వారం వారం అన్నమయ్య.. "ఇంతకాలమో కదా ఈ దేహధారుణము"
చిత్రం- శ్రీ పొన్నాడ మూర్తిగారు
విశ్లేషణ - డా. ఉమాదేవి జంధ్యాల
సహకారం : శ్రీమతి Ponnada Lakshmi
~~~~~~~~~~~~~~~~
మొదట ఒక ప్రార్థన ( ఆదినారాయణ శతకం)
శా॥
యావజ్జీవము దేహసౌఖ్యమునకై యతినించువారై భవ
త్సేవన్జేయుట మాని లోభ రతులై చీకాకును బొంది యో
దేవాదుర్వ్యసనంబులంబడుదురింతేకాని,యీ మానవుల్ న
నీవే మూలమటంచుఁగొల్వరిల దండ్రీ యాదినారాయణా!
కీర్తన పాఠం
***********
ప || ఎంతకాలమో కదా ఈ దేహధారణము
చింతా పరంపరల చిక్కువడ వలసె॥
చ॥
వడిగొన్న మోహంబు వలలతగులై
కదా
కడలేని గర్భనరకము లీదవలసె
నడిమి సుఖములచేత ననుపు
సేయక కదా
తొడరి హేయపు దిట్టి దూరాడ వలసె
2)పాపపుంజములచే పట్టువడక కదా
ఆపదలతోడి దేహము మోపవలసె
చూపులకు లోనైన సుఖము కానక కదా
దీపన భ్రాంతిచే తిరుగాడ వలసె ॥
౩.)
హితుడైన తిరువేంకటేశు కొలువక కదా
ప్రతిలేని నరక కూపమున బడవలసె
అతని కరుణామృతంబబ్బకుండక కదా
బతిమాలి,నలుగడల పారాడవలసె
———————-
వివరణ నాకు తెలిసినంత
ప ||
ఎంతకాలమో కదా ఈ దేహధారణము
చింతా పరంపరల చిక్కువడ వలసె॥
*అన్నమయ్య కీర్తనలు వేదోపనిషత్తుల సారాన్ని , గీతా సారాన్ని ఇముడ్చుకున్నచింతనామృతాలు.
జీవుడు జన్మించి భగవచ్చింతనతో, కర్మాచరణ చేస్తూ ధర్మ వర్తనుడూ, స్థితప్రజ్ఞుడూ అయి జీవించనంత కాలం జన్మలు పొందుతూనే ఉండాలి. దేహాన్ని ధరిస్తూనే ఉండాలి.అసంఖ్యాకమైన చింతల వరుసలలో చిక్కుకుంటూనే ఉండాలి.
1)
చ॥ వడిగొన్న మోహంబు వలల తగులైకదా
కడలేని గర్భనరకము లీదవలసె
నడిమి సుఖములచేత ననుపు
సేయక కదా
తొడరి హేయపు దిడ్డి దూరాడ వలసె
*అద్వైత సిద్ధి కలగనంత కాలం మోహ పాశంలో చిక్కుకుంటూనే ఉండాలి. మెలికలు పడిన మోహపు వలలో పడినన్నాళ్ళూ అంతులేని గర్భనరకం అనుభవిస్తూనే ఉండాలి.
మధ్యలో వచ్చిన ఐహిక భోగాలను నిరాకరించక పోవడం వలన, వాటిని అధిగమించక పోవడం వలనకదా నీచమైన సన్న యోనిమార్గాలలో దూరవలసి వస్తోంది!
అరిషడ్వార్గాలు ఒకటుంటే మిగతావి వాటంతటవే వచ్చి చేరతాయి. మోహాన్ని వదలలేకపోతే అసూయ, కోపం, అదుపులేని తనం అన్నీ ఉంటాయి.
2)పాపపుంజములచే పట్టువడగా కదా
ఆపదలతోడి దేహము మోపవలసె
చూపులకు లోనైన సుఖము కానక కదా
దీపన భ్రాంతిచే తిరుగాడ వలసె ॥
*జీవితం ఆపదల మయం. రోగాలు, రొస్టులు, కష్టాలు అనేకం . అది సుఖంగా ఉంటుందనుకోవడం భ్రమ. అటువంటి జన్మకు కారణం పాపపు రాసిలో కూరుకు పోయి లేవలేక పోవడమే। కళ్ళకు కనిపించే సుఖాలలోని నిజమెంతో గ్రహించ లేక పోవడం వల్లనే ఇంత భ్రాంతిలో తిరగవలసి వస్తున్నది!
౩.)
హితుడైన తిరువేంకటేశు కొలువక కదా
ప్రతిలేని నరక కూపమున బడవలసె
అతని కరుణామృతంబబ్బకుండక కదా
బతిమాలి నలుగడల పారాడ
వలసె !!
*మనకు అసలైన హితకరుడు ఆ పరమాత్మే. ఆ వేంకటపతిని సేవింపని, ధ్యానింపని కారణం చేతనే నరకకూపంలో పడుతున్నాం. ఇవేవీ వదలలేని వారికి , పరమాత్మను కొలవని వారికీ నరకకూపంలో పడటం తప్ప మరో దారి లేదు.
ఆ స్వామి దయ మనకు లభించక పోవడం వల్లనే ఎవరెవరినో బతిమాలుకుంటూ బ్రతకవలసి వస్తున్నది!
ఉద్ధరింప వలసిన వాడు ఆ భగవంతుడే.
మనం ఉద్దరిపబడాలంటే ఆయన దయ కావాలి.
స్వామి దయచూపాలంటే మనం నిర్మోహత్వంతో జీవిస్తూ ఆ జగన్నాథుని పై భారం వేసి బ్రతకాలి!
మన కష్ట సుఖాలు, జన్మలూ అన్నీ మన కర్మఫలితాలే! నిష్కామ కర్మతోనే మనకు జన్మరాహిత్యం కలుగుతుంది. పరబ్రహ్మను గాక అన్యులను వేడుకుంటే ప్రయోజనంలేదు.
ఇంత వివరంగా అన్నమయ్య ఈ కీర్తనలో మనకు కర్తవ్యం బోధించాడు.
కొందరిది అనినమయ్య వార్థక్యంలో వ్రాసిన కీర్తనగా భావిస్తున్నారు. కానీ పరమ భక్తుడు, జ్ఞాని అయిన అన్నమయ్య పునరపి జననం … పునరపి మరణం వెనకగల జీవిత సత్యాన్ని ఒక సామాన్యుడిలా ముసలితనందాకా ఆగి వ్రాయడని నా ఉద్దేశం !
స్థితప్రజ్ఞుడైనఅన్నమయ్య జీవుల దేహధారణ గురించి మనలను హెచ్చరిస్తున్నాడు.!
************************
(కొన్ని పదాలకు అర్థాలు
ననుపు- అధిగమించు
వడిగొను- మెలికలు పడు/ వేగముగా
దిడ్డి- ఇరుకు దారి
దీపన భ్రాంతి- మితిమీరిన భ్రాంతి )
~~~~~~~~~~~~~
తే.గీ
చావుపుట్టుకలబడుచు జీవుడిట్లు
గర్భ నరకంబు నొందుట కర్మ ఫలము
వీడి భ్రాంతి, నీ పదముల వేడుకొనక
గలగునేముక్తి శ్రీతిరుమలనివాస!
తే.గీ
మోహ పాశంబునంబడి యహముఁదోడ
హితుడవైనట్టి నినుగాంచు మతియు లేక
నిదియె సుఖమని దల్చుచు వదలలేము
పాపకూపంబు వెల్వడఁబ్రాపు నీవె!
స్వస్తి
~~~~~~~~~।।
డా. ఉమాదేవి జంధ్యాల
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి