21, మార్చి 2019, గురువారం

నర్తనశాల - ఎన్ టి . రామారావు



నా పాత్రకు బ్రహ్మలు ఆ అయిదుగురు - ఎన్ టి రామారావు

(ప్రజాశక్తి దినపత్రిక, 11 అక్టోబర్ 2013, శుక్రవారం, పేజీ నం. 8లో ప్రచురితం - రెంటాల జయదేవ) 

(నర్తనశాలలో బృహన్నల పాత్రపోషణపై సాక్షాత్తూ ఎన్టీయార్ యాభై ఏళ్ళ క్రితం చెప్పిన మనసులో మాట...)

సాహసోపేతంగా బృహన్నల పాత్ర పోషించిన హీరో పెద్ద ఎన్టీయార్‌ 'నర్తనశాల' 50 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. 1963 అక్టోబరు 11న దసరా కానుకగా ఈ చిత్రం విడుదలై ఘన విజయం సాధించి, జాతీయ అవార్డుకు కూడా ఎంపికైంది. ఆ సందర్భంలో, తన మనసులో మాటను పత్రికా ముఖంగా పెద్ద ఎన్‌.టి.రామారావు పంచుకున్నారు. క్లిష్టమైన ఆ పాత్రపోషణ జనామోదం పొందడంలో తెరపై కనిపించే తన కృషితో పాటు తెర వెనుక ఉన్న మహానుభావుల శ్రమను ప్రత్యేకంగా పేర్కొన్నారు. 50 ఏళ్ళ క్రితం ఆయన చెప్పిన అభిప్రాయాల్లో ముఖ్యాంశాలు నేటి పాఠకుల కోసం...

చిత్ర విజయంతో సిద్ధించిన ప్రతిష్ఠలో ప్రథమ తాంబూలం మా (దర్శకుడు) కమలాకర కామేశ్వరరావుగారిది. ఊహాతీతమైనది 'బృహన్నల' పాత్ర. ...భారతం రచించిన ఆ మహాకవే - 'ఇదీ' అని గుర్తుపెట్టి, వర్ణించి, విమర్శించి, రూపొందించని పాత్ర - బృహన్నల. (నిర్మాత) శ్రీమతి లక్ష్మీరాజ్యం గారు నన్నీ పాత్ర ధరించమన్న ప్పుడే నాకు దిగ్భ్రమ కలిగింది. 'ఇది పరిహాసమా' అన్నాను. ఆమె, 'కాదండీ! నిష్కల్మషంగా నేననుకున్నాను - మీరు ఆ పాత్రకు జీవం పోయగలరని! కనుక మీరు బృహన్నల పాత్ర ధరిస్తేనే నేనీ చిత్రం తీస్తాను. లేకపోతే లేదు' అన్నారు. రెండు రోజుల వ్యవధి కోరాను - నా నిర్ణయం తేల్చిచెప్పడానికి! 

ఒకే మథన - వేయాలా? వేయకూడదా? ఏదైనా చిత్రంలో రెండు, మూడొందల అడుగుల ఆడవేషం ధరించాల్సిన అవసరం కలిగితేనే నా మీద నాకు జుగుప్స వేసి, భయం కలుగుతుందే! మరి ఈ 13 వేల అడుగుల దీర్ఘంగా సాగిన పాత్ర నిర్వహణ ఎలా? విజయం సిద్ధించు కొనేదెలా? పైగా ఆ పాత్ర నిర్వహణతో ఆనాడు భారత వీరుడైన అర్జునుడు విజయంగా నడిపిన అజ్ఞాతవాస కథ - ఈనాడు ఈ నా పాత్ర ధారణతో అపజయమైతే? ఇవి నాలో చెలరేగిన భయాందోళ నలు. ఒక పక్క పేరుప్రతిష్ఠలు, మరోపక్క 'మీరే తగినవాళ్ళు. మీరు బృహన్నల వేష ధారణ చేయకపోతే చిత్రం ఆపుచేస్తామ'నే నిర్మాత మాటలు. ఏమిటి గత్యంతరం?

సరే! ఆనాటి కొక దృఢసంకల్పానికి వచ్చాను. (నిర్మాతలు) శ్రీ శ్రీధర్‌, శ్రీమతి లక్ష్మీరాజ్యం గార్లతో నా నిర్ణయం చెప్పాను - ''సరే! మీకీ సంకల్పం ఎలా కలిగిందో నాకు తెలియదు. నాకీ పరీక్ష ఎందుకు వచ్చిందో తెలియదు. నేను నటించిన శతాధిక చిత్ర నటనానుభం అండగా ఉంచుకొని, తప్పకుండా వేషధారణ చేస్తాను'' అని మాటిచ్చాను. 

ఇక ఆ నాటి నుంచి చిత్ర నిర్మాణం ఆఖరు వరకూ కొనసాగిన నా దీక్షలో నాకు అనుక్షణం అండగా నిలిచి, నా ఆవేశానికి అపశ్రుతి రానీయకుండా, నా భావాలకు రూపకల్పన చేసి, నాలో ఆ పాత్ర ఈనాడు రూపొందించుకున్న ఘనతకు కారణభూతులైనవారు అయిదుగురు (పంచ బ్రహ్మలు). 

రచయిత: ఇల్లాలుకు మాంగల్యం, ఇంటికి దీపం ఎంత జీవమో, అలాగే పాత్రకు ప్రాణం సంభాషణ. ..సందర్భ సన్నివేశాలకు అవసరమైన ఆవేశంతో, భావంతో, అందరికీ అర్థమయ్యేలా బృహన్నల మనోజ్ఞ ప్రవృత్తిని తెలియ జేసేది - సముద్రాల వారి సరస సంభాషణా చాతురి. ఇది వారి రసమయ సృష్టి. 

కళా దర్శకుడు: కవివర్యుల మానస వీధుల్లోని మూర్తికి ఆకృతి కల్పించి, అలంకరణ సల్పి, సజీవంగా ప్రేక్షకుల ప్రత్యక్ష సన్నిధిని ఈ పాత్రను నిలిపిన చాతురీ ధురీణుడు, ఊహోపాసనా శిల్పి - టి.వి.ఎస్‌. శర్మ గారు. 

అలంకరణ, వేషధారణ: కళాదర్శకుని కుంచె జాలులో రూపం కల్పించుకొని, లావణ్యతనూ, భావాన్నీ ముఖకమలం మీద రంగులతో లాలనగా అద్ది, నేనా? పాత్రా? అన్న విధంగా నా మీద ముద్ర వేసి, ఆ పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేసిన కళాస్రష్ట - మేకప్‌ చీఫ్‌ హరిబాబు గారు.

చిత్రగ్రాహకుడు: పాత్రానుగుణ్యమైన రూపకల్పనకు, జ్యోతులతో నీరాజనం ఇచ్చి, చూపరులకు నయనానందంగా, సుజన కళాపోషకుల సన్నిధిని - నన్నీ స్థానంలో నిల్పిన చాతురీ ధురీణుడైన ఛాయాగ్రాహకుడు - ఎం.ఏ. రెహమాన్‌ గారు. మగ కాని మగటిమి, ఆడతనం చాటున తొణికిసలాడే ధీరోదాత్తత, చీకటి వెలుగుల సయ్యాటలలో చిద్విలాసంగా చిత్రించి, నాకు పరమార్థం దక్కించిన చిత్రకారుడు- ఈ కెమేరా శిల్పి. 

నృత్య దర్శకుడు: శాపప్రభావంతో రూపం మారినప్పుడు అధ్యాపకుడై, విరటుని 'నర్తనశాల'ను పునీతం చేసిన నాటి నాట్యాచార్యుడు (బృహన్నల) ఎక్కడీ నేటి నేనెక్కడీ (ఆ నాట్య విలాస ప్రదర్శనలో నాకు) ఏ కాస్త అయినా పరమార్థం దక్కితే, అది పారంపర్యంగా దేశానికి గురువులుగా నాట్యకళామ తల్లికి నీరాజనం పట్టే 'కూచిపూడి' వారి సాంగత్యం వల్లనే! ఆ ఘనతంతా వెంపటి వారి సత్యం గారిది!

నా పాత్ర నా అభిమానులనూ, కళాప్రియులనూ రంజింపజేసిందంటే - ఇందరి కళాకారుల అశేష ప్రజ్ఞా విశేషాలు దానికి బాసటగా నిలిచాయి గనకనే! 

ఇక, ఆ పాత్ర నిర్వహణలో నా ప్రజ్ఞ ఎంత ఉన్నదన్నది నా కన్నా కళాపోషకులైన ప్రజానీకానికే తెలుసు. వారి మన్ననలే నా భాగ్యం. వారి ఆనందమే నా ఆకాంక్ష. వారి తృప్తే నా ఆశయం. 
 — 

నటరత్న, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు



నటరత్న - విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు 

ఒక ఆర్టిస్ట్ గా ఈ మహానుభావుని చిత్రించుకునే మహద్భాగ్యం నాకు కలగడం నా అదృష్టం.




నట రత్నం, తెలుగు వజ్రం, రాత ముత్యం వెరసి ఎన్.టి.ఆర్ అనే మణిహారం ----
ఔనంటారా కాదంటారా? 'నందమూరి తారక రామారావు' అనే బృహత్మేరు పర్వత శిఖరాన్ని మనో దర్పణంలో చూసుకుంటే ఎన్.టి.ఆర్ అనే సంక్షిప్త రూపంగా కనిపిస్తుంది. అంతే కాదు- ఆ పొడి పొడి మూడక్షారాల వరస నట రత్నం, తెలుగు వజ్రం, రాత ముత్యం అనే కలబోత మణిహారంలా అనిపిస్తుంది.
నటరత్నం- సరే సరి. తిరుగులేని సత్యం. అది ఆయనని వరించిన తొలి బిరుదు. సినీ కళామతల్లి బిడ్డలలో అటువంటి వారే అరుదు. తలపెట్టిన సినీ రంగ 'నటన' అనే వృత్తిలో భాగంగా 'దర్శకత్వం' అనేది అవతల పెట్టక రెండిటినీ సమపాళ్ళలో రంగరించడం ఆయనలాగ అందరికీ కుదరదు.

తెలుగు వజ్రం?- ఇంద్రుడి చేతిలో 'పవి' అనే వజ్రాయుధం ఉండేదట. అన్యాయం మీద ఆ ఆయుధం ప్రయోగించేవాడట. తన ఎడమ చేతిని మడిచి ఒక్క వేలే చెంపల్ని తాకిస్తూ ఆత్మీయంగా చూస్తున్న ఆ తెలుగు చూపు లోనూ 'పవి' ఉంది. ఎటొచ్చీ అది 'పవర్ ఫుల్ విస్ డం' అనే ఇంగ్లీష్ మాటల పొడి పొడి రూపం. అదే ఆయన వజ్రాయుధం. అందులో 'తెలుగు వారి ఉనికి', 'ఆత్మాభిమానం' అనే తీక్ష్ణమైన వెలుగులు దాగి ఉన్నాయి. తెర మీది 'కధానాయకుడు' అంచెలంచెలుగా ఎదిగి తెలుగు 'దేశోద్ధారకులు' కావడమన్నది ఆ 'పవి' చలవ లేదా గరిమ. ఇదే ఫోటో తెలుగు వారి ఇళ్ళల్లో మూడు-నాలుగు దశాబ్దాలు అభిమాన దేవుడి పటంగా గోడకానుకుంది. చిత్రం ఏమిటంటే 'కధానాయకుడు' చిత్రంలో ఆయన కుడి చెయ్యి చాచి 'వినవయ్యా రామయ్యా' అన్నప్పుడు ఆయన కూడా అనుకోలేదు మరో దశాబ్ద కాలంలో ఎడమ చెయ్యి చాచి జనాన్ని కదిలించే 'అన్న' గా మారబోతాడని. అదీ నియంత్రణ, క్రమ శిక్షణ అనే రెండు వైపుల పదను ఉన్న 'పవి' మహాత్మ్యం. రెండు చేతులా పని ఉన్నప్పుడే మొండి శక్తి ఆవరిస్తుంది. అందుకే ఎన్.టి.ఆర్ మధ్య రూపం-తెలుగు వజ్రం.
రాత ముత్యం?- ఆయన సన్నిహితులూ, స్క్రిప్ట్ చేజిక్కించుకున్న సినీ హితులూ చెప్పే మాట ఇది. ఆయన రాసే అక్షారాలు ఒద్దికగా, పొందికగా, ఓపికగా, నింపాదిగా, నిబ్బరంగా, ఒడిదుడుకులు లేకుండా యోగా ముద్రలో ఉన్నట్టు ఉండేవి. అవే రాత ముత్యాలంటే!
అలనాటి ఎన్.టి.ఆర్ శ్రీకృష్ణ రూపం లేక ఇలా నేడు వెండి తెర మీద ఏదో వెలితి కానవస్తోంది. 'సీతా' అని స్తంభం ఆనుకునీ విలవిలలాడే శ్రీ రామ రూపంలో ఆయన తెర మీద కనపడగానే గుండె చెరువైన ప్రేక్షకులు మరో శ్రీరామ రూపానికి చేరువ కాలేక పోతున్నారు. రావణ పాత్ర వేసి రుద్రవీణ మ్రోగించినా, కర్ణ పాత్ర వేసి కుంతీదేవి కంట తడి పెట్టించినా, దుర్యోధనుడిగా పౌరుష మీసం మెలి తిప్పినా ప్రేక్షకుల్లో తన్మయత్వం, విస్మయం, అద్భుత వశీకరణం. అవన్నీ మళ్ళీ మళ్ళీ రాక, ఉన్న వాళ్ళలో చూడ లేక దిగాలు పడి పోయింది వెండి తెర. వేరే పాత్రల అసహనంతో పని పెంచుకుంది సెన్సార్ కత్తెర.
ఎన్.టీ.ఆర్ గొప్ప కళాకారుడే కాదు గొప్ప సమాజ శ్రేయోభిలాషి. యాభైల కాలంలో సినీ రంగం 'మనదేశం' సినిమాలో హీరోగా ఆయన చేత తొలి అడుగు వేయిస్తే ఎనభైల కాలంలో 'తెలుగు దేశం' ఆయన్ని రాజకీయ రంగం లోకి మలుపు తిప్పింది.
ఎన్.టి.ఆర్. లోని దర్శకత్వ ప్రతిభ కూడా అసామాన్యమే. అంతవరకూ కృష్ణుడు లో 'కృ' కష్టపెడుతూ ఉంటే అందరూ పలికే 'క్రి' ని వాడుకుంటే నష్టమేముందీ అని తన సినిమా టైటిల్ ని 'శ్రీక్రిష్ణ పాండవీయం' గా మలచిన ధైర్యశాలి ఎన్.టి.ఆర్.
ఎన్.టి.ఆర్. లో మంచి సాహిత్యాభిలాష ఉండేది, అది ఆయన నటించిన సినిమాల్లోనూ, దర్శకత్వంలోనూ కనిపిస్తూ ఉండేది .
అసలు ఎన్.టి.ఆర్ లోని నటుడిని వెలికి తీసింది ఆయన గురువుగారైన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారే. ఆయన జ్ఞానపీఠ కవి. అలాగే ఎన్.టి.ఆర్ వెతికి తీసుకొచ్చిన కవి డా. సి.నారాయణరెడ్డిగారు కూడా ఆనక జ్ఞానపీఠం అధిరోహించినవారే. ఎన్.టి.ఆర్ తన గురువుగారి 'ఏకవీర' రచన సినిమాగా మారుతుంటే హర్షించారు. హృద్యంగా నటించారు. ఈ ఏకవీర చిత్రానికి తొలిసారిగాడా. సి.నా.రె. మాటలు రాశారు.
దేవులపల్లి వారు కూడా తొలిసారిగా సినిమాకి మాటలు రాయడం 'మల్లీశ్వరి' చిత్రం కోసమే జరిగింది.
వేటూరి సుందరరామమూర్తి వంటి కొత్త తరం ప్రతినిధిని సినిమా రంగానికి ఆహ్వానిస్తే తెలుగు బతికి బట్ట కడుతుందని ఎన్.టి.ఆర్. ఆయన్ని మందలించి మరీ లాక్కొచ్చారట. లేకపోతె ఒక పాత్రికేయుడిగా మిగిలిపోయేవారు వేటూరి.
ఎన్.టి.ఆర్ లో మరో విశేషం- పాటని అనుభవిస్తూ అభినయించడం. కొన్ని పాట సీన్లు చూస్తే తెలుస్తుంది ఆయన కంఠం కదలికలు ఎంత సహజంగా ఉంటాయో. అంతేకాదు అడపా దడపా ఘంటసాల వారితో గొంతు కలిపేవారు కూడా. 'వచ్చిండన్నా''వచ్చాడన్నా' అన్న రెండు ముక్కలు ఆయన అనడం, జనం వాటిని 'తారక (రామ) మంత్రం' లా తీసుకోవడం నాటి రోజుల విశేషం.
పాత రీళ్లు తిరుతున్నంత కాలం, పాత పాట వ్రేళ్ళు చితికిపోనంత కాలం బ్రతికే ఉంటారు ఎన్.టీ.ఆర్. మెరుస్తూనే ఉంటుంది నటరత్నం, తెలుగు వజ్రం, రాత ముత్యాలు కలబోసిన మణి హారం!
courtesy : (డా. తాతిరాజు వేణుగోపాల్,)

20, మార్చి 2019, బుధవారం

షేక్ నాజర్ - బుర్రకథా పితామహుడు

"బుర్రకథా పితామహుడు"గా పేరొందిన షేక్ నాజర్ (1920-1997) -
(ఈ నెల 'తెలుగుతల్లి కెనడా' పత్రికలో ప్రచిరితమయిన నా pencil sketch. వారికి నా ధన్యవాదాలు).
బుర్రకథా కళాకారుడు, నటుడు, ప్రజా రచయిత మరియు గాయకుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత.
ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథకు కొత్త జీవం పోసి, మెరుగులు దిద్ది,
ప్రత్యేక ఆహార్యంతో తగిన హావ భావలతో ఎన్నో ప్రదర్శనలిచ్చి బుర్రకథా
ప్రక్రియకు విస్తృత ప్రచారం కల్పించిన బుర్రకథా పితామహుడు నాజర్,
గొప్పనటుడు, ప్రజారచయిత, మహాగాయకుడు. " ఈ గండపెండే'త్రెలూ, ఊరేగింపులూ, సన్మానాలూ, పద్మశ్రీలూ అన్నీ కలిపి, నాకు జనం వేసే ఒక్క ఈలతో సాటి కాదు" అని తన కళను ప్రజా ప్రయోజనానికే అంకితం చేసిన ప్రజా కళాకారుడు.
సినిమాల్లొ బుర్రకధల అభినయంకోసం ఎన్.టి.ఆర్, జమున వంటి నటులు కూడా వీరిదగ్గర శిక్షణపొందారు. పుట్టిల్లు, అగ్గిరాముడు, చిత్రాలలో బుర్రకథలు చెప్పాడు. నిలువుదోపిడి, పెత్తందార్లు చిత్రాలకు పనిచేసాడు.

వేములపల్లి శ్రీకృష్ణ - చేయెత్తి జైకొట్టు తెలుగోడా


వేములపల్లి శ్రీకృష్ణ గారు (1917 – 8 April 2000) (Pencil sketch)
1968-72 మధ్య "విశాలాంధ్ర" పత్రికకు సంపాదకునిగా పనిచేసారు. ఆయన సి.పి.ఐ. పార్టీకి చెందిన నాయకులు మరియు ఎన్నో కార్మిక ఉద్యమాలు నడిపారు.
ఇటీవల విడుదలైన 'NTR కధానాయకుడు' చిత్రం చూసిన తర్వాత వేములపల్లి శ్రీకృష్ణ గారి గురించి నేను కొంత తెలుసుకొనే అవకాశం కలిగింది.
వారు వ్రాసిన ఈ పాటను NTR నటించిన 'పల్లెటూరు' చిత్రంలో ఘంటసాల స్వీయ సంగీత దర్శకత్వంలో ఒక ఉత్తేజితమైన బృంద గానంగా స్వరపరిచారు. ఈ పాటనే మరికొన్ని చరణాలతో తరువాత రామారావు గారు ఎన్నికల ప్రచారానికి ఉపయోగించారు.
చేయెత్తి జైకొట్టు తెలుగోడా!
గతమెంతో ఘనకీర్తి గలవోడా!
వీర రక్తపుధార, వారవోసిన సీమ
పలనాడు నీదెరా, వెలనాడు నీదెరా
బాలచంద్రుడు చూడ ఎవరోడోయ్
తాండ్ర పాపయ గూడ నీవోడోయ్
నాయకి నాగమ్మ, మల్లమాంబా, మొల్ల
మగువ మాంచాల నీతోడ బుట్టినవోళ్ళే
వీరవనితలగన్న తల్లేరా!
ధీరమాతల జన్మభూమేరా!
కల్లోల గౌతమీ, వెల్లువల కృష్ణమ్మ
తుంగభద్రా తల్లి, పొంగి బారిన చాలు
ధాన్యరాశులె పండు దేశానా!
కూడు గుడ్డకు కొదువ లేదోయీ
ముక్కోటి బలగమోయ్, ఒక్కటై మనముంటే..
ఇరుగు పొరుగులోన, వూరు పేరుంటాది
తల్లి ఒక్కతే నీకు తెలుగోడా!
సవతి బిడ్డల పోరు మనకేలా!
పెనుగాలి వీచింది – అణగారి పోయింది
నట్టనడి సంద్రాన – నావ నిలుచుండాది
చుక్కాని పట్టరా తెలుగోడా!.
నావ దరిజేర్చరా – మొనగాడా!
చేయెత్తి జైకొట్టు తెలుగోడా!
గతమెంతో ఘనకీర్తి గలవోడా!
గతమెంతో ఘనకీర్తి గలవోడా!..

15, మార్చి 2019, శుక్రవారం

K. V. Mahadevan - కే . వి. మహాదేవన్


K. V. Mahadevan - నా పెన్సిల్ చిత్రం 


*సినిమా పాట మొదట ప్రజలను ఆకర్షించాలంటే....అందరూ పాడుకునేందుకు వీలుగా ఉండాలి. అంటే...అదీ ఫోక్ స్టైల్ అయితే...ఈజీగా జనాల్లోకి వెళ్తుందని గ్రహించిన మహదేవన్...శాస్త్రీయ సంగీతం క్షుణ్ణం గా వచ్చినా...జానపదాల శైలి కలబోసి...అద్భుతమైన బాణీలను అందించేవాడు!*

మాతృభాష తమిళమే అయినా తెలుగు సినిమాకి ఆయన స్వరపరచిన బాణీలు అజరామరంగా నిలిచాయి. 1958 వ సంవత్సరంలో ప్రతిభా సంస్థ నిర్మించిన "దొంగలున్నారు జాగ్రత్త" అను సినిమాకు తొలిసారిగా తెలుగులో స్వరాలు అందించారు. అదే సంవత్సరంలో విడుదలైన "ముందడుగు'" సినిమాతో మహాదేవన్ ప్రతిభ బయటపడింది. 1962 లో విడుదలైన "మంచి మనసులు" కేవలం పాటల వల్లే సినిమా హిట్టయిందన్నవారు కూడా ఉన్నారు. ఇది నూటికి నూరు పాళ్లు నిజం. ముఖ్యంగా "మావా...మావా " పాట బాగా జనాదరణ పొందింది. అప్పటి నుంచి మహాదేవన్ ను "మామ" అని పిలవడం మొదలుపెట్టారు. 1963లో వచ్చిన "మూగ మనసులు" మామను తిరుగులేని స్థానానికి చేర్చాయి.
ఇక పోటీ ఎక్కడైనా ఉంటుంది. ఎం.ఎస్.విశ్వనాథన్, ఎస్.రాజేశ్వరరావు, పెండ్యాల, టి.వి.రాజు, టి.చలపతి రావు, చక్రవర్తి, ఇళయరాజా....ఎందరో మహానుభావులు. ఎవరిశైలి వారిది!*
*షుమారు దగ్గర దగ్గర 50 సంవత్సరాలు...సంగీత ప్రపంచంలో విఖ్యాతి గాంచడం......4 భాషలలో కలిపి...600 చిత్రాలకు పైగా...స్వరరచన చేయడం...అంత సులభం కాదు...ముఖ్యం గా పోటీ తీవ్రత ఎక్కువగా ఉండే సంగీత ప్రపంచాన!*
*వీరాభిమన్యు, మంచిమనసులు, మూగ మనసులు, తేనె మనసులు, కన్నె మనసులు,అంతస్తులు,అడవిరాముడు, శంకరాభరణం, సప్తపది, శుభోదయం,గోరంత దీపం, ముత్యాలముగ్గు, సిరివెన్నెల,శృతిలయలు, పెళ్ళిపుస్తకం,వంశవృక్షం, స్వాతి కిరణం.....ఎన్నని పేర్కొనాలి! ఆ లిస్ట్ కు అంతం ఉన్నా...ఇక్కడ స్పేస్ సరిపోదు మరి!*
కీ.శే.పుహళేంది గారి పేరు చెప్పనిదే...మామ మహదేవన్ గారి చరిత్ర సంపూర్ణం కాదు. పూవుకు...తావిలా...మామకు పుహళేంది! మామ గారి మౌనాన్ని,సైగలను..సంకేతాలను...సంగీతం గా మలచడం లో పుహళేంది గారి కృషి...మరువలేనిది.
మామ తెలుగు సినిమా సంగీతంలో ఓ కొత్త బాణీకి ఊపిరిపోశారు. కాని ఈయనకు తెలుగు రాదు. అయినా సంగీతానికి "భాష" అనే ఎల్లలు లేవు అని నిరూపించిన వారిలో మహాదేవన్ ఒకరు. ఈయన కవి పాట రాశాక దానికి స్వరాలను అద్దేవారు. చివరి వరకు ఆయన ఇదే పద్ధతిని అనుసరించారు. మనం బాణీ చేసి ఇస్తే అందులో మాటలు పట్టక కవి ఇబ్బంది పడతాడు. అందుకే ఆ పద్ధతి వద్దు అని సున్నితంగా తిరస్కరించేవారు. పాటలోని సాహిత్యాన్ని అధిగమించకుండా స్వరాలను అల్లేవారు. ఒక్కోసారి సాహిత్యం కోసం బాణీల్లో మార్పులూ చేర్పులూ చేసేవారు. తెలుగు తెలియకపోయిన కవి రాసిన సాహిత్యం అర్ధం అవ్వకపోయినా అడిగి మరీ దానర్ధం తెలుసుకొని సందర్భానుసారం స్వరాలను అందించేవారు.

14 March, 1918 సంవత్సరంలో జన్మించి 2 జాతీయ అవార్డులు, 3 నందులు,ఫిలింఫేర్ అవార్డులు...ఎన్ని అందుకున్నా...ప్రజల హృదయాల్లో 'మామ' గా నిలిచిపోయిన కృష్ణన్ కోయిల్ వెంకటాచలం మహదేవన్...నాలుగు దశాబ్ధాలకు పైగా...సినీ సంగీతాన్ని ఏలి.....21..జూన్ 2001 న ఇంద్రసభకు మరలి పోయారు!

(సేకరణ : ఇక్కడా అక్కడా)

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...