16, జులై 2016, శనివారం

పద కవితా పితామహుడు 'అన్నమయ్య'


“ఓలి నిర్వుర సతుల నాలింగనము సేయ
లొలు డటుగాన నాలుగు చేతులాయ”
అనడం అన్నమయ్యకే చెల్లు. బండి తొక్కిన పాపం వాళ్ళ కృష్ణుడు బండిబోయడయ్యాడట. అందగాడయిన స్వామి విరహం కారణంగా నల్లబడ్డాడట. అమ్మవారి విషయంలో కూడా అన్నమయ్య వెనుకడుగు వేయలేదు. నడుమును లేనట్టుగా వర్ణించడం, నవ్వుల్ని తెల్లగా చెప్పడం కురుల్ని చీకటిగా చెప్పడం కవి సమయాలయితే వాటికి కారణాలు చెప్పాడు అన్నమయ్య.
నడుమేల బడుగాయ నవ్వులేల తెలుపాయ
వెడగు నీ గుణములు విని విని పో
కురులేల చీకటాయ, గోళ్ళేల వాండ్లాయ
సొరిది నీ చేతలనే చూచి చూచి పో
‘వాక్కులొక్కటే భాషల వరుస వేరు’ అని అన్నమయ్య భావం. పరమార్ధాన్ని పామరులకు బోధించే వేళ పదిమందికి తెలిసిన అంశాలను ఉదాహరణగా చెప్పడం సహజ సుందరమౌతుంది.
‘నేను జీవుడిని, నీవు పరమాత్ముడివి. జీవుడయిన నేను దారి తప్పాను. దారి తప్పడం అజ్ఞానం వల్ల కావచ్చు. అహంకారం వల్ల కావచ్చు. కాని దారి మళ్ళించడం నీ ధర్మం’ అని చెప్పడం కోసం అన్నమయ్య,
“సొమ్ము గలవాడు తన సొమ్ము చెడనిచ్చునా
కమ్మి నీ సొమ్మును నేను, కాపాడవే హరి “
పసుర మడవి బడ్డ పసురము కలవాడు
దెసలు వెదకి కింటికి తెచ్చుకున్నట్టు
వసగా ఆసలలోన వడిబడ్డ నా మనసు
ఎసగ మళ్ళించవే” అనడంలో అందరికీ తెలిసిన ‘పసరం’ (పశువు) ఉపమానం ఎన్నుకున్నాడు. అలాగే కొన్నిటికి ప్రయత్నాలేమీ అవసరంలేదని, అవి సహజ భావాలని చెప్పిన తీరు కూడా రమణీయం.
కాంత తలుచుకొంటేనే కామోద్రేకము పుట్టు
ఇంతలో కూడినా ఏడకేడ సూత్రము
చింతకాయతొక్కు, చూచితేనే నోరూరు
ఎంతకెంత దవ్వు ఏడకేడ సూత్రము. ఇలా ఎన్నో ఎన్నెన్నో అన్నమయ్య పద కవితలో మాధుర్యాలు, రమణీయాలు.
పొన్నాడ లక్ష్మి. సేకరణ: ఆచార్య సర్వోత్తమరావు, (తిరుపతి) గారి వ్యాసం నుంచి.

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...