13, ఫిబ్రవరి 2022, ఆదివారం

మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల - అన్నమయ్య కీర్తన


నా facebook post యధాతధంగా :

వారం వారం అన్నమయ్య - ఈ వారం కీర్తన : "మేలుకో శృంగార రాయ మేటి మదనగోపాల..."
విశ్లేషణ డా. Umadevi Prasadarao Jandhyala ,
చిత్రం పొన్నాడ మూర్తి
సహకారం: శ్రీమతి Ponnada Lakshmi
~~~~~🍀🙏🍀~~~~~~

ఓం నమో వేంకటేశాయ 🙏
మొదట ఒక ప్రార్థన పద్యం.

శా॥
కస్తూరీ తిలకోజ్వల స్మిత ముఖా! కైవల్య లక్ష్మీ సఖా!
హస్తోదంచిత శంఖచక్ర రుచిరా!
హస్తీంద్ర రక్షాపరా!
అస్తోకామృత వర్షవేణు నినదా! యానంద లీలాస్పదా!
తస్త్రానేక జనాభయప్రదకరా!
ధారాధరాశ్రీధరా!
(రాధికా స్వాంతనం)
అన్నమయ్య తనస్వామిని అన్ని కోణాలలోనూ చూసి పరవశించాడు. ఆయన మహిమలు, అవతారప్రభలు, దుష్టశిక్షణ, శిష్టరక్షణాది సంఘటనలు, ప్రతి చేత వెనుక గల పరతత్వము …. ఇలా ఎన్నో! కృష్ణావతారంలో బాలుడిగా చేసిన అల్లరి , రసశేఖరునిగా ఆయన శృంగారం, వీరునిగా ఆయన ప్రతాపం , దుర్మార్గుల పట్ల ఆయన చూపిన రౌద్రం, రాజకీయదురంధరునిగా ఆయన వ్యూహరచన , గురువుగా బోధ ఇలా అనేకం అన్నమయ్య కీర్తనలలో కనబడతాయి!
ఇప్పుడు ఈ వారం అన్నమయ్య కీర్తన
‘మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల’గురించి చెప్పుకుందాం.
ఊయలలో కన్నయ్యకు లాలి పాటలు పాడిన అన్నమయ్యే శృంగార మూర్తి అయిన మదన గోపాలుడికి మేలుకొలుపూ పాడుతున్నాడు!

🔹కీర్తన పాఠం
**********
ప॥
మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల
మేలుకోవె నాపాల ముంచిన నిధానమా
చ॥
సందడించే గోపికల జవ్వనవనములోన
కందువదిరిగే మదగజమవు
యిందుముఖి సత్యభామ హృదయపద్మములోని
గంధము మరిగినట్టి గండు తుమ్మెద
చ॥
గతిగూడి రుక్మిణికౌగిట పంజరములో
రతిముద్దు గురిసేటి రాచిలుకా
సతుల పదారువేల జంట కన్నులఁ గలువలు
కితమై పొదిమిన నా యిందు బింబమ
చ॥
వరుసంగొలనిలోనివారి చన్నుఁగొండ
లపై
నిరతివాలిన నా నీలమేఘమా
శిరినురమున మోచి శ్రీవేంకటాద్రి మీద
గరిమ వరాలిచ్చే కల్పతరువా!
💥వివరణ 👇🏿
అన్నమాచార్యుల వారు స్వామిని ‘శృంగార రాయా’అని సంబోధించారు. వీరశృంగారాలు సమపాళ్ళలో ఉన్నవాడు స్వామి! ఆయనలోని శృంగార కోణాన్ని దర్శింపజేస్తున్నారు అన్నమయ్య !
ఆ మోహనరూపుడైన గోపాలుని సౌందర్యానికి జగత్తంతా స్త్రీ పురుష భేదం లేకుండా మత్తిల్లిపోయింది. గోపకాంతలంతా మనసు పారేసుకొని పరుగులు పెట్టారు.మువ్వగోపాలుడు మదనగోపాలుడై రాసక్రీడలతో రంజింప చేసాడు.
ఇవన్నీ తలుచుకుంటూ ‘మదన గోపాలా మేలుకో !’ అంటూ వ్రాసిన మేలుకొలుపు కీర్తన ఇది!
“ఓమదన గోపాలా మేలుకోవయ్యా! నీ అందంతో మమ్మల్ని మత్తులో ముంచి నువ్వు నిద్రపోతున్నావా? మాపాలిటి పెన్నిధివి నీవు ! నమ్మిన వారిని పాలముంచే నిధానము నీవు !”
ఈ కీర్తన శృంగారానికి పరాకాష్ఠ!
మదన గోపాలుని రసికతను ఎలా వర్ణించాడో చూడండి.
“గోపికల యౌవనమనే అరణ్యంలో విచ్చలవిడిగా తిరిగే మదపుటేనుగవు నీవు!
చందమామ వంటి ముఖంకలిగిన సత్యభామ హృదయపద్మంలోని సువాసనను మరిగిన గండుతుమ్మెదవు నీవు.
రుక్మిణీదేవి కౌగిలి అనే పంజరంలో సంగమ వేళ ముద్దులొలికే రాచిలుకవు నీవు.
పదహారు వేలమంది గోపికల కలువలవంటి కన్నులలో ముందే పుట్టిన చంద్ర బింబానివి! మేలుకో స్వామీ “
సాధారణంగా చంద్రోదయమయ్యాక కలువలు విచ్చుకుంటాయి. కానీ ఇక్కడ ఈ చంద్రుడికి ఎంత తొందరంటే అవి విచ్చుకోక ముందే వచ్చేసాడు. ఇంకా వివరంగా చెబితే కలువలవంటి కళ్ళు చందమామ వంటి వదనంలో కదా విచ్చుకున్నాయి! కనక ముందే చంద్రుడు వచ్చినట్లు లెక్క!
తరవాత చరణంలో మోహనకృష్ణుని
అల్లరి శృతిమించింది.
“సరస్సులో జలకాలాడుతున్న గోపికల స్తన గిరులపై తిరిగే నీలమేఘమా !
ఇప్పుడు వేంకటాద్రిపై శ్రీని ( లక్ష్మీ దేవిని) వక్షస్థలాన మోస్తూ గొప్ప వరాలనిచ్చే కల్పతరువా! మేలుకోవయ్యా!”
ఇదండీ అన్నమయ్య తన మనోనేత్రంతో దర్శించిన శ్యామసుందరుని శృంగార చేష్టలు!
శృంగార రాయనికి సింగారాల సిరికి
ప్రణమిల్లుతూ స్వస్తి 🙏
~~~~~~~~~~~
కం॥
శృంగారంబున మేటివి
యంగనలను మోహపెట్టి యాడింతువయా!
ముంగొంగు బసిడి వీవని
చెంగును జాపుదుము నీదు చిత్తము కరుగన్ !
( స్వామికి నా పద్యకుసుమం),
~~~~~~~~~~~~~
డా.ఉమాదేవి జంధ్యాల
చిత్రం- శ్రీ Pvr Murty గారు

 

కామెంట్‌లు లేవు:

The power of 'Will' Usage - English grammar - illustration

  When we use will to make a promise 🤝 or an offer 💡, we are usually deciding to do something at the very moment we are speaking. It shows...