఇంత తెలిసి యుండి ఈ గుణమేలర ‘ అన్నట్లు హరుని ఆరాధిస్తూ హరిని ద్వేషించడం నీవంటి వాడికి తగునా! శివకేశవ భేదాన్ని చూపిన వాడు మహాపాతకుడని వినలేదా? బ్రహ్మను వరాలు కోరడంలోనూ నీ అహంకారమూ , అజ్ఞానమూ కనబడుతూనే ఉంది. నీ కంటికి యక్ష కిన్నర గంధర్వ కింపురుషాది దేవగణములు , దేవతలు తప్ప మానవులు ఆగలేదు. వరమడగడం లో ఎవరిని తేలికచేసావో ఆ మానవుడిగానే అవతరించి ఆ శ్రీమన్నారాయణుడు ఇక్ష్వాకు వంశంలో పుట్టి రాముడనే పేరుతో నిన్ను సంహరించబోతున్నాడు.ఆ బ్రహ్మ నిన్ను మానవుల వలన తప్ప ఇతరుల వలన చావుండదని వరమీయడంలోని కిటుకు గమనించని వెర్రివాడివి. ఆ చతుర్ముఖుని మాటలు నమ్మి పరమేశ్వరుడు కూడా ఆరాధించే సర్వేశ్వరుడైన హరిని, ఆ హరి అవతారమైన రాముని విస్మరించావు.”అని ఉసూరుమంటాడు.
ఎదురా రఘుపతికి అనడంలో మనకు చాలా విషయాలు గుర్తుకొస్తాయి.
రాముడెక్కడ ! రావణుడెక్కడ!
బలి విసిరిన పాచీకను ఎత్తలేక పోయినవాడు రావణుడు. ఆ బలినే పాతాళానికి అణగద్రొక్కినవాడు వామనుడు. ఆ వామనుడే గదా ఈ రాముడు.
రావణుడు కార్తవీర్యుని జయించి ఉండవచ్చు. కానీ ఆ కార్తవీర్యుని తెగనరికిన పరశురామునికే గర్వభంగం చేసిన వాడు శ్రీరాముడు!
శివధనువును కనీసం ఎత్తలేక పోయినవాడు రావణుడు. ఆ శివధనువును ఎక్కుపెట్టి పుటుక్కున విరిచిన వాడు శ్రీరాముడు.
రావణుడిని వాలి తోకతో చుట్టి విసిరి పారేసాడు. ఆ వాలినే సంహరించిన వాడు శ్రీరాముడు.
ఇవన్నీ మరిచిపోయాడో లేక మదోన్మత్తుడై విస్మరించాడో ఆ రామునితోనే తగవు పెట్టుకున్నాడు.
‘వినాశకాలే విపరీతబుద్ధి’ అని నానుడి కదా!
ఇన్ని సంగతులున్నాయి అన్నమయ్య ఒక్క ఎదురా రఘుపతికి అనడంలో!!
ఇంకా అన్నమయ్య ఇలా అంటాడు.
“రావణా! ఆ శ్రీరాముడు శరణాగత వత్సలుడు! శరణు కోరితే నీ తప్పులన్నీ క్షమించేవాడుకదా! శరణు కోరకపోవడంతో కులమే సమసి పోయింది”.
రావణుడు అహంకారి. స్వాతిశయంతో ఉచితానుచితాలు మరిచిన వాడు.
శరణు కోరమని ఎంత చెప్పిచూసాడు రుద్రతేజుడైన హనుమంతుడు!
ఆ మహానుభావుడిని వానరాధముడంటూ అవమానించాడు. దూతగా వచ్చిన వాడిని హతమార్చాలనుకున్నాడు.
శరణు కోరమని తమ్ముడు విభీషణుడెంత మొత్తుకున్నాడు!
పోగాలము దాపురించిన వారికి హితోక్తులు తలకెక్కవు గదా!
కీర్తనలో అన్నమయ్య రావణుడి అజ్ఞానానికి పరాకాష్ఠ అనిపించే విషయమొకటి గుర్తు చేసుకొని నవ్వుకొని ఉంటాడు. అదేమిటంటే..
“రావణా! నీవెంత అవివేకివి! సముద్రానికి అవతల ఉండటం పెద్ద ఉపాయంగా భావించావు. మానవులు రాలేరనుకున్నావు! చివరికి నరులకన్నా ముందు వానరుడే సముద్రమూ లంఘించాడు. వానరులంతా కలిసి ఊహించని విధంగా వారధినీ నిర్మించారు।
నీ పరాక్రమం మీద నీకెంత నమ్మకమయ్యా! నేనే మొనగాడినని రొమ్ము విరుచుకొని ప్రవర్తించి ఆ రాముని వింటికి బలైపోయావు.నీలాగా విర్రవీగి తిరగకుండా నీ తమ్ముడు ఉన్నచోట ఉండి తన హృదయంలో ఆ హరినే నమ్మి సుఖించాడు చూడు! నీ పొగరుబోతు పనులతో నీవు సాధించినదేమిటి? ఓ వెర్రిరావణా! ఆ రఘుపతికి ఎదురువెళ్ళి గెలవగలవా! ఎదురులేని అవక్ర పరాక్రమవంతుడు ఆ రామచంద్రుడు! ఆయనే గదా నేటి ఈ వేంకటపతి!” అని అన్నమయ్య ఎంతటి వారికైనా హరితో వైరం పెట్టుకోవడం వినాశహేతువే నని తనకీర్తనతో హితవు పలికి లోకాన్ని హెచ్చరించాడు
*కొన్ని పదాలకు అర్థాలు
బంటతనము- వీరత్వము
ఉపమ- ఉపాయము
సమయు- నశించు
*కీర్తన సారాంశం నా పద్యంలో.
****
మ ॥
సరియే రామునకీభువిన్ నరులనన్ సాకేత ధామంబునన్
ధరజన్మించెను రావణున్ దునుమగా దైత్యారి యావిష్ణువే
వరకోదండము బూనిపోరుసలిపెన్ పౌలస్త్యునేగూల్చగన్
హరితో వైరము బూనుదుష్టులకుదాహారంబుగానిల్వదే!
May be a cartoon of standing

d 2 others

కామెంట్‌లు లేవు:

The power of 'Will' Usage - English grammar - illustration

  When we use will to make a promise 🤝 or an offer 💡, we are usually deciding to do something at the very moment we are speaking. It shows...