19, ఫిబ్రవరి 2022, శనివారం

మహినుద్యోగి కావలె మనుజుడైన వాడు | సహజివలెనుండేమి సాధించలేడు -- అన్నమయ్య కీర్తన

 



వారం వారం అన్నమయ్య - ఈ వారం కీర్తన : మహినుద్యోగి కావలె మనుజుడైన వాడు |
సహజివలెనుండేమి సాధించలేడు॥

విశ్లేషణ సౌజన్యం : డా. Umadevi Prasadarao Jandhyala
చిత్రం : Pvr Murty
సహకారం : శ్రీమతి Ponnada Lakshmi


మహినుద్యోగి కావలె మనుజుడైన వాడు |
సహజివలెనుండేమి సాధించలేడు॥
వెదకి తలచుకుంటే విష్ణుడు కానవచ్చు |
చెదరి మరచితే సృష్టి చీకటౌ |
పొదలి నడిచితేను భూమెల్లా మెట్టి రావచ్చు |
నిదురించితే కాలము నిమిషమై తోచు II
వేడుకతో చదివితే వేదశాస్త్ర సంపన్నుడౌ |
జాడతో నూరకుండితే జడుడౌను |
వోడక తపసియైతే వున్నతోన్నతుడౌ |
కూడక సోమరి ఐతే గుణహీనుడౌను II
మురహరు గొలిచితే మోక్షము సాధించవచ్చు
వెర వెరగ కుందితే వీరిడి యౌను
శరణంటే శ్రీవేంకటేశ్వరుడు రక్షించును
పరగ సంచయించితే పాషండుడౌను II

—————————
🌻వివరణ నాకు తెలిసినంత
***********************
మానవజన్మ లక్ష్యాన్ని, ఆ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన జీవన విధానాన్ని చెప్పిన కీర్తన ఇది. ఒకరకంగా వ్యక్తిత్వ వికాసానికి సూత్రాలు చెప్పారు అన్నమయ్య.

🔹పల్లవి

*మహినుద్యోగి కావలె మనుజుడైన వాడు |
సహజివలె నుండేమి సాధించలేడు

మనిషైనవాడు ఉద్యోగి కావాలంటాడు. ఉద్యోగమంటే ప్రయత్నం. పసివాడు కూర్చోడం, పాకడం, నడవడం నుంచి జీవితంలో ఏది చేయగలిగినా అది ప్రయత్నం వల్లనే గానీ దానంతటది రాదు. అలాగే జీవన్ముక్తి కూడా ప్రయత్నం వలననే వస్తుంది. స్తోత్రం, లేదా నామం ఒక సారి పఠిస్తేనే పుణ్యం వస్తుందా? మోక్షం కలుగుతుందా? నిరంతర ధ్యానం, నమ్మకం , సహనం వీటితో పాటు మళ్ళీ తన కర్మాచరణలో లోపం లేకుండా చేయాలి.

సహ అంటే భూమి అని అర్థముంది. సహజ అంటే కొండో బండో కావచ్చు. బండరాయిలా పడుంటే ఏదీ సాధించలేవని అర్థం. సహజి కాలక్రమంలో పదం మారి ఉండవచ్చు.

1)చ॥

వెదకి తలచుకుంటే విష్ణుడు కానవచ్చు |
చెదరి మరచితే సృష్టి చీకటౌ |
పొదలి నడిచితేను భూమెల్లా మెట్టి రావచ్చు |
నిదురించితే కాలము నిమిషమై తోచు II

‘భగవంతుడు ఉంటే కనబడడేం’అంటుంటారు.
(ఒక MLA ని కలవడం మనం అనుకోగానే జరుగుతుందా? )

మరిక భగవంతుడంటే విశ్వాధిపతి! జగన్నాటక కర్త! ప్రతివారికీ కనబడే అవసరం ఆయనకేముంది! మనం వెతకాలి. మనం కనబడమని మనసులో వేడుకోవాలి. అన్య చింతనలు వదలాలి. అదే లక్ష్యంగా శ్రమ పడాలి. భగవంతుణ్ణి పొందే మార్గాలు భాగవతంలో చెప్పారు కదా! ఏదో ఒక మార్గంలో అకుంఠిత దీక్షతో సాగితే భగవద్దర్శనం కలిగితీరుతుంది. వెతకాలి ఆయన ఉనికి కోసం!
మనసు చెదిరి పోతే మనకు మిగిలేది చీకటే. ఆపదలో స్మరిస్తాం. వేరే ప్రలోభాలకు గురై అంతలో మరిచి పోతాం. అప్పుడు మిగిలేది చీకటే. చీకటంటే అజ్ఞానమే!

మొదలు పెట్టి నడుస్తుంటే భూమిని కూడ చుట్టిరావచ్చు. సముద్రాలనే ఈదిన వారు, పర్వతాగ్రాలనే చేరిన వారు, ఆ సేతు హిమచలం నడవడమో, సైకిల్ తొక్కడమో చేసినవారు, కొత్త ఖండాలూ, దేశాలూ కనుక్కున్నవారు ఎందరో ఉన్నారు. అదంతా ప్రయత్నమే కదా!

ఇదీ అంతే. సంకల్ప బలంతో ఆపకుండా ముందుకు వెళ్ళాలి!
నిద్రపోతే నిమిషం కూడా ముందుకు పోలేం.తాబేలు కుందేలు కథ విన్నాం కద!

2చ॥
*వేడుకతో చదివితే వేదశాస్త్ర సంపన్నుడౌ |
జాడతో నూరకుండితే జడుడౌను |
వోడక తపసియైతే వున్నతోన్నతుడౌ |
కూడక సోమరి ఐతే గుణహీనుడౌను!

ఇష్టం గా చేస్తే ఏ పనీ కష్ట మనిపించదు. హిరణ్య కశిపుడి వంటి రాక్షసులు వెదికారు. కానీ వాళ్ళు విరోధంతో, కనబడితే చంపాలని వెతికారు. కానీ ఆయన ప్రహ్లదుడి భక్తిని, నమ్మకాన్ని గెలిపించడానికే బయటికి వచ్చాడు.
ఏడుస్తూ ఎంత చదివినా తలకెక్కదు. ఏ పని చేసినా విసుక్కుంటూ చేస్తారు కొందరు. దానివల్ల సుఖము ఉండదు. ఇష్టం లేకపోతే చిన్నపనికూడా భారంగానే ఉంటుంది. ఇష్టంలేకుండా పెద్దవాళ్ళ పోడు పడలేక నేర్చుకునే సంగీతం రాణిస్తుందా? ఏదైనా అంతే!
జాడతో ఉరకడమంటే దేనికైనా ఎవరో ఆచూకీ చెబితేనో , ఉపాయం చెబితేనో మన మనసుకు పదునుండదు. మనంతట మనం వెతికి పట్టుకుంటే ఆ ఆనందమే వేరు. సోమరిగా పరుగెత్తితే మిగిలేది సోమరితనమే. భగవంతుడు ఎవరో చెబితే కనబడడు … ఒక్కొక్కరికి ఒక్కోరకంగా దర్శనమీయవచ్చు. ఆయన జాడ ఒకరు చెప్పేది కాదు.

మామూలు జీవితంలోనే మంచి రాంకు సాధించాలంటే, ఉన్నత మైన స్థాయికి ఎదగాలంటే తపస్సు చేసినట్లు చదవాలి, శ్రమించాలి కదా! ఓటమి ఒప్పుకోకూడదు!

ఇవేవీ కాదని సోమరిపోతుగా ఉంటే వాడిలో శ్రేష్ఠత ఉండదు. గుణము అంటే వన్నె. ఏదో చచ్చీచెడీ డాక్టరో, ఇంజనీరో , మరొకటో అయినా అందులో వన్నె కనబడదు( గుణహీనుడు).

3చ॥
* మురహరు గొలిచితే మోక్షము సాధించవచ్చు
వెర వెరగ కుందితే వీరిడి యౌను
శరణంటే శ్రీవేంకటేశ్వరుడు రక్షించును
పరగ సంచయించితే పాషండుడౌను II

ముర అనే దైత్యుని చంపిన ఆ హరిని పూజిస్తే మోక్షం. మనలోని అసురుడిని చంపి మనం పేరు సాధించడమే నిజమైన పౌరుషం.
భయపడుతూ కుంగిపోతే పనికిమాలిన వాళ్ళమే ఔతాం.
శరణాగతికే ఆ వేంకటపతి కనబడతాడని గజేంద్ర మోక్షం చెబుతోంది. అంటే అంతా ఆయన మీద వేసి కూచోవడం కాదు. నూరు శాతం మనం ప్రయత్నించి , ఆయన అనుగ్రహమూ కోరాలి. అంతా నేనే చేస్తున్నాననే అహం విడిచి పెట్టాలి।

సంవత్సరాల శ్రమతో వేలకోట్ల రాకెట్ తయారుచేసిన సైంటిస్టులు దానిని పంపుతూ దేవుడికి మొక్కడం ఇదే. చేసిన ప్రయత్నం అనుకూలించడానికి దైవానుగ్రహం ఉండాలి। అది మోక్ష మైనా మరొకటైనా!

ఈ విధంగా ఈ నాటి కీర్తనలో ప్రతి వాక్యమూ అన్నమయ్య నిజజీవితానికి కూడా అన్వయించుకునేలా మార్గదర్శకత్వం చేసాడు!

అన్నమయ్య గొప్ప కౌన్సిలింగ్ ఇందులో ఉంది.

కామెంట్‌లు లేవు:

కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! - తెలుగు గజల్

 ॥తాజా గజల్॥  నా pencil చిత్రానికి Dr. ఉమాదేవి గారి గజల్ ~~~~🔹🔸🔹~~~~ కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! పోరాట మేలేని జీవితం కోసమై అన...