ఈ వారం అన్నమయ్య కీర్తన :
ఆకటి వేళల అలపైన వేళల
తేకువ హరినామమే దిక్కు మరి లేదు
చెఱవడి వొరుల చేజిక్కినవేళ
వొఱపైన హరినామమొక్కటే గతి గాక
మఱచి తప్పిననైన మఱి లేదు తెరగు
ఆపద వచ్చిన వేళ ఆరడి బడిన వేళ
పాపపు వేళల భయపడిన వేళ
వోపినంత హరినామ మొక్కటే గతి గాక
మాపు దాకా పొరలిన మరిలేదు తెరగు
సంకెల బెట్టిన వేళ చంప బిలిచిన వేళ
అంకిలిగా నప్పుల వారాగిన వేళ
వేంకటేశు నామమే విడిపించ గతినాక
మంకు బుద్ది పొరలిన మరిలేదు తెరగు
భావం : సౌజన్యం - 'సాహిత్య శిరోమణి' సముద్రాల లక్షణయ్య
ఆకలి కలిగినప్పుడు, శ్రమకు లోనైనప్పుడు, ధైర్యము చేకూర్చి రక్షించునది శ్రీహరినామ మొక్కటె. అది తప్ప మరొక దిక్కులేదు.
తాని ఎందొకు కొరగాని దుస్థితి ఏర్పడినప్పుడు, కులము చెడినప్పుడు, ఇతరులచే చెరలో బంధింపబడి కృశించినప్పుడు, రకసమానమైన (దృఢమైన) హరినామ మొక్కటే గతి, దానిని మరచినచో మరొక గతి లేదు.
ఆపద గలిగినప్పుడు, నిందకు లోనైనప్పుడు, పాపము పైకొన్నప్పుడు, భపడినప్పుడు చాలినంతగా స్మరింపబడిన హరినాం మొక్కటె గతి. దానిని విడిచి కడవరక్ ప్రయత్నించినను ఆ దుర్ధశలనుండి కాపాడుటకు మరొక మార్గము లేదు.
శత్రువులు సంకెళ్ళతో బంధించినప్పుడు, చంపుటకు బిలిచినప్పుడు, అప్పులవారు అడ్డ్గగించి నిలదీసినప్పుడు విడిపించుటకు శ్రీ వేంకటేశ్వరుని నామ మొక్కటే ఉపాయము. దానిని వదలి మూర్ఖత్వముతో ఎంత ప్రయత్నించినను మరొకదారి లేనే లేదు.
(చిత్రం : పొన్నాడ మూర్తి)