27, మే 2019, సోమవారం

నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం శత వర్ధంతి.




కందుకూరి వీరేశలింగం శత వర్ధంతి - నా pencil చిత్రం.

ఈ సందర్భంగా 26.5.2019 ఆంధ్రజ్యోతి లో ఈ మహామహుని గురించి వచ్చిన వ్యాసం యధాతధంగా ఇక్కడ పొందుపరుస్తున్నాను. పత్రిక వారికి నా ధన్యవాదాలు.
వీరేశలింగం వితంతు పునర్వివాహాల గూర్చిన విమర్శలు అసంగతం. ఎన్ని వివాహాలు జరిగాయి? అందులో అంతర్వర్ణ వివాహాలు ఎన్ని? వివాహానంతరం వారి మంచి చెడ్డలను పట్టించుకొన్నాడా?... ఆయన విశాల కార్యరంగంలో, కొన్ని పొరబాట్లు జరిగినా, అవి అప్రస్తుతాలు. మహత్తరంగా, ఏటికి ఎదురొడ్డి నిలిచిన మహోద్యమంలో యివన్నీ భాగాలే! ఆ ఉద్యమంలోని జీవనాడిని పట్టుకోవాలి.

గత శతాబ్ది మధ్యకాలానికి, కళాశాల విద్యలో అడుగిడేనాటికి, ఆధునిక ఆంధ్ర దేశ వైతాళికులుగా, వీరేశలింగం, గురజాడ, గిడుగు, కొమర్రాజు మా ఎరుకలోకి వచ్చారు. సాంఘిక, సాహిత్య భాష, చరిత్ర రంగాల్లో వీరి కృషి ఫలితమే, ఇరవయ్యో శతాబ్ది మొదటి రెండు దశాబ్దాల్లో రూపుదిద్దుకొన్న ఆంధ్ర దేశంగా పరిగణించారు. వీరిలో ఏ ఒక్కరూ రాజకీయవాదులు కాదు. వారి వారి కార్యరంగాల్లో తలమునకలవుతున్నపుడు, జాతీయోద్యమం మితవాద దశలో వుండి, ప్రజాబాహుళ్యంలోకి చొచ్చుకుపోలేదు. వీరేశలింగం కాంగ్రెస్‌ సంస్థ గూర్చి రాజమహేంద్రవరంలో ‘‘జాతీయ మహాసభయు దాని యుద్దేశములు’’ (The National Congress and its Aims) అనే మకుటంతో ఉపన్యసించినా, జాతీయవాది అనిపించుకోకపోగా, వందేమాతర ఉద్యమం తీవ్రమై బిపిన్‌ చంద్ర పాల్‌ రాజమండ్రికి వచ్చినప్పుడు, స్థానిక కళాశాల విద్యార్థులు, క్లాసులు బహిష్కరించడం, నూరుమందికి పైగా కళాశాల నుండి బర్తరఫ్‌ కావడం (వారిలో గాడిచెర్ల హరిసర్వోత్తమరావుగారొకరు), వారు వీరేశలింగాన్ని చూసినప్పుడు ‘నమస్తే’ బదులు ‘వందేమాతరం’ అని సంబోధించడంలో హేళన ఉంది. అలాగే గురజాడ మద్రాసు కాంగ్రెస్‌ మహాసభలకు హాజరై రాసిన ఆంగ్ల గేయం వ్యంగ్యంగా కాంగ్రెస్‌ను విమర్శించే రీతిలో వుంది. కొమర్రాజు, గిడుగులకున్న జాతీయ భావాలు వారు చేపట్టిన సాహిత్య, చారిత్రక కృషికి పూరకమే! ఇది కొమర్రాజువారి ఆంధ్రుల పరిశోధనల్లో ద్యోతకమైంది.
వీరు ముగ్గురూ సాంఘిక, సాహిత్య, సాంస్కృతిక సేనానులు. వీరి సేవలను కొనియాడుతూ జయంతులు, చర్చాగోష్టులు జరిగేవి. వైతాళికులుగా పేర్కొనబడ్డ వీరి ప్రాభవం, 1920 దశకంలో జాతీ యోద్యమం వూపందుకొన్నాక (గాంధీ ప్రవేశంతో) కొంతమేరకు మసకబారింది. తిరిగి వీరి రచనలు, వీరిని గూర్చిన ప్రస్తావనలు 1930దశకం దాటాక, వారి వారసత్వాన్ని అభ్యుదయ సాహిత్యో ద్యమం వెలుగులోకి తీసుకొచ్చింది. వామపక్షవాదులూ యిందులో పాత్ర వహించారు. వీరేశలింగం సమగ్ర రచనలను ప్రచురించడం, చిలకమర్తి ‘స్వీయచరిత్ర’ పునర్ముద్రణ, వారికి సన్మానం, గురజాడ సమగ్ర రచనల్ని వెలుగులోకి తీసుకురావడంలో కృషి సల్పారు. ఈ కృషికి చారిత్రక ధ్యేయం వుంది. రాజకీయ మార్పులకు పూర్వ రంగంగా, సమాజంలో, ప్రజల మనోభావాల్లో సానుకూల మార్పు, ప్రగతిశీల భావజాలం రావాలన్నది చారిత్రకంగా రుజువైన అంశం. ఫ్రెంచి విప్లవానికి పూర్వం, అక్కడి ప్రజల్లో భావపరంగా మార్పు రావడానికి మేధావులు, రచయితలు కృషి సల్పారు ("Long before the french revolution, there was a revolution in the minds of people).
ఇది పూర్వ రంగం. వీరేశలింగం తన సమకాలీన సామాజిక పరిస్థితులకు స్పందించి తత్సంబంధ సంస్కరణపూరిత సాహిత్యాన్ని సృష్టించడంతోపాటు, సంస్కరణల కార్యాచరణకు పూనుకొన్నాడు. 19వ శతాబ్దంలో వీరేశలింగానికి వెనుకా, ముందూ, ప్రముఖ సంస్కర్తలు బెంగాల్‌, మహారాష్ట్ర, కేరళ తదితర ప్రాంతాల్లోనూ వున్నారు. వారిలో బెంగాల్‌కు చెందిన ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌తో ప్రత్యక్ష పరిచయం లేకున్నా, వితంతు వివాహాలకు సంబంధించిన వారి రచనలను తెప్పించుకొని, వాటిని ఆచరణలో పెట్టి ‘దక్షిణ భారత విద్యాసాగరుడ’ని పిలువబడ్డాడు. మద్రాసులోని బ్రహ్మ సామాజికులతో నిత్య సంబంధాలు పెట్టుకొని అక్కడున్న రఘునాధ రావు, చెంచల్రావు ప్రభృతులను సమీకరించి, అన్ని కులాలవారితో సహపంక్తి భోజనాలు జరిపించాడు. మద్రాసులో బ్రహ్మ సమాజ మందిర నిర్మాణానికి సాయపడ్డాడు. కర్నాటక ప్రాంతంలో బెంగు ళూరు దాకా పర్యటించి, బ్రహ్మసమాజ శాఖలను నెలకొల్పాడు. తాను నిర్వహిస్తున్న సంస్కరణ కార్యక్రమాలకు విరాళాలు సేకరిస్తూ, నైజాం పాలనలోవున్న హైదరాబాద్‌కు వచ్చి నిధులు సేకరించాడు. తాను కర్తృత్వం వహించి వివాహం జరిపించిన కవయిత్రి సరోజినీ నాయుడు కుటుంబాన్ని కలిశాడు.
వీరేశలింగం కార్యరంగం ప్రధానంగా అప్పటి ఆంధ్ర దేశం. హైస్కూలు దాటని మెట్రిక్యు లేషన్‌ చదువు. అధ్యాపక వృత్తి. వరుంబడి తక్కువ. పిత్రార్జితం లేదు. సంస్కరణ కార్యక్రమాలకు సరిపడేంత ఆర్థిక వనరులు లేవు. తన వెంట నడిచే అనుచరులు కొద్దిమందే! వారిలో తుది దాకా నిలబడింది ఒకరో, యిద్దరో! ఇన్ని ప్రతికూలతలను తట్టుకొని నిలబడి వితంతు పునర్వివాహాలు జరపడం ఏటికి ఎదురీదడమే! వీటి గూర్చి విపులంగా తన స్వీయ చరిత్రలో చెప్పుకొన్నాడు. విరూపాక్ష పీఠాధిపతి శంకరా చార్యతో వాగ్వివాదానికి దిగి, తుదకు సంఘ బహిష్కరణకు గురైనా ప్రాయశ్చిత్తం చేసుకో నిరాకరించాడు. ఈ కృషిలో వీరేశలింగానికి దన్నుగా నిలబడి, ప్రాచశ్చిత్తం చేసుకోకుండా, సుమారు 30వేల రూపాయలు విరాళమిచ్చి ఆదుకొన్నది, కాకినాడకు చెందిన వైశ్య ప్రముఖుడు పైడా రామకృష్ణయ్య.
వితంతు పునర్వివాహాలు గూర్చిన విమర్శలు అసంగతం. ఎన్ని వివాహాలు జరిగాయి? అందులో అంతర్వర్ణ వివాహాలు ఎన్ని? (చూడు: నాళం కృష్ణారావు ‘వితంతు వివాహ చరిత్ర’). వివాహా నంతరం వారి మంచి చెడ్డలను పట్టించుకొన్నాడా?... ఆయన విశాల కార్యరంగంలో, కొన్ని పొరబాట్లు జరిగినా, అవి అప్రస్తు తాలు. మహత్తరంగా, ఏటికి ఎదురొడ్డి నిలిచిన మహోద్యమంలో యివన్నీ భాగాలే! ఆ ఉద్యమంలోని జీవనాడిని పట్టుకోవాలి. అనాదిగా వస్తున్న అమానుష సాంఘిక దురాచారాన్ని ప్రశ్నించి, సవాలుగా తీసుకొని, ‘శాస్త్రయుక్తంగా’ అది సమ్మతమేనని చూపడం యిందులోని ముఖ్యోద్దేశం. నాటి సమాజంలో అవినీతిని, న్యాయ స్థానాలుగా చెప్పబడ్డవాటిలో ప్లీడర్లు, న్యాయమూర్తుల లంచగొండి తనాన్ని ఎండగట్టడం, రాజమండ్రి పురపాలక సంఘ కార్యకలా పాల్లో ప్రత్యక్షంగా కలుగచేసుకొని, పట్టణ సమస్యల్ని సరిదిద్దడం- ఇలాగ మరెన్నో! ఇవన్నీ ‘స్వల్ప’ విషయాలుగా అన్పించవచ్చు. నేడున్న పరిస్థితి ఏమిటి? వీరేశలింగం చనిపోయి నూరేండ్ల తర్వాత, దేశం స్వాతంత్య్రం పొంది, రాజ్యాంగ చట్టాలు అమల్లోకి వచ్చాక, సమాజం, అన్ని విధాల సమర్థనీయంగా వుండాల్సిన తరుణంలో, రోజుకొక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం! అవినీతి, సమాజపు మూలుగల్ని పీల్చేస్తున్నప్పుడు, స్త్రీలకు రక్షణ కొరవడిన ప్పుడు- విచ్చలవిడితనం సర్వవ్యాప్తమైనపుడు-వీరేశలింగం, ఆనాటి వైతాళికులు ఆశించిన సమాజాన్ని నిర్మిస్తున్నామా? సమాజపు రుగ్మతలను రూపుమాపి, కలుషపూరిత సమాజాన్ని శుభ్రపరచా లనుకొన్నాడు. ఆధునిక యుగానికి వైతాళికుడైనాడు. గురజాడ అన్నట్టు, వీరేశలింగం ‘నిశ్చయముగ మహాపురుషుడు’.
(నేడు కందుకూరి వీరేశలింగం శతవర్ధంతి)
వకుళాభరణం రామకృష్ణ

కామెంట్‌లు లేవు:

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...