19, నవంబర్ 2022, శనివారం

అది నాయపరాధ మిది నా అపరాధ - మదియు నిదియు నాయపరాధము.! - అన్నమయ్య కీర్తన


 ఈ వారం అన్నమయ్య కీర్తన.

ప. అది నాయపరాధ మిది నా అపరాధ - మదియు నిదియు నాయపరాధము.!
1. నెరయ రూపములెల్ల నీ రూపమే కా నరయని యది నా యపరాధము
పరిపూర్ణుఁడగు నిన్నుఁ బరిచ్చిన్నునిఁగా నరయుట నా యపరాధము !
2. జీవత్మునిఁ గాఁ జింతింపఁ దలఁచుట యా వంక నది నా యపరాధము
సేవించి నిను నాత్మఁ జింతింపకుండుట ఆవల నిది నా యపరాధము !
౩. ఈడెరుఁగక వేంకటేశుఁడ నినుఁగొని యాడుట యది నా యపరాధము
ఏడఁ జూచిన నా ఎదుర నుండఁగ నిన్ను నాద నీడ వెదకు తపరాధము.
భావము:
దేవా! అది నా తప్పు, ఇదియు నా తప్పు, రెండునూ నా తప్పులే.
విశ్వమున గోచరించు సమస్త రూపములు నీ రూపమే అని గుర్తించక పోవడం నా తప్పు. పరిపూర్ణుడ వైన నిన్ను దేశకాల నామ రూపాదులకు లోబడిన వానిగా తలచుట నా తప్పిదమే.
పరమాత్ముడవైన నిన్ను సాధారణ జీవాత్మునిగా చింతించుట నా తప్పు. దివ్యమంగళమూర్తివైన నిన్ను సేవించి, చిత్తములో నిను స్మరింపకపోవడం నా తప్పిదమే.
నిన్ను సరిగ్గా తెలుసుకోక నిన్ను నేను స్తుతింపబూనుట నా అపరాధము. సర్వత్ర వ్యాప్తుడవై యున్న నిన్ను ఎక్కడో ఉన్నావని అక్కడ ఇక్కడ వెదుకబోవుట నాయొక్క ఘోర అపరాధము.
విశ్వమంతా వివిధరూపములలో గోచరించే పరమాత్ముని తెలుసుకోలేక పోవడం మన అపరాధము. విశ్వమంతా వ్యాపించిన ఆ భగవంతుడిని కాన లేక ఇక్కడ అక్కడా వెతుకులాడటం కూడా మన అపరాధమే అని అన్నమయ్య ఈ కీర్తనలో వివరించాడు.
(సేకరణ)

15, నవంబర్ 2022, మంగళవారం

మునిమాణిక్యం నరసింహారావు - కాంతం కధల సృష్టికర్త - pencil sketch

Pencil sketch


ఈ నెల తెలుగుతల్లి కెనడా పత్రికలో నేను చిత్రీకరించిన ఈ చిత్రం 'మూర్తిమంతమాయె'  శీర్షికలో ప్రచురించబడింది. పత్రిక యాజమాన్యానికి నా ధన్యవాదాలు.

ఆయన రాసిన మొదటి నవల ‘టీకప్పులో తుఫాను’. ఇందులోనే మొట్టమొదటిగా కాంతం పాత్ర కనపడుతుంది. కాంతం కుటుంబం పేద కుటుంబం. కాంతం కథలలో ఒకటి ఆయన  రేడియో నాటకంగా రాస్తే ఆయన కుమార్తె కాంతంగా వేసి అందరినీ మెప్పించింది. ఆయన "కాంతం కథల" కి ఆయన భార్యే ప్రేరణ, స్ఫూర్తి. నిజ జీవితంలోనే దాంపత్య సన్నివేశాలను, చిన్న సంఘటనలను ఆధారంగా చేసుకుని రాసినవి కాబట్టే ఇప్పటికీ కాంతం కథలు నిత్య నూతనమనిపిస్తాయి. ఇటువంటి ‘కాంతం’ చనిపోగానే ఆయన చాలా దిగులు చెందారు. వెంటనే ఎక్కువగానే ప్రేమించే పెద్దమ్మాయి రుక్కుతల్లి మరణించింది. దాన్ని తట్టుకోవడానికి రచనలు చేసేవారనిపిస్తుంది. కొంతకాలానికి రాజ్యలక్ష్మిని రెండవ భార్యగా చేసుకున్నారు.

ఆయన రాసిన మొదటి నవల ‘టీకప్పులో తుఫాను’. ఇందులోనే మొట్టమొదటిగా కాంతం పాత్ర కనపడుతుంది. కాంతం కుటుంబం పేద కుటుంబం. కాంతం కథలలో ఒకటి ఆయన రేడియో నాటకంగా రాస్తే ఆయన కుమార్తె కాంతంగా వేసి అందరినీ మెప్పించింది. ఆయన "కాంతం కథల" కి ఆయన భార్యే ప్రేరణ, స్ఫూర్తి. నిజ జీవితంలోనే దాంపత్య సన్నివేశాలను, చిన్న సంఘటనలను ఆధారంగా చేసుకుని రాసినవి కాబట్టే ఇప్పటికీ కాంతం కథలు నిత్య నూతనమనిపిస్తాయి. ఇటువంటి ‘కాంతం’ చనిపోగానే ఆయన చాలా దిగులు చెందారు. వెంటనే ఎక్కువగానే ప్రేమించే పెద్దమ్మాయి రుక్కుతల్లి మరణించింది. దాన్ని తట్టుకోవడానికి రచనలు చేసేవారనిపిస్తుంది. కొంతకాలానికి రాజ్యలక్ష్మిని రెండవ భార్యగా చేసుకున్నారు.

తన రచనల ద్వారా మధ్యతరగతి సంసారంలోని సరిగమల్ని ఎన్నింటినో వినిపించాడు మునిమాణిక్యం. తెలుగు హాస్యరచయితలలో మునిమాణిక్యం గారికి ఒక విశిష్టస్థానం ఉంది. మునిమాణిక్యం కేవలం హాస్యరచయిత మాత్రమే కాదు. మంచి హాస్యోపాసకులు కూడా. విభిన్న వ్యక్తుల మనసులను అలరించే హాస్యోక్తులుహాస్య సన్నివేశాలు ఎక్కడ ఆయన దృష్టికి తెచ్చినా వాటిమీద మక్కువతో అనువదించి గాని, అనుసరించిగాని, భాషను కొంచెం తమాషాగా, మార్చి తెలుగుపాఠకులకు అందజేసేవారు.


(సౌజన్యం : వికీపీడియా)

12, నవంబర్ 2022, శనివారం

కరి పద్మనాభాచార్యులు - ప్రముఖ నాటక కర్త


కరి పద్మనాభాచార్యులు Pencil sketch


నట కొలనులో వికసించిన 'పద్మం' శ్రీమాన్ కరి పద్మనాభాచార్యులు, Pride of Visakhapatnam.
'కొండ అద్దమందు కొంచమై ఉండదా' అని వేమన చెప్పినట్టు సమాజంలో ఎందరో లబ్దప్రతిష్టులు, ప్రతిభావంతులు అతి సామాన్యులుగానే దర్శనమిస్తారు. వారిని పలుకరించి, అనుభవాలు, జ్ఞాపకాల దొంతరలు కదిపితే కానీ వారి విశ్వరూపం మనకు అవగతం కాదు. అలాంటి ప్రతిభామూర్తి 'పద్మం' అని సన్నిహితులు పిలుచుకొనే కరి పద్మనాభాచార్యులు, ప్రచారార్భాటాలకు దూరంగా, తను ఆరాధించే నాటకరంగానికి పరిపూర్ణంగా అంకితమైన కొద్దిమందిలో ఒకరు. (ఆంధ్రజ్యోతి దినపత్రికలో వీరి గురించి రాసిన ముందుమాటలు).
శ్రీమాన్ కరి పద్మనాభాచార్యులు Visakhapatnam Port Trust లో పనిచేసిన విశ్రాంత ఉద్యోగి, బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రసిధ్ధ నాటక, సినీ నటులు జె. వి. సోమయాజులు దర్శకత్వంలో, గురజాడ అప్పారావు 'కన్యాశుల్కం' లో పలుపర్యాయాలు అగ్నిహోత్రావధానులుగా అవతారమెత్తారు. ఈ నాటకం వీరి జీవితంలో అంతర్భాగమైపోయింది. ఉద్యోగం చేసుకుంటూనే పలు చోట్ల కన్యాశుల్కంతో పాటు ఇంకా ఎన్నో దేశవ్యాప్తంగా ఎన్నో నాటక ప్రదర్శనలు ఇచ్చారు. పలు పురస్కారాలు పొందారు.
ఇటీవల వీరి తొంభయ్యవ పుట్టినరోజు సందర్భంగా విశాఖపట్నంలో తన నాటక ప్రస్థానంలో తోడుగా నిలిచిన నలభైమందిని పద్మనాభాచార్యులు సత్కరించుకున్నారు.
ఈ సందర్భంగా వారి చిత్రపటం నా pencil తో చిత్రీకరించి వారికే సమర్పించుకునే భాగ్యం కలిగింది. చిత్రకారునిగా వారిచే సత్కరించబడి, ఓ జ్ఞాపికను వారి చేతులు మీదుగా పొందడం నేను చేసుకున్న అదృష్టం.
 

11, నవంబర్ 2022, శుక్రవారం

"కొనరో కొనరో మీరు కూరిమి మందు" - అన్నమయ్య కీర్తన - చిత్రం : పొన్నాడ మూర్తి


అన్నమయ్య కీర్తన : "కొనరో కొనరో మీరు కూరిమి మందు" (చిత్రం : పొన్నాడ మూర్తి

కొనరో కొనరో మీరు కూరిమి మందు
ఉనికి మనికి కెల్లా ఒక్కటే మందు
ధృవుడు గొనిన మందు తొల్లి ప్రహ్లాదుడు
చవిగా గొనిన మందు చల్లని మందు
భవరోగములు వీడి పారగ పెద్దలు మున్ను
జవ కట్టుకొనిన నిచ్చలమైన మందు
నిలిచి నారదుడు గొనిన మందు , జనకుడు
గెలుపుతో కొని బ్రదికిన యా మందు
మొలచి నాలుగు యుగముల రాజులు ఘనులు
కలకాలము గొని కడగన్న మందు
అజునకు పరమాయువై యొసగిన మందు
నిజమై లోకమెల్లా నిండిన మందు
త్రిజగములు నెఱుగ తిరువేంకటాద్రిపై
ధ్వజమెత్తే కోనేటి దరినున్న మందు
ఉనికి మనికికి = ఉండుటకు బ్రదుకుటకును
జవగట్టిన = పొదిగికొనిన, స్వాధీనముగావించుకున్న
నిచ్చలము = నిశ్చలము
భావము :
జనులారా ! ప్రేమ స్వరూపుడైన భగవంతుడు అను ఔషదమును మీరు చేసుకొనుడు. సుఖముగా లోకమున జీవించుటకిది ఒక్కటే తగిన మందు. పూర్వము ధ్రువుడు ఈ మందును సేవించెను. ప్రహ్లాదుడు ఈ మందును మిక్కిలి ప్రీతితో స్వీకరించెను. ఇది యెట్టి ఉద్వేగము కలిగింపని చల్లని మందు. సంసార రోగమును పోగొట్టుకొనుటకై తొల్లి మహనీయులైనవారు శాశ్వతమైన ఈ మందును తమ స్వాధీనము గావించుకొనిరి.
ఈ మందునే నారదుడు శ్రధ్ధతో సేవించెను. విదేహాధిపతియైన జనకుడు విజయోత్సాహముతో ఈ మందునే స్వీకరించి బ్రహ్మానందముతో జీవించెను. వారు వీరననేల? నాలుగు యుగములకు జెందిన నరపతులు, మహాత్ములు జీవించినంతకాలము ఈ మందునే సేవించి ముక్తులైరి.
ఈ మందే బ్రహ్మదేవునకు పరమాయువై విలసిల్లినది. ఇదే సత్యస్వరూపమై భువనములెల్ల నిండియున్నది. కోనేటిగట్టునున్న ఈ మందే ముల్లోకములెరుంగునట్లు ‘నావలె భవరోగమును పరమార్పగల మందింకొకటి లేదు’ అని శ్రీవేంకటాద్రి పై టెక్కమెత్తి చాటినది. (‘ధ్వజమెత్తి’ అను పాఠమైనచో ధ్వజమెత్తి చాటుచు కోనేటి గట్టునున్న మందు అని భావము)
వ్యాఖ్యాత : ‘సాహిత్య శిరోమణి’ సముద్రాల లక్ష్మణయ్య
సౌజన్యం : అన్నమాచార్య సంకీర్తనామృతము, ప్రచురణ : తిరుమల తిరుపతి దేవస్థానములు

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...