31, డిసెంబర్ 2021, శుక్రవారం

ఉయ్యాల బాలునూచెదరు కడు నొయ్య నొయ్య నొయ్యనుచు - అన్నమయ్య కీర్తన


అన్నమయ్య కీర్తన : "ఉయ్యాల బాలునూచెదరు కడు నొయ్య నొయ్య నొయ్యనుచు"

విశ్లేషణ డా. Umadevi Prasadarao Jandhyala
చిత్రం : Pvr Murty
సహకారం : శ్రీమతి పొన్నాడ లక్ష్మి
🌷ముందుగా హరిస్తుతి
ఉ॥
తోయజనేత్ర! భక్తజన తోయజ మిత్ర! రమాకళత్ర! ది
వ్యాయుధ నీలగాత్ర! మునివర్గ పవిత్ర! పురారిమిత్ర! కౌంతేయ సహాయమాత్ర! నగధీర విరించి సుపుత్ర! భవ్యనా
రాయణ హేమసూత్ర! సువిరాజిత వేంకట శైలనాయకా !
(వేంకట శైలనాయక శతకం )
ఈ వారం అన్నమయ్య కీర్తన
~~~~~>>>🌺<<<>>>~~~~
ప|| ఉయ్యాల బాలునూచెదరు కడు
నొయ్య నొయ్య నొయ్యనుచు || ఉయ్యాల బాలునూచెదరు ||
చ|| బాల యవ్వనలు పసిడి ఉయ్యాల
బాలుని వద్దపాడేరు
లాలి లాలి లాలి లాలెమ్మ
లాలి లాలి లాలనుచు || ఉయ్యాల బాలునూచెదరు ||
చ|| తమ్మిరేకు కను ద మ్ముల నువ్వుల
పమ్ముజూపులబాడేరు
కొమ్మల మట్టెల గునుకుల నడపుల
ధిమ్మి ధిమ్మి ధిమ్మినుచు || ఉయ్యాల బాలునూచెదరు ||
చ|| చల్లుచూపుల జవరాండ్లురే
పల్లె బాలుని పాడేరు
బల్లిదు వేంకటపతి జేరందెలు
ఘల్లు ఘల్లు ఘల్లనుచు || ఉయ్యాల బాలునూచెదరు ||
భక్తుడు భగవంతుని అనేక విధాలుగా సేవించుకుంటాడు. శ్రీవారి నిత్య సేవలలో డోలోత్సవం పవళింపు సేవ ఉన్నాయికదా!
వాగ్గేయకారుడైన అన్నమాచార్యులవారు
వ్రేపల్లె లోని చిన్నశిశువు ను గోప కాంతలు ఉయ్యాల ఊపుతున్న దృశ్యం మనకు పాటగా అందించారు.
డోలాయాంచల డోలాయాం…
అలరుచంచలమైన ఆత్మలందుండ..
లాలనుచు నూచేరు లలనలిరుగడల ..
ఉయ్యాల నూపులు ….
చందమామరావో జాబిల్లి రావో ….
ఉయ్యాల బాలు నూచెదరు ….
ఇలా అన్నమయ్య ఆ పరంధామునికి లాలిపాటలు అనేకం వ్రాసారు. వాటిలో ఒకటైన ఉయ్యాల బాలునూచెదరు… పాట గురించి చెప్పుకుందాం.
దేవకీ నందనుడు యశోద పురిటి పక్కలోకి చేరాడుకదా! ఈ మార్పంతా గుట్టు చప్పుడుగా జరిగిపోయింది. వ్రేపల్లెకు పెద్ద అయిన నందుని యింట వెలసిన ఆ పసిబాలుడిని ఉయ్యాల తొట్టిలో వేసి ఊపుతూ తల్లి యశోద, గోపెమ్మలు పాటపాడుతున్నారు. ఒయ్య … ఒయ్య అంటూ ఒక్కో ఊపూ ఊపడం… మధ్యమథ్య పలకరించడం ఎలా ఉందంటే ….
లాలీ లాలీ లాలెమ్మ లాలీ అని ఆ గొల్ల యువతులు పసిడి ఉయ్యాల ఊపుతున్నారు.
ఆయువతుల కనుదమ్ములు నవ్వులొలుకుతూ తమ్మిరేకలను అతిశయిస్తున్నాయి. పద్మదళాలు అందంగా ఉంటాయి కానీ వాటికి నవ్వడం రాదు. వీరి కళ్ళకు తామరరేకలవంటి అందమేగాక నవ్వగల శక్తీ ఉంది మరి!
ఉయ్యాల ఊపుతుండగా వాళ్ళ గునుకుల నడకలకు కాళ్ళు కదిలినప్పుడు వ్రేళ్ళ మట్టెల సవ్వడి థిమిథిమ్మని పాటకు తగినట్లు లయబద్ధంగా తాళం వేస్తున్నట్లుంది.
ఉయ్యాల ఊపుతో పాటు త్వరత్వరగా కదలడాన్ని గునుకు అంటారు . పరుగువంటి నడకని అర్థం.
ఆ జవరాళ్ళవి చల్లు చూపులు … అంటే ప్రసరించే , కాంతిమంతమైన చూపులు.
ఉయ్యాలతో పాటు ఆ పసివాడు ఎంతదూరం కదిలితే అంతదూరమూ ఆ చూపులు పరిగెడుతున్నాయి. విస్తరిస్తున్నాయి.
ఆ ఊయలలో చూడటానికి బాలుడేగానీ బల్లిదుడు అంటూ ఆయన ఘనతను , బలాన్ని గుర్తు చేసాడు అన్నమయ్య! జగత్తునే ఊపగల వాడు ఉయ్యాలలో ఊగుతున్నాడు. ఏమీ ఎరగని బుల్లి బుజ్జాయిలా నవ్వులు చిందిస్తున్నాడు.
మెడలో హారాలు ( చేరులు) కాళ్ళ అందెలు గలగలమనేటట్లు ఆ గోపెమ్మలు చిన్న కృష్ణుని ఉయ్యాల లూపుతున్నారు.
నాడు వ్రేపల్లెలో ఊయలలూగిన చిన్న శిశువే ఈ వేంకట పతి!
**************
తే.గీ
భూమి భారము బాపగ భువిన బుట్ట
యూపి నారయ్య యుయ్యాల నువిద లిట్లు
లీలలెన్నగ వశమె గోపాలబాల!
నీల మేఘశ్యామ! ముకుంద! నీకు జయము!
స్వస్తి! 🙏
~~~~~~
అర్థాలు
ఒయ్య ఒయ్య- ఊపేటప్పుడు అనే అలవాటు పదం
కనుదమ్ములు- కన్నులనే పద్మములు
పమ్ము- అతిశయము
గునుకుల నడకలు- చిన్న పరుగువంటి నడక

16, డిసెంబర్ 2021, గురువారం

బాపురే అనిపించుకున్న తెలుగువాడు 'బాపు'


చిత్రకారులు బాపు .. నా pencil చిత్రం.                            

బాపు గారు బొమ్మలు వేస్తారు. ఇది తెలుగువారందరికీ తెలిసిన విషయమే. కానీ వీరు ఎంత అధ్భుత చిత్రకారులో భారతీయులందరికీ తెలియదు కారణం బాపు తెలుగువాడు అంటాను నేను.      తెలుగుదనంలో  ఎంత ధనం ఉందో బాపు  వేసిన బొమ్మలు చూస్తేగాని తెలియదు.

బాపు గారు సినిమాలు కూడా తీస్తారు. సినిమాల్లో పాత్రలు, వాటి కదలికలు సహజంగా ఉంటాయి. Make ups కూడా సహజంగా ఉండాలని వారి అభిప్రాయం కాబోలు.. ఓవర్ make ups, బుట్ట విగ్గులు వీరి సినిమాల్లో కనిపించవు. బాపు గారి గురించి చెప్పాలంటే చాలానే ఉంది. వారి గురించి సమగ్రంగా శోధించి రాసిన  వ్యాసం ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చదవండి. ఇన్ని వివరాలు అందించిన 64  కళలు పత్రిక వారికి నా ధన్యవాదాలు. 


సి. హెచ్. ఆత్మ - అధ్భుత గాయకుడు


 సి హెచ్ ఆత్మ (charcoal పెన్సిల్ స్కెచ్) 


విరహవేదనలో ఉన్న పద్మినికి రేడియో లో "ప్రీతమ్ ఆన్ మిలో...ప్రీతమ్ ఆన్ మిలో దుఖియా జియా బులాయే ప్రీతమ్ ఆన్ మిలో' అనే పాట వినిపిస్తూ ఉంటుంది. నేను ఎప్పుడో చూసిన అలనాటి 'కాజల్' సినిమాలో దృశ్యం ఇది. ఆ సన్నివేశానికి, ఆమె మానసి కి స్థితికి అద్దం పట్టినట్టు ఉంటుంది ఆ పాట. అంతవరకూ ఆ పాట గురించి నాకు తెలియదు. మిత్రుని సహకారం తో తెలుసుకున్నాను ఈ పాట పాడింది సి. హెచ్.ఆత్మ అని, స్వరపరచింది ఓ. పి. నయ్యర్ అని, ఈ పాట రచించినది ఓ పి నయ్యర్ భార్య అని !! అయితే అప్పటికి ఓ.పి. నయ్యర్ గురించి చాలామందికి తెలియదు. ఇదొక ప్రైవేట్ రికార్డు. అయితే ఈ పాటని ఆ దృశ్యానికి వాడుకోవడం దర్శకుని సృజనాత్మకత అని చెప్పుకోక తప్పదు. ఈ పాట ఎంత జనాదరణ పొందింది అంటే ఇదే పాటని గురుదత్ తన చిత్రం 'Mr . and Mrs 55' లో ఓ.పి. నయ్యర్ సంగీత దరకత్వం లోనే గీతాదత్ చేత పాడించారు. ఆ సన్నివేశం కూడా అద్భుతంగా ఉంటుంది.

15, డిసెంబర్ 2021, బుధవారం

అమరజీవి పొట్టి శ్రీరాములు.. వివరాలు

ఈ రోజు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి.  ఈ సంధర్భంగా వారి గురించి ఈ క్రింది లింక్ క్లిక్ చేసి  ఈ రోజు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి.  ఈ సంధర్భంగా వారి గురించి ఈ క్రింది లింక్ క్లిక్ చేసి విందాం. విందాం. విందాం.

 https://fb.watch/9VDz-FiU0C/

11, డిసెంబర్ 2021, శనివారం

" ఎదురేది యింక మాకు యెందు చూచినను..." అన్నమయ్య కీర్తన


 వారం వారం అన్నమయ్య - ఈ వారం కీర్తన " ఎదురేది యింక మాకు యెందు చూచినను నీ-

పదము లివి రెండు సంపదలు సౌఖ్యములు"
విశ్లేషణ : డా. Umadevi Prasadarao Jandhyala గారు
చిత్రం : Pvr Murty
సహకారం : శ్రీమతి Ponnada Lakshmi గారు
~~~~~~~🌺🌺~~~~~~
ప్రార్థన
~~~~~~
సీ॥
కమ్మతావులనీను కస్తూరి తిలకంబు మోము చందురునందు ముద్దుగుల్కఁ
గోటి సూర్యప్రభన్ నీటు మీఱెడు తేజు గల కౌస్తుభంబు వక్షమునఁ గ్రాల
నమృతబిందువు లీల నలరుచుండెడు
నాణి
ముత్తెంబు నాసాగ్రమునను వ్రేల
దరమధ్యముననుండి ధారగాఁ బడురీతి
నల ముత్తెముల సరు లఱుత మెఱయఁ
తే.గీ
గరజలజముల రత్నకంకణము లలరఁ
దనువు నెల్లెడ రక్తచందనము దనర
మురళిఁబాడుచు నాడెడు పుణ్యశీలు
భక్తపరిపాలు వేణుగోపాలుఁగంటి!
( వేణుగోపాల శతకం)
🔹అన్నమయ్య కీర్తన 👇🏿
~~~~~~~~~
(॥పల్లవి॥)
ఎదురేది యింక మాకు యెందు చూచినను నీ-
పదము లివి రెండు సంపదలు సౌఖ్యములు
(॥ఎదు॥)
1)గోపికానాథ గోవర్ధనధరా!శ్రీపుండరీకాక్ష జితమన్మథా!పాపహర సర్వేశ పరమపురుషాచ్యుతా!నీపాదములే మాకు నిధినిధానములు
(॥ఎదు॥)
2)పురుషోత్తమా !హరీ !భువనపరిపాలకా! కరిరాజవరద శ్రీకాంతాధిప!మురహరా సురవరా ముచుకుందరక్షకా!
ధరణి నీపాదములె తల్లియును దండ్రి
(॥ఎదు॥)
3)దేవకీనందనా దేవేంద్రవందితా!కైవల్యనిలయ సంకర్షణాఖ్య!శ్రీవేంకటేశ్వరా జీవాంతరాత్మకా!
కావ నీపాదములె గతి యిహముఁ బరము
🔹🔹కీర్తన భావము -కొన్ని విశేషాలు.👇🏿
———————————————
శ్రీవారిపాదాలను కీర్తిస్తూ అన్నమయ్య వ్రాసిన పాటలలో ఒకటైన”ఎదురేది ఇంక మాకు ఎందుజూచిననూ…”అనే కీర్తన విశేషాలు తెలిసినంత వివరిస్తాను.
ఓ వేంకటపతీ నీ పాదయుగళిని సేవించే మాకిక ఎదురున్నదా? ఎందుకంటే అవే మాకు సంపదలు … సౌఖ్యప్రదాతలు!
1)మొదటి చరణంలో స్వామి వారికి వాడిన పదాలలోనే ఆ జగన్నాధుని విశేషమంతా కనబడుతుంది..
గోపికావల్లభా! గోవర్థనగిరి ధారీ!పుండరీకాక్షా! మన్మధునే జయించినవాడా!సమస్త పాపములను పోగొట్టే వాడా! పరమ పురుషా!అచ్యుతా! నీ పాదాలే మాకు నిధినిక్షేపాలు!
*ఎవరీ గోపికలు? వీరందరికీ ఆయన హృదయనాథుడై ప్రేమనెందుకు పంచాడు?
కృతయుగంలోని ఋషులు, త్రేతాయుగంలోని వానరులు ద్వాపర యుగంలో గోపికలైనారంటారు. ఋషులుగా ఉన్నప్పుడు తపస్సువలన దర్శనం వరకే లభించింది. ఆ పుణ్య విశేషం వలన
త్రేతాయుగంలో పరమాత్మతో కలిసి తిరుగుతూ మాట్లాడే భాగ్యం దొరికింది. ఇక ద్వాపర యుగంలో వారి కోరిక ఫలించి ఆయన ప్రేమను పొంది ఆలింగన భాగ్యాన్ని అందుకో గలిగారు. జీవాత్మ పరమాత్మకు చేరువ కావడానికి ఒక్కొక్క మెట్టూ ఎదగడం కనిపిస్తుంది… మనకు!
*గోవర్థన గిరిని ఎత్తిన ఘట్టంలో” ఇంద్రుని పూజించడం కన్నా గోవర్థన పర్వతాన్ని పూజించి , గోవులకు మంచి మేత పెట్టి వాటిని సంతోషపరచండి” అని కృష్ణుడు నందాదులకు చెబుతాడు। ఇంద్రుడు యాదవులపై కోపించి రాళ్ళవాన కురిపించినప్పుడు తన చిటికెన వ్రేలిపై గోవర్థన గిరినెత్తి గోవులను, గోపకులాన్ని కాపాడాడు . సమస్త దేవతలు కొలువైన గోవును మించిన దైవం లేదని, గోరక్షణ వలననే లోకరక్షణ జరుగుతుందనే సందేశం ఈ ఘట్టంలో ఉన్నది.
*అచ్యుత= చ్యుతి లేని వాడు. శాశ్వతుడు
*ఇక పుండరీకాక్ష పదం పవిత్రతకు సంకేతం పుండరీకాక్ష అనిముమ్మారు స్మరిస్తే అపవిత్రం పవిత్రమౌతుంది.
పుండరీకపు రేకలు విచ్చుకోవడం ఆత్మవికాసానికి సంకేతం. ఆ శ్రీహరి కనులు విచ్చుకున్న పుండరీకములు.
2)
స్వామీ! నీవు పురుషోత్తముడవు! లోకములను పరిపాలించే జగత్పతివి! గజేంద్రుని రక్షించిన వాడివి! లక్ష్మీ పతివి! ముచుకుంద మహర్షిని బ్రోచిన వాడివి . ఈ భూమిలో నీ పాదాలే మాకు తల్లీ తండ్రీ!
*నీవే దిక్కని నమ్మి శరణుగోరితే గతజన్మల పాపాలను తొలగించి శాపాలను బాపగల పరమాత్మ అనడానికి నిదర్శనం గజేంద్రమోక్షం.
*సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి పతి!
*దుష్టశిక్షకుడు( మురహరి)!
*తాను నేరుగా సంహరింపగల అవకాశం లేనప్పుడు లౌక్యంగా శత్రుసంహారం చేయగల తంత్రజ్ఞుడు!
ముచుకుందుడనే మహామునిని సాధనంగా వాడుకొని కాలయవనుడనే రాక్షసుని సంహరింపజేయడమే ఉదాహరణ!
3)
దేవకీ సుతుడవు! దేవేంద్రునికి పూజ్యుడవు! మోక్ష ధాముడవు! సంకర్షణ నామం కలవాడవు! నీవే జీవులలో అంతరాత్మవు. నీపాదములే మాకు ఇహ పరసాధకములు!
*హరికి సంకర్షణుడనే నామం ఉంది. అనగా ఆకర్షించే వాడు. లేదా ఆకర్షింపబడేవాడు. సంకర్షణుడంటే బలరాముడు.
మహావిష్ణువులోని శ్వేతవర్ణం కలుపుకొని ఆదిశేషుడు బలరాముడు కాగా, నీలవర్ణం కృష్ణుడిగా ఏర్పడ్డాయని కొన్ని గ్రంథాలలో ఉంది. దేవకీదేవి సప్తమగర్భసంకర్షణం తో బలరాముడు రోహిణి గర్భంలో చేరడం వలన కూడా సంకర్షణుడనే పేరు వచ్చింది.జీవులందరిలోనూ ఆత్మస్వరూపం ఆ పరమాత్మే! అటువంటి శ్రీమహావిష్ణువే కలియుగదైవం ఏడుకొండలస్వామి. ఆ శ్రీవారి దివ్య చరణార విందాలను శరణు కోరుదాం!
స్వస్తి🙏
చం॥
బరువడినీదుపాదములె ప్రాపనినమ్మితినిక్క_మిత్తరిన్
బరులను వేడనొల్ల నిక బాలను ముంచిన నీటముంచినన్ నెరవగుగాక నీకయని నెమ్మది నెంచెతి నస్మదార్య నిర్భరనిరుపాధిక (ప్రణయ వైభవ మేర్పడఁ గంటి నచ్యుతా!
( అచ్యుత శతకం నుండి)
~~~~~।~~।~~~~~~
డా.ఉమాదేవి జంధ్యాల
చిత్రం-శ్రీ Pvr Murty

డా. బాలకృష్ణ ప్రసాద్ గారు ఈ కీర్తనని అద్భుతంగా గానం చేశారు. ఈ క్రింది లింక్ క్లిక్ చేసి వినండి.

9, డిసెంబర్ 2021, గురువారం

వారం వారం అన్నమయ్య -- త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీజగన్నాథా

 



వారం వారం అన్నమయ్య -- 'త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీజన్నాధ..

చిత్రాలు Pvr Murty
భావం / విశ్లేషణ Dr. Umadevi Prasadarao Jandhyala
సహకారం : Ponnada Lakshmi
~~~~~~~~~~~~~~~~~~~~~
హరి స్తుతి 🙏
—————————-
ఉ॥ ( భాగవతం)
తో యరుహోదరాయ!భవదుఃఖహరాయ !నమో నమః!పరే
శాయ!సరోజకేసర పిశఙ్గ వినిర్మల దివ్య భర్మ వ
స్త్రాయ!పయోజ సన్నిభ పదాయ! సరోరుహ మాలికాయ!కృ
ష్ణాయ!పరాపరాయ!సుగుణాయ! సురారిహరాయ! వేధసే.!
*కీర్తన 👇🏿
~~~~~~
త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీజగన్నాథా ॥
వాసుదేవ కృష్ణ వామన నరసింహ శ్రీ సతీశ సరసిజనేత్రా ।
భూసురవల్లభ పురుషోత్తమ పీత- కౌశేయవసన జగన్నాథా ॥
బలభద్రానుజ పరమపురుష దుగ్ధ జలధివిహార కుంజరవరద ।
సులభ సుభద్రా సుముఖ సురేశ్వర కలిదోషహరణ జగన్నాథా ॥
వటపత్రశయన భువనపాలన జంతు- ఘటకారకరణ శృంగారాధిపా ।
పటుతర నిత్యవైభవరాయ తిరువేంకటగిరినిలయ జగన్నాథా ॥
భావ సౌరభం👇🏿
~~~~~~~~
ఓ వేంకటపతీ! శ్రీనివాసా! ఓ లోకాధీశ్వరా! నీవే శరణు !(నీవు మాత్రమే రక్షింపగలవాడివి)
‘అన్యధాశరణం నాస్తి ! త్వమేవ శరణం మమ’అని ఆ అచ్యుతుని అంఘ్రికమలములనాశ్రయించడానికి ఆయనలో గల విశేషణాలను కొన్ని మననం చేసుకుంటున్న కీర్తన ఇది!
స్వామీ!నీవు వసుదేవుని సుతుడవైన వాసుదేవుడవు!
వామనుడవు! పొట్టిగావటువురూపంలో
వచ్చి త్రివిక్రముడిగా ఎదిగిన నీకు ఆకాశం నీ అడుగంత! భూమి రెండవ అడుగంత !
పురుష సింహుడవైన నీవు దుష్టసంహరణార్థం నరసింహునిగా అవతరించావు.
సంపదకు ప్రతీక అయిన లక్ష్మీ దేవికి పతివి!
పద్మపత్రములవలే నీకళ్ళు అందమైనవి .. విశాలమైనవి!
కృష్ణావతారంలో ఆదిశేషునికి అగ్రజుని స్థానమిచ్చిన విశాలహృదయుడవు!
పాలకడలిలో నీ విహారం!
కరిరాజును బ్రోచిన కరుణామూర్తివి!
భక్త సులభుడవు!
సోదరి సుభద్రకు ప్రీతిపాత్రుడివి!
దేవదేవుడివి!
కలియుగ దోషాలను పోగొట్ట గలవాడివి.
వటపత్రశాయివి! ( ఊర్థ్వ మూలమూ అధోశాఖలూ గల ఆధ్యాత్మిక భావ ప్రతీక అయిన మఱ్ఱి ఆకుపై పవళించిన వాడు.)
ఘటనాఘటన సమర్థుడవు!
( ఘటము= కుండ … కుమ్మరికుండ చేసినట్లు నీవీ లోకములలో సమస్తమూ తయారు చేయగలవాడివి)
రసరాజమైన శృంగారానికి అధిపతివి !
అటువంటి పరమపురుషుడవైన నీకి నిత్యమూ నీకు ఎనలేని వైభవమే!
శుభకరమైన సప్త గిరులే నీకు నివాసము! తిరుమలగిరి రాయా జగన్నాధా! శరణు శరణు!
పరమాత్మ లీలా విశేషాలు అనేకం!
ఈ కీర్తనలో పరమాత్మ సర్వ వ్యాపకత, సర్వ కారకత్వము, కరణత్వము, వాత్సల్యము, దక్షత, ఆర్త త్రాణ పరాయణత్వము, అందరినీ ఆనందింపజేసే కృష్ణత్వము, సుముఖత, సులభసాధ్యమైన స్వభావము, మహిమ, సమర్థత ఇత్యాది అద్భుత గుణములు మనకు కనబడతాయి. తరచిన కొలది ఎన్నో పారమార్థికమైన సత్యాలను దాచుకున్న కీర్తన ఇది!
ఉ॥( ఉమాదేవి)
వామన! వాసుదేవ!కరిబాధను దీర్చిన భక్తవత్సలా!
ప్రేమగలట్టి సోదరుడ వీవు సుభద్రకు నెల్లవేళలన్
భూమిన ధర్మరక్షణకు బుట్టుచునుందువు పెక్కుభంగులన్
శ్రీమల వేంకటేశ్వరుడ! శ్రీనరసింహుడ! నీకుమ్రొక్కెదన్!
~~~~~~~~~~~~~~~
డా. ఉమాదేవి జంధ్యాల

5, డిసెంబర్ 2021, ఆదివారం

'పెళ్లి చేసి చూడు' - టూరింగ్ టాకీసులు


'పెళ్లి చేసి చూడు' సినిమా విడుదలైనప్పుడు నా వయస్సు 8 సంవత్సరాలు. ఇంట్లో ఓ గోని సంచీ తీసుకుని ఇసుకతో కూడిన బేడో పావలావో నేల టిక్కెట్టు కొనుక్కుని టూరింగ్ టాకీస్ లో చూసిన సినిమాల్లో 'పెళ్లి చేసి చూడు' కూడా ఒకటి. అసలు టూరింగ్ టాకీస్ లు అంటే ఏమిటి? ఈ తరం వారికి తెలియకపోవచ్చు. ఓ టూరింగ్‌ టాకీస్‌ సినిమాలను ప్రదర్శించే ఒక సంస్థ. నాకు తెలిసిన విషయాలతో పాటు కొన్ని వివరాలు వికీపీడియా నుండి సేకరించి ఇక్కడ పొందుపరుస్తున్నాను.
గత కాలంలో సినిమాలను ప్రదర్శించే సినిమా హాళ్ళూ (సినిమా ప్రదర్శన కేంద్రాలు) ఎక్కువగా లేని కాలములో సినిమాలను ప్రదర్శించడానికి తాత్కాలికంగా ఒక డేరాను ఏర్పాటుచేసి అందులో సినిమాలను ప్రదర్శించేవారు. ఇవి కేవలము పల్లెటూర్లల్లో మాత్రమే ఏర్పాటు చేసేవారు. పట్టణాలలో ఆడిన సినిమాలను ఇందులో ప్రద్ర్శించే వారు. వీటిని ఒక ప్రాతంనుండి మరొక ప్రాంతానికి తరలించడానికి అనుకూలంగా వుండేవి. అందుకే వాటిని టూరింగు టాకీసులు అనేవారు. ఇందులో ప్రతి సినిమా సుమారుగా ఒక వారము మాత్రమే ప్రదర్శించేవారు. వారాంతములో అనగా చివరి రోజున ఆ తర్వాత ఆడబోయే సినిమాని, ప్రస్తుతము ఆడుతున్న సినిమాని కలిపి రాబోయే సినిమాని కూడా ఒకే టికెట్టు పై చూపే వారు. ఆ విదంగా ప్రేక్షకులు ఒక టికెట్టుతో రెండు సినిమాలు చేసే అవకాశము లభించేది. వీరి సినిమా ప్రచారానికి చిన్నపాటి టౌన్లు అయితే రిక్షాలు, పల్లెటూరులైతే ఎడ్ల బండితో ప్రచారము నిర్వహించేవారు. ఆ రోజుల్లో చిన్న పిల్లలకు సినిమా బండి వచ్చిందంటే సినిమా చూసినంత సంబరము. మరొక్క విషయమేమంటే....... ఆ రోజుల్లో పల్లె ప్రజలు ఎడ్ల బండిమీద ఊరి వారందరు ( అనగా సుమారు 10 మంది) కలిసి నిసిమాకు వెళ్ళేవారు. అలా ఎడ్ల బండి తోలుకొచ్చిన వానికి సినిమా టికెట్టు ఉచితము. ఈ విధంగా వుండేవి టూరింగు టాకీసులు. సర్వసాధారణంగా ఈ టూరింగ్ సినిమా హాళ్ళలో ఒకే ఒక్క ప్రొజెక్టరు వుండేది. ఒక రీలు పూర్తి కాగానే రీలు మార్చడానికి సుమారు ఐదు నిముషాలు పట్టేది. ఇలా సినిమా పూర్తయ్యేలోపల సుమారు ఐదుసారు మధ్య మధ్యలో విరామము. ఈ మధ్యలో రీలు తెగిపోతే..... దానిని ఆతికించి తిరిగి ప్రారంభించడానికి మరో అయిదు నిముషాలు అదనం.

4, డిసెంబర్ 2021, శనివారం

రాజసులోచన - నర్తకి, నటి

 


My Pencil sketch


రాజసులోచన (ఆగష్టు 15, 1935 - మార్చి 5, 2013) అలనాటి తెలుగు సినిమా నటి, కూచిపూడి, భరత నాట్య నర్తకి. తెలుగు సినిమా దర్శకుడు చిత్తజల్లు శ్రీనివాసరావు భార్య. ఈమె విజయవాడలో సాంప్రదాయ కుటుంబంలో జన్మించింది, కానీ విద్యాభ్యాసం అంతా తమిళనాడులో జరిగింది.

రాజసులోచన తండ్రి భక్తవత్సలం నాయుడుకు మద్రాసుకు బదలీ కావడంతో, రాజసులోచన చిన్న వయసులోనే అక్కడకు వెళ్ళిపోయారు. చెన్నైలోని ట్రిప్లికేన్‌ ప్రాంతంలో ఆమె బాల్యం గడిచింది. అక్కడి తోపు వెంకటాచలం చెట్టి వీధిలో 1939లో స్థాపించిన ప్రసిద్ధ శ్రీసరస్వతీ గాన నిలయంలో ఆమె నాట్యం నేర్చుకున్నది. కష్టపడి తల్లిదండ్రుల్ని ఒప్పించి సరస్వతీ గాన నిలయంలో నాట్యం
నేర్చుకున్నది. ఈమె 1963లో పుష్పాంజలి నృత్య కళాకేంద్రం అనే శాస్త్రీయ నృత్య పాఠశాల ప్రారంభించింది. అది ఇప్పటికీ నడుస్తున్నది.


స్టేజీ మీద రాజసులోచన నాట్య ప్రదర్శన చూసి కొందరు నిర్మాతలు సినిమాల్లో నటించే అవకాశం ఇచ్చారు. రాజసులోచన 1953లో కన్నడ చిత్రం 'గుణసాగరి' ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. కన్నతల్లి చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. అంతకు ముందు 'గుణసాగరి' అనే కన్నడ చిత్రంతో పాటు 'సత్యశోధనై' అనే తమిళ చిత్రంలో నటించారు. తొలిసారి హీరోయిన్ గా ఎన్.టి.ఆర్. సరసన ఘంటసాల నిర్మించిన సొంతవూరు (1956) చిత్రంలో నటించింది. తన చిత్రాలకు నృత్య దర్శకులైన పసుమర్తి కృష్ణమూర్తివెంపటి పెదసత్యంవెంపటి చినసత్యం, జగన్నాథశర్మ మొదలైన వారి వద్ద కూచిపూడి నృత్యంలోని మెళకువలు నేర్చుకున్నారు. ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో కలిపి దాదాపు 275 చిత్రాల దాకా అందరు మేటి నటుల సరసన నటించారు[1]. ప్రతి భాషలోను తన పాత్రకు స్వయంగా డైలాగ్స్ చెప్పుకునేవారు.


మద్రాసు నగరంలో 1963 సంవత్సరంలో 'పుష్పాంజలి నృత్య కళాకేంద్రం' స్థాపించారు. దీని ద్వారా విభిన్న నృత్యరీతుల్లో ఎన్నో నృత్య ప్రదర్శనలను మన దేశంలోను, వివిధ దేశాల్లో ప్రదర్శించారు. ముఖ్యంగా విదేశాల్లో జరిగే ఫిల్మోత్సవ్ లలో వీరి ప్రదర్శనలు విరివిగా జరిగాయి. ఈ ప్రదర్శనలలో భామా కలాపంఅర్థనారీశ్వరుడుశ్రీనివాస కళ్యాణంఅష్టలక్ష్మీ వైభవం లాంటి ఐటమ్ లకు మంచి ఆదరణ, ప్రశంసలు లభించాయి. వీరు అమెరికాజపాన్చైనాశ్రీలంకరష్యాసింగపూర్ తదితర దేశాల్లో నాట్య ప్రదర్శనలనిచ్చారు.


(courtesy : Wikipedia)

1, డిసెంబర్ 2021, బుధవారం

సిరివెన్నెల సీతారామశాస్త్రి


  

భువునుండి దివికేగిన అద్భుత గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రతిభాపాటవాలు ఎంత చెప్పినా తక్కువే. ఆ మహనీయునికి నా చిత్ర నివాళి.

డా. ఉమాదేవి జంధ్యాల గారు తన పద్యం, గజల్ రచన ద్వారా ఆ మహనీయునికి ఇలా నివాళి అర్పించారు.

ఉ॥
తీరని లోటుగల్గె నిక తీయని పాటకు చిత్రసీమలో
చేరగ దల్చిబాలుడిని జీవితమున్ త్యజియించి పోతివో
వేరొక రెవ్వరుండిరిట వెల్తిని దీర్పగ సీతరాముడా !
నీరయె గుండె యాంధ్రులకు నిన్నటి మొన్నటి శోకవార్తలన్!

కీ.శే. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి నివాళిగా ఒక గజల్
~~~~~~~🌺🙏🌺~~~~~~~~~~
సిరివెన్నెల రసఝరిలో నిలువెల్లా తడవనీ!
తరలిపోవు వసంతాన్ని రమ్మనమని పిలువనీ!
వేదాలకు నాదంలా భావానికి నీకలం
కవాతుచేసిన తీరుకు సలామునే చేయనీ !
వెన్నెలుంది పేరుముందు అగ్గిఉంది మాటలో
అభినవశ్రీశ్రీవంటూ ఎలుగెత్తీ అరవనీ !
వెన్నెలకురిసే సూర్యునికమావాస్య ఉండునా!
తెలుగుపాట జాతీయత గుండెలలో ఒదగనీ!
అనేకమున ఏకత్వం గాంచినావు మహర్షీ
మనపాటకు పెద్దపీట దేవతలను వేయనీ!
మజిలీ ముగిసినదిక్కడ బిజిలీవిక గగనాన!
ఏరువాకలా పాటను ఎదఎదలో సాగనీ!
జంధ్యాలా మేలుకొలిపె ఈ రావుఁడు జాతినే!
సాహిత్యపు సేద్యాన్నే అమరులకూ నేర్పనీ !
~~~~~~~~~~~~~~~
డా. ఉమాదేవి జంధ్యాల

ఈ సందర్భంగా సాక్షి దినపత్రిక లో వచ్చిన వివరణాత్మక వ్యాసం ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చదవగలరు.

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...