ఎంత చక్కటి చిత్రమో 😍
ఆటవెలది //
ముందు చూపు గలిగి ముందునిద్ర యనుచు
కన్ను మూసి మంచి కలలు గనుచు
హాయిననుభవించు రేయి పగలు
యంత దూర దృష్టి వింత గొలిపె!
( నా చిత్రకళను ప్రశంసిస్తూ ఈ చిత్రానికి పద్యం రచించిన శ్రీమతి జానకి గంటి గారికి ధన్యవాదాలు )
ఆటవెలది //
ముందు చూపు గలిగి ముందునిద్ర యనుచు
కన్ను మూసి మంచి కలలు గనుచు
హాయిననుభవించు రేయి పగలు
యంత దూర దృష్టి వింత గొలిపె!
( నా చిత్రకళను ప్రశంసిస్తూ ఈ చిత్రానికి పద్యం రచించిన శ్రీమతి జానకి గంటి గారికి ధన్యవాదాలు )
_*ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారి జయంతి సందర్భంగా సమర్పిస్తున్న ఈ నా వ్యాసం వారి రాగాలాపనలాగే కాస్త సుదీర్ఘంగా ఉంటుంది. ఓపికతో చదవాలి.*_
*(ర)సాలూరు సంగీత సారస్వతం... రాజే(శ్వ)స్వరరావు*
*...ఆచారం షణ్ముఖాచారి*
_తెలుగు చలనచిత్ర స్వర మాంత్రికుడు సాలూరు రాజేశ్వరరావు జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ అందిస్తున్న వ్యాసమిది. అందరి సంగీత దర్శకుల వ్యవహార శైలి ఒకటిగా వుంటే రాజేశ్వరరావు శైలి తద్భిన్నంగా, వినూత్నంగా వుండి, అందరి దృష్టిని ఆకర్షించేది. ఆత్మాభిమానానికి రాజేశ్వరరావు ఇచ్చిన విలువ ధనార్జనకు ఇవ్వలేదంటే ఆశ్చర్యం వేస్తుంది. తను నమ్మిన సిద్ధాంతాన్ని ఏనాడూ సడలించని మనస్తత్వం రాజేశ్వరరావుకు సొంతం. పాటనుబట్టి వాయిద్యాలనిర్ణయం జరగాలే తప్ప వున్నాయికదా వాయిద్యాలు వాడుకుందాం అనే భావనను ఎప్పుడూ ఆయన దరిచేరనీయ లేదు. జానపద, సాంఘిక చిత్రాల పాటలకు ఎన్ని వాద్యపరికరాలు వుండాలి, పాశ్చాత్య ధోరణి పాటకైతే ఎన్ని వాయిద్యాలును వాడాలి అనే ఖచ్చితమైన లెఖ్ఖలు రాజేశ్వరరావు దగ్గర వుండేవి. జానపద పాటలకు ఫ్లూటు, డప్పులు, జముకు, డోలక్, క్లారినెట్, పంజా, షెహనాయి వంటి వాద్యపరికరాలను రాజేశ్వరరావు ఎక్కువగా వాడేవారు. వెస్ట్రన్ ట్యూన్ ఆధారిత పాటలకు యాభైకి పైగా వయొలిన్లు వాడిన సందర్భాలు రాజేశ్వరరావు కు కోకొల్లలు. చంద్రలేఖ సినిమాలో సెల్లోలు, హేమాండ్ ఆర్గాన్, ఎలెక్ట్రిక్ గిటార్, ట్రంపెట్లు, త్రోంబోన్, సింథసైజర్, జిప్సీలు వాడే వాద్య పరికరాలు వుపయోగించి ఒక నూతన ఒరవడి సృష్టించిన ఆ మహనీయుని గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం._
*బాల రసాల సాలూరు...*
సాలూరు రాజేశ్వరరావు అక్టోబరు 11, 1921 న విజయనగరం జిల్లా సాలూరుకు దగ్గరలో వుండే శివరామపురం లో జన్మించారు. మంగమ్మ, సన్యాసిరాజు ఆయన తల్లిదండ్రులు. తండ్రి మంచి కవి, మృదంగ విద్వాంసుడు. విజయనగరం రాజాస్థానంలో ఆయన పనిచేసేవారు. సన్యాసిరాజు వాయులీన విద్వాంసులు ద్వారం వెంకటస్వామి నాయుడు కచేరీలకు మృదంగం వాయించేవారు. రాజేశ్వరరావు కు చిన్నతనం నుంచే సంగీతం మీద ఆసక్తి వుండేది. హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసు కార్యక్రమాలకు రాజేశ్వరరావు క్రమం తప్పకుండా వెళ్ళేవారు. ఆయనవద్ద హరికథలు చెప్పడంలో శిక్షణ తీసుకొని అప్పుడప్పుడు పెళ్లి పందిళ్ళలో సరదాగా హరికథలు చెప్పేవారు. ద్వారం వారి శిష్యరికంలో త్యాగరాయ కృతులు, వర్ణాలు నేర్చుకున్నారు. దసరా ఉత్సవాలకు ఈ బాలరాజేశ్వరరావు పల్లెటూర్లలో హరికథా కాలక్షేపం చేసేవారు. విశాఖపట్నంలో రాజేశ్వరరావు తన సోదరుడు హనుమంతరావుతో కలిసి కచేరి చేసినప్పుడు వైణిక విద్వాంసులు సంగమేశ్వర శాస్త్రి వీరికి బంగారు పతకం బహూకరించారు. అప్పుడే హచ్చిన్స్ రికార్డింగ్ కంపెనీ వారు కొత్త గాయకుల అన్వేషణలో విజయనగరానికి వచ్చి, రాజేశ్వరరావు ప్రతిభను గుర్తించి, బెంగుళూరు తీసుకెళ్ళి భగవద్గీత తోబాటు కొన్ని పాటలు పాడించి రికార్డులు విడుదల చేశారు. వేల్ పిక్చర్స్ వారు 1934 లో ‘శ్రీకృష్ణలీలలు’ సినిమా తీసేందుకు ప్రయత్నాలు జరుపుతున్న తరుణంలో గూడవల్లి రామబ్రహ్మం, పి.వి. దాసు బెంగుళూరులో రాజేశ్వరరావు పాడిన రికార్డులు విని అతనికి శ్రీకృష్ణుడు వేషాన్ని కరారు చేశారు. అలా పన్నెండేళ్ళ వయసులో బెరుకు లేకుండా రాజేశ్వరరావు ఆ చిత్రంలో నటించారు. ఆ సినిమా 1935 నవంబరు 23న విడుదలై విజయదుందుభి మ్రోగించింది. ఆరోజుల్లో ‘శ్రీకృష్ణలీలలు’ సినిమా ప్రచారంలో భాగంగా కరపత్రాలు విసరడానికి హెలికాప్టర్ సేవలను వినియోగించడం గొప్పగా చెప్పుకున్నారు. తరవాతి సంవత్సరం వేల్ పిక్చర్స్ వారు ‘మాయాబజార్’ చిత్రాన్ని నిర్మించారు. అందులో రాజేశ్వరరావు అభిమన్యుడి వేషం వేశారు. ఆ తరవాత న్యూ థియేటర్స్ వారు ‘కీచక వధ’ సినిమా నిర్మిస్తూ అందులో ఉత్తరుడుగా నటించేందుకు రాజేశ్వరరావును ఎంపికచేసి కలకత్తా తీసుకెళ్ళారు. అక్కడ రాజేశ్వరరావుకు కె.ఎల్. సైగల్, పంకజ్ మల్లిక్ వంటి సంగీత నిష్ణాతులతో పరిచయం యేర్పడింది. వారి సహవాస ఫలితంగా రాజేశ్వరరావుకు హిందుస్తానీ సంగీతం మీద ఆసక్తి పెరిగి ఉస్తాద్ ఫయాజ్ ఖాన్ వద్ద ఆ సంగీతపు మెలకువలు ఆపోశన పట్టారు. మరోవైపు హార్మోనియం, సుర్ బహార్, సితార్ వంటి సంగీత పరికరాలను ఉపయోగించడం నేర్చుకున్నారు. న్యూ థియేటర్స్ కు చెందిన ఆర్.సి. బోరల్, పంకజ్ మల్లిక్ లవద్ద ఆర్కెస్ట్రా ఎలా కండక్ట్ చేయాలో తర్ఫీదుపొందారు. వాద్యపరికరాలను కలిపి రాగాలను సృష్టించడం వంటి మెలకువలన్నీ రాజేశ్వరరావు వారి దగ్గరే నేర్చుకున్నారు. ఆ మెలకువలు అవగతమయ్యాక సంగీత దర్శకత్వం నెరపాలనే కోరిక పెంచుకున్నారు. మద్రాసు తిరిగి వచ్చాక సంగీత దర్శకుడు జయరామయ్యర్ వద్ద సహాయకుడిగా చేరి ‘విష్ణులీల’ అనే తమిళ సినిమాకు పనిచేశారు. కన్నడంలో నిర్మించిన ‘వసంతసేన’ సినిమాకు ఆర్. సుదర్శనం వద్ద సహాయకునిగా పనిచేశారు.
*పద్దెనిమిదేళ్ళకే సంగీత దర్శకునిగా...*
రాజేశ్వరరావు ప్రతిభ గుర్తించిన శ్రీ శారదా రాయలసీమ ఫిలిమ్స్ వారు 1939లో ‘జయప్రద’ సినిమా నిర్మిస్తూ రాజేశ్వరరావును సంగీత దర్శకునిగా నియమించారు. రాజేశ్వరరావు బొంబాయి నుంచి రికార్డింగ్ పరికరాలను తెప్పించి పాటలు రికార్డు చేశారు. ఈ సినిమా పెద్దగా ఆడక పోవడంతో సంగీత దర్శకునిగా రాజేశ్వరరావుకు తగిన గుర్తింపు రాలేదు. 1940 లో గూడవల్లి రామబ్రహ్మం ఇందిరా దేవి ఫిలిమ్స్ పతాకం మీద ‘ఇల్లాలు’ సినిమా నిర్మిస్తూ రాజేశ్వరరావుకు ఒక వేషమిచ్చారు. గూడవల్లి నిర్మించే సినిమాలకు భీమవరపు నరసింహరావు ఆస్థాన సంగీత దర్శకుడు. అయితే రాజేశ్వరరావు తండ్రి సన్యాసిరాజు అభ్యర్ధన మేరకు రాజేశ్వరరావుకు సంగీత దర్శకత్వం వహించే అవకాశం కల్పించారు. ఈ సినిమాలో రాజేశ్వరరావు, రావు బాలసరస్వతి జంటగా నటించారు. అందులో వీరి జంట ఆలపించిన “కావ్యగానము చేసి కైపెక్కినానే, దివ్యలోకాలన్నీ తిరిగొచ్చినానే” అనే పాట బాగా పాపులరైంది. రాజేశ్వరరావు ‘ఇల్లాలు’ సినిమాలో ప్లేబ్యాక్ పధ్ధతి ప్రవేశపెట్టి సఫలీకృతులయ్యారు. రికార్డింగ్ మొత్తం జెమినీ స్టూడియోలో జరిగినప్పుడు రాజేశ్వరరావు చొరవను ఎస్.ఎస్. వాసన్ గమనించారు. తన స్టూడియోలో సంగీత విభాగంలో రాజేశ్వరరావు కు చోటు కలిపించారు. జెమినీ ఫిలిం సర్క్యూట్ నిర్మించిన జీవన్ముక్తి (1942), బాలనాగమ్మ (1942) సినిమాలకు రాజేశ్వరరావు సంగీత దర్శకత్వం వహించారు. జీవన్ముక్తి లో “జయజయ పరమాత్మా సకల భువన కారణా”, “దాశరథే దయాశరదే”, “మేలుకో జీవా తూర్పు తెలవారే” పాటలు; బాలనాగమ్మ సినిమాలో “నా సొగసే కని మరుడే దాసుడు కాడా”, “శ్రీ జయజయ గౌరీ రమణా” వంటి పాటలు బాగా పాపులరయ్యాయి. బాలనాగమ్మ సినిమాకు రాజేశ్వరరావు చేసిన రీ-రికార్డింగు అద్భుతమని, ముఖ్యంగా మాయల ఫకీరు ప్రవేశంలో వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ కి పెద్దవాళ్ళు కూడా జడుసుకునేవారని చెప్పుకునేవారు. జెమినీ వారు నిర్మించిన ‘చంద్రలేఖ’ (1946) తమిళ/హిందీ సినిమాకు రాజేశ్వరరావు సమకూర్చిన సంగీతం ఆయన కీర్తిని ఇనుమడింపజేసింది. ముఖ్యంగా డ్రమ్ డ్యాన్సు సంగీతానికి రాజేశ్వరరావు అహర్నిశలు శ్రమించారు. రకరకాల ప్రయోగాలు చేశారు. ఈ డ్రమ్ డ్యాన్స్ పాటకోసం మద్రాసులో వున్న వాద్యకారులందరి సేవలు వినియోగించుకున్నారు. వారు సరిపోక పోలీసు బ్యాండ్ దళాన్ని, నేవీ బ్యాండ్ దళాన్ని కూడా వుపయోగించుకున్నారు. ఈజిప్టు, ఆఫ్రికా దేశాలనుంచి జిప్సీలు వాడే వాద్యపరికరాలను దిగుమతి చేసుకొని వాటిని ఉపయోగించేందుకు వదలకొద్దీ రిహార్సల్స్ చేయించారు. ఈ సినిమా సంగీతాన్ని పూర్తిచేసేందుకు సుమారు ఏడాది సమయం పట్టిందంటే ఆలోచించండి రాజేశ్వరరావు ఎంతగా శ్రమించి ఉంటారో! తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మించిన ఈ సినిమా విడుదలైనప్పుడు హిందీ చలనచిత్రసీమకు చెందిన సంగీత పండితులు, సాంకేతిక కళాకారులు, ఆ సినిమా సంగీతాన్ని, చిత్రీకరణను తిలకించి పులకించిపోయారు. పాతికేళ్ళు కూడా నిండని ఓ కుర్రాడు ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడంటే నమ్మలేకపోయారు. తరవాత జెమినీ వారు నిర్మించిన ‘అపూర్వ సహోదరులు’, ఆ చిత్ర హిందీ వర్షన్ ‘నిషాన్’ (1950) లకు రాజేశ్వరరావు సంగీతం సమకూర్చారు. అదే సమయంలో బి.ఎన్. రెడ్డి ‘మల్లీశ్వరి’ (1951) సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రాజేశ్వరరావుకు పిలుపొచ్చింది. ఈ సినిమా పాటలు స్వరపరచి రికార్డింగ్ చెయ్యడానికి ఆరునెలల సమయం పట్టింది. దేవులపల్లి కృష్ణశాస్త్రి పాటలు రాసిన తరవాతే రాజేశ్వరరావు వాటికి స్వరాలు సమకూర్చారు. ఆర్కెస్ట్రా సహకారాన్ని ఆద్దేపల్లి రామారావు అందించారు. అందులో “ఎందుకే నీకింత తొందరా”, “ఎవరు ఏమని విందురు”, కోతిబావకు పెళ్ళంట”, “పరుగులు తీయాలి”, “మనసున మల్లెల మాలలూగెనే” పాటలు నేటికీ అజరామరాలే. ఆ సినిమా ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. 1954 లో భానుమతి నిర్మించిన ‘విప్రనారాయణ’ సినిమాకు శాస్త్రీయ సంగీత బాణీలతో అద్భుత సంగీతాన్ని అందించారు రాజేశ్వరరావు. “ఎందుకోయీ తోటమాలీ అంతులేని యాతన”, “చూడుమదే చెలియా కనులా”, “పాలించర రంగా”, “మధుర మధురమీ చల్లని రేయి”, ”మేలుకో శ్రీరంగ మేలుకోవయ్యా” మొదలైన పాటలు ఘంటసాలతో కాకుండా ఎ.ఎం.రాజా, భానుమతి కాంబినేషన్లో పాడించి హిట్ చేయడం రాజేశ్వరరావు ప్రతిభే. “ఎందుకోయీ తోటమాలి” పాట బాణీ రాజేశ్వరరావుకు సిటీ బస్సులో ప్రయాణం చేస్తుండగా స్పురించింది. బస్సు దిగిన వెంటనే భరణీ స్టూడియోకి వెళ్లి వెనువెంటనే ఆ పాటకు పూర్తి స్థాయి బాణీని స్వరపరచడం జరిగింది. ముందుగా అల్లిన స్వరానికి సముద్రాల రాసిన పాట అది. విజయా వారి మిస్సమ్మ చిత్రంలో కూడా రామారావుకి రాజా చేత పాటలు పాడించి ప్రయోగం చేశారు రాజేశ్వరరావు. “ఔనంటే కాదనిలే, కాదంటే ఔననిలే”, “తెలుసుకొనవె యువతి”, “బృందావనమది అందరిదే”, “రావోయి చందమామా” పాటలు ఇందుకు ఉదాహరణలు. అదే సినిమాలో రాజేశ్వరరావు స్వరపరచిన “కరుణించు మేరిమాతా” పాట క్రైస్తవుల మందిరాలలో నేటికీ తరచూ వినిపిస్తూనే వుంటుంది. ఈ సినిమాని ఎ.వి.ఎం వారు హిందీలో ‘మిస్ మేరి’ గా పునర్నిర్మించినప్పుడు సంగీత దర్శకుడు హేమంత్ కుమార్ “బృందావనమది అందరిది” పాట బాణీని యధాతధంగా వాడుకోవడం జరిగింది. ఇందుకోసం హేమంత్ కుమార్ రాజేశ్వరరావు దగ్గర సమ్మతి తీసుకోవడం కూడా సత్సంప్రదాయం గా అమరింది. తరవాత ఎ.వి. ఎం వారి భక్త ప్రహ్లాద, బి.ఎ. సుబ్బారావు గారి ‘చెంచులక్ష్మి’, వాహినీ వారి ‘రంగులరాట్నం’, ‘బంగారు పంజరం’, బి. ఎస్. రంగా గారి ‘అమరశిల్పి జక్కన్న’, అన్నపూర్ణా వారి ‘ఇద్దరు మిత్రులు’, ‘ఆత్మగౌరవం’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘ఆత్మీయులు’, పి.ఎ.పి. వారి ‘భార్యాభర్తలు’, జగపతి వారి ‘ఆరాధన’ వంటి సినిమాలకు రాజేశ్వరరావు వైవిధ్యమైన సంగీతం సమకూర్చారు. తెలుగులో వచ్చిన తొలి డబ్బింగ్ చిత్రం ‘ఆహుతి’ (1950-హిందీలో నీరా అవుర్ నందా) సినిమాకు శ్రీశ్రీ స్వేచ్చనువాదంతో పాటలు రాస్తే రాజేశ్వరరావు వాటిని హిట్ చేసి చూపారు. “ప్రేమయే జనన మరణ లీల”, “ఊగిసలాడేనయ్యా పడవ” పాటలు అలాంటివే. ‘అమరశిల్పి జక్కన్న’ (1964) సినిమాలో రాజేశ్వరరావు స్వరపరచిన “ఈ నల్లని రాలలో యే కన్నులు దాగెనో”, ”నిలువుమా నిలువుమా నీలవేణి”, “అందాల బొమ్మతో ఆటాడవా” (జావళి), “నగుమోము చూపించవా గోపాలా” (జావళి), “ఎదో గిలిగింత ఏమిటీ వింత” పాటలు నేటికీ నిత్యనూతనంగా భాసిల్లుతున్నాయి. ముఖ్యంగా రాజేశ్వరరావు ఇందులో వాద్యాలను ఉపయోగించిన తీరు పరమాద్భుతం.
*అద్భుతాల స్వరమాంత్రికుడు ...*
పాటలే కాదు, పౌరాణిక సినిమాలలో వుండే పద్యాలకు అద్భుతమైన బాణీలు కట్టి, తక్కువ ఆలాపనతో వాటిని హిట్ చేసిన ప్రతిభాశాలి రాజేశ్వరరావు. పద్యాలను ఘంటసాల, మాధవపెద్ది, పి.బి. శ్రీనివాస్ ల చేత ఆలపింపజేసిన తీరుగొప్పగా వుంటుంది. మద్రాసులో వాహినీ స్టూడియో కార్మికులు సమ్మె చేసిన సందర్భంలో అన్నపూర్ణా వారి ‘చదువుకున్న అమ్మాయిలు’ సినిమా షూటింగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అప్పట్లో పాటల రీ-రికార్డింగ్ పనులు మద్రాసులో జరుగుతుండేవి. ఆ సదుపాయాలు హైదరాబాదు సారథి స్టూడియోలో లేవు. అందుకు నాందీ ప్రస్తావన చేసిన మహనీయుడు రాజేశ్వరరావే. సమ్మె సమయంలో కొంతమంది ముఖ్య వాద్యకారుల్ని హైదరాబాదు రప్పించి, స్థానిక కళాకారుల సహకారంతో పాటల రికార్డింగు, రీ-రికార్డింగ్ పనులు సజావుగా పూర్తిచేయించిన ఘనత రాజేశ్వరరావుకే దక్కుతుంది. రాజేశ్వరరావు మ్యూజిక్ సిట్టింగులకు ఆలస్యంగా వెళ్ళేవారు. అందుకు ఒక కారణముంది. అర్ధరాత్రి రేడియోలో బి.బి.సి, వాయిస్ ఆఫ్ అమెరికా వంటి విదేశీ ఛానళ్ళలో వచ్చే సంగీతాన్ని వింటూ, మంచి ట్యూనులు స్పురిస్తే వాటి నోటేషన్లను రాసుకుంటూ, ఎప్పుడో తెల్లవారు ఝామున నిద్రపోయేవారు. ఆలస్యంగా నిద్ర లేచేవాళ్ళు. అందుకే మ్యూజిక్ సిట్టింగులకు, రికార్డింగులకు రావడం ఆలస్యమయ్యేది. వీణా వాద్యమన్నా, సితార వాద్యమన్నా రాజేశ్వరరావుకు యెంతో ఇష్టం. వీణ నేపథ్యంలో రాజేశ్వరరావు ఎన్నో గొప్పపాటలు సృష్టించారు. విదేశీ వాద్యాలతో రాజేశ్వరరావు ఎన్నో ప్రయోగాలు చేసేవారు. బెంగాలి సంగీతాన్ని, ఆఫ్రికన్ జిప్సీ సంగీతాన్ని శ్రద్ధగా విని, మంచి బిట్లు వుంటే అనుకరించేందుకు వెనుకాడేవారు కాదు. రాజేశ్వరరావుకు సైగల్, నౌషాద్, సచిన్ దేవ్ బర్మన్, హేమంత్ కుమార్ సంగీతమంటే చాలా ఇష్టం. విదేశీ సింఫనీలనుండి ప్రేరణ పొందేవారు. పాటకు మాతృక ఫలానా అని చెప్పేందుకు వెనుకాడేవారు కాదు. రాజేశ్వరరావు తనయులు అందరూ సంగీత విద్వాంసులే. పెద్దబ్బాయి రామలింగేశ్వరరావు మంచి పియానో ప్లేయర్ కాగా, పూర్ణచంద్రరావు, వాసూరావు మంచి సంగీత దర్శకులు. కోటి విషయానికొస్తే ఆయన ఎన్నో చిత్రాలకు అద్భుత సంగీతం అందించారు. సింధుభైరవి, కల్యాణి, మాలకోస్, భీమ్ పలాస్, మోహన రాగాలంటే రాజేశ్వరరావుకు చాలా ఇష్టం. రాజేశ్వరరావు 150 చిత్రాలకు పైగా సంగీత దర్శకత్వం వహించారు. తెల్లటి పంచె, లాల్చీ వస్త్రధారణతో బెంగాలి బాబులను మరపించే రాజేశ్వరరావు సంగీతం అజరామరం... అమరం!!
*మరిన్ని విశేషాలు ...*
చరిత్రలో ఒక క్లాసిక్ గా నిలిచిపోయిన ‘మల్లీశ్వరి’ చిత్రంలో “మనసున మల్లెల మాలలూగెనే” పాట రికార్డింగుకు ముందు రిహార్సల్స్ జరుగుతున్నాయి. భానుమతి ఆ పాటను ప్రాక్టీస్ చేస్తూ రాజేశ్వరరావు చెప్పిన పద్ధతిలో కాకుండా తనదైన శైలిలో పాడుతోంది. రాజేశ్వరరావుకు ఆమె పధ్ధతి నచ్చలేదు. “అలలు కొలనులో గలగలమనినా” చరణాన్ని ‘’ఇలా పాడాలి’’ అని రాజేశ్వరరావు మరోసారి బాణీని పాడి వినిపించారు. భానుమతికి ఉక్రోషం వచ్చింది. “నేనూ సంగీతంలో మాస్టర్నే” అని పెడసరంగా బదులిచ్చింది. రాజేశ్వరరావు యేమీ మాట్లాడలేదు. బాత్ రూముకు వెళ్ళినట్లే వెళ్లి ఇంటికి వెళ్ళిపోయారు. ఇది జరినప్పుడు దర్శకుడు బి.ఎన్. రెడ్డి అక్కడ లేరు. గంటన్నర తరవాత వచ్చి చూస్తే ఆర్కెస్ట్రా వాళ్ళు మాత్రమే వున్నారు. రాజేశ్వరరావు కనపడలేదు. తబలా వాద్యకారుడు లక్ష్మణరావు జరిగిన విషయాన్ని బి.ఎన్. కు వివరించి చెప్పాడు. బి.ఎన్. హుటాహుటిన రాజేశ్వరరావు ఇంటికి వెళ్ళారు. “ఈ సినిమా చేయడానికి నాకు ఏమీ అభ్యతరం లేదు. భానుమతికి ఉందేమో కనుక్కోండి” అంటూ రాజేశ్వరరావు తనదైన శైలిలో చెప్పారు. బి.ఎన్. భానుమతికి కబురంపి కాస్త గట్టిగానే మందలించారు. భానుమతి రికార్డింగుకు వచ్చి రాజేశ్వరరావు చెప్పిన పద్ధతిలోనే పాడింది. పాట రికార్డు చేశారు. రికార్డింగ్ అయ్యాక అందరూ ఆ పాట ఎలా వచ్చిందోనని వింటున్నారు. “అలను కొలనులో” చరణం వచ్చింది. భానుమతి లేచివచ్చి రాజేశ్వరరావుకు ప్రణమిల్లింది. “మాస్టారూ, హాట్స్ ఆఫ్. ఇప్పుడు వింటుంటే నాకు తెలుస్తోంది మీరు నన్ను యెందుకు హెచ్చరించారోనని. నేనే కాదు మున్ముందు మీరు చెప్పినదానికి యెవరు అడ్డు చెప్పినా వారికి పాడే అర్హత వుండదు” అంటూ నమస్కారం మీద నమస్కారం చేస్తూ చెప్పింది.
విజయా వారి ప్రతిష్టాత్మక చిత్రం ‘మాయాబజార్’ (1957) సినిమాకు మొదట సంగీత దర్శకుడిగా నియమించింది రాజేశ్వరరావునే. అందులో “చూపులు కలసిన శుభవేళా”, “లాహిరి లాహిరి లాహిరిలో”, “నీవేనా నను తలచినది”, “నీకోసమే నే జీవించునదీ” పాటలకు స్వరాలల్లి, మ్యూజిక్ బిట్లు కూడా సమకూర్చినది రాజేశ్వరరావే. ఐదవ పాటగా ‘కుశలమా కుశలమా నవ వసంత మాధురిమా’ అంటూ సాగే పల్లవిని బీంపలాస్ రాగంలో రాజేశ్వరరావు స్వరపరచారు. ఈ సమయంలో దర్శకుడు కె.వి. రెడ్డితో రాజేశ్వరరావుకి పొసగలేదు. కె.వి. రెడ్డి పద్ధతులు భిన్నంగా వుండేవి. పాటను కంపోజ్ చేసేటప్పుడు నిర్మాత, గేయ రచయిత, నృత్య దర్శకుడు, కళాదర్శకుడు కూడా ఉండాలనేది కె.వి. రెడ్డి నియమం. పాటకు ట్యూను కట్టేటప్పుడు సాహిత్య శైలి ఎలావుండాలి, ప్రతి సంగీత బిట్టుకి డ్యాన్స్ ఎలా అమరుతుంది, నటీనటుల భంగిమలు ఎలావుంటాయి వంటి అంశాలపై వీరు సూచనలు ఇచ్చేవారు. ఒక సందర్భంలో వీరంతా కూర్చొని వున్నప్పుడు కె.వి. రెడ్డి పాటను కంపోజ్ చేయమని రాజేశ్వరరావుకు చెప్పారు. సాలూరు వారికి ఆ పద్ధతి రుచించలేదు. పైగా మ్యూజిక్ సిట్టింగులలో చక్రపాణి జోక్యాన్ని రాజేశ్వరరావు జీర్ణించుకోలేక పోయారు. కోపం వచ్చింది. ‘’ఇది మ్యూజిక్ రూమ్ లా లేదు. కోర్టు హాలులా వుంది’’ అంటూ చిరాకుపడి లేచి వెళ్ళిపోయారు. దాంతో కె.వి. రెడ్డికి రాజేశ్వరరావుకి అభిప్రాయ భేదాలతోబాటు బహిరంగ పరచలేని మరికొన్ని కారణాలు తోడవడంతో రాజేశ్వరరావు తప్పుకున్నారు. ఆ స్థానంలో ఘంటసాల గారు సంగీత దర్శకత్వం వహించారు. “బాణీలు కట్టేటప్పుడు సంగీత దర్శకునికి స్వేచ్చ వుండాలి. సంగీతజ్ఞానం లేనివాళ్ళు, ఎంతపెద్ద నిర్మాతలైనా జోక్యం చేసుకుంటే మంచి సంగీత సృష్టి జరగదు” అని గట్టిగా నమ్మిన వ్యక్తి రాజేశ్వరరావు. అంతేకాదు ఆయన ఆత్మాభిమానానికి అత్యంత విలువనిచ్చే సంగీత స్రష్ట కూడా!
అన్నపూర్ణా సంస్థ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావుకు సాలూరు రాజేశ్వరరావు అన్నా, అతని సంగీతమన్నా విపరీతమైన అభిమానం. అన్నపూర్ణా పిక్చర్స్ సినిమాలకు సంగీత సారథి రాజేశ్వరరావే. వారు తొలి సినిమా ‘దొంగరాముడు’ నిర్మించదలచినప్పుడు రాజేశ్వరరావునే సంగీత దర్శకుడిగా తీసుకోవాలనుకున్నారు. అయితే రాజేశ్వరరావును భరించడం కష్టమని కొందరు సలహా ఇవ్వడంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నారు. అప్పుడు పెండ్యాల సారధ్యం వహించారు. తరవాత ‘వెలుగు నీడలు’ సినిమాకు రాజేశ్వరరావును సంగీత దర్శకుడిగా అనుకున్నా, కబురంపితే రాజేశ్వరరావు రాలేదు. ఆ అవకాశాలు కూడా పెండ్యాలకు దక్కాయి. తరవాత ఒకానొకసందర్భంలో ఇద్దరూ కలవడం జరిగింది. ‘’అన్నపూర్ణా సంస్థ నిర్మించే చిత్రాలకు మీరు పనిచెయ్యరా’’ అని దుక్కిపాటి అడిగిన ప్రశ్నకు రాజేశ్వరరావు తనదైన శైలిలో బదులిచ్చారు. “మీరు చాలా నిబద్ధతతో ఉంటారని. సమయానికి రాకపోతే కోప్పడతారని మా ఆర్కెస్ట్రా వాళ్ళు చెప్పారు. అందుకే రాలేదు” అనేది ఆ జవాబు. తర్వాత రాజేశ్వరరావు ’ఇద్దరు మిత్రులు’ చిత్రంతో అన్నపూర్ణలో అడుగుపెట్టి అజరామరమైన సంగీతాన్ని అందించారు. దుక్కిపాటి రాజేశ్వరరావుగారి ఇంటికి కారు పంపేవారు. “రాజేశ్వరరావు ఎప్పుడు వచ్చి కారేక్కితే అప్పుడే తీసుకురా. అంతేగాని, కారొచ్చింది ఎక్కండి అని మాత్రం అనవద్దు” అని డ్రైవర్ ను హెచ్చరించి మరీ కారు పంపేవారు. రాజేశ్వరరావు మనసెరిగి, ఆయన వీలున్నప్పుడు వచ్చి పాటలకు బాణీలు కట్టే విధంగా వాతావరణాన్ని సృష్టించడం చేతనే అన్నపూర్ణ వారి సినిమాలకు అత్యద్భుతమైన పాటలు పురుడుపోసుకొని నేటికీ శ్రోతలకు వీనుల విందు చేస్తున్నాయి.
వృత్తి ధర్మాన్ని నమ్ముకున్న రాజేశ్వరరావు డబ్బుకోసం ఆత్మాభిమానాన్ని అమ్ముకోలేదు సరికదా సంగీత సరస్వతికి అపచారం జరిగితే సహించలేదు కూడా. నిర్మాతల సరళి నచ్చక ‘కృష్ణవేణి’ సినిమా ను వదలుకున్నారు. ఎన్.టి. రామారావు సినిమాలు కూడా వదలుకున్న సందర్భాలు లేకపోలేదు. రామారావు సంస్థలో ఒక చిత్రానికి సంబంధించిన సంగీత చర్చలు జరుగుతున్నాయి. త్రివిక్రమరావు పదేపదే సలహాలు ఇస్తుండడం రాజేశ్వరరావుకు నచ్చలేదు. వెంటనే ఆయన లేచి ఎన్టీఆర్ వద్దకు వెళ్లి “సార్, మీ ఇంటిలోనే మంచి సంగీత దర్శకుడు వున్నారు. ఆయన ఎవరో కాదు మీ తమ్ములుం గారే. వారితో చేయించుకోండి” అంటూ వెళ్ళిపోయారు. ఈ సంఘటన ఎన్.టి. ఆర్ ప్రష్టాత్మక చిత్రం ‘సీతారామ కల్యాణం’ విషయంలోనే జరిగింది. ఆ సినిమాకు తొలుత సంగీత దర్శకుడు రాజేశ్వరరావే. “కానరార కైలాస నివాసా” పాటకు స్వరకర్త రాజేశ్వరరావే. ఈమని శంకర శాస్త్రి చేత రావణాసుర అష్టకానికి, పాటకు కూడా బిట్లు స్వరపరచిన మేధావి రాజేశ్వరరావు. కానీ త్రివిక్రమరావు జోక్యం సహించలేక బయటకు వచ్చేశారు. తరవాత గాలి పెంచల నరసింహారావు ఆ చిత్రానికి సంగీతం సమకూర్చారు.
మిస్సమ్మ (1955) సినిమా కు పింగళి రాసిన పాటలన్నీ రాజేశ్వరరావు పూర్తిచేశారు. చివరగా ‘బృందావనమది అందరిదీ’ పాటను రాజేశ్వరరావు ట్యూన్ చేస్తున్నారు. ఆయన హమ్ చేసిన ట్యూను చక్రపాణికి నచ్చలేదు. మరేదైనా ట్యూన్ వినిపించమన్నాడు. ‘’మీరే చెప్పండి సార్.. ట్యూన్ చేస్తాను’’ అని సర్కాస్టిక్ గా అన్నారు రాజేశ్వరరావు. చక్రపాణి వెంటనే తను చిన్నతనంలో వినిన ఒక పల్లెజానపదాన్ని హమ్ చేసి వినిపించాడు. ‘’అలాగే ట్యూన్ చేస్తాను’’ అని చెప్పి రాజేశ్వరరావు, తను తొలిసారి చేసిన ట్యూన్ నే మరలా వినిపించారు. ‘భేషుగ్గా వుంది’’ అని చక్రపాణి మెచ్చుకున్నాడు. హేమంత్ కుమార్ అంతటివాడు ఆ ట్యూన్ నే హిందీ చిత్రంలో అనుకరించడం ఆ పాట గొప్పతనం. ఏ.ఎం. రాజా చేత ఎన్టీఆర్ కు పాటలు పాడించే ముందు రాజేశ్వరరావు ఎన్టీఆర్ అభిప్రాయం తెలుకోవాలని ఆయన ముందు ఈ ప్రస్తావన తెచ్చారు. ఎన్టీఆర్ చాలా సమయస్పూర్తిని ప్రదర్శిస్తూ ‘’నేను నటించేవాడినే కానీ గాయకుడిని కాదు. మీరు ఎవరిచేత పాడించినా నాకు అభ్యంతరం లేదు’’ అని జవాబిచ్చారు. ఆ తరవాతే రాజేశ్వరరావు రాజా చేత అందులో పాటలు పాడించారు.
రాజేశ్వరరావు సరదామనిషి. హాస్యప్రియత్వం ఎక్కువ. ఒకసారి ఒక నిర్మాత రాజేశ్వరరావుకు ఫోను చేసి “కారు రిపేరులో వుంది. మీరు ఆటోలో రండి” అని చెప్పారు. రాజేశ్వరరావుకు కోపమొచ్చింది. రెండు గంటలు ఆలస్యంగా స్టూడియోకి చేరుకున్నారు. నిర్మాత “సార్... బాగా ఆలస్యమైనట్లుందే” అని అడిగారు. “అవున్ సార్.. తమరు ఆటోలో రమ్మన్నారు కదా. ఎక్కడా ఆటో దొరకలేదు. ఒక టాక్సీ దొరికింది. దాన్నెక్కి ఆటోకోసం తిరిగి తిరిగి, ఆ ఆటోని పట్టుకునేసరికి ఇంత టైమయింది. ఇవిగో టాక్సీ, ఆటో బిల్లులు” అంటూ చేతికందించారు. నిర్మాత బిక్కమొగం వేశాడు. ఇదీ రాజేశ్వరరావు చమత్కార సరళి.
జ్ఞాపకాల పరిమళాలు. -నేడు శ్రీ సాలూరి వారి జయంతి.
-ద్విభాష్యం రాజేశ్వరరావు.
' ఇంటర్వ్యూలో మీ ప్రశ్నలు సంసారపక్షంగా ఉన్నాయి సార్!....'
- కళాప్రపూర్ణ శ్రీ సాలూరి రాజేశ్వరరావు.
జనవరి 9వ తేదీ, 1984
ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ఫోన్ వచ్చింది.
"రాజేశ్వరరావు గారూ! రేపు మన స్టూడియోకి సినీ సంగీత దర్శకులు శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారు వస్తున్నారు. ప్రసారం నిమిత్తం వారి ఇంటర్వ్యూ తీసుకునే ఉద్దేశంలో ఉన్నాం. మా ఆకాశవాణి స్టాఫ్ కాకుండా, ఇతరులు ఎవరిచేతనైనా ఆ ఇంటర్వ్యూ చేయిద్దామని మా డైరెక్టర్ గారి ఆలోచన! రేపు ఆ ఇంటర్వ్యూ చేయడానికి మీకు వీలవుతుందేమో కనుక్కోమన్నారు....." అంటూ ఇంకా ఏదో చెప్పుకుపోతున్నారు! నా చెవులను నేనే నమ్మలేనంత ఆనందం!!
"తప్పకుండా! ఇది మీరు నాకు ఇచ్చే ఒక గొప్ప అవకాశం గా నేను భావిస్తాను! ధన్యవాదాలు!!" అన్నాను ఆయన మాటలకు అడ్డుపడుతూ.
"అయితే రేపు మీరు ఉదయం పదకొండు గంటలకు స్టూడియోకు వచ్చేయండి! కాంట్రాక్ట్ ఫారం రెడీ చేసి ఉంచుతాను!" అంటూ ఫోన్ పెట్టేశారు ఆ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్!
రాజేశ్వరరావు గారు నా ఫేవరెట్ సంగీత దర్శకుడు. అటువంటి మహానుభావుణ్ణి ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు రావడం అనే విషయం నాకు ఎనలేని ఆనందం కలిగించింది. మర్నాడు ఆకాశవాణికి వెళ్లి, అప్పటికే అక్కడికి వచ్చి స్టేషన్ డైరెక్టర్ గారి రూమ్ లో ఆసీనులై ఉన్న సాలూరి రాజేశ్వరరావు గారికి పాదాభివందనం చేశాను. డైరెక్టర్ గారు నా గురించి నాలుగు మాటలు చెప్పి నన్ను ఆయనకు పరిచయం చేశారు.
తర్వాత స్టూడియోలో అరగంటలో ఇంటర్వ్యూ రికార్డింగ్ అంతా పూర్తయింది.
ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత "మీ ప్రశ్నలు అన్నీ సంసార పక్షంగా ఉన్నాయి సార్!" అన్నారాయన.
"అదేమిటండీ?" అంటూ అడిగాను చిన్నగా నవ్వుతూ.
"చాలామంది జర్నలిస్టులు ఇంటర్వ్యూలో ఇరుకున పెట్టే ప్రశ్నలు వేస్తూ ఉంటారు.' సార్! పలానా వాళ్ళకి మీకు తగువు ఎందుకు వచ్చింది? లేకపోతే... ఫలానా సినిమాలో సగం పనిచేశాక ఎందుకు మానేశారు?.... చక్రపాణితో మీకు గొడవ వచ్చిందట కదా!..... దాని వివరాలు ఏమిటి?' ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు సార్!.... అలాంటి వాటికి సమాధానాలు చెప్పి చెప్పి విసుగెత్తి పోయాను సార్!... అందుకని మీ ప్రశ్నలన్నీ చాలా సంసారపక్షంగా ఉన్నాయని అన్నాను!" ముఖంలో ఏ భావం చూపించకుండా సంభాషణ ముగించారు.
ఆకాశవాణి ఆఫీసులో మిగిలిన ఫార్మలిటీస్ అన్ని పూర్తయ్యాక రాజేశ్వరరావు గారిని మా ఇంటికి లంచ్ కి ఆహ్వానించాను. ఏమాత్రం బెట్టు చేయకుండా నా ఆహ్వానం మన్నించి మా ఇంటికి వచ్చి భోజనం చేశారాయన! తర్వాత మూడు గంటల పాటు మా ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నారు.
ఆ తర్వాత "మీరు ఏమీ అనుకోకపోతే మరొకసారి మీ ఇంటర్వ్యూ తీసుకుంటాను నా టేప్ రికార్డర్ మీద!" అంటూ ఆయన్ని ప్రాధేయపడ్డాను." అలాగే సార్!... తప్పకుండా!" అంటూ నేను రికార్డు చేసుకుంటూ ఉండగా నా ప్రశ్నలు అన్నిటికీ మళ్ళీ ఓపికగా చక్కగా సమాధానాలు చెప్పారు.అంతేకాకుండా, 'చల్లగాలిలో యమునా తటిపై......' పాట పాడమంటే పాడి వినిపించారు. దాంతోపాటు' ఓ యాత్రికుడా...' కూడా పాడేరు. అలా వారి పాటలతో సహా వారి గొంతు నా దగ్గర దాచుకునే అదృష్టం నాకు కలిగింది. సాయంకాలం వారిని తీసుకు వెళ్లి, వారు విడిది చేసిన హోటల్లో దింపి వచ్చాను. అది నిజంగా నా జీవితంలో మరుపురాని రోజు!
తెలుగువారు గర్వించదగ్గ సంగీత దర్శకులలో అగ్రగణ్యులుగా వినుతికెక్కిన శ్రీ సాలూరి రాజేశ్వర రావు గారు 1922లో అక్టోబర్ 11న సాలూరు మండలంలోని శివరామపురం అనే చిన్న గ్రామం లో జన్మించారు. వారి తండ్రిగారు సన్యాసి రాజు గారు ప్రముఖ వయోలిన్ విద్వాంశులైన ద్వారం వెంకటస్వామి నాయుడు గారికి కచేరీలలో మృదంగంపై సహకరించిన వ్యక్తి! పువ్వు పుట్టగానే పరిమళించిన రీతిలో రాజేశ్వరరావు గారు అతి చిన్న వయస్సులోనే అనేక రాగాలను గుర్తించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు! ఏడేళ్ల వయసు వచ్చేసరికి అన్నగారైన హనుమంతరావు గారితో కలిసి పాటకచేరీలివ్వడం, హరికథలు చెప్పడం మొదలెట్టారు. 1934 నాటికి 'బాలభాగవతార్ మాస్టర్ సాలూరి రాజేశ్వరరావు ఆఫ్ విజయనగరం' కంఠం గ్రామ ఫోను రికార్డుల ద్వారా మొదటిసారిగా విజయనగరం ఎల్లలు దాటి, బెంగళూరు వారి హచ్చిన్స్ గ్రామ ఫోన్ కంపెనీ ద్వారా, యావదాంధ్ర దేశానికి పరిచయమైంది.
ఈయన గాన మాధుర్యానికి ముగ్ధులైన పినపాల వెంకట దాసు,గూడవల్లి రామబ్రహ్మం గారలు తమ చిత్రం 'శ్రీకృష్ణ లీలలు'లో ఇతడిని కృష్ణుడి పాత్రధారునిగా ఎంపిక చేసుకొని 1935 లో మద్రాసు తీసుకువచ్చారు. నాలుగైదు సినిమాలలో నటించి ఆయన పాటలు ఆయనే పాడుకున్నారు! చిత్రపు నరసింహారావు దర్శకత్వంలో తయారైన 'జయప్రద' అనే చిత్రానికి పూర్తి సంగీత దర్శకత్వం బాధ్యతలు చేపట్టి అప్పట్లో అత్యంత యువ సంగీత దర్శకుడుగా ఒక చరిత్రను సృష్టించారు. 1940లో విడుదలైన 'ఇల్లాలు' సినిమా ఆయనకు సినీ సంగీత దర్శకునిగా బాగా గుర్తింపు తెచ్చింది.
1948 లో విడుదలైన 'చంద్రలేఖ', 1951లో వచ్చిన 'మల్లీశ్వరి' సినిమా విజయాలతో మరి రాజేశ్వరరావు గారు వెనుతిరిగి చూడలేదు!! మొత్తం ఐదు దశాబ్దాల పాటు ,సుమారు 100 చిత్రాలకు పైగా అద్భుతమైన సంగీతం అందించి, చిత్ర విజయాలకు వీరి మధుర సంగీతం ద్వారా బాటలు వేశారు!
రాజేశ్వరరావు గారు ఎంత లౌక్యులో అంత బోళామనిషి! ఏ విషయమూ మనసులో దాచుకోవడం ఆయనకు తెలియదని అనేకమంది ఆయన గురించి పేర్కొంటారు. క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా వ్యంగ్యంగా ఎదుటివారికి ఎలా చురకలాంటిస్తారో అనేక సందర్భాలలో మిత్రుడు శ్రీ బాలు గారు చెప్పడం కూడా మనకు తెలుసు! సాలూరి వారి గురించి నేను విన్న ఒక సరదా విషయం మీతో పంచుకుంటాను.
ఓసారి అన్నపూర్ణ వారి సినిమాకి పాటల రికార్డింగ్ జరుగుతోంది. నిర్మాత మధుసూదనరావు గారు "రాజేశ్వరరావ్! రేపు నిన్ను తీసుకురావడానికి మన ప్రొడక్షన్ కారు రాదు. వేరే పని మీద వెళ్తోంది. అందుకని నువ్వు ట్యాక్సీ తీసుకుని వచ్చేయ్ !ఇక్కడికి రాగానే పే చేద్దాం!" అన్నారు. మర్నాడు పొద్దున్నే పది గంటలకు రికార్డింగ్. పదకొండు అయినా పన్నెండు అయినా సాలూరు వారి జాడలేదు! మధుసూదన రావు గారు, ఆర్కెస్ట్రా వారు క్షణమొక యుగంలా సాలూరి వారి కోసం నిరీక్షిస్తున్నారు! ఎట్టికేలకు పన్నెండున్నరకు రాజేశ్వరరావు గారు వచ్చారు. దుక్కిపాటి వారు విసుగును అణిచిపెట్టుకుంటూనే, "రాజేశ్వరరావు ....ఇంత ఆలస్యం ఏంటి? టాక్సీ దొరకలేదా?... అయినా, మీ ఇల్లు మన ఆఫీసుకు దగ్గరే కదా!... అంటూ అడిగారు." అవును సార్! టాక్సీ దొరకలేదు! ఆ టాక్సీ కోసం ఆటోలో ఊరంతా వెతికి ఆఖరికి టాక్సీ పట్టుకుని వచ్చేసరికి ఈ టైం అయిపోయింది సార్!" అన్నారు తాపీగా . సాలూరి వారి సమాధానం విన్నాక, దుక్కిపాటి వారికి ఏం మాట్లాడాలో అర్థం కాక తల పట్టుకుని ఉండిపోయారట!
సుస్వరాలూరించిన సాలూరి వారు 1999 అక్టోబర్ 25వ తేదీన తమ 77 వ ఏట మద్రాసులో పరమపదించారు.
నా చిత్రానికి
అమ్మాయి మెరాజ్ ఫాతిమా రాసిన కవిత
"ఆదరణ లేని
అస్తవ్యస్తమైన ఆలోచనలకు
ఒక రూపు కావాలి,
ఏపాటికీ సాటి లేని
రూపానికి
మనో ఊరట కావాలి,
అనేక అంతర్
యుద్దాల తర్వాత
ఒకింత శాంతి కావాలి,
వీడిపోయిన వారి నుండి
ఓడిపోయిన మనస్సుకు
విశ్రాంతి కావాలి,
గుండె మంటలను ఆర్పేందుకు
కొన్ని కన్నీళ్లు కావాలి,
దుఃఖపు ముప్పెనలో మునిగిన ముఖాన్ని దాచుకొనేందుకు
ఓ భరోసానిచ్చే
భుజం కావాలి.
ఎంత చక్కటి చిత్రమో 😍 ఆటవెలది // ముందు చూపు గలిగి ముందునిద్ర యనుచు కన్ను మూసి మంచి కలలు గనుచు హాయిననుభవించు రేయి పగలు యంత దూర దృష్టి వింత...