28, జులై 2014, సోమవారం

తలత్ మహమద్ - అమర గాయకుడు

స్వల్ప అస్వస్థలో కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకుంటూనే సిల్కు గొంతు తలత్ మహమూద్ పాట నా చెవిన పడింది. 'ఏయ్ గమేదిల్ క్యా కరూన్..' అబ్బ ఎంత హాయి అండీ. ఈ రోజు నెట్ లో వెతికితే ఆంధ్రబూమి లో ప్రచురించబడిన గంటి బానుమతి గారి వ్యాసం కంటబడింది. వీరు మన తెలుగు సినిమా 'మనోరమ' లో 'అందాలసీమా సుధా నిలయం' 'గతి లేని వాణ్ని గుడ్డి వాణ్ని బాబయా' వంటి పాటలు కూడా పాడారు.

ఆంధ్రభూమి లో ప్రచురించబడిన వ్యాసం :

మెరీ యాద్‌మే తుమ్ న ఆసూ బహానా...అని పాడాడు. కానీ వింటుంటే మన కళ్లు చెమ్మగిల్లడం ఖాయం.
ఫిర్ వహీ షామ్, వహీగమ్, వహీ తన్‌హాయి ఆ పాట నిజంగానే మనల్ని కళ్లుమూసుకునేలా చేసి, ఏకాంతంలోకి వెళ్లిపోయేలా చేస్తుంది.
ఓ మాయని, ఓ పొరని మన చుట్టూ సృష్టించే శక్తి ఆ గళానికి ఉంది. అతని పాటలు గుండెల్లోని మూలల్ని తాకుతుంది. అప్రయత్నంగా కళ్లు మూసుకుని, ‘అబ్బా’ అని అనుకుంటూ మైమరిచిపోయేలా చేస్తుంది.
ఆ గొంతుని అనుకరించి, చెంపలేసుకున్న వారెందరో. ఆ గొంతుని అనుకరించలేరు. ఆ గొంతు అతనికే స్వంతం. అదే అతని ప్రత్యేకత. అందులో లాలిత్యం ఉంది. మాధుర్యం ఉంది. అన్నింటికీ మించిన మంత్రం ఉంది.
గజళ్లు పాడడం ఆయనకే చెల్లు. అతనికి అతనే సాటి. వేదన, ఆర్ద్రత, బాధ, ఆవేదన, ప్రేమ, అన్ని రసాలను అందులోకి ప్రవహింప చేయగల రాజు. అందుకే అతడిని బాద్‌షా-ఎ-గజల్. కింగ్ ఆఫ్ గజల్స్ అంటారు. అతని తర్వాత ఆ బిరుదు ఎవ్వరికీ రాలేదు. అతని గొంతుని ‘మొఖ్మలీ ఆవాజ్’ అని అంటారు.
ఇన్ని ప్రత్యేకతలు సంతరించుకున్న ఆ గొంతు స్వంతదారుడు తలత్ మహమూద్. తలత్ గాయకుడే కాదు నటుడు కూడా.
తలత్ లక్నోలోని సనాతన సంపన్న కుటుంబంలో మన్‌సూర్ మొహమూద్‌కి గల ఆరుగురు సంతానంలో ఒకడిగా ఫిబ్రవరి 24, 1924న పుట్టాడు.
ఇంట్లో తండ్రి, సోదరీమణులు సంగీతంలో మంచి ప్రతిభ వున్నవారు కావడంతో అదే తలత్‌కి వచ్చింది.
పెద్ద పెద్ద గొప్ప సంగీత విద్వాంసుల సంగీతాన్ని వింటూ కాలం గడిపేవాడు. గాలిబ్, మీర్, దాగ్, జిగర్‌ల గజళ్లని పాడుతుండేవాడు. విన్న వాళ్లందరు అతని గొంతులోని మార్ధవాన్ని లాలిత్యాన్ని, గుర్తించి ఇది ఓ ప్రత్యేకమైన గొంతు, మిగిలిన గాయకులలాగ లేదు అని అనుకున్నారు
ఆ సమయంలో అతని 16వ ఏట లక్నో ఆకాశవాణిలో పాడే అవకాశం వచ్చింది. అతని గాత్రాన్ని గుర్తించిన హెచ్‌ఎంవివారు తలత్‌తో పాడించారు. అవి సబ్‌దిన్ ఏక్ సమాన్ నహీ థా...పెద్ద హిట్. ఆ తర్వాత తస్‌వీర్ తెరీ దిల్ మెరా మెహలా న సఖేగీ...ఇది ఓ ప్రభంజనానే్న సృష్టించింది. ఒక్కసారిగా పదివేల రికార్డులు అమ్ముడుపోయాయి.
అంతవరకు రాష్ట్రానికే పరిమితం అయిన తలత్ ఇతర రాష్ట్రాలలోని సంగీత ప్రియుల దృష్టిలో పడ్డాడు.
తలత్ ప్రతిభని గుర్తించిన కలకత్తా సినీ పరిశ్రమ ఆహ్వానించింది. 1940 ప్రాంతంలో కలకత్తా సినిమా పరిశ్రమలకి ఓ కేంద్రం. తలత్ సినిమాలకి పాడడం అదీ ఇంట్లో వాళ్లకి ఇష్టం లేదు. వారిది సనాతన, కట్టుబాట్లు వున్న కుటుంబం అవడంవలన, తలత్‌ని మెచ్చుకోలేదు. ప్రోత్సహించలేదు కానీ ఓ పదేళ్ల తరువాత తలత్‌ని, అతని పాటలని విన్నారు. అభినందించారు. ఆనందించారు.
సినిమా కెరీర్‌ని ఎంచుకున్న తలత్ కలకత్తా వచ్చాడు. అక్కడ తపన్ కుమార్ పేరుతో పాడాడు. ఆ పాటలు ఈనాటికీ, ఎక్కడో అక్కడ వినిపిస్తునే వుంటాయి.
తలత్ మంచి పర్సనాలిటీతో వున్న మనిషి. మంచి అందగాడు. అందుకని అతనితో సినిమాలు కూడా తీసారు. 1945లో కానన్ బాలతో ‘రాజ్యలక్ష్మి’, 1947లో ‘తుమ్ ఔర్ మై’లో కానన్‌దేవి, 1949లో ‘సమాప్తి’ భారతీదేవిలతో నటించాడు.
1949 వరకు కలకత్తాలో పని చేసిన తలత్, హాలీవుడ్ లాంటి బొంబాయికి రావాల్సి వచ్చింది. కలకత్తా సినీ పరిశ్రమ లాగానే బొంబాయి సినీ పరిశ్రమ రెండు చేతులు చాచి ఆహ్వానించింది. ఆ కాలంలో నటులు వాళ్ల పాటల్ని వాళ్లే పాడుకునేవారు. సైగల్, శ్యామ్ సురేంద్ర లాగా, తలత్‌కి కూడా నటించే అవకాశాన్ని ఇచ్చారు. అయితే ముందుగా గాయకుడిగానే పరిచయం అయ్యాడు. ఆ అవకాశాన్ని ఇచ్చిన ఘనత అనీల్ బిస్వాస్‌ది. ‘ఆర్జూ’ అనే సినిమాలో దిలీప్‌కుమార్‌కి పాడాడు. ‘ఐ దిల్ ముఝే ఐసీ జగాహ్ లే చల్ జహా కోయి నహీ’ అది ఓ విద్యుల్లతలా అందర్నీ ఊపేసింది. రాత్రికి రాత్రి పెద్ద హిట్ అయిపోయింది.
అప్పటి సంగీత దర్శకులకి ఇతని గొంతు నటులకి సరిగ్గా సరిపోతుందని భావించారు. అందుకని అప్పటి పరిశ్రమలోని సంగీత దర్శకులందరు అందరి హీరోలకి కనీసం ఒక్క పాటయినా పాడించారు. తప్పనిసరిగా సినిమాలో గజల్ ఒకటి ఉండేది. దాన్ని తలత్‌తోనే పాడించేవారు. పదాల ఉచ్ఛారణ, భావాన్ని పలికించడం, రసానుభూతిని కలగజేయడం అతని ప్రత్యేకత. ఉర్దూ పాట అంటే తలత్. గజల్ అంటే తలత్. వాటిని విడదీయడం కష్టం అన్నట్టుగా అయిపోయింది.
గాయకుడిగా కొనసాగుతూనే సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. ఆరామ్ (మధుబాల, దేవానంద్), దిల్-ఎ-నాదాన్, లాలా రూఖ్ (శ్యామా) డాక్‌బాబూ, రఫ్తార్ (నాదిరా) మాలిక్, వారిస్ (సురయ్య), దివాలీకీ రాత్ (రూప్‌మాలా, శశికళ) ఏక్ గావ్‌కీ కహానీ (మాలా సిన్హా), సోనేకీ ఛిడియా (నూతన్) మొత్తం పది సినిమాల్లో చేశాడు.
దాదాపు 800 పాటల వరకు పాడాడు. అందులోని కొన్ని పాటలు ఈ రోజుకీ రేడియోలో వినిపిస్తూనే ఉంటాయి. శ్రోతలు వాటిని కోరుతూనే ఉన్నారు.
హమ్‌సే ఆయా న గయా (దేఖ్ కబిరా రోయా), జాయేతో జాయెకహా (టాక్సీడ్రైవర్), తస్‌వీర్ బనాతాహూ మై తకదీర్ నహీ బన్‌తీ (బరాదరి), ఆసూ సమఝకే క్యో ముఝె అప్‌నే గిరాదియా (్ఛయా), మేరీ యాద్ మే తుమ్ న ఆసూ బహాన్ (మద్‌ఘోష్), ఫిర్ వహీ షామ్ వహీ గమ్ వహీ తన్వాయి (జహనారా), ఐ మెరె దిల్ కహీ ఔర్ చల్ (దాగ్), జిందగీ దేనేవాలే సున్ (దిల్-ఎ-నాదాన్), మై దిల్ హ ఏక్ అర్మాన్ భూత్ ఆకే ముఝే పెహచాన్ జరా (అన్‌హోనీ) జల్‌తే హై జిస్‌కేలియే (సుజాత), దిల్‌ఎ నాదాన్ తుఝె హువా క్యాహై (మిర్జా గాలిబ్) షామ్ ఎ గమ్‌కీ కసమ్ (్ఫట్‌పాత్), ప్యార్ బస్‌తో నహీ మెరా తు బతా తుఝె ప్యార్ క రూయా న కరూ (సోనేకీ ఛిడియా), బహారోంకి దునియా పుకారే తు ఆజా (లైలా మజ్ను), దిల్‌మే సమాగమె సజన్ ఫూల్ ఖిలే చమన్ చమన్ (తకదీర్), తుమ్‌తో దిల్‌కీ తార్ ఛేడ్‌కర్ హోగయే బేకబర్ ( రూప్‌కీ రాని చోరోంకా రాజా) మొహబ్బత్‌మే ఐసీ జమానే భీ ఆయె (సగాయి) ఐ సనమ్ ఆజ్ ఏ ఖసం ఖాయో (జహనారా), ఏ నరుూ నరుూ ఫ్రీత్‌హై ఏ నరుూ నరుూ మీత్ హై (పాకెట్ మార్), మిల్‌తే హీ ఆంఖే దిల్ హువా దీవాన్ (బాబుల్), హమ్ తుమ్ హారే హోగయే సనమ్ (రంగీలా రాజ్) రాత్‌నే క్యాక్యా ఖాబ్ దిఖారుూ, సబ్‌కుచ్ లుటాకే హోష్‌మే ఆయేతో క్యాహువా మొదలైనవి ఇంకా ఎనె్నన్నో మధురగీతాలు పాడాడు. తెలుగులో మనోరమలో రమేశ్‌నాయుడు పాడించారు. అందాల సీమ సుధా నిలయం, గతిలేని వాడ్ని గుడ్డివాణ్ని బాబయ్య.
సినిమాలు వద్దనుకున్నాడు. గాయకుడిగానే కొనసాగించాడు. అయితే ఆ తర్వాత గజళ్లు వెనక్కి వెళ్లిపోయాయి. కానీ అతని గాత్రం అంటే ఇష్టపడేవాళ్లు ఒక్క పాటయినా తన సినిమాల్లో పెట్టేవారు. ‘హకీకత్’లో ‘కరచలే’ అన్న పాటని రఫీ మన్నాడేతో కలిసి ఒక్క చరణం పాడాడు. ‘గమ్‌కీ అంధేరే రాత్ మే’ అన్న పాటని రఫీతో కలిసి పాడారు. రఫీ, ముఖేష్, కిషోర్, మన్నాడేల గొంతు అప్పుడే వస్తున్న హీరోలకి సరిపోతుందనుకున్నారు. ఈ సమయంలోనే తలత్ తనే ఇంక పాడలేనని సినిమాల్లో పాడడం మానేసారు. అయితే ప్రైవేట్‌గా ఎన్నో ఉర్దూ ఎక్కువగా వుండే గజళ్లు పాడారు.
విదేశాల్లో ప్రోగ్రాంలు ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి తలతే. అప్పటినుంచి ఇస్తూ వచ్చిన తలత్ ఆఖరుసారిగా 1991లో హాలెండ్‌లో ఇచ్చారు. ఇంతటి గొప్ప గాయకుడిగా ఎన్నో అవార్డులు వచ్చాయి. భారత ప్రభుత్వం కూడా 1992లో పద్మ విభూషణ్‌తో సత్కరించి తనని తాను గౌరవించుకుంది. నరాల బలహీనతతో బాధపడ్డ తలత్ పాడలేకపోయాడు. అది క్రమేపీ పార్కిన్‌సన్‌కి దారితీసింది. దానితో డిప్రెషన్‌లోకి వెళ్లిపోతూ మంచంమీదే గడిపేవారు ఈ అమరగాయకుడు. 1998 మే 9న బొంబాయిలోని బాంద్రాలోని సన్‌బీమ్ ఇంట్లో తుది శ్వాసని విడిచారు.
తలత్‌పోయి ఇన్ని ఏళ్లయినా అతని పాటలు జీవించి ఉన్నాయి. ఆ పాటలు మెత్తగా, చల్లగా, హాయిగా, ఇంకా చెవుల్ని తాకుతూ వుంటాయి. అతడిని అమరుడిని చేసాయి. - గంటి భానుమతి 
 — with Aruna Ramesh,Devaki Yagalla and Vinjamuri Venkata Apparao.

కామెంట్‌లు లేవు:

కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! - తెలుగు గజల్

 ॥తాజా గజల్॥  నా pencil చిత్రానికి Dr. ఉమాదేవి గారి గజల్ ~~~~🔹🔸🔹~~~~ కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! పోరాట మేలేని జీవితం కోసమై అన...