8, జూన్ 2022, బుధవారం

మేలుకో శృంగారరాయ మేటి మదనగోపాల" - అన్నమయ్య కీర్తన


 వారం వారం అన్నమయ్య .. ఈ వారం కీర్తన "మేలుకో శృంగారరాయ మేటి మదనగోపాల"

విశ్లేషణ డా. Umadevi Prasadarao Jandhyala
చిత్రం : పొన్నాడ మూర్తి
~~~~~🌺🌺~~~~~
ఓం నమోవేంకటేశాయ 🙏
ప్రార్థన
*******
ఉ॥
సుందర దివ్య విగ్రహము సూర్య శశాంక నిభాక్షియుగ్మ పా
రీంద్ర నిభావలగ్న పరిలిప్త సుగంధ నితాంత గాత్ర మా
నందమ యాభయప్రద ఘనద్యుతి హస్త వికాస మూర్తివే
నందిత పద్మగర్భ సురనాథ మహేశ్వర వేంకటేశ్వరా!
( శ్రీ పోచిరాజు కామేశ్వర రావు గారి పద్యం)
అన్నమయ్య శృంగార కీర్తనలలో ఒకటైన
‘మేలుకో శృంగారరాయ’ కీర్తన గురించి ఈ వారం చెప్పుకుందాం.
ద్వాపర యుగంలో దుష్టశిక్షణ , శిష్టరక్షణలకై దేవకీ వసుదేవులకు జన్మించి , యదుకుల శ్రేష్ఠులైన నంద యశోదల ముద్దుబిడ్డగా పెరిగిన హరికి కృష్ణుడని పేరు పెట్టినా అందరు పిల్లలలాగే గోవులను కాచి గోపాలుడైనాడు. గోవు అంటే ఆవు అనేగాక కిరణము, సూర్యుడు, భూమి, స్వర్గము వంటి అనేకార్థాలున్నాయి. వీటన్నిటినీ పాలించినవాడు అనికూడ అర్థం. గోవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు. కనుక దేవతలకందరికీ అధిపతి అనే అర్థంకూడ వస్తుంది.
మువ్వలు ధరించి మువ్వగోపాలుడిగా, వేణువునూదుతూ వేణుగోపాలుడిగా, నందుని కొడుకుగా నందగోపాలుడిగా,
యశోదయింట ముద్దులొలికిన బాలగోపాలుడిగా ,గోపికల హృదయాలను దోచుకొని మదనగోపాలుడిగా మనం పిలుస్తుంటాం.
అన్నమయ్య అనేక ఆలయాలను దర్శిస్తూ అక్కడ తనకు కలిగిన అను భూతిని పాటగా వ్రాసి పాడుకున్నాడు.
తిరుపట్లలోని మదనగోపాలస్వామిని దర్శించిన అన్నమయ్యకు, గోపికలతో రాసకేళి జరిపిన గోపాలుడు, అష్ట భార్యలతో శృంగార సామ్రాజ్యాన్నేలి అలసి సొలసి నిదురిస్తున్నట్లనిపించి మేలుకోవయ్యా మదనగోపాలా ! అంటూ అందుకునినాడు కీర్తన!
కీర్తన లిరిక్స్
~~~~~~~
మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల
మేలుకోవె నాపాల ముంచిన నిధానమా
సందడించే గోపికల జవ్వనవనములోన
కందువదిరిగే మదగజమవు యిందుముఖి సత్యభామ హృదయ
పద్మములోని గంధము మరిగినట్టి
గండు తుమ్మెద
గతిగూడి రుక్మిణికౌగిట పంజరములో
రతిముద్దు గురిసేటి రాచిలుకా
సతుల పదారువేల జంట కన్నులఁ గలువలు
కితమై పొదిమిన నా యిందు బింబమ
వరుసంగొలనిలోని వారి చన్నుఁగొండలపై
నిరతివాలిన నా నీలమేఘమా
శిరనురమున మోచి శ్రీవేంకటాద్రి మీద
గరిమ వరాలిచ్చే కల్పతరువా!
వివరణ నాకు తెలిసినంతలో
************************
అన్నిటిలోనూ మేటియైన వాడే కృష్ణమూర్తి! ఆయన వంటి అందగాడు, వీరుడు, దయాళువు, గురువు, స్నేహితుడు, సలహాదారు, రక్షకుడు మార్గనిర్దేశకుడు….ఇంకెవరున్నారు? అలాగే శృంగారంలోనూ ఆ జితమన్మధాకారునికి సరితూగే వారు లేరు.
ఆ ప్రేమకోసమే కదా గోపికలంతా తమ ప్రాకృతిక జీవనాన్ని మరిచి వెంటపడ్డారు. ఆ స్వామి ఆలింగనం కోసమే కదా తమ సంసారాలను మరిచిపోయారు. ఆ మనోహరుని చుంబన రుచి కోసమే కదా తహతహలాడారు!
తననంతగా ప్రేమించి, కామించి, నిరంతరం తనసన్నిధి కావాలని కోరుకునే ఆ గోపికలెవరు?
కృష్ణుడు పరమాత్మ! కాబట్టి యోగ్యత లేని వారి ముద్దుముచ్చటలు
తీరుస్తాడా! ఊహూఁ….
ఆ గోపికలంతా పరమ యోగులు! హరిసన్నిధికై దిగివచ్చిన దివ్యులు! తానిచ్చిన మాట ప్రకారం తన భక్తులకు ద్వాపరయుగంలో ప్రణయసుఖాన్ని అందించాడు భక్త వత్సలుడు!
చిత్రకారుడు శృంగారాన్ని చిత్రించడానికి ఎలాగైతే వెనుకాడడో అలాగే మహా భక్తుడైన అన్నమయ్య భగవంతుని శృంగారాన్ని కీర్తించడానికి వెనుకాడలేదు. ఈ రసకేళిలోని ఆధ్యాత్మిక రహస్యాలను పెద్దలు చాలా మంది వివరించారు. మనం కేవలం భావం చూద్దాం. ఇది ప్రాపంచికమైనది కాదని గ్రహించి, ఆంతర్యాన్ని వెతకండి.
అర్థం
****
నా పాలిటి పెన్నిధివైన స్వామీ…. నను పాలముంచిన ( నాకు మేలు కలిగించే) స్వామీ! శృంగారరాయా! మేలుకో !
నేలమీద కాలునిలవని వయసే యౌవనం . జవ్వనుల యౌవనాల తోటలోకి చేరి నేర్పుగా మంతనాలాడుతూ తిరిగే మదకరివి నీవు! ( మదగజం ఎలాగయితే ఆడ ఏనుగులను తన అదుపులోకి తెచ్చుకొని క్రీడిస్తుందో అలా క్రీడించడానికి వచ్చిన వాడు) మేలుకో!
అందమైన చందమామ వంటి మోము గల భామ సత్యభామ.శ్రీకృష్ణుని తన అనురాగంతో తనచుట్టూ తిప్పుకున్న భార్య. ఆమె హృదయపద్మం వెదజల్లే సుగంధాన్ని మరిగిన గండు తుమ్మెదవు నీవు! మేలుకోవయ్యా!
వలచి నీతోవచ్చిన వనిత రుక్మిణీ దేవి. అష్టమహిషులలో నేగాదు భక్తిలోనూ రక్తిలోనూ కూడ ప్రథమురాలు. ఆమె కౌగిలి అనే పంజరంలో ముద్దులు కురిసే రాచిలుకవు నీవు! మేలుకో!
నరకాసురుడు బంధించిన పదహారు వేల మంది రాచకన్నెలను వివాహమాడి లోకంలో వారికి చెరపట్టబడిన ముద్ర తొలగించి వివాహితల స్థానాన్ని, గౌరవాన్ని కలిగించాడు కృష్ణుడు. ఆయన అపారమైన కరుణకు తమహృదయాలనర్పించారు. పదహారువేలమంది కళ్ళూ కలువలై ఈ చందమామకోసం ఎదురు చూస్తుంటే ఆ ముప్పది రెండువేల కలువలకు హితము కలిగించి వాటిలో తనను నిలుపుకునేటట్లు చేసిన ఇందువదనుడవు నీవు గోపాలా మేలుకో!
కృష్ణుడొక నీలమేఘం. మేఘాలు కొండలను కమ్ముకోవడం ప్రకృతి ధర్మం. అవసరం కూడ. ఇక్కడ ఈ నీలమేఘుడు కొలనులో జలకాలాడే గోపికల స్తనగిరులను ఆక్రమిస్తున్నాడు. అనుగ్రహాన్ని వర్షించడానికి!
ఓ భక్తవత్సలా మేలుకో!
ఇప్పుడు వేంకటాద్రిపై భాగ్యదేవత సిరిని నీ వక్షస్థలాన మోస్తూ భక్తులకు కోరిన వరాలిచ్చే కల్పవృక్షమా మేలుకో!
దర్శించే వారంతా భక్తులు కారు కాబట్టి స్వామి కోరిన ప్రతివారి కోరికలూ తీర్చడు.
గోపికలు ఆయననెంతగా ఆరాధించారో..
తపించారో ఆ విధంగా భగవంతుని నమ్మాలి… ప్రేమించాలి. రతి అంటే కోరిక! అది భగవంతుని చేరాలనే అలౌకికమైన కామంగా పరిణతి చెందినప్పుడు స్వామి అనురాగం దక్కుతుంది.

స్వస్తి 🙏
~~~~~~~~~~~

కామెంట్‌లు లేవు:

The power of 'Will' Usage - English grammar - illustration

  When we use will to make a promise 🤝 or an offer 💡, we are usually deciding to do something at the very moment we are speaking. It shows...