16, సెప్టెంబర్ 2017, శనివారం

విప్రనారాయణ - Akkineni Nageswara Rao


నా పెన్సిల్ చిత్రం - 'విప్రనారాయణ' గా అద్భుత నటన ప్రదర్శించిన అక్కినేని చిత్రం వేయాలనిపించింది. ప్రయత్నించాను. facebook లో మంచి స్పందన లభించింది. నా చిత్రాలను చూసి అభినందిస్తున్న మిత్రులందరికీ ధన్యవాదాలు.

8, సెప్టెంబర్ 2017, శుక్రవారం

ఆలోచనలు...ఆలోచనలు



కవిత courtesy : శ్రీమతి పొన్నాడ లక్ష్మి
ఆలోచనలు...ఆలోచనలు
అంతూ దరీ లేని ఆలోచనలు.

కన్నపిల్లల వ్యధలను తీర్చలేక
చేయూతనివ్వలేని అసహాయపు ఆలోచనలు..

ప్రమాదాలకు బలిఅయి, వందలాది ప్రయాణీకుల
హా..హా..కారాల తలపులతో ఆలోచనలు..

బోరుబావిలో పడి ఉక్కిరిబిక్కిరై, అయోమయావస్థలో
తుది శ్వాస విడిచిన చిన్నారుల గురించి ఆలోచనలు..

చెత్తకుండీలలో, మురుగు కాల్వలలో విసరివేయబడిన
పురిటికందుల ఆక్రందనలపై ముసురుకొనే ఆలోచనలు..

క్రూర రాక్షసుల కబంధ హస్తాలలో చిక్కుకొని, తమ
మాన ప్రాణాలను అర్పించుకున్న అబలల ఆర్తిపై ఆలోచనలు..

మందుమైకంలో దారితప్పి ప్రమాదాలకు గురై
తమని తామే ఆహుతి చేసుకుంటున్న యువతపై ఆలోచనలు..

వరద భీభత్సంలో సర్వం కోల్పోయి, నిలువనీడలేక
నిరాశ్రయులైన బడుగుజీవుల బతుకులపై ఆలోచనలు..

ఎవరినీ ఆదుకోలేక, ఆపన్న హస్తం అందించలేక.
జోరీగల్లా ముసిరే ఆలోచనలతో,
నిదుర లేని రాత్రులు ఎన్నో? ఎన్నెన్నో??

- పొన్నాడ లక్ష్మి

3, సెప్టెంబర్ 2017, ఆదివారం

బాపు బొమ్మ - నా రేఖలు రంగుల్లో చిత్రీకరణ

బాపు గారికి స్త్రీలు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం కాబోలు. నిజానికి స్త్రీలే పుస్తకాలు పఠించేవారు.  బాపు గారు అటువంటి చిత్రాలు వేసారు. నా సేకరణ లో కొన్ని ఉన్నాయి. అవి పాతపడడం వల్ల పాడయిపోయి. వాటిని మళ్ళీ చిత్రీకరించి రంగులు అద్దే ప్రయత్నంలో ఉన్నాను. ఈ చిత్రం కూడా అటువంటిదే.

30, ఆగస్టు 2017, బుధవారం

'బాపు' కి శ్రధ్ధాంజలి



నా కుంచెనుండి 'బాపు' గారి చిత్రం. వారికి నా శ్రధ్ధాంజలి.
బాపు గారు వేసిన చాలా చిత్రాలు చూసాను. ఆడపిల్లలు పుస్తక పఠనం లో ఆసక్తి చూపాలన్నట్లుగా చాలా బొమ్మలు నాకు కనిపించాయి. ఆడపిల్లలకి కూడా చదువు ముఖ్యం అన్న భావన వారి చిత్రాల్లో కనిపిస్తుంది.

28, ఆగస్టు 2017, సోమవారం

గిడుగు వెంకట రామ్మూర్తి - పెన్సిల్ చిత్రం



గిడుగు వెంకట రామ్మూర్తి - పెన్సిల్ చిత్రం
మిత్రులందరికీ 'తెలుగు భాషా దినోత్సవ' శుభాకాంక్షలు.
తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు, గిడుగు వెంకట రామమూర్తి (ఆగష్టు 29, 1863 - జనవరి 22, 1940) . గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమంవల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది. గిడుగు రామ్మూర్తి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం”గా జరుపుకుంటున్నాము. (వికీపీడియా నుండి సేకరణ)

21, ఆగస్టు 2017, సోమవారం

పునీతమైనదమ్మ పురుష జన్మా...





మగాడు మృగాడా .. ? (Courtesy : భరణి చిత్రలేఖ)
భరణి చిత్రలేఖ గారి ఆలోచన కి నా బొమ్మ. ఇంత మంచి రచన అందించినందుకు ఆమెకి నా అభినందనలు. శుభాశీస్సులు
"పునీతమైనదమ్మ పురుష జన్మా.....
ఆ జన్మకు పరిపూర్ణత ఇంటాయనమ్మా....!
ఔనూ......నాకర్థం కాక అడుగుతాను.. ఎందుకూ ఊరికే తప్పు చేసిన మగాళ్లను "మృగాళ్లు"...."క్రూర మృగాలు" అని ఆడిపోసుకుంటారు???
దీన్ని నేను ఆకురాయి మీద అరగంట సానబెట్టిన చురకత్తితో ఖండిస్తున్నా!!
జంతువులు జంతువులే! అవెలా కృూరమైనవి చెప్పండి.మనం దేవుని సృష్టిని నమ్మితే అవి శాకాహారులుగా కొన్ని..మాంసాహారులుగా కొన్ని సృష్టించబడినాయి.వేట వాటికి ప్రకృతి నిర్దేశించిన ధర్మం...అదీ ఆకలేసినపుడు మాత్రమే !
ఏ జంతువు మరొక
జంతువును "ఈవ్ టీజింగ్" చేసి కామెంట్లు చేసి ఏడిపించింది?
ఏ మృగం మరొక మృగంపై యాసిడ్ పోసి చావుకీ బతుక్కూ కాకుండా చేసింది?
ఏ మృగం కట్నకానుకల కోసం కిరసనాయిలు మీద పోసి తగలెట్టింది?
ఏ జంతువు మిగతా జంతువులను బలహీనమని ఎంచి వాటి మీద ఆధిపత్యానికి ఆరాట పడింది?
ఏ మృగం చూపులతో మాటలతో చేతలతో మరో జాతిని హింసించి పైశాచికానందం పొందుతుంది?
లేదే..మరెందుకు మృగాడూ అని పోలిక ...అవమానం కాకపోతే!!
వాళ్లని మృగాడూ అనే ముందు మరో యాంగిల్
ఏ జంతువు పక్కింటావిడ పచ్చని కాపురం చూసి కుళ్లి కుళ్లి ఏడ్చేది?
ఏ జంతువు దాని జాతికి అసూయే అలంకారమనే బిరుదు తెచ్చుకుంది?
ఏ జంతువు సూటిపోటి మాటలనాయుధాలుగా మలచి సాటి జంతువును హింసిస్తుంది?
ఏ జంతువు కూతురికి కోడలికి అల్లుడికి కొడుక్కి సెపరేట్ రూల్స్ పెట్టేస్తుంది?
ద్యావుడా!!? ఇన్ని లక్షణాలు మనలో పెట్టేసుకుని వాటి పేర్లతో తిట్టుకోడమేమీ??
కాబట్టి భరణీ..
క్రూర జంతువులూ మృగాలూ లేవు..కృూర మనుషులే ఉంటారు..
ఈ క్షణం నుండీ జీవితంలో ఎవరిని తిట్టాలనిపించినా లింగభేదంతో నిమిత్తం లేకుండా జంతువులతో పోలిక వాడనని...
సామాన్య జంతువులైన వాటిని అవమానించనని
సాంఘిక జంతువుగా....ఎదుటనున్న జిరాఫీ సాక్షిగా ప్రతిన బూనుతున్నాను !"

పాలగుమ్మి పద్మరాజు -- రచయిత

 పాలగుమ్మి పద్మరాజు రచయిత -  పెన్సిల్ స్కెచ్ పాలగుమ్మి పద్మరాజు ( జూన్ 24 , 1915 - ఫిబ్రవరి 17 , 1983 ) ప్రముఖ తెలుగు రచయిత, కేంద్ర సాహిత్...