19, నవంబర్ 2022, శనివారం

అది నాయపరాధ మిది నా అపరాధ - మదియు నిదియు నాయపరాధము.! - అన్నమయ్య కీర్తన


 ఈ వారం అన్నమయ్య కీర్తన.

ప. అది నాయపరాధ మిది నా అపరాధ - మదియు నిదియు నాయపరాధము.!
1. నెరయ రూపములెల్ల నీ రూపమే కా నరయని యది నా యపరాధము
పరిపూర్ణుఁడగు నిన్నుఁ బరిచ్చిన్నునిఁగా నరయుట నా యపరాధము !
2. జీవత్మునిఁ గాఁ జింతింపఁ దలఁచుట యా వంక నది నా యపరాధము
సేవించి నిను నాత్మఁ జింతింపకుండుట ఆవల నిది నా యపరాధము !
౩. ఈడెరుఁగక వేంకటేశుఁడ నినుఁగొని యాడుట యది నా యపరాధము
ఏడఁ జూచిన నా ఎదుర నుండఁగ నిన్ను నాద నీడ వెదకు తపరాధము.
భావము:
దేవా! అది నా తప్పు, ఇదియు నా తప్పు, రెండునూ నా తప్పులే.
విశ్వమున గోచరించు సమస్త రూపములు నీ రూపమే అని గుర్తించక పోవడం నా తప్పు. పరిపూర్ణుడ వైన నిన్ను దేశకాల నామ రూపాదులకు లోబడిన వానిగా తలచుట నా తప్పిదమే.
పరమాత్ముడవైన నిన్ను సాధారణ జీవాత్మునిగా చింతించుట నా తప్పు. దివ్యమంగళమూర్తివైన నిన్ను సేవించి, చిత్తములో నిను స్మరింపకపోవడం నా తప్పిదమే.
నిన్ను సరిగ్గా తెలుసుకోక నిన్ను నేను స్తుతింపబూనుట నా అపరాధము. సర్వత్ర వ్యాప్తుడవై యున్న నిన్ను ఎక్కడో ఉన్నావని అక్కడ ఇక్కడ వెదుకబోవుట నాయొక్క ఘోర అపరాధము.
విశ్వమంతా వివిధరూపములలో గోచరించే పరమాత్ముని తెలుసుకోలేక పోవడం మన అపరాధము. విశ్వమంతా వ్యాపించిన ఆ భగవంతుడిని కాన లేక ఇక్కడ అక్కడా వెతుకులాడటం కూడా మన అపరాధమే అని అన్నమయ్య ఈ కీర్తనలో వివరించాడు.
(సేకరణ)

కామెంట్‌లు లేవు:

ముందు చూపు కలిగి - ఆటవెలది

ఎంత చక్కటి చిత్రమో 😍 ఆటవెలది // ముందు చూపు గలిగి ముందునిద్ర యనుచు  కన్ను మూసి మంచి కలలు గనుచు  హాయిననుభవించు రేయి పగలు  యంత దూర దృష్టి వింత...