18, జులై 2014, శుక్రవారం

చందమామ రావో జాబిల్లి రావో - అన్నమయ్య కీర్తన - నా బొమ్మ

చందమామ రావో జాబిల్లి రావో - ఈ వారం అన్నమయ్య కీర్తన

చందమామని చిన్న పిల్లలకి చూపించి చందమామ రావే జాబిల్లి రావే అని తల్లి పాడి లాలించడం అనాదిగా మన సంప్రదాయంలో ఉంది. ఈ చందమామ పాట ఏనాడో అన్నమయ్య మనకోసం రచించి పెట్టాడు. కాలక్రమేణా ఈ చందమామ పాట సాహిత్యంలో కొన్ని మార్పులు వచ్చాయి కానీ మాత్రుక మాత్రం అన్నమయ్య పాటే.

చందమామ రావో జాబిల్లి రావో
మంచి కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో

నగుమోము చక్కని యయ్యకు
నలువ బుట్టించిన తండ్రికి
నిగమము లందుండే యప్పకు
మా నీల వర్ణునికి
జగమెల్ల నేలిన స్వామికి
ఇందిర మగనికి
ముగురికి మొదలైన ఘనునికి
మా ముద్దుల మురారి బాలునికి

తెలిదమ్మి కన్నుల మేటికి
మంచి తియ్యని మాటల గుమ్మకు
కలికి చేతల కోడెకు
మా కతల కారి ఈ బిడ్డకు
కుల ముద్ధించిన పట్టెకు
మంచి గుణములు కలిగిన కోడెకు
నిలువెల్ల నిండు వొయ్యారికి
నవ నిధుల చూపుల జూసే సుగుణునకు

సురల గాచిన దేవరకు
చుంచు గరుడుని నెక్కిన గబ్బికి
నెరవాది బుద్ధుల పెద్దకు
మా నీటు చేతల పట్టికి
విరుల వింటి వాని యయ్యకు
వేవేలు రూపుల స్వామికి
సిరిమించు నెరవాది జాణకు
మా శ్రీ వేంకటేశ్వరునికి

భావం :

చందమామ రావే జాబిల్లి రావే మంచి బంగారు గిన్నెలో వెన్న పాలు తేవే.
నగుమోముతో ఉన్న మా చక్కనయ్యకు, బ్రహ్మని పుట్టించిన తండ్రికి, వేదమలనందుండే అప్పకు, మా నీలవర్ణునికి, జగమెల్ల ఏలే స్వామికి, చక్కని లక్ష్మీ దేవీ మగనికి, మువుర దేవుళ్ళకు ఆఎఇమోలమైన మా ముద్దుల కృష్ణునికి బంగారు గిన్నెలో వెన్న పాలు తేవో!
తెల్లతామెరవంటి కన్నులు గలవానికి, తియ్యగా మాట్లాడే వానికి, మంచిపనులు చేసేవానికి, మంచిమాటకారియై సమయానికి తగినట్లుగా కతలల్లి చెప్పే ఈ బిడ్డకు, గోకులాన్ని ఉద్ధరించిన పట్టికి, మంచి గుణములు కలిగిన వానికి, నిలువెల్లా ఒయ్యారాలతో ఉండి నవనిధులను చూపులలో నింపి చూసే మా సుగుణాల రాశికి,
దేవతలను కాపాడిన దేవునకు, బలమైన గరుత్మంతుని ఎక్కిన ఘనునకు, మంచి నేర్పరితనమున్న బుద్ధులు కల మా పెద్దకు,గొప్ప చేతల పట్టికి, మన్మదుని తండ్రికి, వేయిరూపులు గల స్వామికి, సిరిని కట్టుకొన్న నేర్పరి జాణకు శ్రీ వేంకటేశ్వరునికి బంగారు గిన్నెలో వెన్నపాలు తేవో! చందమామ రావో!

కామెంట్‌లు లేవు:

కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! - తెలుగు గజల్

 ॥తాజా గజల్॥  నా pencil చిత్రానికి Dr. ఉమాదేవి గారి గజల్ ~~~~🔹🔸🔹~~~~ కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! పోరాట మేలేని జీవితం కోసమై అన...