2, ఫిబ్రవరి 2016, మంగళవారం

వహీదా రెహమాన్ - పెన్సిల్ చిత్రం


తెలుగులో 'రోజులు మారాయి' చిత్రంలో 'ఏరువాక సాగారో' పాటలో కనిపించి, గురుదత్ సహకారంతో హిందీ చిత్ర రంగంలో ప్రవేశించి ఎన్నో హిట్ చిత్రాలలో నటించి అగ్ర నటీమణుల స్థాయికి ఎదిగిన వహీదా రెహమాన్ కి జన్మదిన శుభాకాంక్షలు. Guide చిత్రంలో అతి క్లిష్టమయిన 'రొజీ' పాత్ర పోషించి అందరి చేత ప్రశంసలు పొందింది. ఈమె నటనా కౌశలం కి గుర్తింపుగా ఎన్నో పురస్కారలతో పాటు filmfare, జాతీయ పురస్కారాలు కూడా ఈమెను వరించాయి. ప్యాసా, కాగజ్ కే ఫూల్, చౌద్వీన్ కా చాంద్, సాహెబ్ బీబీ అవుర్ గులామ్, తీస్రీ కసమ్, Guide, వంటి అత్యుత్తమ చిత్రాలలో అద్భుతంగా నటించి అందరి చేతా సెభాష్ అనిపించుకున్న నటి వహీదా రెహమాన్.

1, ఫిబ్రవరి 2016, సోమవారం

తెలుగు వారి 'కారాలు'

మన తెలుగువాళ్ళకు 'కారాలంటే ఎంతో యిష్టం.ఈ కారాలను చూడండి.
1. మొదలు పెట్టె కారం -- శ్రీకారం 
2. గౌరవించే కారం ----సంస్కారం, 
3. ప్రేమ లో కారం --- మమకారం 
4. పలకరించేకారం ----నమస్కారం,
5. పదవి తో వచ్చే కారం ---అధికారం,
6. అది లేకుండా చేసే కారం------ అనధికారం,
7. వేళాకోళం లో కారం ---- వెటకారం
8. భయం తో చేసే కారం ---- హాహాకారం,
9. బహుమతి లో కారం --- పురస్కారం,
10. ఎదిరించే కారం --- ధిక్కారం
11. వద్దని తిప్పికొట్టే కారం-----తిరస్కారం,
12. లెక్కల్లో కారం --- గుణకారం,
13. గుణింతం లో కారం -- నుడికారం
14. గర్వం తో వచ్చే కారం ---- అహంకారం,
15. సమస్యలకు కారం ----- పరిష్కారం,
16. ప్రయోగశాల లో కారం------- ఆవిష్కారం,
17. సంధులలో కారం --- 'ఆ'కారం,
18. సాయం లో కారం --- సహకారం
19. స్రీలకు నచ్చే కారం--- అలంకారం,
20. మేలు చేసే కారం ----ఉపకారం,
21. కీడు చేసే కారం -- అపకారం
22. శివునికి నచ్చే కారం ---- ఓం కారం,
23. విష్ణువు లో కారం ----శాంతాకారం,
24. ఏనుగులు చేసేది --- ఘీంకారం
25. మదం తో చేసే కారం --- హూంకారం,
26. పైత్యం తో వచ్చే కారం --వికారం,
27. రూపం తో వచ్చే కారం --ఆకారం
28. ఇంటి చుట్టూ కట్టే కారం -- ప్రాకారం,
29. ఒప్పుకునే కారం --- అంగీకారం,
30. చీదరించుకునే కారం ---చీత్కారం
31. పగ తీర్చుకునే కారం---- ప్రతీకారం,
32. వ్యాకరణం లో వచ్చే కారాలు 'ఆ'కారం', 'ఇ' కారం, 'ఉ' కారం.


(facebook లో ఈ రొజు ఈ 'కారాలను' అందించిన శ్రీ అవధానుల రామారవు గారికి ధన్యవాదాలు)

30, జనవరి 2016, శనివారం

జనరల్ కృష్ణారావు - శ్రధ్ధాంజలి


శ్రద్ధాంజలి - తెలుగు తల్లి ముద్దుబిడ్డ, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ కొటికలపూడి వెంకట కృష్ణారావు (93) శనివారం తుదిశ్వాస విడిచారు. 1971 బంగ్లాదేశ్ విమోచన పోరాటంలో ఆయన క్రియాశీల పాత్ర పోషించారు. ఆయన జమ్మూ కశ్మీర్, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు. జులై 11, 1989 నుంచి జనవరి 19, 1990 వరకు తొలిసారి జమ్మూ కాశ్మీర్ గవర్నర్‌గా పని చేశారు. ఆ తర్వాత మళ్లీ రెండోసారి మార్చి 13, 1993, నుంచి 1998 వరకు గవర్నర్‌గా సేవలందించారు. కేవీ కృష్ణారావు 1923లో విజయవాడలో జన్మించారు. 1942 నుంచి 1983 వరకు ఇండియన్ ఆర్మీలో ఆయన సేవలందించారు. బ్రిటిష్ ఇండియా ఆర్మీ, ఇండియన్ ఆర్మీలో పనిచేసిన ఆయన యువ ఆఫీసర్‌గా బర్మాలో, రెండవ ప్రపంచయుద్ధ కాలంలో బెలుచిస్తాన్‌లో సేవలందించారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయనకు విశిష్ట సేవా మెడల్ ఇచ్చి సత్కరించింది.

తెలుగు రచయిత్రులు - 1960




1960 లొ తెలుగు రచయిత్రుల కలయిక - రంగనాయకమ్మ, పాకాల యషోదరా రెడ్డి, రాఘవమ్మ (కాసు బ్రహ్మానంద రెడ్డి సతీమణి, భానుమతి రామక్రీష్న, ఇల్లిందల సరస్వతీ దేవి, తురగా జానకీ రాణి, ఊటుకూరు లక్ష్మీకాంతం, తెన్నేటి లత)

వడ్డాణం


శ్రీమతి శశికళ ఓలేటి గారు facebook లో వ్రాసిన పద్యాలు 
వడ్డాణం
1. అడ్డాల., నాడ పిల్లకు.,
విడ్డూరపు తండ్రి యొకడు విత్తము హెచ్చన్,
నడ్డికి మువ్వల గొలుసుల
వడ్డాణము తెచ్చినట్టి వైనము గనరే!!
…………………………………………………
2. పెద్దది యాయెను తరుణిగ,
సద్దుగ బిరబిర పరుగిడి సవ్వడి జేయన్,
ముద్దుగ వడ్డాణ మమరె
అద్దాని నడుముకు జోడు హంసల తోడన్.
…………………………………………………
3. బిడియము పెరిగెను వడివడి,
పొడుగుగ, పొగడలె పెరిగెను పొలతిగ తానున్,
పిడికెడు నడుమున యొదిగెను
ఒడుపుగ వడ్డాణమదియె యూర్వశి బోలన్.
…………………………………………………
4. గడసరి మగనిని సరసిజ
అడిగెను వడ్డాణమొకటి నరవంకి జతన్
ముడిచిన మోమది వడలగ,
వడివడి చేయించి తెచ్చెవజ్రపు నగ తాన్.
…………………………………………………
( ఈ పద్యము కందముగా గ్రహించ వద్దని మనవి)
5. కాంచన మందున మెరయుచు,
కాంతల నడుములు ముదమున కౌగిళు లిడగన్,
కాంచిన శృంగార మొలుకు
కాంతుల రత్నము , పగడము కనువింద గుచున్.
************************
5. కాంచన మందున మెరయుచు,
అంచలు, సరములు, కమలము, లమరగ, తాదీ
వించుచు, సింగపు నడుముకు,
పెంచెను శోభను యనఘయె పేరిమి తోడన్.
…………………………………………………
6. వయ్యారము పెంపొందగ,
వెయ్యొంతులు విలువ నిచ్చు విరియగ సొగసుల్
అయ్యారే! వడ్డాణము
వెయ్యగ నెల్లరు సుదతులు వెలుగగ మోముల్. 



29, జనవరి 2016, శుక్రవారం

దండ వంకీ యదియె దక్షిణ హస్తాన - దండ కడియాలు - పద్యాలు


.

శ్రీమతి శశికళ ఓలేటి గారి పద్యాలు చక్కని పద్యాలు  - వారి అనుమతితో ఇక్కడ పొందుపరుస్తున్నాను.
దండ వంకీ
*******
దండ ఒంకి యదియె దక్షిణ హస్తాన
ధగధగలుగ మెరయ దండి గాను.
పచ్చ,రవ్వ, కెంపు , పచ్చరించి పొదిగి
సొగసు కత్తె కెంతొ సొబగు లద్దె.
…………………………………………
అరటి దూట వంటి అందాల చేతికి
అమరె బంగరమున అర్ధ వంకి
వంక లేని వనిత వర్ఛస్సు మరిపెంచి
మురిపెముగను తొడిగె మురియ ముదిత.
……………………………………………
చేతి గాజు లెంతొ సింగార మొలుకుతూ
చేవ కూర్చె తరుణి చేతి కెంతొ
పోటికొచ్చెనదె పొళ్ళ బంగరు వంకి
కేకి బొమ్మ పెంచ, కేలు సొగసు.
……………………………………………
కలువ తూడు లవిగొ కరములు లలనవి
కోమలాంగి కేలు కోరె మగడు.
కండ లేని దండ కమరించె నాతడు
కమలజాక్షి వంకి కలికి సిరికి.
……………………………………………
వజ్రఖచిత మైన వడ్డాణమునకదె
సరిగ బోలు నట్టి సరసి ఒంకి
ఒంకరేమి లేని వొరు వరస పట్టెడ
వంక జాబిలల్లె సొంపు కూర్చె.
……………………………………………
జోడు హంస లవిగొ చూడ పతకమందు,
జాలు వారు గొలుసు జార గూడి
కాంతులీను తున్న కనకంపు ముత్యాల,
పచ్చ, కెంపు, కలిసి పసిడి ఒంకి.

28, జనవరి 2016, గురువారం

స్వాతంత్ర్య సమరయోధుడు - లాలా లజపత్ రాయ్ - పెన్సిల్ చిత్రం



ఈ రోజు స్వాతంత్ర్య సమారా యోధుడు లాలా లజపత్ రాయ్ జయంతి. ఈ సందర్భంగా నేను వేసిన పెన్సిల్ చిత్రం. ఈ మహనీయుని గురించి వికీపీడియా వారు ఏమంటున్నారో ఈ క్రింది లింకులో చదవండి.

https://te.wikipedia.org/wiki/%E0%B0%B2%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BE_%E0%B0%B2%E0%B0%9C%E0%B0%AA%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B1%8D

అమ్మకే అమ్మ అమ్మమ్మ

 ​ అమ్మకే అమ్మ అమ్మమ్మ (pen sketch) ఆ గుండె చప్పుడు వింటూ ఒదిగిపోతా, నీ దీవెనల నీడలో పెరిగి పెద్దవుతా. తరాలు దాటిన మన ప్రేమానుబంధం, ఈ సృష్టి...