28, జనవరి 2022, శుక్రవారం

షావుకారు (శంకరమంచి) జానకి - (Pencil sketch)

My pencil sketch


మన జానకమ్మకి 'పద్మశ్రీ' బిరుదు ప్రకటన భేష్..! నా దగ్గర 'షావుకారు' మాటలు పాటలతో ఓ LP record ఉండేది. అందులో ఆమె dialogues పదేపదే వినేవాడిని. వెంకటేశ్వర మహత్యం చిత్రం లో సోది చెప్పి ఓ ఊపు ఊపేసింది. ఇంక 'కన్యాశుల్కం' లో బుచ్చెమ్మ పాత్రగురించి చెప్పేదేముంది. 'పాండవులు పాండవులు' పాటలో ఏఎన్నార్ దగ్గరుండి స్టెప్పులు నేర్పించారట. అదరగొట్టేసింది. ఓ సారి youtube లో చూడండి. మీకే తెలుస్తుంది. 'షావుకారు' చిత్రంలో నటించి 'శంకరమంచి' నుంచి 'షావుకారు జానకి' అయ్యింది మన జానకమ్మ.

ఆమెకు 'పద్మశ్రీ' బిరుదు ప్రకటన బహుదా ప్రశంసనీయం. శుభాభినందనలు జానకమ్మా .. (అయితే ఈ పురస్కారం తమిళనాడు కోటాలో ఇచ్చినట్టున్నారు.. టీవీ వార్తల్లో అలా చూపించారు).



 

26, జనవరి 2022, బుధవారం

త్రిపురనేని రామస్వామి - Pencil sketch



Pencil Sketch

 త్రిపురనేని రామస్వామి చౌదరి (జనవరి 151887 - జనవరి 161943) న్యాయవాది, ప్రముఖ హేతువాద రచయిత, సంఘసంస్కర్త, స్వాతంత్ర్య సమర యోధుడు. కవి రాజు గా కీర్తించబడే త్రిపురనేనిని హేతువాదంమానవతావాదాలను తెలుగు సాహిత్యంలోకి మొదటి సారిగా ప్రవేశపెట్టిన కవిగా భావిస్తారు. (Courtesy : Wikipedia)


తను స్థాపించిన సూతాశ్రమాన్ని పలురకాల కార్యక్రమాలకు వేదికగా చేశాడు. రాజకీయ, సామాజిక, కార్యకర్తలందరికీ సూతాశ్రమం స్వాగతం పలికేది. ఆశ్రయం ఇచ్చేది. స్వాతంత్ర్యపోరాట సమయంలో కొందరు నాయకులు దాక్కునేందుకు దీనినే ఎంచుకున్నారు. పోలీసుల దృష్టి అంతగా పడదని, రామస్వామి అండవుంటే చాలనుకుని వచ్చిన వారు వారంతా.

సాహిత్య రాజకీయ,సామాజికరంగాలలో తనదైన ముద్రవేసినవాడు త్రిపురనేని రామస్వామి. తిరుపతి వేంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళవెంకట శాస్త్రిగారి శిష్యరికంలో సాహిత్యం, అవధానాలను వంటపట్టించుకుని, ముట్నూరు కృష్ణారావుగారి శిష్యరికంలో బావవ్యక్తీకరణ నేర్చుకుని, ఇంగ్లండ్ వెళ్ళి సాధించిన బార్-ఎట్-లాతో లోకాన్ని చదివిన వాడు త్రిపురనేని రామస్వామి. బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమ పార్టీ జస్టిస్ పార్టీ అభిమాని ఇతను, ఆ పార్టీకి అధ్యక్ష స్థానం వహించినవాడు. తెనాలి మునిసిపాలిటీకి రెండుసార్లు ఛైర్మన్ ఆయ్యాడు. సాహిత్యరంగంలో ఆయన రాసిన నాటకాలు, నాటికలు, ‘‘జంబుకవర’’ ‘‘పల్నాటి పోరాటం’’, ‘‘సూతపురాణం’’ వంటి వాటికి గుర్తుగా కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు చేతిమీదుగా‘‘కవిరాజు’’ అన్న బిరుదును 1929లో అందుకున్నారు.
యజ్ఞయాగాదులను, జంతుబలులను నిరసించి, నిషేధించిన మున్సిపల్ చైర్మన్ ఆయన. పురాణాలను ప్రశ్నించాడు. భగవద్గీతను వ్యంగ్యంగా, తిప్పి రాసిన సమర్ధుడు. బ్రాహ్మణవాదాన్ని వ్యతిరేకించి కమ్మబ్రాహ్మలను తయారుచేశాడు. ఇలా ఆయన జీవితం అంతా ఏన్నో సామాజిక, సాహిత్య అంశాలకు అంకితం చేశారు.
త్రిపురనేని రామస్వామి జీవించింది 56 సంవత్సరాలు మాత్రమే. ఆయన తన 43వ ఏట రెండవ భార్య మరణించిన ఒక సంవత్సరంలోనే మూడవ వివాహం చేసుకున్నారు, వరుస వివాహాలతో ఆయన మీద మానసిక ఒత్తిడి కలిగింది. సర్ధుకుపోవటం సులభంకాదు ఇంగ్లండు లో బారిస్టర్ చదవటానికి వెళ్ళినప్పటినుండే ఆయనకు పొగతాగే అలవాటుండేది.
ఉద్యమాలలో తిరిగేటప్పడు, తాను నిజమని నమ్మినదానిని బలంగా వాదించలసినప్పుడు ఆయనలో పొగతాగటం మరికొంచెం అధికంగా వుండేది. పొగతాగటం ఆరోగ్యానికి మంచిదికాదని, దానిని వదలమని చెప్పినా ఆయన విన్నట్టుగా ఉండేవారే కాని మానే వారు కాదు.
తాను ప్రత్యర్ధులుగా భావించిన వ్యక్తులను, తాను వ్యతిరేకించిన సిద్ధాంతాలను తీవ్ర పదజాలంలో విమర్శించినా ఆయనంటే చాలామందికి గౌరవం
. బ్రాహ్మణవాద వ్యతిరేక ఉద్యమం నడిపినా ఆయనకు మాలపల్లి నవలా రచయిత ఉన్నవ లక్ష్మీ నారాయణతో సాన్నిహిత్యం వుండేది. సామాజిక సమరస భావమే వారిద్దరినీ చివరివరకు కలసి పనిచేయించింది. గుడివాడలో త్రిపురనేని రామస్వామికి గజారోహణ సత్కారం చేశారు.
ఆయన గురువుగారైన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిచేత ఆ సత్కారం అందు కోవటం త్రిపురనేని రామస్వామికి ఎంతో గర్వంగా, సంతోషంగా అనిపించింది. 56 ఎడ్లబండ్లు సర్వాంగ సుందరంగా అలంకరించి గుడివాడ పురవీధులలో ఊరేగించారు
భావోద్వేగంతో ఆయన గుండె స్పందించింది. ఆ సన్మాన సమయానికి త్రిపురనేని రామస్వామికి దగ్గు ఇబ్బందిపెడుతుండేది. ఆయనకు ఏదో అంతుపట్టని ఛాతీ సమస్య ఏర్పడింది, ఊపిరితిత్తులలో నెమ్ముచేరిందో లేక వేరేదేమో తెలియదు. మరణం దాదాపుగా హఠాత్తుగా సంభవించినదే. 1943వ సంవత్సరం జనవరి 16వ తేదీన ఆయన మరణించారు. జీవించినంత కాలం ప్రజల పక్షం నిలిచి మనుస్మృతిని వ్యతిరేకించి, మధ్య కులాలను మేలుకొలిపి వారిలో చదువులపట్ల ఆసక్తిని పెంచి, ఆత్మన్యూనతను తగ్గించేందుకు కృషిచేసిన వాడుగా కొనియాడబడ్డాడు.

1930లో ఉప్పు సత్యాగ్రహాని పిలుపినిచ్చారు గాంధీజీ.  అహింసా మార్గంలో చేపట్టిన ఆ ఉద్యమం సమయంలో బ్రిటిషివాళ్ళు చూపిన హింసాప్రవృత్తి ప్రపంచాన్నే నిశ్చేష్తపరచింది. అయినాసరే .. ఆ ఉద్యమంలో పాల్గొన్న తెలుగు శాంతివీరుల కోసం కవిరాజు త్రిపురనేని రామస్వామి ఓ గేయం రాశారు.

వీరగంధము తెచ్చినారము

వీరుడెవ్వడో తెల్పుడీ!

పూసి పోదుము, మెడను వైతుము

పూలదండలు భక్తితో!" అని మొదలయ్యే ఈ కవిత ఆంధ్రజ్యాతి ప్రాభవాన్ని గుర్తుచేస్తూ..

తెలుగు బావుట కన్ను చెదరగ

కొండవీటను నెగిరినప్పుడు

తెలుగువారల్ కత్తిదెబ్బలు 

గండికోటను కాచినప్పుడు..

 అంతోఓ సాగి తెలుగు యోధులకి అప్పట్లో ఎంతో స్ఫూర్తినిచ్చింది. 

(ఇక్కడా ఆక్కడా చదివి సేకరించిన వివరాలు ఆధారంగా)



23, జనవరి 2022, ఆదివారం

మత్స్య కూర్మ వరాహ మనుష్య సింహ వామనా... అన్నమయ్య కీర్తన


వారం వారం అన్నమయ్య - "మత్స్య కూర్మ వరాహ
మనుష్య సింహ వామనా..."
విశ్లేషణ సౌజన్యం : డా. Umadevi Prasadarao Jandhyala
చిత్రం " Pvr Murty
సహకారం : శ్రీమతి Ponnada Lakshmi
ముందుగా ఒక ప్రార్థన పద్యం
(శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రి గారిది)
కం॥
మీనము,కూర్మవరాహం
బానరహరి, వామనునిగ, భార్గవుగా, శ్రీ జానకి మగడుగ, కృష్ణుడు
జ్ఞానియు బుద్ధుండు పైన కల్క్యగు హరి!జే !
~~~~~~~~

కీర్తన :

మత్స్య కూర్మ వరాహ
మనుష్య సింహ వామనా
యిచ్చ రామ రామ రామ హితబుద్ధి కలికి

నన్ను గావు కేశవ నారాయణ మాధవ
మన్నించు గోవింద విష్ణు మధుసూదన |
వన్నెల త్రివిక్రమ వామనా శ్రీధరా
సన్నుతించే హృషీకేశ సారకు పద్మనాభ ||
కంటిమి దామోదర సంకరుషణ వాసుదేవ
అంటేజాలు ప్రద్యుమ్నుడా అనిరుద్ధుడా |
తొంటే పురుషోత్తమ అథోక్షజ నారసింహమా
జంటవాయకు మచ్యుత జనార్ధన ||
మొక్కేము వుపేంద్ర హరి మోహన శ్రీకృష్ణరాయ
యెక్కితి శ్రీ వేంకట మిందిరానాథ |
యిక్కువ నీ నామములు యివియే నా జపములు
చక్కగా నీదాసులము సర్వేశ అనంత॥

వివరణ
********
ఈ కీర్తనలో అన్నమయ్య తన ఇష్టదైవమైన శ్రీ వేంకట పతిని తనను కాపాడమంటూ ఆ జగన్నాథుడు సాధురక్షణకు, దుర్జన సంహరణకు ధరించిన దశావతారాలను ప్రారంభంలో తలుచుకుంటూ కల్పాంతాలలో జగత్తునే రక్షించిన వాడివి నన్ను బ్రోచుట నీకెంత పని స్వామీ అన్నట్లుగా వేడుకుంటున్నాడు. ఆ అవతారములివే!
‘మత్స్యకూర్మ వరాహ మనుష్యసింహ వామన, రామరామరామ హితబుద్ధి కలికి .’
*సంగ్రహ వివరణ

సత్యయుగంలో మత్స్యావతారం దాల్చి హయగ్రీవుడనే అసురుడినుండి వేదాలను రక్షించాడు. ఆ కల్పాంతంలో ఏర్పడిన జలప్రళయంలో సత్యవ్రతాదులున్న నావను తన ఒంటికొమ్ముతో లాగి రక్షించాడు. ఆయనకు ఈ మనలను భవజలధిని దాటించడం ఎంతపని!

కృతయుగంలో భూగోళాన్ని పట్టుకుపోయి పాతాళంలో దాచిన హిరణ్యాక్షుని ఆదివరాహావతారందాల్చి వానిని సంహరించి భూదేవిని రక్షించాడు।

అదితి కుమారుడై జన్మించి, వామననామంతో వటువు రూపంలో వచ్చి బలిచక్రవర్తి దేవతల విరోధిగా వారి సంపదలను దోచినందుకు, పాతాళానికి అణగద్కొక్కాడు . అప్పుడే మూడడుగులు దానమడిగి అవి ఇవ్వగానే మూడు అడుగులతో ముల్లోకాలు కొలిచి త్రివిక్రముడైనాడు.
ఇక త్రేతాయుగంలో పరశురాముడిగా మదాంధులైన క్షత్రియులను సంహరించాడు.

రఘుకులతిలకుడైన శ్రీరాముడై రావణ కుంభకర్ణాదుల రాక్షస సంహారం చేసాడు.
ద్వాపర యుగంలో హలాయుధుడైన బలరాముడై శ్రీకృష్ణునకు అగ్రజుడై దుష్టసంహారంలో భాగస్వామి అయినాడు. హితబుద్ధియైన బుద్ధునిగా కల్కి గా కలియుగమున! యుగయుగములందూ జగతిని కాపాడే తండ్రీ! నన్ను కాపడవయ్యా!” అని వేడుకున్నాడు.
**చరణములు - వివరణ
చరణాలలో మరిన్ని విధాల
అన్నమయ్య శ్రీవారిని కీర్తిస్తూ సంబోధించిన స్వామివారి కొన్ని నామాలను , స్వల్పంగా వాటి అర్థం తెలుసుకుంటూ పరిశీలిద్దాం.
*గోవిందా!(సకలజగత్తును పాలించే వాడా! గో, గోపాలక రక్షకుడా),
*ఓ విష్ణు మూర్తీ (సర్వ వ్యాపకుడ వైనవాడా) ,
*మధుసూదనా!(మధుకైటభుల నిర్జించిన వాడా)
*త్రివిక్రమా!( ముల్లోకములను మూడుఅడుగులతో కొలిచిన విక్రముడా)
*నారాయణా(సంసారమనే జలధిని తరింపజేసేవాడా, జలయానం చేసేవాడా,బ్రహ్మజ్ఞానము కలవాడా)
*మాధవా !( లక్ష్మీపతీ, సకలసంపదలకు అధిదేవత అయిన శ్రీలక్ష్మికి పతి అయిన వాడా)
*వామనా!( సూక్ష్మమైన ఆత్మస్వరూపుడా)
*శ్రీధరా( శ్రీని వక్షస్థలమున ధరించినవాడా)!*హృషీకేశా( ఇంద్రియములను నిగ్రహించు వాడా)!*పద్మనాభా( సృష్టికర్త బ్రహ్మకే జన్మస్థానమైన పద్మమును నాభియందుకలవాడా)!
*దామోదరా( శమదమాది లక్షణములు ఉదరమునందుకలవాడా! త్రాటితో యశోదమ్మచే ఉదరమును కట్టబడిన వాడా! ప్రేమకు కట్టుబడినవాడా)
*సంకర్షణా!( ఉపాసకుని దగ్గరకు చేర్చుకుని ఉద్ధరించే వాడా)
*ప్రద్యుమ్నా!( ధన బలములకు నిధానమైనవాడా)
*అనిరుద్ధా!( నిరోధింపగలవారు లేనివాడా)
*అధోక్షజా( ఊర్థ్వ ముఖపడవై ఎన్నడూ కిందకు జారనివాడా)
*ఉపేంద్రా!( వామనుడై అదితి కశ్యపులకు జన్మించడం వలన ఇంద్రుడికి సోదరుడైనవాడా)
*హరి!( సమస్త దుఃఖములు హరించే వాడా)
*శ్రీకృష్ణా!(అనంతమైన ఆకాశం వలే నల్లనివాడా)
*ఇందిరానాథా! (ఇందిర పదం సౌందర్యానికి, సంపదకు ప్రతీక . లక్ష్మి. ఆమెకు నాథుడా)
అంటూ
భక్తి పారవశ్యంతో అన్నమయ్య సర్వేశ్వరుడైన ఆ వేంకటపతి నామాలను జపిస్తూ, స్మరిస్తూ, కీర్తిస్తూ తనను మన్నించి,ఈ భవసాగరందాటించి దాసుడనైన తనను అనుగ్రహింపమని వేడుకుంటున్నాడు!
*****************
నరసింహ శతకం నుండి ఒక పద్యంతో స్వస్తి పలుకుదాం.
సీ.
గరుడవాహన! దివ్యకౌస్తుభాలం
కార!
రవికోటితేజ! సారంగవదన!
మణిగణాన్విత! హేమమకుటా
భరణ! చారు
మకరకుండల! లసన్మందహాస!
కాంచనాంబర! రత్నకాంచివిభూషిత!
సురవరార్చిత! చంద్ర సూర్యనయన!
కమలనాభ! ముకుంద గంగాధర
స్తుత!
రాక్షసాంతక! నాగ రాజశయన!
తే.
పతితపావన! లక్షీశ! బ్రహ్మజనక!
భక్తవత్సల! సర్వేశ! పరమపురుష!
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార!నరసింహ దురిత
దూర!
స్వస్తి 🙏
****************
డా. ఉమాదేవి జంధ్యాల
చిత్రం-శ్రీ Pvr Murtyగారు

15, జనవరి 2022, శనివారం

నారాయణ నీ నామమె గతి యిఁక కోరికలు మాకుఁ గొనసాగుటకు - అన్నమయ్య కీర్తన

ఈ అన్నమయ్య కీర్తనకి   డా. ఉమాదేవి జంద్యాల  గారు  ఇచ్చిన విశ్లేషణ యధాతధంగా (ఈ చిత్రం  బాపు గారి చిత్రానికి నా రేఖలు రంగులతో  కొంతవరకూ అనుకరణ).  


ఓం నమో వేంకటేశాయ 🙏
ముందుగా ఒక ప్రార్థన పద్యం !
శా॥
శ్రీనారాయణ యన్నఁ జాలు దురితశ్రేణి న్నివారింపఁగా
నానందస్థితి గల్గు నంచు నిగమార్థానేక మెల్లప్పుడున్‌
నానాభంగులఁ జెప్ప నేను విని శ్రీనారాయణా యంచు ని
న్నే నే నెప్పుడు గొల్తు బ్రోవఁ గదె తండ్రీ నన్ను నారాయణా!
కీర్తన పాఠం
~~~~~~~~~
నారాయణ నీ నామమె గతి యిఁక
కోరికలు మాకుఁ గొనసాగుటకు
1)
పై పై ముందట భవ జలధి
దాపు వెనకఁ జింతా జలధి
చాపలము నడుమ సంసార జలధి
తేప యేది యివి తెగనీఁదుటకు
2)
పండె నెడమఁ బాపపు రాశి
అండఁ గుడిని పుణ్యపురాశి
కొండను నడుమఁ ద్రిగుణరాశి – యివి
నిండఁ గుడుచుటకు నిలుకడ యేది
3)
కింది లోకములు కీడునరకములు
అందేటి స్వర్గాలవె మీఁద
చెంది యంతరాత్మ శ్రీ వేంకటేశ నీ –
యందె పరమపద మవల మరేది
వివరణ నాకు తెలిసినంత
***************************
నారాయణ నామస్మరణ మహిమను
తెలిపే అనేక కీర్తనలలో ఒకటి నారాయణ నీ నామమె గతియిక!….
మనిషి అంతా నాగొప్పదనమే అనుకుంటాడు. కష్టాలు చుట్టుకున్న కాసేపు దేవుణ్ణి తలుచుకుంటాడు. మొక్కులు మొక్కుతాడు. బాధలు తీరితే భగవంతుడు గుర్తుకు రాడు.
బిడ్డకు ఆకలి వేసినప్పుడే అమ్మగుర్తుకు రావడం వలే ఉంటుంది మనిషి తీరు!
మా కోరికలు తీరాలంటే నారాయణా నీ నామమే గతిఇక!
గజేంద్రుడిలా చేతులెత్తేసే పరిస్థితిలో ఎవరికయినా ఆయనే గతి! అదే శరణాగతి!
( మా కోరికలు అంటే అన్నమయ్య వంటి మహా భక్తుల కోరిక మోక్షం. మనబోటి వారి కోరికలు కాదు.)
1)
ఎటుచూసినా సముద్రమే!
ముందుక చూస్తే పైపైన పడే భవసాగరం!
వెనకకు తిరిగితే దగ్గరగా దుఃఖ సాగరం!
మధ్యలో చలించే సంసార సాగరం!
వీటిని ఈదగల తెప్ప ఏది?
ఈ జలధులను దాటించగలది నీ నామమే అని అర్థం.
( ఈ పుట్టుకే ఒక సముద్రంలో పడటం వంటిది. ఉన్నా చింతే, లేకపోయినా చింతే. అన్నిటికీ బాధపడే ఈ మనసొక సముద్రం. ఇల్లు వాకిలీ, ఇల్లాలూ పిల్లలూ… ఇతరబంధాలు, సమస్యలు వంటి అలలపోటుతో కదిలిపోయే కడలి ఈ సంసారం! ఈ ప్రపంచం)
2)
ఇక ఎడమ పక్కకు చూస్తే పండిన పాపాల కుప్ప. కుడి వైపు చూస్తే అండగా పుణ్యాల రాశి!
మధ్యలో కొండంత సత్వరజస్తమోగుణాల కుప్ప!
ఇవి స్తిమితంగా, పూర్తిగా తెలుసుకొని అరిగించుకోడానికి తీరికేది? ఏది మంచో, ఏది చెడో , ఏది కావాలో, ఏది వదిలేయాలో తెలుసుకునే ఓర్పు నేర్పు మనిషికి లేదు .
3)
కింద నరకముంది. అందులో అంతా చెడే. అందేటట్లుగా స్వర్గముంది. కానీ అక్కడ నీవుండే పరమపదంలేదు. మరి అదెక్కడుంది? అది ఓ వేంకటేశ్వరా నీవే! మరి నీవెక్కడున్నావు? నీవున్న ఆ పరమపదమెక్కడ? అంటే అది మా అంతరాత్మలోనే!
ముందుకు వెనకకు , పైకి కిందికి చూడకు నీలోకి నీవు చూసుకో … నీలోని పరమాత్మే నిన్ను ఈ సముద్రాలను దాటిస్తాడు. త్రిగుణాలకు అతీతుడైన ఆ పరమాత్మే నీకు పరమపదానికి దారి చూపిస్తాడు. మధ్యలోని ఆకర్షణలకు లొంగి పోవద్దు. దిక్కులు చూడవద్ద. ముందు వెనకలాలోచన అంతకంటే వద్దు. అన్నిటికీ ఆ నారాయణుడే దిక్కని నమ్ముకుంటే చాలు !
గడిచినది మారదు. రాబోయేది తెలియదు. నడుమన ఈ క్షణమే నీది. దాన్ని సద్వినియోగం చేసుకో!
పాపమేదో పుణ్యమేదో మన అంతరాత్మకు తెలుసు ! త్రిగుణాలలో ఏగుణం మంచిదో కూడ తెలుసు.
కానీ మనసుకు చాపల్యమెక్కువ!
కానిదానివైపే పరుగులు తీస్తుంది.
పాప పుణ్యాలకు , స్వర్గ నరకాలకు, త్రిగుణాలకు గల సంబంధం కూడ అన్నమయ్య సూచించాడు.
వీటన్నిటికీ అతీతమైనదే ధర్మవర్తన, కర్తవ్య నిర్వహణ! తామరాకుపై నీటిబొట్టులా దేన్నీ అంటించుకోని అంతరాత్మే పరమాత్మకు నిలయం!
ఇవన్నీ గ్రహించి సరైనది ఎంచుకోవడానికి ఆ నారాయణ నామమే శరణ్యం!
నామస్మరణమే ధన్యోపాయము !
స్వస్తి 🙏🏼
కం॥
నారాయణ నామంబును
నోరారగ భక్తితోడ నుడువుట చేతన్
దీరును కోరిన గోర్కెలు
జేరగ వచ్చును శ్రీహరి శ్రీచరణంబుల్ !
—————-
చిత్రం - శ్రీ Pvr Murty గారు
కృతజ్ఞతలు 🙏

8, జనవరి 2022, శనివారం

ఎన్నడు విజ్ఞానమికనాకు విన్నపమిదె శ్రీ వేంకటనాథా - అన్నమయ్య కీర్తన




 
చిత్రం : పొన్నాడ మూర్తి (self)

ఎన్నడు విజ్ఞానమికనాకు విన్నపమిదె శ్రీ వేంకటనాథా

బాసిన బాయవు భవబంధములు ఆస ఈ దేహమున్నన్నాళ్ళు
కోసిన తొలగవు కోరికలు గాసిలి చిత్తము కలిగినన్నాళ్ళు

కొచ్చిన కొరయవు కోపములు గచ్చుల గుణములు గలిగినన్నాళ్ళు
తచ్చిన తగలవు తహతహలు రచ్చలు విషయపు రతులన్నాళ్ళు

ఒకటికొకటికిని ఒడబడవు అకట శ్రీవేంకటాధిపుడా
సకలము నీవే సరణంటే ఇక వికటము లణగెను వేడుక నాళ్ళు

భావం : సౌజన్యం శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు 

మేము పెంచుకున్న ఈ బంధము లెటువంటే .. అవి పాసిన పాయవు.  (వదలించుకున్దామన్న వదలటం లేదు.) ఈ మానవ దేహం ఉన్నంతకాలం ఆశ చావదు. కోసి తొలగించు కావాలన్న కోర్కెలు తీరటంలేదు. వీటన్నిటివల్లా నా మనస్సు బాధ పడుతూనే ఉంటుంది.

 

ప్రభూ! గచ్చుల గుణములు (పై పై పూతల-వంటి నటనలు చూపించే గుణములు), కొచ్చిన గోరయవు (తగ్గించుకున్దామనుక్న్నా తాగుటలేదు) అందువల్ల నాలో సహజంగా వుండే  క్రోధం నన్ను వదలుటలేదు. (శాంతం నటించినా కోపంతో మనస్సు కుతకుత లాడుతూనే ఉన్నది).విషయపు రతులు (విషయ వాంఛలు) అన్ని రోజులూ ఎంత ప్రయత్నించినా  తొలగవు. అవి రచ్చలవుతూనే తహతహలాడిస్తాయి. (ఇది ఎంత చిత్ర హింస?)

 

ఓ వెంకతనాధా ! పైన చెప్పిన విరుద్ధ భావములన్నియును ఒకదానితో ఒకటి  సమాధాన  పడక ఉన్నాయి. అకట! దీనికి ఒకటే మార్గం కనిపిస్తోంది. ఇక సకలము నీవేనని శరణంటే వికతములు (దుర్గుణములు) తగ్గిపోతాయి. వేడుకనాళ్ళు నిత్యమూ ఉంటుంది.




2, జనవరి 2022, ఆదివారం

సురభి కమలాబాయి - charcoal pencil sketch


 సురభి కమలాబాయి, (1907 - 1971) -- తొలి తెలుగు సినిమా నటీమణి, గాయని. (Charcoal pencil sketch)


ఈమె 1931లో హెచ్.ఎం.రెడ్డి నిర్మించిన తొలి తెలుగు టాకీ చిత్రము భక్తప్రహ్లాద లో లీలావతి పాత్ర ధరించింది.

కమలాబాయి 1907లో సురభి నాటక కళాకారుల కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి కృష్ణాజీరావు. తల్లి వెంకూబాయి కమలాబాయితో గర్భవతిగా ఉండి ఒక నాటకములో దమయంతి పాత్ర వేస్తున్నప్పుడు పురిటినొప్పులు రాగా తెరదించి ఆ రంగస్థలంమీదే కమలాబాయిని ప్రసవించడం విశేషం. ప్రేక్షకులు ఇదికూడా నాటకంలో ఒక భాగమనుకొన్నారు. తీరా విషయం తెలిసిన తర్వాత ప్రేక్షకులు చంటిబిడ్డ మీద డబ్బుల వర్షం కురిపించారు.

రంగస్థల కుటుంబంలో పుట్టిన కమలాబాయికి చిన్నప్పటి నుండే నటన అలవాటయ్యింది. బాల్యంలో కృష్ణుని, ప్రహ్లాదుని పాత్రలు వేస్తుండేవారు. యుక్తవయసు వచ్చిన తర్వాత మగపాత్రలు ఆపేసి ఆడపాత్రలు ధరించడం ప్రారంభించింది. అందరూ మహిళలే నటించి విజయవంతమైన సావిత్రి నాటకంలో ఆమె సావిత్రి పాత్రను పోషించింది.

పలు చిత్రాలలో కథానాయకి పాత్రలు పోషించిన కమలాబాయి ఆ తర్వాత సినిమాలలో కారెక్టర్ రోల్సు వెయ్యటం ప్రారంభించి. ఈ విధంగా నటించిన సినిమాలలో పత్ని, మల్లీశ్వరి, లక్ష్మమ్మ, పాతాళభైరవి, సంక్రాంతి, అగ్నిపరీక్ష ముఖ్యమైనవి.

(సేకరణ : వికీపీడియా)

ముందు చూపు కలిగి - ఆటవెలది

ఎంత చక్కటి చిత్రమో 😍 ఆటవెలది // ముందు చూపు గలిగి ముందునిద్ర యనుచు  కన్ను మూసి మంచి కలలు గనుచు  హాయిననుభవించు రేయి పగలు  యంత దూర దృష్టి వింత...