20, మార్చి 2019, బుధవారం

వేములపల్లి శ్రీకృష్ణ - చేయెత్తి జైకొట్టు తెలుగోడా


వేములపల్లి శ్రీకృష్ణ గారు (1917 – 8 April 2000) (Pencil sketch)
1968-72 మధ్య "విశాలాంధ్ర" పత్రికకు సంపాదకునిగా పనిచేసారు. ఆయన సి.పి.ఐ. పార్టీకి చెందిన నాయకులు మరియు ఎన్నో కార్మిక ఉద్యమాలు నడిపారు.
ఇటీవల విడుదలైన 'NTR కధానాయకుడు' చిత్రం చూసిన తర్వాత వేములపల్లి శ్రీకృష్ణ గారి గురించి నేను కొంత తెలుసుకొనే అవకాశం కలిగింది.
వారు వ్రాసిన ఈ పాటను NTR నటించిన 'పల్లెటూరు' చిత్రంలో ఘంటసాల స్వీయ సంగీత దర్శకత్వంలో ఒక ఉత్తేజితమైన బృంద గానంగా స్వరపరిచారు. ఈ పాటనే మరికొన్ని చరణాలతో తరువాత రామారావు గారు ఎన్నికల ప్రచారానికి ఉపయోగించారు.
చేయెత్తి జైకొట్టు తెలుగోడా!
గతమెంతో ఘనకీర్తి గలవోడా!
వీర రక్తపుధార, వారవోసిన సీమ
పలనాడు నీదెరా, వెలనాడు నీదెరా
బాలచంద్రుడు చూడ ఎవరోడోయ్
తాండ్ర పాపయ గూడ నీవోడోయ్
నాయకి నాగమ్మ, మల్లమాంబా, మొల్ల
మగువ మాంచాల నీతోడ బుట్టినవోళ్ళే
వీరవనితలగన్న తల్లేరా!
ధీరమాతల జన్మభూమేరా!
కల్లోల గౌతమీ, వెల్లువల కృష్ణమ్మ
తుంగభద్రా తల్లి, పొంగి బారిన చాలు
ధాన్యరాశులె పండు దేశానా!
కూడు గుడ్డకు కొదువ లేదోయీ
ముక్కోటి బలగమోయ్, ఒక్కటై మనముంటే..
ఇరుగు పొరుగులోన, వూరు పేరుంటాది
తల్లి ఒక్కతే నీకు తెలుగోడా!
సవతి బిడ్డల పోరు మనకేలా!
పెనుగాలి వీచింది – అణగారి పోయింది
నట్టనడి సంద్రాన – నావ నిలుచుండాది
చుక్కాని పట్టరా తెలుగోడా!.
నావ దరిజేర్చరా – మొనగాడా!
చేయెత్తి జైకొట్టు తెలుగోడా!
గతమెంతో ఘనకీర్తి గలవోడా!
గతమెంతో ఘనకీర్తి గలవోడా!..

1 కామెంట్‌:

bhuvanachandra చెప్పారు...

ప్రతి తల్లీ తండ్రీ తమ బిడ్డలకు నేర్పితీరాల్సిన గీతమిది .తెలుగు జాతికి హారతిపట్టిన గీతమిది

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...