11, నవంబర్ 2022, శుక్రవారం

"కొనరో కొనరో మీరు కూరిమి మందు" - అన్నమయ్య కీర్తన - చిత్రం : పొన్నాడ మూర్తి


అన్నమయ్య కీర్తన : "కొనరో కొనరో మీరు కూరిమి మందు" (చిత్రం : పొన్నాడ మూర్తి

కొనరో కొనరో మీరు కూరిమి మందు
ఉనికి మనికి కెల్లా ఒక్కటే మందు
ధృవుడు గొనిన మందు తొల్లి ప్రహ్లాదుడు
చవిగా గొనిన మందు చల్లని మందు
భవరోగములు వీడి పారగ పెద్దలు మున్ను
జవ కట్టుకొనిన నిచ్చలమైన మందు
నిలిచి నారదుడు గొనిన మందు , జనకుడు
గెలుపుతో కొని బ్రదికిన యా మందు
మొలచి నాలుగు యుగముల రాజులు ఘనులు
కలకాలము గొని కడగన్న మందు
అజునకు పరమాయువై యొసగిన మందు
నిజమై లోకమెల్లా నిండిన మందు
త్రిజగములు నెఱుగ తిరువేంకటాద్రిపై
ధ్వజమెత్తే కోనేటి దరినున్న మందు
ఉనికి మనికికి = ఉండుటకు బ్రదుకుటకును
జవగట్టిన = పొదిగికొనిన, స్వాధీనముగావించుకున్న
నిచ్చలము = నిశ్చలము
భావము :
జనులారా ! ప్రేమ స్వరూపుడైన భగవంతుడు అను ఔషదమును మీరు చేసుకొనుడు. సుఖముగా లోకమున జీవించుటకిది ఒక్కటే తగిన మందు. పూర్వము ధ్రువుడు ఈ మందును సేవించెను. ప్రహ్లాదుడు ఈ మందును మిక్కిలి ప్రీతితో స్వీకరించెను. ఇది యెట్టి ఉద్వేగము కలిగింపని చల్లని మందు. సంసార రోగమును పోగొట్టుకొనుటకై తొల్లి మహనీయులైనవారు శాశ్వతమైన ఈ మందును తమ స్వాధీనము గావించుకొనిరి.
ఈ మందునే నారదుడు శ్రధ్ధతో సేవించెను. విదేహాధిపతియైన జనకుడు విజయోత్సాహముతో ఈ మందునే స్వీకరించి బ్రహ్మానందముతో జీవించెను. వారు వీరననేల? నాలుగు యుగములకు జెందిన నరపతులు, మహాత్ములు జీవించినంతకాలము ఈ మందునే సేవించి ముక్తులైరి.
ఈ మందే బ్రహ్మదేవునకు పరమాయువై విలసిల్లినది. ఇదే సత్యస్వరూపమై భువనములెల్ల నిండియున్నది. కోనేటిగట్టునున్న ఈ మందే ముల్లోకములెరుంగునట్లు ‘నావలె భవరోగమును పరమార్పగల మందింకొకటి లేదు’ అని శ్రీవేంకటాద్రి పై టెక్కమెత్తి చాటినది. (‘ధ్వజమెత్తి’ అను పాఠమైనచో ధ్వజమెత్తి చాటుచు కోనేటి గట్టునున్న మందు అని భావము)
వ్యాఖ్యాత : ‘సాహిత్య శిరోమణి’ సముద్రాల లక్ష్మణయ్య
సౌజన్యం : అన్నమాచార్య సంకీర్తనామృతము, ప్రచురణ : తిరుమల తిరుపతి దేవస్థానములు

కామెంట్‌లు లేవు:

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...