కం.
రంగైన విగ్రహంబున్,
బొంగుదు రెవరైన గనిన పూర్తిగ వశమై
ఖంగున మ్రోగెడి కంఠము
రంగా రావునకు సాటి రారెవ్వరిలన్ (పద్య రచన శ్రీ వెంకటేశ్వర ప్రసాద్)
ఎస్వీ రంగారావు జయంతి నేడు. ఆ మహానటునికి నివాళి అర్పిస్తూ నా పెన్సిల్ చిత్రం.
సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు ఎస్వీ రంగారావు పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు (జులై 3, 1918 - జులై 18, 1974). నట యశస్విగా పేరు పొందిన ఈ నటుడు మూడు దశాబ్దాలపాటు మూడొందల చిత్రాలకు పైగా అద్భుతంగా నటించి ఘటోత్కచుడిగా, కీచకుడిగా, రావణాసురుడిగా తనకు తానే సాటిగా ఖ్యాతి గడించాడు. ఆయా పాత్రలలో ఆయన ఎంత మమేకమై పొయ్యరంటే, వేరెవరు కూడా ఆ పాత్రలలో ఇప్పటివరకు ఇమడ లేకపొయ్యారు.
బి.వి.రామానందం దర్శకత్వంలో నిర్మించిన వరూధిని చిత్రంలో ప్రవరాఖ్యుడిగా తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయమయ్యాడు. తన తొలి సినిమాలో పాత్ర పోషించినందుకు గాను రూ.750 పారితోషికంగా అందుకున్నారు.
ఆ తర్వాత మనదేశం, పల్లెటూరి పిల్ల, షావుకారు, పాతాళభైరవి, పెళ్ళి చేసి చూడు, బంగారుపాప, బాలనాగమ్మ, గృహలక్ష్మి, బాల భారతం, తాతా మనవడు ఇలా అనేక చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి తన అద్భుత నటనాచాతుర్యంతో సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాడు.
నటసామ్రాట్, విశ్వనట చక్రవర్తి మొదలగు బిరుదులతో తెలుగు ప్రేక్షకులు ఆయన్ను గౌరవించారు. ఎస్వీయార్ నటించిన నర్తనశాల ఇండొనేషియాలోని జకార్తాలో ఆఫ్రో-ఆసియాఅంతర్జాతీయ చిత్రోత్సవములో ప్రదర్శించబడడమే కాకుండా కీచకపాత్రకు గాను ఎస్వీయార్ అప్పటి ఎన్నో చిత్రాల కథానాయకులను వెనుకకు నెట్టి భారతదేశం నుంచి తొలి అంతర్జాతీయ ఉత్తమ నటుడుగా బహుమతి పొందాడు. కొన్ని చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించాడు. ముఖ్యంగా ఆయన దర్శకత్వం వహించిన చదరంగం చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వ బహుమతి, నగదు పారితోషికం లభించాయి.
- రంగారావు దర్శకత్వం వహించిన మొదటిచిత్రం 'చదరంగం' ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డును, రెండవ చిత్రం 'బాంధవ్యాలు' తొలి ఉత్తమ చిత్రంగా నంది అవార్డునుగెలుచుకున్నాయి.
- నర్తనశాల చిత్రంలో నటనకు ఇండోనేషియా ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటుడి అవార్డు, అదే పాత్రకు రాష్ట్రపతి అవార్డు అందుకున్నాడు.
- ఎస్.వి.రంగారావు ప్రతిభను గురించి, వైవిధ్యమైన పాత్రల పోషించగల నైపుణ్యం గురించి ప్రసిద్ధ దర్శకుడు చిత్రకారుడు, బాపువేసిన చిత్రానికిముళ్ళపూడి వాఖ్యానం ఇలా చమత్కారంగా వ్రాశారు.
- క్లిష్టపాత్రల్లో చతురంగారావు
- దుష్టపాత్రల్లో క్రూరంగారావు
- హడలగొట్టే భయంకరంగారావు
- హాయిగొలిపే టింగురంగారావు
- రొమాన్సులో పూలరంగారావు
- నిర్మాతల కొంగుబంగారావు
- స్వభావానికి 'ఉంగారంగారావు
- కథ నిర్బలం అయితే హావభావాలు పాత్రపరంగారావు
- కళ్ళక్కట్టినట్టు కనబడేది ఉత్తి యశ్వీరంగారావు
- ఆయన శైలీ ఠీవీ అన్యులకు సులభంగారావు
- ఒకోసారి డైలాగుల్లో మాత్రం యమకంగారంగారావు
- 2013 లో భారత సినీ పరిశ్రమ వందేళ్ళ సందర్భంగా విడుదలయిన తపాళాబిళ్ళలలో ఒకటి ఎస్వీ రంగారావు మీద విడుదలయింది.
- (వికీపీడియా నుండి సేకరణ)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి