18, ఆగస్టు 2018, శనివారం

సాలూరు రాజేశ్వరరావు - Saluru Rajeswara Rao

స్వరసారధి సాలూరు రాజేశ్వరరావు గారి గురించి నేను తెలుసుకున్న కొన్ని విషయాలకి నా పెన్సిల్ చిత్రం జోడించి మీముందు ఉంచుతున్నాను. వీరు 11 October 1922 లో జన్మించారు.
"మెలొడీ” అనే మాట వినగానే సినీ సంగీతాభిమానులందరూ ఏకాభిప్రాయంతో తల్చుకునేది సాలూరు రాజేశ్వర రావు గారిని అంటే అని అంటే అతిశయోక్తి ఎంతమాత్రమూ కాదు. ఈయన శాస్త్రీయ సంగీతంలో దిట్ట. ఆయన శాస్త్రీయ,లలిత సంగీతాల సమ్మేళనంగా ఆణిముత్యాల్లాంటి మధుర సినీ గీతాలను మనకి అందించారు. అనేక ప్రయోగాలను చేశారు. కొన్ని గీతాలను ఇంగ్లీష్ గీతాలనుంచి ప్రేరణ పొంది కొద్ది ఛాయలతో మాత్రమే వాటిని అచ్చ తెలుగు పాటలుగా మలిచారు. పాశ్చాత్య సంగీత పద్ధతులను తొలిసారిగా తెలుగు సినీ రంగంలో ప్రవేశపెట్టిన ఘనత ఆయనది. చంద్రలేఖ సినిమా ఇందుకు ఒక ఉదాహరణ.
ఆలిండియా రేడియోకి సోలో గానూ, రావు బాలసరస్వతి తోనూ కలిసి ఆయన పాడిన లలితగీతాలు 1940 ల్లో యువ హృదయాలను ఉర్రూతలూగించాయి. “పాట పాడుమా కృష్ణా పలుకు తేనెలొలుకునటుల" , ”చల్ల గాలిలో యమునా తటిలో” , “ఓ యాత్రికుడా” వంటి పాటలు ఈ నాటికీ ఆయన సంగీతాన్ని అభిమానించే వారికి గొప్ప ఆస్తి క్రిందే లెక్క! సన్నని స్వరంతో ఆయన పాడిన లలిత గీతాలు ఆలిండియా రేడియో పుణ్యమా అని సంగీతాభిమానుల దాహార్తి తీర్చాయి.
సినిమాల్లో ఆయన ప్రావీణ్యం కొత్తపుంతలు తొక్కి, మెలొడీకి పెద్దపీట వేయడమే కాక, కొన్ని సినిమాలను ఈ నాటికీ మ్యూజికల్ హిట్లుగా నిలబెట్టింది. తెలుగు సినిమా సంగీతాన్ని ఆరాధనీయమైన స్థాయికి తెచ్చింది రాజేశ్వర రావు గారేనన్నా అతిశయోక్తి కాదు.

ఇంక సాలూరి కిరీటంలో కలికితురాయి మల్లీశ్వరి (1951). సినిమా సంగీతంలోను, సినిమా తీసే పద్ధతిలోను గణనీయమైన మార్పులు చెందినా, డబ్భై సంవత్సరాలు దాటినా  నేటికీ గల గలా ప్రవహించే నదిలా వీనులవిందు గొలుపుతున్న సాహిత్య సంగీతాల మేళవింపు “మల్లీశ్వరి”. వి.ఎ.కె.రంగారావుగారి మాటల్లో చెప్పాలంటే “బి.ఎన్‌.రెడ్డి కార్యదక్షతతో, దేవులపల్లి మల్లెపూరేకు బరువుతో వ్రాసిన సాహిత్యంతో, పసుమర్తి కృష్ణమూర్తి నృత్య సారధ్యంతో, ఘంటసాల భానుమతిల గళ మధురిమతో యీ చిత్రంలోని సంగీతం తక్కిన అన్ని హంగుల మాదిరిగానే నభూతో నభవిష్యతి అన్న తీరుగా రూపొందింది.” “ఇదొక్కటి చాలు సాలూరి గొప్పతనం తెలియజెప్పడానికి” అనేవారు కొందరైతే, “దీనిని మించిన సంగీతభరితమైన చిత్రం ఇంతవరకు రాలేదు, ఇక ముందు కూడా రాబోదని” దృఢంగా విశ్వసించే వారూ చాలామంది ఉన్నారు.

“మల్లీశ్వరి” తరువాత ముఖ్యంగా చెప్పుకోవలసిన చిత్రం విప్రనారాయణ (1954). ఎవ్వాడే అతడెవ్వాడే అన్న అపూర్వమైన రాగమాలికనొక్కసారి (భైరవి, మోహన, కాపి, వసంత) జ్ఞప్తికి తెచ్చుకోండి! ఈ చిత్రంలోని ప్రతి పాటా గొప్పదే. పాలించర రంగా (హేమవతి), చూడుమదే చెలియా (హిందోళం), రారా నా సామి రారా (కల్యాణి), సావిరహే (యమునాకల్యాణి),మేలుకో శ్రీరంగ (బౌళి, మలయమారుతం), …
హిందోళం లో రాజేశ్వర రావు గారు చేసిన పగలే వెన్నెల(పూజాఫలం), ఆల్ టైం హిట్ గా నిలిచిన భావగీతం. ఇదే రాగంలో కూర్చిన శ్రీకర కరుణాలవాల (బొబ్బిలి యుద్ధం)పాటేమో భక్తి రసంతో పాటు వీర రసం కూడా ఉట్టిపడే గీతం.
రాగమాలిక(వివిధ రాగాలను వివిధ చరణాల్లో ఒకే పాటలో కూర్చడం) లో స్వరరచన చేయడం క్లిష్టమైన పని! మల్లీశ్వరి లోని "ఆకాశవీధిలో" ఎవరు మర్చిపోగలరు? జయదేవ చిత్రంలోని దశావతారాలను వర్ణించే అష్టపది “జయ జగదీశ హరే “, “పాడెద నీ నామమే”(అమాయకురాలు),రాధాకృష్ణ సినిమాలోని “నా పలుకే కీర్తనా” పాటలు ఆయన రాగమాలికలకు కొన్ని ఉదాహరణలు!
ఇక వీణ రాజేశ్వర రావుగారి వీణ పాటలంటే ప్రాణం ఇవ్వని అభిమానులెవరు? పాడవేల రాధికా,పాడమని నన్నడగవలెనా,మదిలో వీణలు మ్రోగే,పాడెద నీ నామమే…ఇవన్నీ ఆయన వీణా నాదాలే!
యమన్ కళ్యాణి రాగంలో రాజేశ్వర రావుగారు ఇచ్చిన హిట్లు అసంఖ్యాకం! ప్రతి తెలుగు గొంతులో ఎప్పుడో ఒకప్పుడు పలికే పాట “మనసున మల్లెల మాలలూగెనే” , "సావిరహే తవదీనా","రారా నా సామి రారా"(విప్రనారాయణ), చెలికాడు నిన్నే(కులగోత్రాలు),జగమే మారినది(దేశద్రోహులు),చిగురులు వేసిన కలలన్నీ(పూలరంగడు), కళ్లలో పెళ్ళి పందిరి(ఆత్మీయులు) ఎప్పటికీ మర్చిపోలేని ఆణిముత్యాలే!
అలాగే పాశ్చాత్య సంగీత ప్రేరణతో వాటిని మక్కీకి మక్కీ దించకుండా “ఎక్కడో విన్నట్టుంది” అన్నట్టుగా వాటిని “తెలుగు నేటివిటీకి దగ్గరగా కూర్చిన పాటల్లో కొన్ని..హలో హలో ఓ అమ్మాయి(ఇద్దరు మిత్రులు),స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు(ఆత్మీయులు), ఈ రేయి తీయనిది (చిట్టి చెల్లెలు).
రాజేశ్వర రావు గారు ఈ పాటలు కూర్చారనో, ఆయన ఇంతటి ప్రతిభాశాలి అనో,ఆయన పాటల్లో ఇవి మంచివి అనో చెప్పడం పెద్ద సాహసమే! అందుకే ఆయన్ని ర"సాలూరు" రాజేశ్వర రావు అన్నా, రాజే”స్వర”రావు అన్నా, అది ఆయనకే చెల్లు!

వీరు 25 October 200 సంవత్సరంలో స్వర్గస్తులాయ్యరు.

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...