21, మార్చి 2019, గురువారం

నటరత్న, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు



నటరత్న - విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు 

ఒక ఆర్టిస్ట్ గా ఈ మహానుభావుని చిత్రించుకునే మహద్భాగ్యం నాకు కలగడం నా అదృష్టం.




నట రత్నం, తెలుగు వజ్రం, రాత ముత్యం వెరసి ఎన్.టి.ఆర్ అనే మణిహారం ----
ఔనంటారా కాదంటారా? 'నందమూరి తారక రామారావు' అనే బృహత్మేరు పర్వత శిఖరాన్ని మనో దర్పణంలో చూసుకుంటే ఎన్.టి.ఆర్ అనే సంక్షిప్త రూపంగా కనిపిస్తుంది. అంతే కాదు- ఆ పొడి పొడి మూడక్షారాల వరస నట రత్నం, తెలుగు వజ్రం, రాత ముత్యం అనే కలబోత మణిహారంలా అనిపిస్తుంది.
నటరత్నం- సరే సరి. తిరుగులేని సత్యం. అది ఆయనని వరించిన తొలి బిరుదు. సినీ కళామతల్లి బిడ్డలలో అటువంటి వారే అరుదు. తలపెట్టిన సినీ రంగ 'నటన' అనే వృత్తిలో భాగంగా 'దర్శకత్వం' అనేది అవతల పెట్టక రెండిటినీ సమపాళ్ళలో రంగరించడం ఆయనలాగ అందరికీ కుదరదు.

తెలుగు వజ్రం?- ఇంద్రుడి చేతిలో 'పవి' అనే వజ్రాయుధం ఉండేదట. అన్యాయం మీద ఆ ఆయుధం ప్రయోగించేవాడట. తన ఎడమ చేతిని మడిచి ఒక్క వేలే చెంపల్ని తాకిస్తూ ఆత్మీయంగా చూస్తున్న ఆ తెలుగు చూపు లోనూ 'పవి' ఉంది. ఎటొచ్చీ అది 'పవర్ ఫుల్ విస్ డం' అనే ఇంగ్లీష్ మాటల పొడి పొడి రూపం. అదే ఆయన వజ్రాయుధం. అందులో 'తెలుగు వారి ఉనికి', 'ఆత్మాభిమానం' అనే తీక్ష్ణమైన వెలుగులు దాగి ఉన్నాయి. తెర మీది 'కధానాయకుడు' అంచెలంచెలుగా ఎదిగి తెలుగు 'దేశోద్ధారకులు' కావడమన్నది ఆ 'పవి' చలవ లేదా గరిమ. ఇదే ఫోటో తెలుగు వారి ఇళ్ళల్లో మూడు-నాలుగు దశాబ్దాలు అభిమాన దేవుడి పటంగా గోడకానుకుంది. చిత్రం ఏమిటంటే 'కధానాయకుడు' చిత్రంలో ఆయన కుడి చెయ్యి చాచి 'వినవయ్యా రామయ్యా' అన్నప్పుడు ఆయన కూడా అనుకోలేదు మరో దశాబ్ద కాలంలో ఎడమ చెయ్యి చాచి జనాన్ని కదిలించే 'అన్న' గా మారబోతాడని. అదీ నియంత్రణ, క్రమ శిక్షణ అనే రెండు వైపుల పదను ఉన్న 'పవి' మహాత్మ్యం. రెండు చేతులా పని ఉన్నప్పుడే మొండి శక్తి ఆవరిస్తుంది. అందుకే ఎన్.టి.ఆర్ మధ్య రూపం-తెలుగు వజ్రం.
రాత ముత్యం?- ఆయన సన్నిహితులూ, స్క్రిప్ట్ చేజిక్కించుకున్న సినీ హితులూ చెప్పే మాట ఇది. ఆయన రాసే అక్షారాలు ఒద్దికగా, పొందికగా, ఓపికగా, నింపాదిగా, నిబ్బరంగా, ఒడిదుడుకులు లేకుండా యోగా ముద్రలో ఉన్నట్టు ఉండేవి. అవే రాత ముత్యాలంటే!
అలనాటి ఎన్.టి.ఆర్ శ్రీకృష్ణ రూపం లేక ఇలా నేడు వెండి తెర మీద ఏదో వెలితి కానవస్తోంది. 'సీతా' అని స్తంభం ఆనుకునీ విలవిలలాడే శ్రీ రామ రూపంలో ఆయన తెర మీద కనపడగానే గుండె చెరువైన ప్రేక్షకులు మరో శ్రీరామ రూపానికి చేరువ కాలేక పోతున్నారు. రావణ పాత్ర వేసి రుద్రవీణ మ్రోగించినా, కర్ణ పాత్ర వేసి కుంతీదేవి కంట తడి పెట్టించినా, దుర్యోధనుడిగా పౌరుష మీసం మెలి తిప్పినా ప్రేక్షకుల్లో తన్మయత్వం, విస్మయం, అద్భుత వశీకరణం. అవన్నీ మళ్ళీ మళ్ళీ రాక, ఉన్న వాళ్ళలో చూడ లేక దిగాలు పడి పోయింది వెండి తెర. వేరే పాత్రల అసహనంతో పని పెంచుకుంది సెన్సార్ కత్తెర.
ఎన్.టీ.ఆర్ గొప్ప కళాకారుడే కాదు గొప్ప సమాజ శ్రేయోభిలాషి. యాభైల కాలంలో సినీ రంగం 'మనదేశం' సినిమాలో హీరోగా ఆయన చేత తొలి అడుగు వేయిస్తే ఎనభైల కాలంలో 'తెలుగు దేశం' ఆయన్ని రాజకీయ రంగం లోకి మలుపు తిప్పింది.
ఎన్.టి.ఆర్. లోని దర్శకత్వ ప్రతిభ కూడా అసామాన్యమే. అంతవరకూ కృష్ణుడు లో 'కృ' కష్టపెడుతూ ఉంటే అందరూ పలికే 'క్రి' ని వాడుకుంటే నష్టమేముందీ అని తన సినిమా టైటిల్ ని 'శ్రీక్రిష్ణ పాండవీయం' గా మలచిన ధైర్యశాలి ఎన్.టి.ఆర్.
ఎన్.టి.ఆర్. లో మంచి సాహిత్యాభిలాష ఉండేది, అది ఆయన నటించిన సినిమాల్లోనూ, దర్శకత్వంలోనూ కనిపిస్తూ ఉండేది .
అసలు ఎన్.టి.ఆర్ లోని నటుడిని వెలికి తీసింది ఆయన గురువుగారైన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారే. ఆయన జ్ఞానపీఠ కవి. అలాగే ఎన్.టి.ఆర్ వెతికి తీసుకొచ్చిన కవి డా. సి.నారాయణరెడ్డిగారు కూడా ఆనక జ్ఞానపీఠం అధిరోహించినవారే. ఎన్.టి.ఆర్ తన గురువుగారి 'ఏకవీర' రచన సినిమాగా మారుతుంటే హర్షించారు. హృద్యంగా నటించారు. ఈ ఏకవీర చిత్రానికి తొలిసారిగాడా. సి.నా.రె. మాటలు రాశారు.
దేవులపల్లి వారు కూడా తొలిసారిగా సినిమాకి మాటలు రాయడం 'మల్లీశ్వరి' చిత్రం కోసమే జరిగింది.
వేటూరి సుందరరామమూర్తి వంటి కొత్త తరం ప్రతినిధిని సినిమా రంగానికి ఆహ్వానిస్తే తెలుగు బతికి బట్ట కడుతుందని ఎన్.టి.ఆర్. ఆయన్ని మందలించి మరీ లాక్కొచ్చారట. లేకపోతె ఒక పాత్రికేయుడిగా మిగిలిపోయేవారు వేటూరి.
ఎన్.టి.ఆర్ లో మరో విశేషం- పాటని అనుభవిస్తూ అభినయించడం. కొన్ని పాట సీన్లు చూస్తే తెలుస్తుంది ఆయన కంఠం కదలికలు ఎంత సహజంగా ఉంటాయో. అంతేకాదు అడపా దడపా ఘంటసాల వారితో గొంతు కలిపేవారు కూడా. 'వచ్చిండన్నా''వచ్చాడన్నా' అన్న రెండు ముక్కలు ఆయన అనడం, జనం వాటిని 'తారక (రామ) మంత్రం' లా తీసుకోవడం నాటి రోజుల విశేషం.
పాత రీళ్లు తిరుతున్నంత కాలం, పాత పాట వ్రేళ్ళు చితికిపోనంత కాలం బ్రతికే ఉంటారు ఎన్.టీ.ఆర్. మెరుస్తూనే ఉంటుంది నటరత్నం, తెలుగు వజ్రం, రాత ముత్యాలు కలబోసిన మణి హారం!
courtesy : (డా. తాతిరాజు వేణుగోపాల్,)

1 కామెంట్‌:

sistla చెప్పారు...

బృహన్మేరు అని ఉండాలి

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...