5, జులై 2025, శనివారం

ముదిరిపోయిన చెరుకు, కణుపు కణుపున - గజల్


  సోదరులు శ్రీ PVR Murthy గారి చిత్రానికి గజల్ 

~~~~~~~~🌺🔹🌺~~~~~~


వార్ధక్యం వచ్చేవరకూ జీవించడమే ఒక వరం. వ్యర్థం చెయ్యకుండా వాడుకుంటే ముసలితనమూ వరమే! 

అనుభవాల ఆకావ్యం మనింట్లో ఉంటే ఉపయోగించుకోండి. అది పాతవస్తువుకాదు. ఉపయోగపడే ఉద్గ్రంథం! •••• అంటూ

చిత్రకారులు శ్రీ పి. వి మూర్తిగారి చిత్రించిన చిత్రానికి నేనిచ్చిన గజల్ రూపం!

~~~~~~~~~~~~~~

🔹॥గజల్॥( వార్ధక్యం)🔹


ముదిరిపోయిన చెరుకు, కణుపు కణుపున

తీపి పెంచుకొని వంగదా!

ఎక్కుపెట్టిన ధనువు, గెలుపు సాధించాక  విశ్రాంతి పొందదా!


సాకారమైనట్టి స్వప్నాలచిహ్నాలు ముడతలై 

నిలిచాయి 

మడతలో నోటులా, మాసినా విలువతో తలయెత్తి నిలవదా! 


ఎన్ని బాల్యాలకో ఆకళ్ళముందరే మీసాలు వచ్చాయి!

పాతకథ కొత్తగా తిరగరాస్తున్నట్లు కనిపించి నవ్వదా!


తాను వేసిన మల్లె తలనిండ పూలతో తనముందు తిరిగింది

ఊయలూపిన అమ్మ మనవరాలై పుట్టి ఊయలే ఊగదా!


వార్థక్యమున బడిన వార్థిలా జీవితం పోరాడుతూఉంది 

ఈగుండె తనలోన కడలితీరంలాగ కథలెన్నొ దాచదా!


వెన్నెముక వంగినా,వంగనిది లోనున్న ఆత్మవిశ్వాసమే !

ఎండినా పనికొచ్చు చెట్టులా ఉండటం మంచిదని తలచదా! 


కళ్ళెదుటనే ఉన్న విలువైన గ్రంథాలు వృద్ధులే జంధ్యాల! 

పిలుపు కోసం ఎదురుచూసేటి వేళనూ ప్రేమనే పంచదా!

~~~~~~~~~

డా. ఉమాదేవి జంధ్యాల

The power of 'Will' Usage - English grammar - illustration

  When we use will to make a promise 🤝 or an offer 💡, we are usually deciding to do something at the very moment we are speaking. It shows...