వారం వారం అన్నమయ్య అంతరంగా... అన్నమయ్య కీర్తన
ఈ వారం కీర్తన : ప : అలమేలుమంగా హరియంతరంగా
~~~~~~~~🍁🍁~~~~
విశ్లేషణ డా. Umadevi Prasadarao Jandhyala
చిత్రలేఖనం : పొన్నాడ మూర్తి
ఓం నమో వేంకటేశాయ 🙏
🌻ప్రార్థన
*******
శ్రుత్యై నమోస్తు శుభకర్మఫలప్రసూత్యై
రత్యై నమోస్తు రమణీయగుణార్ణవాయై!
శక్త్యై నమోస్తు శతపత్రనికేతనాయై
పుష్ట్యై నమోస్తు పురుషోత్తమవల్లభాయై!!
🌻కీర్తన లిరిక్స్
************
ప : అలమేలుమంగా హరియంతరంగా
కలితనాట్య రంగా కరుణాపాంగా
చ : అలినీలవేణి అంబుజపాణి
వెలయగ జగదేక విభునిరాణి
చ : స్మి(శి)తచంద్రవదనా సింగార సదనా
చతుర దాడిమ బీజచయ సనా(రదనా)
చ : హితవైన శ్రీవేంకటేశుడిదే ననుగూడె(డునిన్నిదేకూడె)
ప(త)తి తలపోతల సమ(తన)కూడె కూడె
🔹కీర్తనకు అద్భుతమైన చిత్రం వేసిన ప్రఖ్యాత చిత్రకారులు శ్రీ పొన్నాడ మూర్తి గారికి కృతజ్ఞతలు 🙏
🌻కీర్తన సారాంశం తెలిసినంత
————————————
హరిఅంతరంగమే అలమేలు మంగ!
ఎంత అద్భుతంగా ఉంది ఈ వాక్యం!
భార్య భర్త అంతరంగాన్ని గ్రహించాలి. భర్త భార్యను తన అంతరంగంలో నిలుపుకోవాలి. భార్యాభర్తల అనుబంధం ఇలా ఉండాలి!
అలరు అంటే పద్మం . మేల్ అంటే పైభాగం. పద్మావతి, పద్మజ అని అర్థం. ఆ పద్మం శ్రీహరి హృదయపద్మమే. ఇంతకూ లక్ష్మీదేవి ఆయన వక్షస్థల నివాసిని ఎలా అయింది? దానికో కథ ఉంది.
శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి మీద ఎనలేని ప్రేమతో ఏదైనా కోరుకో మన్నాడట. “మీ ప్రేమకన్నా నాకు వేరే ఏంకావాలి” అన్నదట. నిజమే కానీ పరమేశ్వరానుగ్రహం కలిగితే మరింత మంచిదని శివుని గురించి తపస్సు చేయమని చెప్పాడట. లక్ష్మీ దేవి తపస్సు ప్రారంభిస్తూ వినాయకుని పూజించడం మరిచిపోవడంతో ఆమె మనస్సు లగ్నం చేయలేకపోతున్నదట. నారదుని సలహాతో గణపతిని ప్రార్థించినా ఫలితం లేకపోయింది. ఆ తరవాత ఆమెరుద్రహోమం జరిపింది. అందులోనుండి ఆకలి … ఆకలి అంటూ వచ్చిన ఒక భయంకరమైన అగ్నిరూపానికి తన ఎడమ రొమ్మును కోసి నివేదించింది. శివుడు అనుగ్రహించి ప్రత్యక్షమై ఆమె ఎప్పుడూ పతి వక్షస్థలంలో ఉండేలా వరమిచ్చాడు.
ఇవ్వాలి అనే సంకల్పం కలిగేది అంతరంగంలో. ఆ అంతరంగంలో సంపదలకు అధిష్ఠాన దేవత లక్ష్మీ దేవి ఉండటం వలననే స్వామి భక్తుల కోరికలు తీర్చగలుగుతున్నాడు. ఆమే లేకపోతే ఆయనకు ఇవ్వాలని ఉన్నా ఇచ్చేందుకు ఏమీ ఉండదన్నమాట!
అన్నమయ్య ఒక్క వాక్యంలో ఇంత విశేషముంది!
‘కలిత నాట్యరంగా!కరుణాపాంగా!’
లక్ష్మీ దేవి నట్టింట నాట్యం చేస్తోంది అంటుంటాం మనం. ఘల్లుఘల్లున లక్ష్మీ దేవి నడయాడితేనే సిరుల పంట. ఇక నాట్యం చేస్తే అశేష సంపద ప్రసాదించిందని అర్థం .
ఆ సంపద చూసి అహంకారం తలెత్తితే ఆమె శిరసున నాట్యం చేస్తుందట!
ఆమె కరుణాపాంగ! కంటి కొసల నుండి కృపతో చూస్తే చాలు. తరించి పోతాం.
కీర్తన చరణాలు చూద్దాం.
1)మొదటి చరణంలో అమ్మ అలమేలు మంగ అందాన్ని మనకు చూపుతున్నాడు అన్నమయ్య.
ఆమె నిడుపాటి నల్లని కురులు కలది. చేతిలో పద్మాన్ని పట్టుకొని వయ్యారంగా నిలబడింది.
‘పద్మం చుట్టూ ఏం ఉన్నా నువ్వు, నీమనసు స్వచ్ఛంగా ఉండాలి’ అనడానికి గుర్తు. పుట్టిన మకిల నుండి ఎదగడం నేర్చుకోమని చెప్పడానికే పద్మాన్ని ధరిస్తుంది.
అలాగే ఆరోగ్యానికి, మానసికమైన ఒత్తిడి లేనివారికి పొడవాటి కురులుంటాయి. ఆలోచనలతోటే జుట్టు ఊడిపోతుంది. స్త్రీత్వానికి, అందానికి, మానసిక బలానికి నిదర్శనం ఒత్తైన పొడవైన జుట్టు.
జగదేక విభుడైన నారాయణునికి అర్థాంగి కావడానికి ఎన్నో అర్హతలు గలతల్లి లక్ష్మీదేవి. అందుకే అన్ని విధాల గుణవతియైన, చూడగానే బాగున్న స్త్రీని మహాలక్మిలా ఉన్నావమ్మా అంటారు.
*రెండవ చరణంలో వర్ణింపబడిన లక్ష్మీ దేవి మహిళలకే మార్గదర్శకం. ఒక మంచి గృహిణి ఇలా ఉండాలి… అని చెబుతున్నట్లుంటుంది. మనసు హాయిగా ఉండాలంటే ఒకరకమైన కౌన్సిలింగ్ ఇది.
ఆమె వదనం ఎప్పుడూ చిరుదరహాసంతో శోభిస్తుంటుంది.అలా నవ్వినప్పుడు దానిమ్మ గింజలవంటి ఆమె పలువరస చూడముచ్చటగా ఉంటుంది. ఆమె భవనం ఎప్పుడూ అలంకరింపబడి కనులకింపుగా ఉంటుంది.
అందమైనదీ, అనుకూలవతి అయిన ఆ హృదయరాణిని గోవిందుడు గుండెలో పెట్టుకున్నా ఎప్పుడెప్పుడు ఆమె చెంత చేరుతానా అని ఆయన
మనసంతా ఆమెతలపులతో నిండిపోతుందిట!
ఉ॥
తామర చేతబట్టి కనుదామరలందుకృపాకటాక్షముల్
తామస హారియై బరపి, ధాన్యధనంబులు రాసిబోయదే!
శ్రీమహలక్షి నర్తనము జేయను సజ్జనులింట నెమ్మితో!
క్షేమము గూర్ప నాస్మితముఖిన్ నిరతంబును గొల్వగాదగున్!
( స్వీయ రచన)
స్వస్తి
~~~~~🙏🏼~~~~~~
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి