26, మార్చి 2017, ఆదివారం

!! ఇష్టమే !! - కవిత - My pencil sketch



Image may contain: one or more people and drawing
Anu Sree
!! ఇష్టమే !!
కొన్ని కష్టాలు కూడా చాలా ఇష్టంగా మారిపోతుంటాయి అప్పుడప్పుడు.....!!
మరపురాని కథల్లా మనసులో
మెదులుతూ ఉంటాయి ఎప్పుడూ...
అనుభవించిన వేళ ఎంత కుమిలినా
ఆపద తీరాక కలిగే ఆనందం
అది ఆస్వాదించే సమయంలో
ఒలికే ఆనందపు భాష్పాల తడి
గాయపడిన హృదయానికి స్వాంతననిచ్చే
అపురూప క్షణాలు
మన మదిలో శాశ్వతంగా మిగిలిపోతాయి.......!!
అప్రమత్తతలుగా దిశానిర్దేశాలుగా
మంచీ చెడుల బేరీజులో
న్యాయనిర్ణేతలుగా....
స్వభావాల వలలో స్వాభిమానానికి
ప్రమాదాలు ఎదురవకుండా
ఆలోచనలకు ఆచరణలకు కాపుకాసే
నిరంతర సూచికలై నిలిచిపోతాయి....!!
సలహాల సంప్రదింపులై మిగిలిపోతాయి...!
----అను---

24, మార్చి 2017, శుక్రవారం

అన్నమయ్య -- Annamayya

అన్నమయ్య - Annamayya



నేడు తాళ్ళపాక అన్నమాచార్యుల వారి వర్ధంతి.
అన్నమయ్య కారణజన్ముడు. 'అన్నం బ్రహ్మేతి వ్యజానాత్'అని శృతి. అన్నమును బ్రహ్మముగా చెప్పుటచే నామమునందే వేదాంతార్ధము కనిపిస్తున్నందున అన్నమయ్య సార్ధకనామధేయుడు. దీనిని బట్టి వేదములు, ఉపనిషత్తులు, పురాణేతిహాసముల యొక్క సారమును భక్తి సంకీర్తనలలో మేళవించి, గానము చేసి సామాన్య ప్రజానీకమునకు వారి భాషలో బ్రహ్మజ్ఞానమును సులభతరముగా సూచించిన మార్గదర్శి అన్నమయ్య.
అన్నమాచార్యులు సంకీర్తనాచార్యుడై వేంకటపతిమీద ముప్పదిరెండు వేల కీర్తనలను రచించి పాడినారు. తిరుమల మొదలుకొని ఊరూరా, వాడ వాడలా 'దేవుడు మెచ్చును లోకము మెచ్చును' అన్నట్లుగ త్రికరణశుధ్ధిగా ఆ తిరుమలేశునిపై పదాలు అల్లి పాడి ప్రచారం చేశారు. ఆ ప్రచారంలో ఆయా ఊళ్ళలోని దేవుళ్ళను వేనోళ్ళ కీర్తించి, ఆ దేవుళ్ళందరిలోనూ వేనామాలవానిని దర్శించిన ధన్యజీవి అన్నమయ్య.
అన్నమయ్య ఆంధ్రసాహిత్యంలో అపూర్వమైన, అనితరసాధ్యమైన కొత్త పోకడలు ప్రవేశ పెట్టాడు. పద్యసంపదతో మాత్రమే పరిఢవిల్లే ఆంధ్రభారతికి పదసంపద కూడా సమకూర్చి సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేసాడు. తొలి తెలుగు వాగ్గేయకారుడుగా ఆంధ్రసాహిత్య చరిత్రలో అద్వితీయస్థానమలంకరించాడు. జానపదుల వాడుక భాషకు సాహిత్య గౌరవం కలిగించాడు. సామెతలు, జాతీయాలు, నానుడులు, నూతన పదబంధాలు మొదలయిన వాటిని తన సంకీర్తనల్లో వాడుకున్నాడు. జోల పాటలు, మెల్కొలుపు పాటలు, పెళ్ళీ పాటలు, శోభనపు పాటలు మొదలైనవి తన కీర్తనల్లోప్రవేశ పెట్టాడు.
వాగ్గేయకారులలో దీర్ఘాయుష్మంతుడు, సంచారశీలి, పద్యపదకవితల్ని అభిమానించిన వారలలో అన్నమయ్యకు సాటి మరెవ్వరూ లేరు. ప్రజలమధ్య తిరుగుతూ, ప్రజలకోసం పదాలు పాడినవాడు. అతని రచనల్లో రైతులు, వైద్యులు, కమ్మరి, కుమ్మరి, సాలివాడు, చాకలి, గొల్ల, బొమ్మలాటలాడెవారు ఇతర నిమ్న జాతుల వారెందరో కనిపిస్తారు. వారి జీవనశైలి కళ్ళకు గట్టినట్లు కనిపిస్తుంది. వారి వారి స్వభావాన్ని భక్తికి అనుబంధంగా తీర్చడం అన్నమయ్య గొప్పతనం.
గ్రాంధికభాష తప్పవ్యావహారిక భాషను కవిత్వంలో ఏమాత్రమూ వాడని ఆ రోజుల్లో కూడా పలుచని నవ్వు, పోలయలుకలు, అమ్ముడుబోవు, బచ్చెన మాటలు, మూసిన ముత్యము మొదలైన వాడుక పదాలు గ్రంధస్తం చేసాడు. ప్రజల జీవన విధానం, పలుకుబడులు నిశితంగా గమనిస్తూ, ఎన్నో సంకీర్తనలు రాసిన అన్నమయ్య అమరుడు. అన్నమయ్య కీర్తనలు అజరామరాలు.

22, మార్చి 2017, బుధవారం

నమస్సుమాంజలి - కవిత

నమస్సుమాంజలి.
యౌవ్వన ప్రాంగణంలొ అడుగుపెడుతూ
ఆకాశపు టంచులలో ఆనందంతో ఊగిసలాడాలని ఊహ!
అంధకారపు లోతులలోకి నిస్సహాయంగా జారిపోయిన వాస్తవం.
పచ్చని కాపురం, ప్రియసఖుని అనురాగంలో మునిగితేలాలని కల!
వేధింపులతో సాధింపులతొ తారుమారైన జీవితంలో మిగిలిన పగటి కల.
మాతృమూర్తియై పసిపిల్లల లాలనలో మునిగితేలాలని ఆశ!
నిస్సంతుయై అపనిందలతో తీరని మాతృ వాంఛతో అంతులేని నిరాశ.
సేవాదృక్పథంతో దీనులను తన సేవలతో ఆదుకోవాలని ఆశయం!
అనారోగ్యంతో తనకు తనే భారమై ఇతరుల సహకారంతో వెళ్ళదీసే బ్రతుకు.
అయినా మొక్కవోని ఆత్మస్థైర్యంతో, ఆశావాదంతో అడుగు ముందుకు వేస్తూ
ఎందరికో స్ఫూర్తినిస్తూ, మరెందరికో వీలయినంత సహాయం చేస్తున్న మహిళలకి
నా హృదయపూర్వక నమస్సుమాంజలి.

- పొన్నాడ లక్ష్మి

20, మార్చి 2017, సోమవారం

మరో బాల్యం - Anu Sree - నా పెన్సిల్ చిత్రం


Image may contain: 1 person
>>>>మరో బాల్యం <<<< 
Anu Sree
ఎక్కడో దూరంగా
అలిగి వెళ్ళిపోయింది
అందమైన బాల్యం....
అమ్మ చేతి గారానికి
నాన్న ఇచ్చే తాయిలానికి
మురిసిపోయి సంబరమయ్యే
ఆనాటి చిరు ఆశలు
చిన్ని చిన్ని కోరికలు తీరినవేళ
కేరింతలై తుళ్ళింతలై
ఎగసిపడిన ఆనందాలు అన్నీ
గతకాలపు వైభవాలు........!!
అలిగితే బుజ్జగించే ప్రేమ
కోపం వస్తే లాలించే దీవెన
పొరపాట్లను భరించే సహనం
దోబూచులాటలోనూ దొంగను
కానివ్వని ఆరాటం....
మరెవ్వరూ అందించని ఆప్యాయత.....!!
అన్నీ అందని ఆకాశానికి
రెక్కలు కట్టుకుని ఎరిపోయాక....
ఆ నిర్మలమైన మనసుకై వెతుకుతుంటే
ఎడారిలో వానజల్లై మురిపిస్తూ
మరోసారి మననం అవుతోంది..!!
మన కంటి వెలుగులైన పాపాయిల్లో....
మనసారా మరోసారి ఆస్వాదించమంటూ....
కోరని వరమై వచ్చి కోరిక నెరవేరుస్తోంది...!!
అనుశ్రీ......


19, మార్చి 2017, ఆదివారం

నీకై వేచిచూసిన ఆశలన్నీ



నా పెన్సిల్ చిత్రానికి శ్రీమతి అనుశ్రీ కవిత

!!! నిర్వేదం !!!

నీకై వేచిచూసిన ఆశలన్నీ
వెనుదిరిగి వచ్చేసాయి
నిరాశల నిట్టూర్పులుగా....
ఆ ఘడియలు గుర్తొస్తే
ఇప్పటికీ శూన్యమే నా మది
ఎప్పటికీ అగమ్యమే మనిద్దరిది.....!!
నిద్రను వెలేసి మనసును కాపేసి
వేదన నిండిన గొంతుని
వేడుకగా నీ ముందర నిలిపి
నా వలపుకు విలువిచ్చి
వస్తావేమో అని
పడిగాపులు పడ్డ ఆ క్షణాలు....
కళ్ళల్లో నిండిన కన్నీళ్ళు
నీ రాకను గమనించవేమో
అని కడ కొంగుతో పలు మార్లు తుడిచి
అశాంతి నిండిన చిరునవ్వును
పెదవులకు అంటించుకున్న ఆరోజులు
ఇప్పడూ ఎప్పుడూ మనసుకు
మానని గాయాలే....
నీలో మార్పు చూడాలని
నాపై ప్రేమ కలగాలని
మనిషిగా ఉన్నతమై ఎదగాలని
దేవుడి ముందర కూర్చుని
చదివిన స్తోత్రాలు చేసిన పూజలు
ఫలించని నా కోరికల్లా
నిర్వేదాన్ని మోసుకొస్తుంటే...
గడిచిన గతం
నడుస్తున్న వర్తమానం
నా ఓటమిని పదే పదే గుర్తుకుతెస్తుంటే...
నలిగిన నా హృదయాన్ని
అనునయించి అర్థించి జీర్ణించుకుంటున్నా
ఇదే జీవితమని ఇంతే మిగిలిందని....
బహుదూరపు బాటసారివై
మండే గుండెలకు ఆజ్యం పోస్తూ
నువ్వెంత దూరం వెళ్ళి తిరిగొచ్చినా
నువ్వు తెచ్చే నిస్పృహలను కొలిచే
ఓర్పులు లేవిక్కడ.....
సమాధిలో స్థిరపడ్డ
ప్రేమ నిండిన నా సహనం
బ్రతికి రాదిక...!!
వరమో శాపమో నిన్ను
మరిచిన నా మదికి
సదా నే కృతజ్ఞురాలినే.........!!

అనుశ్రీ.....

14, మార్చి 2017, మంగళవారం

కారణం - కవిత - Pencil sketch

నా  Pencil sketch :
కవిత courtesy : అను. , source : Vijaya Bhanu (my daughter)
!!కారణం!!
గుండెని మెలిపెట్టే బాధ
కళ్ళలో పొంగుతున్న కన్నీళ్ళు
జ్ఞాపకాల పేజీ తిప్పగానే
అవమానాలను గుర్తుచేసి
మనసు గాయం మరోసారి
అనుభవిస్తోంది మౌనవేదన...!!
ముసుగులోని స్నేహం
అబధ్ధమని తెలిసినా
అడ్డు చెప్పక అంగీకరించి
మదిలో వ్యథలు,రొదలు
రెట్టింపైనా భరించి
జరిగినవన్నీ జరగలేదని
ఒప్పిస్తూ మర్చిపోవాలి...!!
అంతరాత్మ పెట్టే హింసనైనా
పెదవులపై నవ్వులాగే ఒలికించాలి
స్వార్థం ముందు స్వాభిమానం
తలొంచనన్నా సరే
స్థితిగతుల బేరీజు వేసి
తప్పదని మెప్పించాలి....!!
నా భావాల ప్రదర్శన నేరం కనుక
పరిష్కారం నేనే అని తప్పుకుంటే
అంతా ఆనందమే..అన్నీ అభిమానాలే
అప్పుడు ఎవరికీ నేను కారణం కాను....!!
- అను

11, మార్చి 2017, శనివారం

మదిభావం॥తొలిపూత॥

నా చిత్రానికి శ్రీమతి Jyothi Kanchi గారి కవిత.

మదిభావం॥తొలిపూత॥
~~~~~~~~~~~~~
నాపెదవిపైన
నీచిరునవ్వే పూసింది
మదిలో చిగురాకుల ఉగాది 
ముందే పూతేసింది
నీతలపుల చిలిపిదనం
తలుపుచాటున మాటువేసి
చీరచెంగు అంచులతో
సరిగమలను పాడుతోంది
వాలుతున్న మలిపొద్దు
ఆశలేవో మోసుకొస్తూ
జడవాలుగ కుచ్చులతో
కబుర్లాటఆడుతోంది
మాటలలో దాచుకున్న
తీపినీకు పంచాలని
మధురమైన వేగిరమే
ఎదురుచూపుచూస్తోంది..
తళుకులీను కన్నులతో
సిరిమోమున సిగ్గులతో........
మనసంతా నీముంగిట
ముగ్గులాగ పరచాలనీ
ఎదురువేయిచూపులతో
తలవాకిట నిలిచాను
అవును!!
నే అమ్మనౌతున్నా .....
అంతులేని
మరో అనుబంధమౌతున్నా.....
అమూల్యమైన అనురాగానౌతున్నా....J K
11-3-17(చిత్రం-Pvr Murty బాబాయ్ ..ధన్యవాదాలు బాబాయ్ ...)


Show more reacti

10, మార్చి 2017, శుక్రవారం

చంద్రముఖి - పెన్సిల్ చిత్రం

నా పెన్సిల్ చిత్రం = కవిత courtesy : ఓ అజ్ఞాత కవయిత్రి/కవి
నిజం ఈ స్వప్నం ...కళ్ళు మూస్తే మాసేది కాదు ..
కనుమరుగు అయ్యేది కాదు నా ఈ మధురస్వప్నం...
బ్రతకాలనే వుంది నీ జతలో ..నిండు నూరేళ్ళు ...
నిలవాలనుంది ...నీ నీడలో తోడుగా ...
కనుమూసేదాకా కలలతో కాపురమే చేస్తా నీ ఆన గా ...
వేచిచూస్తాలే ...గాలిలో ధూళినై కలిసిపోయేదాకా ..


గజల్ ॥మేఘమంటి మనసు॥ by శ్రీమతి Jyothi Kanchi
~~~~~~~~~~~~~~~~~
మనసువెక్కి పడుతుంటే మాటెందుకు రాదోమరి!!
కన్నీటిని ఓదార్చే బదులెందుకు రాదోమరి!!

వేదనలే నింగినంటి భారమౌతు నిలిచాయీ
మదిమేఘమె చల్లబడుతు చినుకెందుకు రాదోమరి!!
కంటిచెమ్మ ఉప్పదనం కలలన్నీ కుమిలాయీ
రాలిపోవు అశలకే తీపెందుకు రాదోమరి!!
గుండెలోతు గాయాలకు ఎదురేగుతు నిలిచాయీ
ఙ్ఞాపకాల చిగురులకే పూతెందుకు రాదోమరి!!
మరలిరాని నవ్వులన్ని గోడలపై మొలిచాయీ
బీటపడిన మొండిమదికి అతుకెందుకు రాదోమరి!!
నిశివీడని వెన్నెలలో వేచివుంది చిరు'జ్యోతి'
ఆర్తితోడ హత్తుకొనే నీడెందుకు రాదోమరి!!
J K 11-3-17(చిత్రం- Pvr Murty బాబాయ్ ...
ధన్యవాదాలు బాబాయ్ గారూ!)

8, మార్చి 2017, బుధవారం

ఏమాయె మగువా? ఆనాటి చెలిమి?



ఏమాయె మగువా? ఆనాటి చెలిమి? నా పెన్సిల్ చిత్రానికి చక్కని పద్య రచన చేసిన శ్రీమతి 
 Sasikala Volety  గారికి నా ధన్యవాదాలు.
*******************
కం)ఏమయ్యెనా మురిపములు?
ఏమాయ ముసిరె? మగువల యెడమల బెంచన్!
ఏమూల గనిన స్వార్ధమె
యేమార్చి, వంచించు బుద్ది యేమది మదులన్.!!
……………………………………
కం)తల్లి-కొమరితల బంధము
వల్లరిగ మరి హృది మీటు పాటగ నరయన్
పల్లవిగ సుదతి గమనము
వెల్లివిరిసెడి దదె గాద వెలుగులు జిందన్.
……………………………………………
కం)వదిన మరదళ్ళదె గనగ
సుదితముగ స్నేహ పూర్ణ సోదరి భంగిన్
పదియింతలు నాప్యాయత
చెదరక చూపించి పెంచె చెలిమిని కూర్మిన్.
……………………………………………
కం)అక్కలు చెల్లెలు జూడగ
మక్కువ ననురాగ మంది మసలుచు నదిగో
ఇక్కట్ల సమయమొచ్చిన
పెక్కుగ సహకారమిచ్చి బెంచెన్ బ్రేమన్.
……………………………………………
కం)కలిసి మెలిసి మసులు కునుచు
కలిమిగ, వెలుగుచు, కలకల కన్నుల పంటై
విలసిల్లగ స్నేహ సిరులు
చెలుములు మీరగ చెలియలు చెరగుచు బంచెన్.
……………………………………………
కం)ఆనాటి చిత్ర మది నిల
నీనాడదె కానరాదు నిముసంబైనా.
తేనెలు పూసిన కత్తులు.
జాణలదె ! నిలుపరు భాళి,చలువపు స్నేహం.
……………………………………………
కం)మారుము మగువా! నువ్విక
మరువకు కలిమియె బలమని మనగను మహిలోన్.
చెరపకు, విరువకు మనసులు
అరుదగు మనుషులు కరువగు అలమట పడగన్.
…………………………………………
కం)కలుపుకు పో యందరినీ
పలుకుచు మృదువుగ ప్రియంబు జల్లుచు మైత్రిన్
కులకక, సాగుము బ్రీతితొ
చిలుకల గుంపుగ నలరుచు చెలియల తోడన్.

5, మార్చి 2017, ఆదివారం

మరల రాని కలే కదా..మధురమైన ఈ కల'యిక - తెలుగు గజల్


నా పెన్సిల్ చిత్రానికి శ్రీ Madhav Rao Koruprolu గారి గజల్. ఇంత మంచి కవిత అందించినందుకు వారికి నా ధన్యవాదాలు.

మాన్యశ్రీ Pvr Murty గారికి ప్రత్యేక కృతజ్ఞతలతో..!
గజల్ 1451.
మరల రాని కలే కదా..మధురమైన ఈ కల'యిక..!
చెప్పలేని కథే కదా..అందమైన ఈ కల'యిక..!
చైతన్యపు పొదరింట్లో..నాట్యమాడు మెఱుపులెన్నొ..
నిన్నలేని వలే కదా..నిత్యమైన ఈ కల'యిక..!
ఊయలంటి మనసేమో..మధురోహల మబ్బులలో..
మోయలేని బరువేగా..భారమైన ఈ కల'యిక..!
ఈ కత్తుల వంతెనపై..ప్రతిక్షణం మనోహరం..
చూడలేని అడవేగా..దివ్యమైన ఈ కల'యిక..!
వెలుగుపూల కడలికసలు..తీరమెలా ఉంటుందట..
పంచలేని ఫలమేగా..భాగ్యమైన ఈ కల'యిక..!
ఈ మాధవ గజల్ కన్న..వింతగొల్పు గగనమేది..!
వ్రాయలేని కావ్యమేగ...సరసమైన ఈ కల'యిక..!

3, మార్చి 2017, శుక్రవారం

బాల్యం

శ్రీమతి Ponnada Lakshmi గారి కవిత కి నా పెన్సిల్ చిత్రం

చేదు జ్ఞాపకంగా మిగిలిన బాల్యం.
అమ్మకౌగిట పంజరంపు చిలకలా నిశ్చింతగా గడిపేది బాల్యం.
నాన్నదగ్గిర గారాలు పోతూ కావలసినవి సమకూర్చుకొనేది బాల్యం

కారణాంతరాలవల్ల తాతగారింట గడపవలసివచ్చిన బాల్యం.
మాతామహుల ఇంట్లో అన్నింటికీ మొహమాటపడుతూ తిరిగే బాల్యం
సహజసిధ్ధమైన అల్లరి చెసి దెబ్బలు తిని అమ్మకోసం ఆక్రోశించిన బాల్యం.
చదువులో వెనకబడి మరిన్ని చివాట్లు తిన్న బాల్యం.
చిరుతిండి ఏదయినా ఇంకాస్త తినాలనిపించినా అడగలేని దౌర్భాగ్యపు బాల్యం
రాత్రి అమ్మ చెంగుచాటున ఆదమరచి నిద్రపొవాలని ఆశపడే బాల్యం
ఒంటరిగా నిద్రపోతూ మధ్యలో 'అమ్మా!' అని కలవరిస్తూ ఉలిక్కిపడి లేచే బాల్యం
సెలవుల్లొ అమ్మదగ్గిరకి వెళ్ళాలని ఆత్రపడే బాల్యం.
నాన్నగారి రాకకోసం ఎదురుచూస్తూ క్షణమొక యుగంగా గడిపిన బాల్యం.
ఇంటికెళ్ళి అమ్మ ఒడిలో తలదాల్చుకుని స్వాంతన పొందిన బాల్యం.
బాల్యం అందరికీ మధురస్మృతి అయితే కొందరికి మాత్రం చేదు జ్ఞాపకమే.
నాకు తెలిసిన కొంతమంది బాల్యం జ్ఞప్తికి వచ్చి మనసు కలతపడి,
Mahesh A గారి బంగారు బాల్యం కవిత చదివాక నాలో కలిగిన భావాలు.

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...