26, సెప్టెంబర్ 2018, బుధవారం

చిలకమర్తి లక్ష్మీనరసింహం



చిలకమర్తి లక్ష్మీనరసింహం - నా పెన్సిల్ చిత్రం

నివాళి - నేడు చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి జయంతి. ఈరోజు ఈ మహనీయుని చిత్రం గీసే అదృష్టం కలిగింది.
భరత ఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై యేడ్చు చుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియ బట్టి
చిలకమర్తి లక్ష్మీనరసింహం (1867 - 1946) ప్రముఖ కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన మహామహులలో చిలకమర్తి ఒకడు. ఇరవైరెండేళ్ళ వయస్సప్పుడు ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది తెలుగు సాహిత్య చరిత్రలో కనీ, వినీ, ఎరగని విషయం. అప్పటి ఆంధ్రదేశ జనాభా ఎంత? అంత తక్కువ జనాభాలో అన్ని కాపీలు అమ్ముడుపోవడం ఈనాటికీ ఓ వింత అని అభిప్రాయపడుతుంటారు కొందరు సాహెతీవేత్తలు.
చిలకమర్తి లక్ష్మీనరసింహం దాదాపు వందేళ్ల పూర్వం రాసిన నవల గణపతి. సాధారణంగా తెలుగులో చక్కటి హాస్య నవలలే అరుదైన పరిస్థితి ఉంది. అందులో అధిక్షేపాత్మక నవలల సంఖ్య మరీ స్వల్పం. ఈ నేపథ్యంలో హాస్య రసాన్ని పోషిస్తూ అధిక్షేపాత్మకంగా సాగిన గణపతి నవల సాహిత్యంలో ఎంతో ప్రఖ్యాతి పొందింది. (సేకరణ : ఇక్కడా అక్కడా)

19, సెప్టెంబర్ 2018, బుధవారం

కడలి మదిలో కలవరం - కవిత





నా చిత్రాలకి చక్కని కవితలు రాస్తుంటుంది నన్ను 'బాబాయ్' అంటూ అభిమానంగా పలకరించే అనుశ్రీ. ఈసారి నేనే ఓ బొమ్మనిచ్చి కవిత రాయమన్నాను. బొమ్మకి అతికినట్లుగా రాసి పంపించింది కవిత. మీరూ చదవండి. ధన్యవాదాలు.

కడలి మదిలో కలవరం
అతివ మదిలలోని కల్లోలంలా
అలజడుల నిత్య ఆలింగనంతో..
సముద్రమంత సహనాన్ని
మదిలో నింపుకున్నా
జీవన సమరాన గెలిచే దారి లేక
కలల కలువలన్నీ నిరాశలై జారి
కన్నీట మునిగి రాలిపోతుంటే...
సాయానికి దూరమై
గాయాలకు మూలమై
స్వార్థం ముసుగులో ప్రేమని
విషపు మాటల వెలివేతలతో
అహం తలకెక్కిన వాదనతో
విసిగి వేసారిన హృదయం
తలపోస్తోంది ప్రతిక్షణం
ఓటమి గూటిలో తానిక ఇమడలేనని..
కెరటాల వలలో మృత్యువై
ప్రపంచాన్ని శాశ్వంతంగా వెలేసి సుడిగుండాల ఒడిలో హాయిగా ఒదిగిపోతోంది..
తనదైన మనసుకై అన్వేషణ ఇక ముగిసిందని......!!

అనూశ్రీ....

12, సెప్టెంబర్ 2018, బుధవారం

చిత్రకారుడు వడ్డాది పాపయ్య

చిత్రకారుడు కీ.శే. వడ్డాది పాపయ్య - పెన్సిల్ చిత్రం

భారతదేశానికి గర్వకారణమైన చిత్రకారుడు వడ్డాది పాపయ్య (సెప్టెంబరు 10, 1921 - అక్టోబరు 30, 1992). ప్రాచీన సాహిత్యాన్ని అకళింపు చేసుకొని తన కుంచెకు సాహితీ సౌరభాన్ని పులిమి చిత్రాలను చిత్రించిన ప్రత్యేక చిత్రకారుడు వడ్డాది పాపయ్య.గీతకు అర్థం ఉంటుంది. రూపానికి ఆహ్లాదం ఉంటుంది. కొన్ని స్ట్రోక్స్ కలసి రూపం అవుతుంది. దానిలో గీతలు రూపంలోని ఆనందానుభూతిగా వెల్లివిరుస్తుంది. ఈయన బొమ్మలు కేవలం రసాత్మకంగానే ముగిసిపోక రస జగత్తును అధిగమించాయి. లాలిత్యం కంటే గాంభీర్యం, అనుభూతి కంటే ఆలోచన ఎక్కువ పాళ్ళలో ఉండి సౌందర్యాన్ని మించిన శక్తిని కన్పింపజేసిన వడ్డాది పాపయ్య శ్రీకాకుళం పట్టణంలో జన్మించారు.

అతి సామాన్యమైన రంగుల్లోంచి అత్యద్భుతమైన బొమ్మలను , ఇంద్రధనుస్సులో కూడా కానరాని రంగుల కలయికనూ చూపగలిగిన వడ్డాది పాపయ్య కళాజీవితం ఎంతటి ఉన్నతమో, వ్యక్తిగత జీవితం అంతకంటే గొప్పది. పల్లె పడతుల అంద చందాలను, స్నిగ్ద మనోహర వలపు తలపులను చిత్ర కళాకారులు ఏనాటి నుంచో చిత్రీకరించినా వ.పా శైలి మాత్రం అజరామరంగా నిలిచి పోతుంది. మత్స్య గ్రంధి, ఊర్మిలనిద్ర, పంచతంత్రం కథలలోని జంతు ప్రపంచం ఈయన కుంచె కదలికలతో జనజీవాలు నింపుకొని కళాభిరుచి గూర్చి తెలియని పాఠకుల్ని సైతం కళాభిమానులుగా తీర్చిదిద్దాయి. తెలుగు నాట చిత్రకళలో ఈయన శైలికి, బొమ్మలలోని సంతకానికి అందినంత గుర్తింపు గౌరవ ప్రతిష్టలు మరెవరికీ అందలేదనే చెప్పాలి. అయితె ఈయన ప్రతిభ యావత్తూ పరిమిత వర్గంలోనే అవగాహనకు అందింది. చరమ దశలో ఒక పత్రిక యాజమాన్యం ఈయన చిత్ర కళను గుత్తకు తీసుకొని వాణిజ్య పరంగా రాణించింది.
ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య పవిత్ర నాగావళి నదీ తీరాన శ్రీకాకుళం పట్టణంలో రామమూర్తి, మహాలక్ష్మి దంపతులకు సెప్టెంబరు 10, 1921 న జన్మించారు. తండ్రి చిత్రకళా ఉపాధ్యాయుడు కావడంతో ఓనమాలు తండ్రి వద్దనే నేర్చి . తండ్రి బొమ్మలు గీచే పద్ధతిని చాలా శ్రద్ధతో పరిశీలించేవారు. క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నారు. పట్టుదలతో సాధన చేశారు.రంగులు కలపడం, వాటిని ఉపయోగించే పద్ధతిని తండ్రి వద్దనే నేర్చుకున్నారు. తండ్రి బొమ్మలు వేస్తున్నంతసేపూ ఆయనకంటే దీక్షగా పరిశీలించుతూ కచ్చితమైన పెర్‌ఫెక్టివ్‌నెస్ జాడలను తెలుసుకొనేవారు. రంగులు కలపడం, బ్రష్ లు ఎప్పటి కప్పుడు శుభ్రం చేయడం వంటి పనులన్నీ వినయ విధేయలతో నెరవేరుస్తూ తండ్రి వద్ద శిష్యుడి పాత్రను అద్వితీయంగా నిర్వహించారు. ఐదు సంవత్సరాల పిన్న వయసులోనే తన ఇంటిలో ఉన్న రవివర్మ చిత్రం "కోదండ రామ"ను ప్రేరణగా తీసుకుని హనుమంతుని చిత్రాన్ని గీసారు. పాపయ్య చిన్న తనంలో తండ్రి భారత, భాగవతాలను వినిపిస్తుండేవారు. ఆ ప్రభావం వలన పాపయ్య ఆధునికత కంటే ప్రాచీనత మీద, ముఖ్యంగా భారతీయ శిల్ప, చిత్ర కళల మీద మక్కువ పెంచుకొన్నాడు.
ఒకానొక చిత్రకారునిగా 1938 లో తనను తాను గుర్తింపజేసుకున్నాడు. 17 వయేట ప్రారంభించిన ఈ తపస్సు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్ని ఆటుపోట్లకు గురయినా రాణించే వరకు ఆగలేదు. కళాసృష్టి హృదయం నుంచి వెల్లుబుకుతుంది. మేధస్సు నుంచి పుట్టిన హేతువాదానికి ఈ అంశం అందదు. ఆస్తికత్వ, నాస్తికత్వాల ప్రసక్తికి దూరంగా ఉన్నా ఎగురుతున్న హనుమంతుడు, గోపికాకృష్ణుల రాసలీల దృశ్యం మొదలైన ఎన్నెన్నో అతిరమణీయ చిత్రాలతో పాటు, పార్వతి, శకుంతల, లక్ష్మి, ధనలక్ష్మి, శివపార్వతులు, గంగావతరణం మొదలైన పౌరాణిక ఊహాత్మక బొమ్మలను గీచారు. అయితే లౌకిక ప్రపంచానికి తామంత తాముగా దూరమైపోయారు. రేరాణి, అభిసారిక, భారతి పత్రికలలో ప్రచురితమైన బొమ్మలలో ఒక సంచలన చిత్రకారుడుగా పత్రికా ప్రపంచానికి చేరువయ్యారు. తత్ఫలితంగా తెలుగు సినీ ప్రముఖుడు చక్రపాణి తమ సంస్థ ప్రచురణలైన చందమామ, యువ పత్రికలలో బొమ్మలు వేసే ఉద్యోగం ఇచ్చారు. ఒక్క "చందమామ" పత్రికలోనే దాదాపు మూడు దశాబ్దాల పర్యంతం తన సహజ శైలిలో బొమ్మలు చిత్రిస్తూ, ఒకే పత్రికలో కొనసాగటం తెలుగు పత్రికా రంగంలో ఒక పెద్ద రికార్డు! అభిసారికకు 1949-59 మధ్య కాలంలో గీసిన అపురూప ముఖచిత్రాలను, వాటికి శోభ చేకూర్చిన 'కరుణశ్రీ' జంధ్యాల పాపయ్య శాస్త్రి పద్యాలను చూసి తీరవలసిందే.
చిత్రకళ నేర్చుకొంటున్న తొలినాళ్ళలో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు పాపయ్య చిత్రాలు పత్రికలలో ప్రచురించి ప్రోత్సహించాడు. ఆ తరువాత వ.పా రేరాణి, మంజూష, అభిసారిక, ఆంధ్రపత్రిక, భారతి, ఆంధ్రజ్యోతి తదితర పత్రికలలో చిత్రాలు గీయటం ప్రారంబించాడు.

కొంతకాలం తరువాత చందమామ సంపాదకులు చక్రపాణి పరిచయంతో దాదాపు అర్ధ శతాబ్దం పాటు చందమామను తన కుంచెతో తీర్చి దిద్దాడు. అప్పటిలో చందమామ ఎనిమిది భాషలలో వెలువడుతుండటంతో పాపయ్య చిత్రాలు దేశవ్యాప్తంగా ప్రచారం పొందాయి. యువ మాసపత్రికలో చిత్రకారులు ఒక చిత్రం గీసే అవకాశం అరుదుగా వచ్చే రోజులలో నెలకు నాలుగు ఐదు చిత్రాలు గీసేవాడు పాపయ్య. చందమామ, యువ తర్వాత స్వాతి వార, మాస పత్రికలలో దశాబ్ధకాలం పైగా ఈయన చిత్రాలు ప్రచురించబడ్డాయి.

వడ్డాది పాపయ్యగారు గీసిన చిత్రాల క్రింద 'వ.పా.' అనే పొడి అక్షారాల సంతకం వారి ప్రత్యేకత. వీరి బొమ్మలకు గల మరొక కుంచె గుర్తు '0|0' అని వుండడం. ఇందు గురించి ఆయన చెప్పిన భాష్యం - "గతం శూన్యం, వర్తమానం శూన్యం, భవిష్యత్తులో నిలుచున్నానని".

వ.పా. కేవలం చిత్రకారుడే కాదు. రచయిత కూడా. చందమామలో కొడవటిగంటి కుటుంబరావు మొదలు పెట్టిన 'దేవీభాగవతం' కథలను పూర్తి చేసింది ఆయనే. 'విష్ణుకథ' పౌరాణిక సీరియల్ కూడా ఆయన వ్రాసిందే.
1947 లో నూకరాజమ్మను, 1984 లో లక్ష్మి మంగమ్మను వివాహమాడారు. అయనకు ముగ్గురు కుమారులు మరియు ఒక కుమార్తె. కూతురు అనూరాధ మీద మమకారంతో కశింకోటలో 'పావన కుటీరం' నిర్మించుకొని స్థిరనివాసులయ్యారు.
సాధారణంగా చిత్రకారులు మోడల్స్ యొక్క నమూనాలనో లేదా వారినే చూస్తూనో చిత్రాలు గీస్తుంటారు. కాని పాపయ్యగారు మాత్రం ఏనాడూ ఆవైపు పోలేదు. తన ఆలోచనల రూపాలనే చిత్రాలుగా చిత్రించేవారు.
పాపయ్యగారి చిత్రాలలో తెలుగు సంస్కృతి, తెలుగుదనం, ఆచార వ్యవహారాలు, అలంకరణలు, పండుగలు ప్రధాన చిత్ర వస్తువుగా ఉంటాయి.
వ.పాకు తన గురించిన ప్రచారం అంటే ఇష్టం ఉండేది కాదు. తన గురించి లఘుచిత్రం తీయాలన్న దూరదర్శన్ ప్రతిపాదనను తిరస్కరించాడు. కళాకారునిగా తనను అభిమానించవద్దని, తన కళనే అభిమానించమని, అభిమానులను వ.పా. కోరేవాడు. కేవలం మిత్రుల వత్తిడి కారణంగా ఖరగ్‌పూర్, శ్రీకాకుళం లలో తన చిత్రాలను ప్రదర్శనకు ఉంచాడు.
రూప కళను అమితంగా ఇష్టపడే వ.పా. నైరూప్య (Abstract Art) చిత్రకళ పట్ల తీవ్ర అసహనాన్ని ప్రదర్శించేవాడు.
లోకానికి తెలియకుండా తనను తాను ఏకాంతంలో బంధించుకొని మరెవరూ దర్శించలేని దివ్య దేవతారూపాలను చిత్రించే పాపయ్య 1992 - డిసెంబర్ 30 న దివ్యలోకాలకు పయనమై వెళ్ళిపోయాడు.

Source : వికీపీడియా

10, సెప్టెంబర్ 2018, సోమవారం

కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ


కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ  (నా పెన్సిల్ చిత్రం)


విశ్వనాథ సత్యనారాయణ (సెప్టెంబర్ 10, 1895 - అక్టోబరు 18, 1976) "కవి సమ్రాట్" బిరుదాంకితుడు. తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.

20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు. ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు - కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, పద్యకావ్యములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు - ఆయన పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి. ఆయన మాటలలోనే "నేను వ్రాసిన పద్యముల సంఖ్య , ప్రకటింపబడిన సంఖ్య, సుమారు ఇరువది వేలుండ వచ్చును. నేను చింపివేసినవి ఏబది వేలుండవచ్చును " . ఆయన వ్రాసిన రచనలన్నీ కలిపితే లక్ష పుటలు ఉండవచ్చును

విశ్వనాథ మాట్లాడే వెన్నెముక అని శ్రీశ్రీ వర్ణించారు. జి.వి. సుబ్రహ్మణ్యం ఇలా చెప్పారు - "ఆధునికాంధ్ర జగత్తులో విశ్వనాథ ఒక విరాణ్మూర్తి. వచన కవిత్వం వినా ఆయన చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. పట్టింది బంగారం చేయని పట్టూ లేదు. గేయం వ్రాసినా, పద్యం రచించినా, ముక్తం వ్రాసినా, మహా కావ్యాన్ని రచించినా విశ్వనాథ కృతిలో ఆయనదైన ఒక వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, సమాసంలో, భావంలో, భావనలో, దర్శనంలో, విమర్శనంలో, భాషణంలో, భూషణంలో ఒక వైలక్షణ్యం వెల్లివిరుస్తుంది. మహాకవిగా మనుగడ సాగించడానికి ఉండవలసిన మొదటి లక్షణం - ఈ వ్యక్తిత్వం." (source : Wikipedia)

7, సెప్టెంబర్ 2018, శుక్రవారం

గజల్ .."చాలునులే"



నా పెన్సిల్ చిత్రానికి శ్రీమతి గుడుపూడి రాధికారాణి గారి గజల్

గజల్ .."చాలునులే".
---------------
చెలిమోమున చిగురించే నవ్వొక్కటి చాలునులే
వనిశోభను వెలిగించే పువ్వొక్కటి చాలునులే
సంగీతపు సరిగమలే మురిపించవు మూర్ఖులను
ఆ మనసును కరిగించే పాటొక్కటి చాలునులే
జామకాయలమ్ము తాత జాలిచూపు చూసెనేల?
ఆ కనులను మెరిపించే పిలుపొక్కటి చాలునులే
బీడుభూమి పోలెనులే అన్నదాత పొడిపెదవులు
పైరులన్ని పరిమళించు వానొక్కటి చాలునులే
యుద్దభూమికేగినట్టి భర్తజాడ తెలియరాదు
ఆమె గుండెగుబులు తీరు కబురొక్కటి చాలునులే
మబ్బుకమ్ము నింగివోలె నీలవేణి నేత్రములు
కలలురాని కలతలేని నిదురొక్కటి చాలునులే
ఊహలలో ఊసులలో హృదిని కుదుపు భావఝరులు
రాధికకే రచనలలో గెలుపొక్కటి చాలునులే
----------------------------------------
గుడిపూడి రాధికారాణి.

Woman in rural A quiet journey through the fields

A quiet journey through the fields  (My created picture of rural India)  This picture captures a moment from rural India that is slowly fadi...