15, జనవరి 2022, శనివారం

నారాయణ నీ నామమె గతి యిఁక కోరికలు మాకుఁ గొనసాగుటకు - అన్నమయ్య కీర్తన

ఈ అన్నమయ్య కీర్తనకి   డా. ఉమాదేవి జంద్యాల  గారు  ఇచ్చిన విశ్లేషణ యధాతధంగా (ఈ చిత్రం  బాపు గారి చిత్రానికి నా రేఖలు రంగులతో  కొంతవరకూ అనుకరణ).  


ఓం నమో వేంకటేశాయ 🙏
ముందుగా ఒక ప్రార్థన పద్యం !
శా॥
శ్రీనారాయణ యన్నఁ జాలు దురితశ్రేణి న్నివారింపఁగా
నానందస్థితి గల్గు నంచు నిగమార్థానేక మెల్లప్పుడున్‌
నానాభంగులఁ జెప్ప నేను విని శ్రీనారాయణా యంచు ని
న్నే నే నెప్పుడు గొల్తు బ్రోవఁ గదె తండ్రీ నన్ను నారాయణా!
కీర్తన పాఠం
~~~~~~~~~
నారాయణ నీ నామమె గతి యిఁక
కోరికలు మాకుఁ గొనసాగుటకు
1)
పై పై ముందట భవ జలధి
దాపు వెనకఁ జింతా జలధి
చాపలము నడుమ సంసార జలధి
తేప యేది యివి తెగనీఁదుటకు
2)
పండె నెడమఁ బాపపు రాశి
అండఁ గుడిని పుణ్యపురాశి
కొండను నడుమఁ ద్రిగుణరాశి – యివి
నిండఁ గుడుచుటకు నిలుకడ యేది
3)
కింది లోకములు కీడునరకములు
అందేటి స్వర్గాలవె మీఁద
చెంది యంతరాత్మ శ్రీ వేంకటేశ నీ –
యందె పరమపద మవల మరేది
వివరణ నాకు తెలిసినంత
***************************
నారాయణ నామస్మరణ మహిమను
తెలిపే అనేక కీర్తనలలో ఒకటి నారాయణ నీ నామమె గతియిక!….
మనిషి అంతా నాగొప్పదనమే అనుకుంటాడు. కష్టాలు చుట్టుకున్న కాసేపు దేవుణ్ణి తలుచుకుంటాడు. మొక్కులు మొక్కుతాడు. బాధలు తీరితే భగవంతుడు గుర్తుకు రాడు.
బిడ్డకు ఆకలి వేసినప్పుడే అమ్మగుర్తుకు రావడం వలే ఉంటుంది మనిషి తీరు!
మా కోరికలు తీరాలంటే నారాయణా నీ నామమే గతిఇక!
గజేంద్రుడిలా చేతులెత్తేసే పరిస్థితిలో ఎవరికయినా ఆయనే గతి! అదే శరణాగతి!
( మా కోరికలు అంటే అన్నమయ్య వంటి మహా భక్తుల కోరిక మోక్షం. మనబోటి వారి కోరికలు కాదు.)
1)
ఎటుచూసినా సముద్రమే!
ముందుక చూస్తే పైపైన పడే భవసాగరం!
వెనకకు తిరిగితే దగ్గరగా దుఃఖ సాగరం!
మధ్యలో చలించే సంసార సాగరం!
వీటిని ఈదగల తెప్ప ఏది?
ఈ జలధులను దాటించగలది నీ నామమే అని అర్థం.
( ఈ పుట్టుకే ఒక సముద్రంలో పడటం వంటిది. ఉన్నా చింతే, లేకపోయినా చింతే. అన్నిటికీ బాధపడే ఈ మనసొక సముద్రం. ఇల్లు వాకిలీ, ఇల్లాలూ పిల్లలూ… ఇతరబంధాలు, సమస్యలు వంటి అలలపోటుతో కదిలిపోయే కడలి ఈ సంసారం! ఈ ప్రపంచం)
2)
ఇక ఎడమ పక్కకు చూస్తే పండిన పాపాల కుప్ప. కుడి వైపు చూస్తే అండగా పుణ్యాల రాశి!
మధ్యలో కొండంత సత్వరజస్తమోగుణాల కుప్ప!
ఇవి స్తిమితంగా, పూర్తిగా తెలుసుకొని అరిగించుకోడానికి తీరికేది? ఏది మంచో, ఏది చెడో , ఏది కావాలో, ఏది వదిలేయాలో తెలుసుకునే ఓర్పు నేర్పు మనిషికి లేదు .
3)
కింద నరకముంది. అందులో అంతా చెడే. అందేటట్లుగా స్వర్గముంది. కానీ అక్కడ నీవుండే పరమపదంలేదు. మరి అదెక్కడుంది? అది ఓ వేంకటేశ్వరా నీవే! మరి నీవెక్కడున్నావు? నీవున్న ఆ పరమపదమెక్కడ? అంటే అది మా అంతరాత్మలోనే!
ముందుకు వెనకకు , పైకి కిందికి చూడకు నీలోకి నీవు చూసుకో … నీలోని పరమాత్మే నిన్ను ఈ సముద్రాలను దాటిస్తాడు. త్రిగుణాలకు అతీతుడైన ఆ పరమాత్మే నీకు పరమపదానికి దారి చూపిస్తాడు. మధ్యలోని ఆకర్షణలకు లొంగి పోవద్దు. దిక్కులు చూడవద్ద. ముందు వెనకలాలోచన అంతకంటే వద్దు. అన్నిటికీ ఆ నారాయణుడే దిక్కని నమ్ముకుంటే చాలు !
గడిచినది మారదు. రాబోయేది తెలియదు. నడుమన ఈ క్షణమే నీది. దాన్ని సద్వినియోగం చేసుకో!
పాపమేదో పుణ్యమేదో మన అంతరాత్మకు తెలుసు ! త్రిగుణాలలో ఏగుణం మంచిదో కూడ తెలుసు.
కానీ మనసుకు చాపల్యమెక్కువ!
కానిదానివైపే పరుగులు తీస్తుంది.
పాప పుణ్యాలకు , స్వర్గ నరకాలకు, త్రిగుణాలకు గల సంబంధం కూడ అన్నమయ్య సూచించాడు.
వీటన్నిటికీ అతీతమైనదే ధర్మవర్తన, కర్తవ్య నిర్వహణ! తామరాకుపై నీటిబొట్టులా దేన్నీ అంటించుకోని అంతరాత్మే పరమాత్మకు నిలయం!
ఇవన్నీ గ్రహించి సరైనది ఎంచుకోవడానికి ఆ నారాయణ నామమే శరణ్యం!
నామస్మరణమే ధన్యోపాయము !
స్వస్తి 🙏🏼
కం॥
నారాయణ నామంబును
నోరారగ భక్తితోడ నుడువుట చేతన్
దీరును కోరిన గోర్కెలు
జేరగ వచ్చును శ్రీహరి శ్రీచరణంబుల్ !
—————-
చిత్రం - శ్రీ Pvr Murty గారు
కృతజ్ఞతలు 🙏

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...