'పెళ్లి చేసి చూడు' సినిమా విడుదలైనప్పుడు నా వయస్సు 8 సంవత్సరాలు. ఇంట్లో ఓ గోని సంచీ తీసుకుని ఇసుకతో కూడిన బేడో పావలావో నేల టిక్కెట్టు కొనుక్కుని టూరింగ్ టాకీస్ లో చూసిన సినిమాల్లో 'పెళ్లి చేసి చూడు' కూడా ఒకటి. అసలు టూరింగ్ టాకీస్ లు అంటే ఏమిటి? ఈ తరం వారికి తెలియకపోవచ్చు. ఓ టూరింగ్ టాకీస్ సినిమాలను ప్రదర్శించే ఒక సంస్థ. నాకు తెలిసిన విషయాలతో పాటు కొన్ని వివరాలు వికీపీడియా నుండి సేకరించి ఇక్కడ పొందుపరుస్తున్నాను.
గత కాలంలో సినిమాలను ప్రదర్శించే సినిమా హాళ్ళూ (సినిమా ప్రదర్శన కేంద్రాలు) ఎక్కువగా లేని కాలములో సినిమాలను ప్రదర్శించడానికి తాత్కాలికంగా ఒక డేరాను ఏర్పాటుచేసి అందులో సినిమాలను ప్రదర్శించేవారు. ఇవి కేవలము పల్లెటూర్లల్లో మాత్రమే ఏర్పాటు చేసేవారు. పట్టణాలలో ఆడిన సినిమాలను ఇందులో ప్రద్ర్శించే వారు. వీటిని ఒక ప్రాతంనుండి మరొక ప్రాంతానికి తరలించడానికి అనుకూలంగా వుండేవి. అందుకే వాటిని టూరింగు టాకీసులు అనేవారు. ఇందులో ప్రతి సినిమా సుమారుగా ఒక వారము మాత్రమే ప్రదర్శించేవారు. వారాంతములో అనగా చివరి రోజున ఆ తర్వాత ఆడబోయే సినిమాని, ప్రస్తుతము ఆడుతున్న సినిమాని కలిపి రాబోయే సినిమాని కూడా ఒకే టికెట్టు పై చూపే వారు. ఆ విదంగా ప్రేక్షకులు ఒక టికెట్టుతో రెండు సినిమాలు చేసే అవకాశము లభించేది. వీరి సినిమా ప్రచారానికి చిన్నపాటి టౌన్లు అయితే రిక్షాలు, పల్లెటూరులైతే ఎడ్ల బండితో ప్రచారము నిర్వహించేవారు. ఆ రోజుల్లో చిన్న పిల్లలకు సినిమా బండి వచ్చిందంటే సినిమా చూసినంత సంబరము. మరొక్క విషయమేమంటే....... ఆ రోజుల్లో పల్లె ప్రజలు ఎడ్ల బండిమీద ఊరి వారందరు ( అనగా సుమారు 10 మంది) కలిసి నిసిమాకు వెళ్ళేవారు. అలా ఎడ్ల బండి తోలుకొచ్చిన వానికి సినిమా టికెట్టు ఉచితము. ఈ విధంగా వుండేవి టూరింగు టాకీసులు. సర్వసాధారణంగా ఈ టూరింగ్ సినిమా హాళ్ళలో ఒకే ఒక్క ప్రొజెక్టరు వుండేది. ఒక రీలు పూర్తి కాగానే రీలు మార్చడానికి సుమారు ఐదు నిముషాలు పట్టేది. ఇలా సినిమా పూర్తయ్యేలోపల సుమారు ఐదుసారు మధ్య మధ్యలో విరామము. ఈ మధ్యలో రీలు తెగిపోతే..... దానిని ఆతికించి తిరిగి ప్రారంభించడానికి మరో అయిదు నిముషాలు అదనం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి