28, జులై 2016, గురువారం

అన్నమయ్య, వేమన - సారూప్యత


అన్నమయ్య - వేమన.
ఆంధ్రావనిలో అవతరించిన మహాకవుల్లో అగ్రగణ్యు లైన ప్రజాకవులూ, ఆధ్యాత్మిక కవియోగులు - ఒకరు తాళ్ళపాక అన్నమయ్య, ఇంకొకరు వేమన్న.
తాళ్ళపాక అన్నమాచార్యులు వేంకటపతి మీద వింత వింతలుగా ముప్పదిరెండు వేల సంకీర్తనలను రచించి, ప్రజాకవియై, భక్తిమాత్రమే కాక ఎన్నో అంశాలను స్పృశించి అన్నివర్గాల ప్రజలకి స్పూర్తి నిచ్చి అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాడు.
ఇక వేమన యోగి. ‘విశ్వదాభిరామ వినురవేమ’ అనే మకుట పద్యాలద్వారా అఖండ శివ కేశవాభేద పరబ్రహ్మ తత్వాన్ని చాటుతూ మానవతావాదిగా నిల్చి, నిర్మొహమాటంగా జాతిలోని తెలుపు నలుపులని సున్నితంగా విమర్శించి ప్రజా హృదయాలలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న సాహిత్యమూర్తి.
అన్నమయ్య, వేమనలిరువురి భాషలో, భావాల్లో, పదాల్లో, పదబంధాల్లో ఎన్నో సామ్యాలు స్పష్టంగా గోచరిస్తాయి. అందులో కొన్ని.
ఒక వెర్రివాడు తనమెడలో కట్టుకున్న శివలింగం మీద నమ్మకం లేక పర్వతానికి(శ్రీశైలం) శివుణ్ణి దర్శించడానికి వెళుతున్నాడట. అలాగే తనలోనే అంతర్యామియై యున్న పరమాత్ముడిని కానలేక ఎక్కడో దేవుణ్ణి వెదుకుతున్న అజ్ఞానిని గూర్చి అన్నమయ్య వేమన్నలు ఏమంటున్నారో తిలకించండి.
అరుత లింగము గట్టి యది నమ్మజాలక
పరువత మేగిన బత్తుడనైతి
సరుస మేకపిల్ల చంక బెట్టుక నూత
నరయు గొల్లనిరీతి అజ్ఞానినైతి. అని అన్నమయ్య ఆత్మవిమర్శ చేస్తుండగా వేమన్న ఇలా వివరించాడు.
అరుత లింగముంచి అదియును జాలక
పర్వతమున కేగు పామరుడు
ముక్తి కాననగునే మూఢాత్ముడగుగాక
విశ్వదాభిరామ! వినుర వేమ!
మనసులోని ముక్తి మరి యొక్క చోటను
వెదకబోవు వాడు వెర్రివాడు
గొర్రె చంక బెట్టి గొల్ల వెదుకు రీతి
విశ్వదాభిరామ! వినురవేమ !
మరొక చోట మానవుని చంచల మనస్సును కూర్చి ఈ అనుభవ కవియోగులిలా హెచ్చరించారు.
‘పాయదీసి కుక్కతోక బద్దలువెట్టి బిగిసె
చాయకెంత కట్టినాను చక్కనుండీనా
కాయపు వికారమది కలకాలము చెప్పినా
పోయిన పోకలే కాక బుద్ది వినీనా’
కుక్కతోక వంకర, దాని వంకర తీర్చడం బ్రహ్మతరం కాదు. అట్లే మనస్సు చపలత్వం కూడా.. అని అన్నమయ్య వ్యాఖ్యానించగా దానినే వేమన్న ఇలా వివరించాడు.
కుక్కతోక దెచ్చి గొట్టంబు చేర్చిన
క్రోవి చెంతనుండు కొంత తడవు
ఎంత చెప్పు చెడుగు పంతంబు మానునా
విశ్వదాభి రామ! వినుర వేమ!
ఇంకా ఇలాంటి సామ్యాలు చాలా ఉన్నాయి. మరోసారి చెప్పుకుందాం.
సేకరణ: ఇక్కడా అక్కడా, -- పొన్నాడ లక్ష్మి.

కామెంట్‌లు లేవు:

The power of 'Will' Usage - English grammar - illustration

  When we use will to make a promise 🤝 or an offer 💡, we are usually deciding to do something at the very moment we are speaking. It shows...