17, ఆగస్టు 2018, శుక్రవారం

అటల్ బిహారి వాజ్పాయీ - Atal Bihari Vajpayee

అటల్ బిహారి వాజ్పేయి - నా పెన్సిల్ చిత్రం.

సమున్నత విలువల శిఖరం

రాజకీయాల్ని ప్రజాహిత రంగంగా భావించి దశాబ్దాల పాటు అవిరామంగా సాగించిన మహా వాజపేయం ముగిసింది. పుష్కర కాలం వాజ్‌పేయీ అంటే- భావుకత మూర్తీభవించిన విగ్రహం; సంక్షుభిత స్థితిలోనూ సడలని నిగ్రహం! ‘మృత్యువుకైనా వెరవను, చెడ్డపేరంటే మాత్రం చాలా భయం’ అన్న వాజ్‌పేయీది సమున్నత విలువల పథంలో అలుపెరుగని ప్రస్థానం! అటల్‌ జీ విఖ్యాత జాతీయ నాయకుడు... విశిష్ట రాజకీయవేత్త... స్వార్థమెరుగని సంఘ సేవకుడు... మహా వక్త, సాహితీమూర్తి, చక్కని కవి, మంచి పాత్రికేయుడు- 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా సత్కరిస్తూ ఇచ్చిన ప్రశంసాపత్రంలోని ఈ విశేషణాలన్నీ ప్రజాజీవనంలో వాజ్‌పేయీ బహురూపాలు. అర్ధనిమీలిత నేత్రాలతో కవిత చదివినా, అనర్గళ వాగ్ధాటితో ప్రత్యర్థుల్ని చెండాడినా అది వాజ్‌పేయీకే చెల్లు! ‘అధికారంలో కొనసాగడానికి అవినీతిని ఆశ్రయించం, అనైతిక పద్ధతులూ అవలంబించం. మా ఆత్మల్ని అమ్ముకోవాలనో, తాకట్టు పెట్టాలనో మేము అనుకోవడం లేదు’- అంటూ 1996లో పదమూన్నాళ్ల ప్రధానిగా పార్లమెంటులో వాజ్‌పేయీ చేసిన చారిత్రక ప్రసంగం ఆయన నైతిక నిష్ఠాగరిమకు ఘనతర ప్రతీకగా నిలిచింది. దేశ రాజకీయాల్లో కొడిగట్టిపోతున్న కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా భాజపాను జాతి ముందు నిలబెట్టడంలో ఆ కర్మయోగి రాజనీతిజ్ఞత, దూరదృష్టి నిరుపమానమైనవి. తొలుత దేశం, పిమ్మట పార్టీ, ఆ తరవాతే నేను అనే ఆదర్శవాదాన్ని ఆచరణలో పెట్టి, భాజపాకు విలక్షణ సైద్ధాంతిక పునాదుల్ని నిర్మించి, సంకీర్ణ రాజకీయ నావకు తానే సహనశీల చుక్కానిగా మారిన దార్శనికుడు వాజ్‌పేయీ.‘బారీ బారీ అటల్‌ బిహారీ’ అనేంతగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేసిన వాజ్‌పేయీ- దేశమాత రుణం తీర్చుకొన్న ధన్యజీవి! 
నిక్కమైన భావుకత, నిఖార్సైన నిర్భీకత నిలువెల్లా నిండిన అపురూప వ్యక్తిత్వం అటల్‌జీది. ‘ప్రచండ వేగంతో సృష్టిని సాగిస్తూ ప్రళయాల్ని ధరిస్తా’నని, ‘కీర్తి మతాబుల్లో కొందరు కేరింతలు కొడుతుంటే చీకట్లను రహించే పనిలో నిమగ్నం అవుతా’నని కవితాత్మకంగా స్పందించిన వాజ్‌పేయీ- ఆరు దశాబ్దాల ప్రజాజీవనంలో త్రికరణశుద్ధిగా నిబద్ధమైనదే ఆ మహత్కార్యానికి! హిందీలో బ్రహ్మాండమైన వక్తగా తొలినాళ్లలోనే లోక్‌సభాపతి అనంతశయనం అయ్యంగార్‌ కితాబులందుకున్న వాజ్‌పేయీ- ఐక్యరాజ్య సమితిలో రాజ్యభాషలో ప్రసంగించి భారతావని వాణిని ప్రతిధ్వనింపజేసిన ఘనాపాటి. పండిత నెహ్రూను అమితంగా అభిమానించడమే కాదు, తరాల అంతరాలను చెరిపేసి ప్రజాతంత్ర విలువల ఔన్నత్యానికి తానే విశిష్ట వారధిలా ఎదిగిన మేటి! ‘వారసత్వ సమస్యల్ని ఎన్నింటిని పరిష్కరించాం... జాతి ప్రగతికి ఎంత పటిష్ఠ పునాది వేశాం’- ఈ రెండే ప్రతి తరం బాధ్యతాయుత వర్తనకు గీటురాళ్లు అన్నది వాజ్‌పేయీ చెప్పిన మాటే. పదిసార్లు లోక్‌సభకు, రెండు పర్యాయాలు రాజ్యసభకు ఎన్నికైన మహానేత భిన్న హోదాల్లో జాతికి చేసిన సేవకూ తూకంరాళ్లు అవే! కశ్మీర్‌ వివాద పరిష్కారాన్ని లక్షించి చారిత్రక లాహోర్‌ బస్సు యాత్రతో పాకిస్థాన్‌కు స్నేహహస్తం సాచడంలో, కశ్మీరీలను అక్కున చేర్చుకొనేలా మానవీయ విధాన రూపకల్పనలో సౌభ్రాత్ర పరిమళాల్ని వెదజల్లిన వాజ్‌పేయీ- విశ్వాసఘాతుకంతో కార్గిల్‌ యుద్ధానికి కాలుదువ్విన ముషారఫ్‌ మూకల వెన్నువిరిచిన సాహసి. ఉద్రిక్తతలు పెంచిన అయోధ్య వివాదానికి న్యాయ ప్రక్రియ ద్వారా లేదా పరస్పర ఆమోదయోగ్యమైన చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలన్న ఆయన నిర్దేశం- జాతి సమగ్రతకే గొడుగుపట్టింది. పార్టీగత అతివాదులకు ముకుతాడు వేసి, పూర్తికాలం దేశాన్నేలిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా సంకీర్ణ నావను ఒడుపుగా ప్రగతి తీరాలకు చేర్చడంలో వాజ్‌పేయీ చాణక్యం సంస్తుతిపాత్రమైనది! 
‘పార్టీకి దేశానికి ఏది మంచిది అనే లక్ష్మణరేఖను ఎవరికి వారు గౌరవించి, క్రమశిక్షణకు కట్టుబడి ఉంటే, దీర్ఘకాలం బంధాలు నిలబడతాయి’ అంటూ లాల్‌కృష్ణ అడ్వాణీతో తన దశాబ్దాల సాన్నిహిత్య రహస్యాన్ని వాజ్‌పేయీ వెల్లడించారు. అణుశక్తి సంపన్న రాజ్యంగా ఇండియాను తీర్చిదిద్ది, అమెరికా సహా పలు దేశాలు విధించిన ఏకపక్ష ఆంక్షల్ని దీటుగా ఎదుర్కొని, అచిరకాలంలోనే అగ్రరాజ్యాలన్నింటితో భాగస్వామ్య బంధాల్ని బలీయంగా ముడివేసిన వాజ్‌పేయీ విదేశాంగ వ్యూహ విశారదుడు! బుడిబుడి అడుగుల దశలో ఉన్న ఆర్థిక సంస్కరణలకు ఒడుపును, వేగాన్ని అందించి ఎనిమిది శాతం వృద్ధిరేటును సాకారం చేసింది వాజ్‌పేయీ ప్రభుత్వం. సప్తవిధ అనుసంధాన ప్రక్రియల ద్వారా యావత్‌ జాతినీ ఏకతాటిపైకి, ప్రగతిబాటలోకి నడిపించిన ఆయన సారథ్యం చిరస్మరణీయం. నాలుగు మహానగరాల్ని అనుసంధానించే స్వర్ణచతుర్భుజి, దానితోపాటే గ్రామీణ రోడ్ల అనుసంధానం దేశార్థికాన్ని కొత్తపుంతలు తొక్కించాయి. రైలు, విమాన, జలరవాణా సేవలతో పాటు అంతర్జాల విస్తృతి, టెలికాం విప్లవాలు ఇండియా ముఖచిత్రాన్నే మార్చేశాయి. 1999లో వాజ్‌పేయీ తెచ్చిన కొత్త టెలికాం విధానం వల్లనే దేశీయంగా మొబైల్‌ విప్లవం అద్భుతాలు సృష్టిస్తోంది. ఆదేశిక సూత్రంగా, నామమాత్రంగా మిగిలిన నిర్బంధ ఉచిత విద్యాలక్ష్యాన్ని సర్వశిక్ష అభియాన్‌ ద్వారా పట్టాలకెక్కించి కోట్లాది నిరుపేద పిల్లలకు అక్షరాభ్యాసం చేసిన గురువరేణ్యుడు వాజ్‌పేయీ. ‘నా ఆరోగ్యంపై చింతలేదు... దేశ ఆరోగ్యం గురించే నా ఆందోళన అంతా’ అని ప్రకటించి, నూట ముప్ఫైకోట్ల జనావళి ఆలోచనలూ హృదయాల అనుసంధానంతో జాతికి సముజ్జ్వల భవితను స్వప్నించిన వాజ్‌పేయీ- రాజకీయ వినీలాకాశంలో ధ్రువతారగా వెలిగే రాజర్షి!

(సేకరణ : ఈనాడు సంపాదకీయం)

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...