20, జులై 2016, బుధవారం

ఎన్టీఆర్ ఆకర్షణ శక్తి


''యువచిత్ర'' బ్యానర్పై మంచి సినిమాలు తీసిన కె మురారి ''నవ్విపోదురు గాక..'' అనే పేరుతో 520 పేజీల్లో తన జీవితచరిత్ర రాసుకున్నారు. మూడేళ్ల క్రితం అది వెలువడినప్పుడు దానిలోని నాలుగైదు విషయాలను పట్టుకుని పుస్తకాన్ని వివాదాస్పదంగా చిత్రీకరించారు. నిజానికి దానిలో ఆయన చాలా విషయాలు బాగా రాశాడు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, వ్యవసాయ కుటుంబాలు రాజకీయాల్లోకి రావడం యిత్యాది అనేక విషయాలు విపులంగా తన కోణంలో రాశారు. ఎన్టీయార్గురించి ఆయన రాసిన ఒక సంఘటన రాస్తున్నాను. 
''
గోరింటాకు'' (1979) షూటింగు కోసం మురారి తన యూనిట్తో వైజాగ్వెళ్లారు. అప్పటి కింకా నటుడుగానే వున్న ఎన్టీయార్పోలీసుల కోసం నిధులు సేకరించడానికి రైల్లో వచ్చారు. ఎవరో ఎన్టీయార్కు చెప్పారు - 'ఊళ్లో దాసరిగారి దర్శకత్వంలో సినిమా షూటింగు జరుగుతోంది' అని. నిర్మాతెవరో కనుక్కుని ఆయన అనుమతి తీసుకుని ఆర్టిస్టులందరినీ పెరేడ్గ్రౌండ్స్లోని కార్యక్రమానికి తీసుకురమ్మనమని ఎన్టీయార్మనిషిని పంపారు. అతను తన వద్దకు రాగానే మురారికి ఒళ్లు మండింది 'ఆయన ప్రోగ్రాం కోసం మనం షూటింగు కాన్సిల్చేసుకుని వెళ్లడమేమిట'ని. డైరక్టరు దగ్గరకి పంపితే ఆయనే కుదరదంటాడు అనుకుని మనిషిని పంపితే దాసరి 'అలాగే, అందరం వస్తాం' అని చెప్పి పంపించేశారు. భోజనాల దగ్గర విషయం తెలిసి మురారికి చికాకేసింది. ఆయన ఎయన్నార్కు వీరాభిమాని కావడం, స్వతహాగా అహంభావం, దూకుడు వుండడంతో దాసరితో ''కావాలంటే మీరు వెళ్లండి, నేను రాను'' అని చెప్పేశారు. సావిత్రి అది విని ''అలా అనవచ్చా? మేమందరం వుండగా నీ దగ్గరకే మనిషిని ఎందుకు పంపారు? నిర్మాతగా గౌరవం యిచ్చినట్లే కదా'' అన్నారు. మురారికి ఏం చెప్పాలో తెలియకుండా ఆలోచిస్తూంటే 'సాయంత్రం ఫంక్షన్కు దండలు ఏర్పాటు చేయండి' అని దాసరి ప్రొడక్షన్వాళ్లకు చెప్తున్నారు. మురారికి యింకా పట్టుదల వచ్చింది - '' దండలు మీరందరూ వేస్తే వేయండి, నేను అక్కడకు వచ్చినా దండా అదీ ఏం వేయను'' అన్నారు.
మురారికి చాలా ఆత్మీయుడైన శోభన్బాబు అప్పుడు ''నువ్వు అక్కడికి వెళ్లగానే ఆయన నిన్నే ముందు పిలుస్తారు, నువ్వు దండ వేస్తావు. తర్వాత నీ మాటలు, చేతలు నీ అధీనంలో వుండవు'' అన్నారు. మురారి తెల్లబోయి చూస్తే ''అవును, నువ్వు ఆయన దగ్గరకు వెళ్లగానే ఆయన కళ్లలోకి చూడగానే నీ మతి మతిలో వుండదు. ఆయన ముఖంలో అంతటి ఆకర్షణశక్తి వుంది.'' అని రెట్టించారు. ''సోదె కబుర్లు చెప్పకు'' అని మురారి కొట్టి పారేశారు. ''నేను చెప్పినట్లు నువ్వు లేచి వెళ్లి ఆయనకి దండ వేస్తావు. దమ్ముంటే పందెం కాయి'' అన్నారు శోభన్‌. పక్కనే వున్న నటుడు చలం, దాసరి కూడా శోభన్వైపు మాట్లాడుతూ పందెం అన్నారు. ''ఓడిపోతే రేపు మీ అందరికీ లంచ్లో స్వీట్లు, కోడి కూర'' అన్నారు మురారి పంతంగా. సావిత్రి నవ్వుతూ విన్నారు. 
సాయంత్రం మీటింగుకి వెళ్లినపుడు యూనిట్కు సకల మర్యాదలు జరిగాయి, వాళ్ల కార్లను వేదిక దాకా వెళ్లనిచ్చారు, ముందు వరుసలో కూర్చోబెట్టారు. వేదికపై ఎన్టీయార్మైక్వద్దకు వచ్చి 'అందరికీ స్వాగతం, యువచిత్ర యూనిట్టంతా వచ్చినందుకు నిర్మాత మురారి గారికి ధన్యవాదాలు'' అని ''రండి మురారిగారూ'' అంటూ వేదికపైకి పిలిచారు. శోభన్బాబు చెప్పినదానిలో మొదటిది నిజమైంది. మురారికి ఆనందంతో బాటు అనుమానం, కాళ్లలో వణుకు ప్రారంభమైంది. కదలలేదు. సావిత్రిగారు నవ్వుతూ చెయ్యి తట్టి ''నిన్నే పిలుస్తున్నారు, వెళ్లు'' అన్నారు. ''నీ పని అయ్యిందిలే'' అన్నట్టు చలం చూస్తున్నారు. శోభన్బాబు మాత్రం ఆయన పరిస్థితిని అర్థం చేసుకుని లేచి నిలబడి తన చెయ్యి పట్టుకుని స్టేజి దాకా తీసుకెళ్లారు. కాస్త అయోమయస్థితిలోనే యీయన వేదికపైకి వెళ్లారు. ఎన్టీయార్రాజసంగా తన చూపులతోనే వేదికపై మురారి స్థానాన్ని సూచించారు. వెళ్లి కూర్చున్నారు. తర్వాత దాసరి, సావిత్రి, శోభన్‌, చలం - అందర్నీ వేదికపై ఆహ్వానించారు. సావిత్రి పైకి రాగానే రామారావుగారి పక్కన పదహారణాల తెలుగింటి యిల్లాలులా వున్న ఆయన భార్య బసవతారకం గారికి నమస్కరించారు. అది చూడగానే మురారి అసంకల్పితంగా లేచి తనూ ఆవిడకు నమస్కరించారు.
కాస్సేపటికి దాసరి మైక్తీసుకుని యూనిట్అందర్నీ పరిచయం చేయడం మొదలుపెట్టారు. మొదటగా మురారి పేరు చదివారు. ఈయన బింకంగా, తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో దండ తీసుకోకుండా ఎన్టీయార్వద్దకు వెళ్లారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దండ వేయకూడదని, కేవలం నమస్కారం పెట్టి వచ్చేద్దామని మురారి ప్లాను. కానీ కాస్సేపు పోయాక చూస్తే యీయన దండ వేయడం, పెద్దాయన 'రండి మురారిగారూ' అంటూ దగ్గరకు తీసుకోవడం జరిగాయి. ఇదెలా జరిగిందో తనకే తెలియలేదంటారు మురారి. తన ఆత్మకథలో ''నా చేతికి ఎవరు దండ యిచ్చారో, నేను ఎలా వేశానో నాకే తెలియదు. చలం అంతకుముందే అన్నారు - 'ఆయన ముఖంలోని తేజస్సు మనల్ని మనకి తెలియకుండానే ఆకర్షణలో పడేస్తుంది' అని. తర్వాత ఏం జరిగిందో నాకు యిప్పటికీ గుర్తు లేదు. తెలియని అనుభూతి. నాలో నేను లేను. నిజంగానే ఆయన రారాజు.'' అని రాసుకున్నారు.
తన అవస్థ చూసి చలం, శోభన్బాబు నవ్వుతూంటే మురారికి కోపం రాలేదట. తెలియని ఆనందపు మైకంలో వాళ్లకి మనసులోనే ధన్యవాదాలు చెప్పారట. మురారి మైకం, తన్మయత్వం గమనించిన శోభన్ఆయన కుర్చీలో కూర్చోబోతూంటే కిందపడి పోతాడేమో అన్నట్లుగా లేచి పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టారు. మర్నాడు షూటింగు లంచ్లో అందరికీ స్వీట్లు, కోడికూర. ''మురారి పందెం ఓడితే యిలా వుంటుందన్నమాట'' అన్నారు సావిత్రి. 'ఇది ఓడడం కాదు, ఓడి గెలవడం' అనుకున్నారు మురారి లోలోపల. -

(Courtesy : Sri Kameswararao Anappindi, photo courtesy : Sri Sambasivarao Nulu)

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...