26, జనవరి 2023, గురువారం

సరస్వతీ నమస్తుభ్యం - వసంత పంచమి సరస్వతీ దేవికి పద్య సుమార్చన



 

నా చిత్రానికి డా. ఉమాదేవి ప్రసాదరావు గారు సమర్పించిన పద్య సుమార్చన.

వసంత పంచమి సరస్వతీ దేవికి పద్య సుమార్చన !

🙏
☘️☘️🌸🌸🌸🌸🌸🌸🌸☘️☘️
1)ఉ//
శారద గొల్వగాధిషణ జ్ఞానము
నొందును నిష్కళంకమై
చారుసుహాసినిన్ దలచ చారిమ యేర్పడు నాత్మలోపలన్
పారము లేనినీ దయన పామరు
డైనను కాళిదాసగున్
కోరుదు నాదు వాక్కునను గూర్చొన బ్రాహ్మిణి సత్కళానిధీ!
2)
ఉ //
జ్ఞానముఁబెంచుమా జనని శారద !భారతి! మానసంబునన్
గానను దారినీదుపద కంజము చేరగ జ్ఞానహీననై
తేనెలు చిందుమాటలనుఁదేలికగాఁ బ్రతి పద్యమందునన్
దానము సేయరాగద సుధారస ధారలు జారునట్లుగన్
3)సీ।।
కలువగన్నులజూడ కలిగెను మోదంబు
మోముచంద్రునిజూచి మురిసిపోతి
అరుణాధరపుకాంతి కానంద మొందితి
ముక్కెర వెలుగుకు చొక్కుగలిగె
కోటీర కాంతులు కమనీయ మమ్మరో
కళలకు స్రష్టవు కర్త పత్ని
వల్లకిఁజూచి వివశురాల నై తిని
సౌందర్య రాసివి శారదాంబ
ఆ.వె//
వేధ పత్ని వాణి వేవేల దండాలు
బుద్ధి విద్య నొసగి బ్రోవు మమ్మ
నుడికడలివి నిన్ను నుతియింతు నిరతము
బిడ్డ లందరికిని విద్య నిమ్ము !
(వేధ .. బ్రహ్మ)
4)కం//
సంగీతామృత వర్షిణి
భృంగివలెమనంబుదిరిగె ప్రీతిగ నీకై
పొంగెను హర్షము గంగై
సింగిణి వికసించెనాదు చిత్తములోనన్ !
( సింగిణి - హరివిల్లు )
5)కం //
మూలా నక్షత్ర మునన్
మాలాధరి జన్మనొందె మహత్తు జూపన్
చేలము తుషార ధవళము
కేలున కలదొక్కచిలుక క్రీడించుటకై
6)చం //
సలలితరాగ మొల్కగలసప్తనుదాల్చి విరాజమానయై
విలసిత హంసవాహనపుబెట్టిద మొప్పగ లచ్చికోడలా
నలువకుచెంతజేరి పతి నాలుగుమోము లముద్దు జేయగా
కలుగును గాక సౌఖ్యములు కామితముల్ సమకూరు నిత్తరిన్ !
(సప్త .. వీణ )
7)కం//
పుస్తక పాణీ వాణీ
నిస్తుల విజ్ఞాన రాసి నీరజ నయనా
మస్తకమునందు తెలివిని
వ్యస్తము గానీయకమ్మ పల్కులబోటీ !
➿➿➿➿➿🌺➿➿➿➿➿
ఉమాదేవి జంధ్యాల
చిత్రకారులు పొన్నాడ మూర్తిగారికి కృతజ్ఞతలు 🙏

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...