నా చిత్రానికి శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి గారి కవిత
ఈ బాల్యం మాకొద్దు
బుడిబుడి నడకలు నేర్చుకుంటున్న
బుజ్జి బుజ్జి పాదాలను
బూట్లు సాక్సులతో బంధించి
మోయలేని బరువును భుజాలకెత్తి
క్రిక్కిరిసిన ఆటోలో
ఉక్కిరిబిక్కిరి చేస్తూ
క్లాసురూములోనే
ఖైదీలుగా మార్చేసి
గంటకొక్క టీచరొచ్చి
గంటకొట్టినట్లుగా
అర్థంకాని భాషలో
అనర్గళంగా
చెప్పేసిపోతుంటే
చెయ్యలేనంత హోం వర్కుతో
వసివాడిపోతున్న
పసితనం మాకొద్దు
అమ్మ గోరుముద్దలకోసం
ఆరాటపడే ఆకలి
ఆయమ్మ సాయంతో
ఎంగిలిపడటం నేర్చుకుంటోంది
క్లాసులో టీచరు కన్నెర్రజేస్తే
కావలించుకుని ఓదార్చే
అమ్మ దగ్గరలేక
బిక్కచచ్చిన మనసు
వెక్కిళ్ళుపడుతూ
కన్నీళ్ళు మింగింది
మాతృభాష మహానేరమైన
పాఠశాల పంజరంలో
ఆంగ్లభాష చిలకపలుకు
భావ ప్రకటన స్వేచ్ఛను
బాల్యంనుండి హరించింది
ఆడుకోవటం అల్లరి చేయటం
కబుర్లు చెప్పటం కథలు వినటం
కాన్వెంట్ కల్చరు క్రమశిక్షణ మాటున
కల్లలుగా మారి
కలగా మిగిలింది
ఆటస్థలాలు లేని
అంతస్థుల బడిలో
బాల్యాన్ని మూల్యంగా చెల్లించి
పొందబోయే భవిష్యత్తు
బంగారమైనా గానీ
అది మాకొద్దు
ఈ బాల్యం మాకొద్దు.
సింహాద్రి జ్యోతిర్మయి
నరసం ఉపాధ్యక్షురాలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి