23, జనవరి 2022, ఆదివారం

మత్స్య కూర్మ వరాహ మనుష్య సింహ వామనా... అన్నమయ్య కీర్తన


వారం వారం అన్నమయ్య - "మత్స్య కూర్మ వరాహ
మనుష్య సింహ వామనా..."
విశ్లేషణ సౌజన్యం : డా. Umadevi Prasadarao Jandhyala
చిత్రం " Pvr Murty
సహకారం : శ్రీమతి Ponnada Lakshmi
ముందుగా ఒక ప్రార్థన పద్యం
(శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రి గారిది)
కం॥
మీనము,కూర్మవరాహం
బానరహరి, వామనునిగ, భార్గవుగా, శ్రీ జానకి మగడుగ, కృష్ణుడు
జ్ఞానియు బుద్ధుండు పైన కల్క్యగు హరి!జే !
~~~~~~~~

కీర్తన :

మత్స్య కూర్మ వరాహ
మనుష్య సింహ వామనా
యిచ్చ రామ రామ రామ హితబుద్ధి కలికి

నన్ను గావు కేశవ నారాయణ మాధవ
మన్నించు గోవింద విష్ణు మధుసూదన |
వన్నెల త్రివిక్రమ వామనా శ్రీధరా
సన్నుతించే హృషీకేశ సారకు పద్మనాభ ||
కంటిమి దామోదర సంకరుషణ వాసుదేవ
అంటేజాలు ప్రద్యుమ్నుడా అనిరుద్ధుడా |
తొంటే పురుషోత్తమ అథోక్షజ నారసింహమా
జంటవాయకు మచ్యుత జనార్ధన ||
మొక్కేము వుపేంద్ర హరి మోహన శ్రీకృష్ణరాయ
యెక్కితి శ్రీ వేంకట మిందిరానాథ |
యిక్కువ నీ నామములు యివియే నా జపములు
చక్కగా నీదాసులము సర్వేశ అనంత॥

వివరణ
********
ఈ కీర్తనలో అన్నమయ్య తన ఇష్టదైవమైన శ్రీ వేంకట పతిని తనను కాపాడమంటూ ఆ జగన్నాథుడు సాధురక్షణకు, దుర్జన సంహరణకు ధరించిన దశావతారాలను ప్రారంభంలో తలుచుకుంటూ కల్పాంతాలలో జగత్తునే రక్షించిన వాడివి నన్ను బ్రోచుట నీకెంత పని స్వామీ అన్నట్లుగా వేడుకుంటున్నాడు. ఆ అవతారములివే!
‘మత్స్యకూర్మ వరాహ మనుష్యసింహ వామన, రామరామరామ హితబుద్ధి కలికి .’
*సంగ్రహ వివరణ

సత్యయుగంలో మత్స్యావతారం దాల్చి హయగ్రీవుడనే అసురుడినుండి వేదాలను రక్షించాడు. ఆ కల్పాంతంలో ఏర్పడిన జలప్రళయంలో సత్యవ్రతాదులున్న నావను తన ఒంటికొమ్ముతో లాగి రక్షించాడు. ఆయనకు ఈ మనలను భవజలధిని దాటించడం ఎంతపని!

కృతయుగంలో భూగోళాన్ని పట్టుకుపోయి పాతాళంలో దాచిన హిరణ్యాక్షుని ఆదివరాహావతారందాల్చి వానిని సంహరించి భూదేవిని రక్షించాడు।

అదితి కుమారుడై జన్మించి, వామననామంతో వటువు రూపంలో వచ్చి బలిచక్రవర్తి దేవతల విరోధిగా వారి సంపదలను దోచినందుకు, పాతాళానికి అణగద్కొక్కాడు . అప్పుడే మూడడుగులు దానమడిగి అవి ఇవ్వగానే మూడు అడుగులతో ముల్లోకాలు కొలిచి త్రివిక్రముడైనాడు.
ఇక త్రేతాయుగంలో పరశురాముడిగా మదాంధులైన క్షత్రియులను సంహరించాడు.

రఘుకులతిలకుడైన శ్రీరాముడై రావణ కుంభకర్ణాదుల రాక్షస సంహారం చేసాడు.
ద్వాపర యుగంలో హలాయుధుడైన బలరాముడై శ్రీకృష్ణునకు అగ్రజుడై దుష్టసంహారంలో భాగస్వామి అయినాడు. హితబుద్ధియైన బుద్ధునిగా కల్కి గా కలియుగమున! యుగయుగములందూ జగతిని కాపాడే తండ్రీ! నన్ను కాపడవయ్యా!” అని వేడుకున్నాడు.
**చరణములు - వివరణ
చరణాలలో మరిన్ని విధాల
అన్నమయ్య శ్రీవారిని కీర్తిస్తూ సంబోధించిన స్వామివారి కొన్ని నామాలను , స్వల్పంగా వాటి అర్థం తెలుసుకుంటూ పరిశీలిద్దాం.
*గోవిందా!(సకలజగత్తును పాలించే వాడా! గో, గోపాలక రక్షకుడా),
*ఓ విష్ణు మూర్తీ (సర్వ వ్యాపకుడ వైనవాడా) ,
*మధుసూదనా!(మధుకైటభుల నిర్జించిన వాడా)
*త్రివిక్రమా!( ముల్లోకములను మూడుఅడుగులతో కొలిచిన విక్రముడా)
*నారాయణా(సంసారమనే జలధిని తరింపజేసేవాడా, జలయానం చేసేవాడా,బ్రహ్మజ్ఞానము కలవాడా)
*మాధవా !( లక్ష్మీపతీ, సకలసంపదలకు అధిదేవత అయిన శ్రీలక్ష్మికి పతి అయిన వాడా)
*వామనా!( సూక్ష్మమైన ఆత్మస్వరూపుడా)
*శ్రీధరా( శ్రీని వక్షస్థలమున ధరించినవాడా)!*హృషీకేశా( ఇంద్రియములను నిగ్రహించు వాడా)!*పద్మనాభా( సృష్టికర్త బ్రహ్మకే జన్మస్థానమైన పద్మమును నాభియందుకలవాడా)!
*దామోదరా( శమదమాది లక్షణములు ఉదరమునందుకలవాడా! త్రాటితో యశోదమ్మచే ఉదరమును కట్టబడిన వాడా! ప్రేమకు కట్టుబడినవాడా)
*సంకర్షణా!( ఉపాసకుని దగ్గరకు చేర్చుకుని ఉద్ధరించే వాడా)
*ప్రద్యుమ్నా!( ధన బలములకు నిధానమైనవాడా)
*అనిరుద్ధా!( నిరోధింపగలవారు లేనివాడా)
*అధోక్షజా( ఊర్థ్వ ముఖపడవై ఎన్నడూ కిందకు జారనివాడా)
*ఉపేంద్రా!( వామనుడై అదితి కశ్యపులకు జన్మించడం వలన ఇంద్రుడికి సోదరుడైనవాడా)
*హరి!( సమస్త దుఃఖములు హరించే వాడా)
*శ్రీకృష్ణా!(అనంతమైన ఆకాశం వలే నల్లనివాడా)
*ఇందిరానాథా! (ఇందిర పదం సౌందర్యానికి, సంపదకు ప్రతీక . లక్ష్మి. ఆమెకు నాథుడా)
అంటూ
భక్తి పారవశ్యంతో అన్నమయ్య సర్వేశ్వరుడైన ఆ వేంకటపతి నామాలను జపిస్తూ, స్మరిస్తూ, కీర్తిస్తూ తనను మన్నించి,ఈ భవసాగరందాటించి దాసుడనైన తనను అనుగ్రహింపమని వేడుకుంటున్నాడు!
*****************
నరసింహ శతకం నుండి ఒక పద్యంతో స్వస్తి పలుకుదాం.
సీ.
గరుడవాహన! దివ్యకౌస్తుభాలం
కార!
రవికోటితేజ! సారంగవదన!
మణిగణాన్విత! హేమమకుటా
భరణ! చారు
మకరకుండల! లసన్మందహాస!
కాంచనాంబర! రత్నకాంచివిభూషిత!
సురవరార్చిత! చంద్ర సూర్యనయన!
కమలనాభ! ముకుంద గంగాధర
స్తుత!
రాక్షసాంతక! నాగ రాజశయన!
తే.
పతితపావన! లక్షీశ! బ్రహ్మజనక!
భక్తవత్సల! సర్వేశ! పరమపురుష!
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార!నరసింహ దురిత
దూర!
స్వస్తి 🙏
****************
డా. ఉమాదేవి జంధ్యాల
చిత్రం-శ్రీ Pvr Murtyగారు

కామెంట్‌లు లేవు:

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...