28, జనవరి 2023, శనివారం

ఆతడే ఇన్నియు నిచ్చు నడిగిన వల్లాను చేతిలోనే ఉండగాను చింతించడు హరిని - అన్నమయ్య కీర్తన


 

ప. ఆతడే ఇన్నియు నిచ్చు నడిగిన వల్లాను
చేతిలోనే ఉండగాను చింతించడు హరిని !!
వలనంటే సంపదలు వట్టి ఎలమట బెట్టు
అలసి నోప నంటేను అండనే ఉండు
తలచి ఇందరు నీ తరితీపుల జిక్కి
తలచ రెందును బర తత్వమైన హరిని
ఆశపడితే నింతులు అన్నిటాను బిగుతురు
వాసితో నుంటేనే తామే వతుతు రొద్దికి
పోసరించి ఇందరు నీ పొందుల భ్రమలబడి
పాసిఉన్నారదే తమ పతియైన హరిని
గట్టిగా రాతిరెల్లాను కలయై యుండు జగము
పట్టపగలైతే తమ పాల నుండును
బట్టబయలు పందిలి పెట్టేరు గాని చే
పట్టరు శ్రీవేంకటాద్రి పైనున్న హరిని

భావం : సౌజన్యం 'సాహిత్యశిరోమణి' సముద్రాల లక్ష్మణయ్య

ఆ పరమాత్ముడే భక్తితో ప్రార్ధించినచో జీవులు కోరిన కోరిక లెల్ల నెరవేర్చును. అందుబాటులో అనగా తమ హృదయగుహయందే ఉన్నను ఆ శ్రీహరిని మూఢులు చింతింపరు.
అందుకని ఆశపడి ఆర్జింపబూనినచో సంపదలు చేతికి జిక్కక అనేకశ్రమలకు గురిచేయును. వాటిపై విసిగి నాకీ సిరు లక్కరలేదు” అని భగవంతునే భావించుచు ఊరకున్నచో తమకు తామే అవి చెంతకువచ్చి చేరును. లోకులెల్లరు ఈ రహస్యము తెలియక సంపదల వ్యామోహములోబడి పరతత్వమైన హరిని భావింపకున్నారు.
పురుషులు ఆశపడి తామే పైకొనబూనిచనచో కామినులు అన్నివిధముల బిగువు చూపుదురు. గౌరవము వీడక బెట్టుగా ఊరకున్నచో వారే తమపొంతకు వత్తురు. కాని జనులెల్లరు కాంతలపై భ్రాంతిగొని కామోన్మతుతులై వారికై ఆరాటపడి తమ పతియైన శ్రీహరిని వీడియున్నారు.

రాత్రి గాఢనిద్రలో ఉన్నప్పుడు జగమంతయు కలవలె ఉనికి లేనిదగుచున్నది. మరల తెల్లవారగనే జీవులపాలిటి కది అన్ని రూపులలోనూ ప్రత్యక్షమగుచున్నది. ఇంతగా అశాశ్వతమైన ఈ ప్రపంచములో జీవులు బట్టబయలు పందిలి పెట్టినట్టుగా ఏమో సాధింపగోరి వ్యర్ధప్రయత్నములు చేయుచున్నారేగాని శాశ్వతుడై శ్రీవేంకటాద్రిపై నున్న శ్రీహరిని మాత్రము చేపట్టరు.

చిత్రం : పొన్నాడ మూర్తి

కామెంట్‌లు లేవు:

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...