31, డిసెంబర్ 2021, శుక్రవారం

ఉయ్యాల బాలునూచెదరు కడు నొయ్య నొయ్య నొయ్యనుచు - అన్నమయ్య కీర్తన


అన్నమయ్య కీర్తన : "ఉయ్యాల బాలునూచెదరు కడు నొయ్య నొయ్య నొయ్యనుచు"

విశ్లేషణ డా. Umadevi Prasadarao Jandhyala
చిత్రం : Pvr Murty
సహకారం : శ్రీమతి పొన్నాడ లక్ష్మి
🌷ముందుగా హరిస్తుతి
ఉ॥
తోయజనేత్ర! భక్తజన తోయజ మిత్ర! రమాకళత్ర! ది
వ్యాయుధ నీలగాత్ర! మునివర్గ పవిత్ర! పురారిమిత్ర! కౌంతేయ సహాయమాత్ర! నగధీర విరించి సుపుత్ర! భవ్యనా
రాయణ హేమసూత్ర! సువిరాజిత వేంకట శైలనాయకా !
(వేంకట శైలనాయక శతకం )
ఈ వారం అన్నమయ్య కీర్తన
~~~~~>>>🌺<<<>>>~~~~
ప|| ఉయ్యాల బాలునూచెదరు కడు
నొయ్య నొయ్య నొయ్యనుచు || ఉయ్యాల బాలునూచెదరు ||
చ|| బాల యవ్వనలు పసిడి ఉయ్యాల
బాలుని వద్దపాడేరు
లాలి లాలి లాలి లాలెమ్మ
లాలి లాలి లాలనుచు || ఉయ్యాల బాలునూచెదరు ||
చ|| తమ్మిరేకు కను ద మ్ముల నువ్వుల
పమ్ముజూపులబాడేరు
కొమ్మల మట్టెల గునుకుల నడపుల
ధిమ్మి ధిమ్మి ధిమ్మినుచు || ఉయ్యాల బాలునూచెదరు ||
చ|| చల్లుచూపుల జవరాండ్లురే
పల్లె బాలుని పాడేరు
బల్లిదు వేంకటపతి జేరందెలు
ఘల్లు ఘల్లు ఘల్లనుచు || ఉయ్యాల బాలునూచెదరు ||
భక్తుడు భగవంతుని అనేక విధాలుగా సేవించుకుంటాడు. శ్రీవారి నిత్య సేవలలో డోలోత్సవం పవళింపు సేవ ఉన్నాయికదా!
వాగ్గేయకారుడైన అన్నమాచార్యులవారు
వ్రేపల్లె లోని చిన్నశిశువు ను గోప కాంతలు ఉయ్యాల ఊపుతున్న దృశ్యం మనకు పాటగా అందించారు.
డోలాయాంచల డోలాయాం…
అలరుచంచలమైన ఆత్మలందుండ..
లాలనుచు నూచేరు లలనలిరుగడల ..
ఉయ్యాల నూపులు ….
చందమామరావో జాబిల్లి రావో ….
ఉయ్యాల బాలు నూచెదరు ….
ఇలా అన్నమయ్య ఆ పరంధామునికి లాలిపాటలు అనేకం వ్రాసారు. వాటిలో ఒకటైన ఉయ్యాల బాలునూచెదరు… పాట గురించి చెప్పుకుందాం.
దేవకీ నందనుడు యశోద పురిటి పక్కలోకి చేరాడుకదా! ఈ మార్పంతా గుట్టు చప్పుడుగా జరిగిపోయింది. వ్రేపల్లెకు పెద్ద అయిన నందుని యింట వెలసిన ఆ పసిబాలుడిని ఉయ్యాల తొట్టిలో వేసి ఊపుతూ తల్లి యశోద, గోపెమ్మలు పాటపాడుతున్నారు. ఒయ్య … ఒయ్య అంటూ ఒక్కో ఊపూ ఊపడం… మధ్యమథ్య పలకరించడం ఎలా ఉందంటే ….
లాలీ లాలీ లాలెమ్మ లాలీ అని ఆ గొల్ల యువతులు పసిడి ఉయ్యాల ఊపుతున్నారు.
ఆయువతుల కనుదమ్ములు నవ్వులొలుకుతూ తమ్మిరేకలను అతిశయిస్తున్నాయి. పద్మదళాలు అందంగా ఉంటాయి కానీ వాటికి నవ్వడం రాదు. వీరి కళ్ళకు తామరరేకలవంటి అందమేగాక నవ్వగల శక్తీ ఉంది మరి!
ఉయ్యాల ఊపుతుండగా వాళ్ళ గునుకుల నడకలకు కాళ్ళు కదిలినప్పుడు వ్రేళ్ళ మట్టెల సవ్వడి థిమిథిమ్మని పాటకు తగినట్లు లయబద్ధంగా తాళం వేస్తున్నట్లుంది.
ఉయ్యాల ఊపుతో పాటు త్వరత్వరగా కదలడాన్ని గునుకు అంటారు . పరుగువంటి నడకని అర్థం.
ఆ జవరాళ్ళవి చల్లు చూపులు … అంటే ప్రసరించే , కాంతిమంతమైన చూపులు.
ఉయ్యాలతో పాటు ఆ పసివాడు ఎంతదూరం కదిలితే అంతదూరమూ ఆ చూపులు పరిగెడుతున్నాయి. విస్తరిస్తున్నాయి.
ఆ ఊయలలో చూడటానికి బాలుడేగానీ బల్లిదుడు అంటూ ఆయన ఘనతను , బలాన్ని గుర్తు చేసాడు అన్నమయ్య! జగత్తునే ఊపగల వాడు ఉయ్యాలలో ఊగుతున్నాడు. ఏమీ ఎరగని బుల్లి బుజ్జాయిలా నవ్వులు చిందిస్తున్నాడు.
మెడలో హారాలు ( చేరులు) కాళ్ళ అందెలు గలగలమనేటట్లు ఆ గోపెమ్మలు చిన్న కృష్ణుని ఉయ్యాల లూపుతున్నారు.
నాడు వ్రేపల్లెలో ఊయలలూగిన చిన్న శిశువే ఈ వేంకట పతి!
**************
తే.గీ
భూమి భారము బాపగ భువిన బుట్ట
యూపి నారయ్య యుయ్యాల నువిద లిట్లు
లీలలెన్నగ వశమె గోపాలబాల!
నీల మేఘశ్యామ! ముకుంద! నీకు జయము!
స్వస్తి! 🙏
~~~~~~
అర్థాలు
ఒయ్య ఒయ్య- ఊపేటప్పుడు అనే అలవాటు పదం
కనుదమ్ములు- కన్నులనే పద్మములు
పమ్ము- అతిశయము
గునుకుల నడకలు- చిన్న పరుగువంటి నడక

కామెంట్‌లు లేవు:

బి. గోపాలం - సంగీత దర్శకుడు, , నటుడు

బి గోపాలం - సంగీత దర్శకుడు గాయకుడు నటుడు  (my charcoal pencil sketch)  Facebook మిత్రులు వీర నరసింహారాజు గారి వాల్ నుండి సేకరణ యధాతధంగా. వార...