28, ఫిబ్రవరి 2023, మంగళవారం

మెరుగు వంటిది అలమేలుమంగ - అన్నమయ్య కీర్తన





ఈ వారం అన్నమయ్య కీర్తన
పల్లవి:
మెరుగు వంటిది యలమేలుమంగ |
అరిమురి నవ్వీని అలమేలుమంగ ||
చరణం:
పలుచని యెలుగున బాడీ నీ మీది పాట |
మెలుపు గూరిమి నలమేలుమంగ |
చెలులతో నీ సుద్ది చెప్పిచెప్పి కరగీని |
అలయుచు సొలయుచు నలమేలుమంగ ||
చరణం:
ఈడుగా నీ రాకకు నెదురెదురుచూచీ |
మేడ మీద నుండి యలమేలుమంగ |
వాడు మోముతో నీపై వలపు చల్లి చల్లి |
ఆడీ నాట్యము సారె నలమేలుమంగ ||
చరణం:
పేరుకొని పిలిచీని ప్రియములు చెప్పి చెప్పి |
మేరమీర నిన్ను నలమేలుమంగ |


యీరీతి శ్రీవేంకటేశ నిన్ను గూడె నేడు |
ఆరితేరి నన్నిటాను అలమేలుమంగ ||
మెరుపులాంటి అలమేలు మంగమ్మ శ్రీనివాసుడిని చూడగానే ముగ్ధయై నవ్వుతోందని తన పదపల్లవిలో ప్రస్ఫుటం చేస్తున్నాడు. మెరుగు అంటే ఆకాశంలోని మెరుపు. ‘అరిమురి’ అంటే సంభ్రమంతో అని అర్ధాలు.
‘పలుచని యెలుగున’ అంటే సన్నని గొంతుతో అని, ‘మెలుపు కూరిమి’ అంటే గాఢమైన ప్రేమ అని అర్ధాలు. ఆ ప్రేమస్వరూపిణి పతిదేవుడిపై పలుచని స్వరంతో పాటలు పాడుతోందిట. ఆయన గురించి తన చెలికత్తెలతో కబుర్లు చెప్పి , చెప్పి పరవశించిపోతొందిట! అలా పాటలు పాడి, మాటలు చెప్పి అలిసిపోయిందిట!
అలమేలుమంగ ఆ అర్తత్రాణ పరాయణుడు కోసం మేడపై ఎదురుచూస్తూ ఉండేదట! కొన్నిసార్లు ఆ స్వామిపై ప్రేమతో ఆ శ్రీదేవి నాట్యమూ చేసేదట! అలా ఎదురుచూసి, నృత్యం చేసి ఎంతో అలసిపోయిన ఆమె ముఖాన్ని ఒక్కసారి పరికించవయ్యా! అని అన్నమయ్య ఆ పురాణపురుషుడిని ప్రార్ధిస్తూ..
ఈడుగా నీ రాకకు నెదురెదురు చూచీ
మేడమేద నుండి యలమేలు మంగ
వాడు మోముతో నీపై వలపు చల్లి చల్లి
అదే నాట్యము సారె నలమేలు మంగ … అంటున్నాడు.
‘ఎదురెదురు’ అంటే ఎదురుతెన్నులు. ‘సారెకు’ అంటే మాటిమాటికి, ‘వాడు మోముతో’ అంటే వాడిపోయిన ముఖంతో అని అర్ధం.
ప్రియములు చెప్పి చెప్పి ..
స్వామి పేరుని స్మరించడమే అమ్మకు సార్ధకత. అందుకే పలుమార్లు ఆయన నామాన్ని నెమరువేసుకునేవారట! అలా ఏడుకొండలవాడి పేరుని స్మరించి, స్మరించి ఆ పద్మావతి ఆయనలోని తన అర్ధభాగానికి న్యాయం చేసింది. ఆ సన్నివేశాన్నే స్ఫురింపజేస్తూ ‘నీ సాన్నిధ్యంతో ఆమె అన్నింటిలోనూ ఆరితేరిపోయింది స్వామీ!” అంటూ ఈ సంకీర్తనాచార్యులు ..
పేరుకొని పిలిచీని ప్రియములు చెప్పిచెప్పి
మేరమీర నిన్ను నలమేలు మంగ …
అంటూ పదామృతాన్ని ముగిస్తున్నారు. ‘మేరమీర” అంటే అమితంగా అని భావం. అయితే అన్నమయ్యలా ఆ పద్మావతిని ప్రస్తుతించాలంటే ముందు మనస్సు పసిపిల్లడిలా పవిత్రం కావాలి. ఆ మనోస్వచ్ఛత ఆ మనొజ్ఞను ఆరాధించడానికి ప్రధాన అర్హత్.
సౌజన్యం : శ్రీమతి బి. కృష్ణకుమారి గారి వ్యాసం ఆధారంగా. వారికి నా ధన్యవాదాలు.
చిత్రం ' Pvr Murty


27, ఫిబ్రవరి 2023, సోమవారం

నీ నవ్వుల కిలకిలలే నా మనసుని తాకినవి. - కవిత




 

నా చిత్రానికీ శ్రీమతి పుచ్చా గాయత్రీ దేవి గారు అల్లిన కవిత.


నీ నవ్వుల కిల కిలలే నా మనసుని తాకినవి 

నీ శ్వాసల నిట్టూర్పులు నా తనువును తాకినవి.


సరాగములు,  సయ్యాటలు, శ్రుతిమించని తరంగాలు 

నీవలపుల ప్రేమాటలు మధురిమలను పంచినవి

సురగంగల కదలి వచ్చే నా ప్రేమ ఝురి నీవే కదా !

నీ ఊసులు, ఊహలతో నా దినము గడచినది.


నీ నవ్వుల కిల కిలలే నా మనసుని తాకినవి 

నీ శ్వాసల నిట్టూర్పులు నా తనువును తాకినవి.


నా ఊహల నందనమా,  కదలి వచ్చే వయ్యారమా ! 

వెన్నెలంటి చిరునవ్వుతో మెరిసే మణి హారమా ! 

వాదనలు, శోధనలు విధి రాసిన వింత రచన 

ఈ నాటక రూపములో నా జీవన భాగ్యమా !


నీ నవ్వుల కిల కిలలే నా మనసుని తాకినవి 

నీ శ్వాసల నిట్టూర్పులు నా తనువును తాకినవి.


కరుణ పంచు నీ రూపే కరువు తీర కాంచిన,

సుధలు పంచు నీ పలుకే మదినిండుగా వినినా 

సమ్మెహన పదానికే నీవే తాత్పర్యమా !!

కదలాడే చంద్రవంక నా ఊహా చిత్రమా !


పి. గాయత్రిదేవి.

Ponnada VR Murty గారి చిత్రము

22, ఫిబ్రవరి 2023, బుధవారం

నార్ల వేంకటేశ్వర రావు - తెలుగు పత్రికా సంపాదక దిగ్గజం

 

Pencil sketch by me


తెలుగు పత్రికా శిఖరం నార్ల వేంకటేశ్వర రావు గారు గురించి సేకరించిన వివరాలు.


తెలుగు పత్రికా రచనను కొత్త పుంతలు తొక్కించిన బహుముఖ ప్రతిభాశీలి మరియు మేధావి ఆయన. మూడు దశాబ్దాల పాటు తెలుగు పాఠకులకు సుపరిచితుడైన ఆయన శతక పద్యాల 
ద్వారా బాలలకూ చేరువయ్యాడు. రచయితగా, నాటకకర్తగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా బహుముఖ పాత్రలు పోషించిన ఆయన ఛాందస విశ్వాసాలపై రాజీలేని పోరు సాగించి హేతుబద్ధమైన ఆలోచనలను ప్రజలకు చేరువ చేయడానికి ప్రయత్నించారు. జబల్ పూర్‌లో పుట్టిన ఈ తెలుగు తేజం, రాజ్యసభ సభ్యుడిగానూ పనిచేయడం విశేషం. తెలుగు సాహితీ లోకంలో సామాజిక సంస్కరణకు పెద్దపీట వేసిన  ఆ మేటి రచయితే "నార్ల వెంకటేశ్వరరావు".

మరిన్ని వివరాలు క్రింది లింక్ క్లిక్ చేసి చదవండి.


https://www.sakalam.in/veteran-journalist-narla-venkateswara-rao-death-anniversary/

కాటూరి వేంకటేశ్వర రావు - తెలుగు కవి, రచయిత, నాటక కర్త


సాహితీ హాలికుడు 'కాటూరి వేంకటేశ్వర రావు' (1895-1962) -

(pencil sketch - clarity బాగా తక్కువగా ఉన్న ఆనాటి reference ఫోటో నుండి సాధ్యమైనంత వరకూ పునరుధ్ధరణ)

సౌందర్య సస్యాన్ని సమృద్ధిగా పండించిన వెనుకటి తరం సాహితీ హాలికులలో శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు ఒకరు.

చెళ్ళపిళ్ళ వారి వద్ద చేసిన శుశ్రూషా ప్రభావం వల్ల కావచ్చు, కాటూరివారి కవితలో ప్రాచీనార్వాచీనతలు రెండూ సమ్మిళితమైనవి. వస్తువు కొత్తదైతే, పద్ధతి పాతది; పద్ధతి కొత్తదైతే, వస్తువు పాతది. కొత్త పాతల మేలుకలయికకు ఒక ఉదాహరణగా వారి కవిత్వం సాగింది. తెలుగులో ‘రొమాంటిక్’ కవిత్వంపై ఆకర్షణ ప్రబలంగా వున్న రోజులలో రచన ప్రారంభించినా, ఆయన దృష్టి ఎక్కువగా జాతీయవాదం వైపు, ధార్మిక ప్రబోధం వైపు ప్రసరించింది. గాంధీ సిద్ధాంతాలతో ఆయన ఎక్కువగా ప్రభావితులయ్యారు.

గురువులైన తిరుపతి వెంకట కవుల వలె కాటూరి, పింగళి జంటకవులుగా కవితావ్యాసంగం ప్రారంభించారు. వారుభయులు రచించిన తొలకరి, సౌందర్యనందం ఆంధ్ర భాషకు అమూల్యాలంకారాలు. ఆ తరువాత కాటూరివారు విడిగా రచించిన ఖండకావ్యాల సంఖ్యలోనే స్వల్పమైనవి కాని, గుణంలో అస్వల్పమైనవి. అస్పృశ్యతా నిర్మూలనాన్ని ప్రబోధించే ‘గుడి గంటలు’ భక్తితత్వాన్ని ఆవిష్కరించే ‘పౌలస్త్య హృదయం’ మొదలైన ఖండ కావ్యాలు కాక భాస నాటకాలకు, కొన్ని సంస్కృతాంగ్ల కృతులకు అనువాదాలు, ఇతర నాటికలు, సంగీత రూపకాలు వారి ప్రతిభకు నిదర్శనాలు.

కాటూరివారి వ్యాపకాలు బహుముఖమైనవి. కొన్నాళ్ళు కవిత్వం, కొన్నాళ్ళు కృష్ణాపత్రిక సంపాదకత్వం, మరి కొన్నాళ్ళు బందరు జాతీయ కళాశాల ప్రధానాచార్యత్వం, హిందీ ప్రచారం, సాహిత్య సమావేశాలు, గోష్ఠులు, ఇటువంటివి మరెన్నో! ఏ వ్యాపకంలో వున్నా తమంతటి సహృదయులు, రసజ్ఞులు, స్నేహపాత్రులు మరి లేరనిపించుకొన్న ఉదాత్త వ్యక్తిత్వం ఆయనది.

సౌజన్యం : (1962 డిసెంబర్ 27 ‘ఆంధ్రజ్యోతి’
సంపాదకీయం ‘శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు’ అంతర్జాలం నుండి సేకరణ)

21, ఫిబ్రవరి 2023, మంగళవారం

పల్లెల్లో చాకలి..


 పల్లెల్లో చాకలిది చాల ప్రధానమైన వృత్తి. ఈ చాకలి వృత్తి, వారి వారసత్వ హక్కు. రెండు, మూడు పల్లెలు కలిపి ఒక చాకలి కుటుంబం వుంటుంది. వారు తప్ప వేరే చాకలి ఆవూరి వారి బట్టలను వుతక రాదు. పల్లె వాసులకు కూడా వేరొక చాకలిని పెట్టు కోడానికి హక్కు లేదు. ఒక చాకలికి ఇద్దరు మగ పిల్లలుంటే వారు వేరు పోదలచు కుంటే, వారి అధీనంలో వున్న ఊర్లను పంచు కుంటారు. చాకలి లేనిదే పల్లెల్లో సాంప్రదాయమైన పనులు చాల జరగవు. వారి ముఖ్యమైన పని అందరి బట్టలను ఉతికి తేవడం. మధ్యాహ్నం ఒకరు వచ్చి ప్రతి ఇంటి వద్ద కొంత అన్నం కూర తీసుకుని వెళ్లి తింటారు. అలాగే రాత్రికి కూడా కొంత అన్నం పెట్టాలి. ఊరి వారి బట్టలి అన్ని కలిపి వున్నా సాయంత్రానికి ఎవరి ఇంటి బట్టలు వారివి వేరు చేసి వారి వారికిస్తారు. బట్టలను వారు అంత బాగా గుర్తు పట్టగలరు. అందుకే చదివిన వాడికన్న చాకలి మిన్న అన్న నానుడి పుట్టింది . వారు బట్టలను ఉతికే ముందు కొన్ని బట్టలను ఉబ్బకేస్తారుఉబ్బ అంటే మూడు పెద్ద మట్టి కుండలను త్రికోణాకారంలో పెద్ద పొయ్యి మీద పెట్టి వాతి చుట్టూ మట్టితో దిమ్మ కడ్తారు. ఆ కుండల మూతులు మాత్రమే కనిపిస్తుంటాయి. వాటిల్లో సగం వరకు నీళ్లు పోసి, ఆమూడు కుండల మీద ఉబ్బకు వేయాల్సిన బట్టలను సౌడు నీళ్లతో తడిపి చుట్టలు చుట్టలుగా రెండు మూడు అడుగులఎత్తు వరకు అమర్చుతారు. తర్వాత అ బట్టల కుప్పకు ఒక పెద్ద బట్టను కప్పుతారు. ఇప్పుడు కుండల క్రింద మంట పెడ్తారు. కుండలలోని నీరు ఆవిరై అది పైనున్న బట్టలన్నింటికి వ్యాపిస్తుంది. అలా ఒక గంట ఆవిరి పట్టాక వాటిని తీసి నీళ్లలో వుతుకుతారు. అప్పుడు ఆ బట్టలు చాల తెల్లగా వస్తాయి. వీటిలో రంగు బట్టలు వేయరు. ఎందుకంటే ఒకదాని రంగు మరొక దానికి అంటు తుంది. సౌడు అనగా సౌడు భూములలో పైకి తేలిన ఉప్పటి నున్నటి మట్టి. బట్టలు ఉతికినందుకు చాకలికి ఫలితానికి ఒక సారి మేర ఇవ్వాలి, మేర అంటే ఐదు బళ్ళ వడ్లు. అలాగే వరి కోతలప్పుడు అందరి పని వాళ్లతో బాటు చాకలికి కూడా ఒక మోపు వరిని కూడా వదిలి పెట్టాలి. దాన్ని చాకలి ఇంటికి తీసు కెళ్లతాడు. అలా అందరి రైతుల వద్దనుండి వచ్చిన వరి మోపులను ఒక్క రోజున నూర్చి వడ్లను తీసుకుంటాడు. పెళ్ళి పత్రికలు రాకముందు పెళ్ళి పిలుపులకు చాకలినే పంపే వారు. తమలపాకులువక్కలు ఇచ్చి ప్రతి ఇంటికి, వేరే వూర్లో వున్న బంధువులకు చెప్పిరమ్మని చాకలిని పంపేవారు. స్వంత గాళ్లు పిలిచిన పిలిపు కంటే చాకలి పిలుపుకే గౌరవం.... మర్యాద.... సాంప్రదాయం కూడ. ఏశుభ కార్యానికైనా వక్క ఆకు ఇచ్చి పిలిస్తేనె అది మర్యాద. లేకుంటే అయిష్టంగా పిలిచినట్లే భావించే వారు. ఆ సందర్భంగా పుట్టినదే ఈ నానుడి: నాకేమైనా ,వక్క ఆకు ఇచ్చి పిలిచారా నేను రావడానికి? అదేవిధంగా పిల్లలు పుట్టినపుడు పురుడుకు వూరివారి నందరిని చాకలే పిలవాలి నీళ్లు పోయడానికి. చాకలే ముందు నీళ్లు పోయాలి. ఆడ పిల్లలు సమర్తాడినప్పుడు (పుష్పవతి) విషయాన్ని ఊరి వారందరికి చాకలితో చెప్పి పంపుతారు. ఆడ పిల్లలు సమర్థాడి (పుష్పవతి) నప్పుడు వారి వంటి పైనున్న బట్టలు చాకలికే చెందుతాయి. దీనిని బట్టే ఒక సామెత పుట్టింది. అదేమంటే.... సరదాకి సమర్థాడితె చాకలి వచ్చి చీరపట్టు కెళ్లిందట. ఈ సామెతలో.. సరదాకి కూడా అబద్ధం ఆడ కూడదనే సందేశం ఉంది. ఎవరైనా ప్రయాణమై వెళుతున్నప్పుడు చాకలి ఎదురు పడితే శుభ చూచకంగా బావించేవారు. పెళ్ళిల్లలో చాకలి చేయాల్సిన సాంప్రదాయ పనులు చాల వుంటాయి. దీవిటి పట్టడం, చాకలి సాంగెం అనే ఒక కార్యక్రమం వుండేది. అది లేక పోతే చాల లోటు. పంతులు గారు కూడా కొన్ని సందర్భాలలో చాకలి ఎక్కడ అని పిలుస్తుంటాడు. పెళ్ళి సందర్భంగా చాకలికి ప్రత్యేకించి డబ్బులు ఇవ్వరు. కాని అక్కడ తలంబ్రాలు పోసిన బియ్యం చాకలికే చెందుతాయి. అలాగే మంగళ స్నానం తర్వాత విడిచిన బట్టలు కూడా చాకలికే చెందు తాయి. శోభనము నాడు కూడా చాకలికి ప్రధాన పాత్ర ఉంది. జాతరలు, గ్రామ దేవతల పూజలందు చాకలే పూజారి. ప్రతి పండక్కి ఊరి వారందరు ప్రతి రోజు అన్నం పెట్టినట్టే పిండి వంటలు ఇస్తారు. సమాజంలో ముఖ్యమైన పాత్ర వహించిన ఈ చాకలి వృత్తి ప్రస్తుతం పూర్తిగా కనుమరుగైనది. అప్పట్లో వంకల్లో వాగుల్లో ఎక్కడ పడితే అక్కడ నీళ్లు లభించేవి.బట్టలుతికే వారి పని సులువయ్యేది. రాను రాను నీటి లబ్యత తక్కువయ్యే కొద్ది నీటి కొరకు పొలాలలోని బావుల వద్దకు పరుగులు తీసి, అవికూడ అడుగంటగా వారికి దిక్కు తోచ లేదు. పైగా రైతులు వరి పండించడం మానేయగా.. వారికి రావలసిన మేర సరిగా రాక, ఇలా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని క్రమంగా ఆ వ్వవస్థ కనుమరుగైనది. చాల తక్కువగా వుండే చాకలి కులం సామాజిక మార్పులతో చెల్లా చెదురై అంతరించి పోయింది. తరతరాలుగా బట్టలుతికిన చాకిరేవులలో చాకి బండలు నునుపు దేలి చాకలి వృత్తికి సాక్షిభూతంగా నేటికి అక్కడక్కడా పడి ఉన్నాయి. పల్లె ప్రజలు ఎవరి బట్టలు వారే వుతుక్కుంటూ కాలం వెళ్ల దీస్తున్నారు. చాకలి, మంగలి లేకుండా శుభ, అశుభ కార్యక్రమాలు జరిగే అవకాశమే లేదు ఒకపుడు. కాని విధి లేని పరిస్థితిలో ప్రస్తుతం వారు లేకుండానే ఆ కార్యక్రమాలు జరిగి పోతున్నాయి. పట్టణాలలో కళ్యాణ మండ పాలలో జరిగే పెళ్ళిల్లలో వారి అవసరమే లేకుండా జరిగిపోతున్నాయి. కాక పోతే బట్టల మురికి అతి సులభంబా వదల గొట్ట డానికి అనాడు లేని డిటర్జెంటులు, పౌడర్లూ, సబ్బులు, బట్టలు ఉతికే యంత్రాలు ఇప్పుడొచ్చాయి. పైగా మురికి అంతగా అంటని, అంటినా సులభంగా వదిలిపోయే టెర్లిన్, టెరికాట్, పోలిస్టర్ వంటి బట్టలు ఎక్కువైనాయి. రాబోవు తరాల వారికి చాకలి అంటే పుస్తకాలలో చదువు కోవలసిందే.

చిత్రం: పొన్నాడ మూర్తి 


 సౌజన్యం:  Wikipedia 

8, ఫిబ్రవరి 2023, బుధవారం

సురభి కమలాబాయి - చందాల కేశవదాసు

తొలి పూర్తి తెలుగు సినిమా కథానాయిక సురభి కమలాబాయి, తొలి సినిమా గీత రచయిత చందాల కేశవదాసు. తొలి పూర్తి సినిమా 'భక్త ప్రహ్లాద' విడుదలై 91 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వీరిని స్మరించుకుందాం. (పెన్సిల్ చిత్రాలు.. ఈ రెండు చిత్రాలు 'తెలుగుతల్లి కెనడా' పత్రికలో ప్రచురించిన పత్రిక యాజమాన్యానికి నా ధన్యవాదాలు)

 

తొలి తెలుగు సినిమా 'భక్త ప్రహ్లాద' - కధా కమామీషూ

 తొలి full-length తెలుగు సినిమా - కధా కమామీషూ

(తొలి తెలుగు సినిమా దర్షకుడు (H.M. Reddy - pencil sketch)



తొలి పూర్తి తెలుగు టాకీ సినిమా 'భక్త ప్రహ్లాద' విడుదలై 91 ఏళ్ళు నిండాయి. ఇది తెలుగు సినిమా పరిశ్రమలో ఒక చరిత్రాత్మక సంఘటన. అంతకు ముందు సగం తెలుగు, సగం తమిళంలో 1931 అక్టొబర్ 31న తొలి దక్షిణ భాషా టాకీ 'కాళిదాస్' వచ్చింది. ఆపైన పూర్తిగా తెలుగు మాటలు, పాటలతో 'భక్త ప్రహ్లాద' 1932 ఫిబ్రవరి 6న విడుదలై సంచలనం సృష్టించింది. గతంలో ఈ సినిమా సెప్టెంబర్ 15న విడుదల అయినట్టు ప్రచారం జరిగింది. కాని సీనియర్ జర్నలిస్టు డా. రెంటాల జయదేవ్ ఎన్నో ఏళ్ళు ఊరూరా తిరిగి. శ్రమించి, ఎంతో పరిశొధించి, సాక్ష్యాలు సేకరించి ఈ సినిమా 1932 జనవరి 21న బొంబాయిలో censor అయ్యి ఫిబ్రవరి 6న అక్కడే తొలిసారి విడుదలైనట్ట్లు ఆధారాలతో నిరూపించారు.
ఆ విధంగా 1932 ఫిబ్రవరి 6న బొంబాయి శ్రీకృష్ణా సినిమా ధియటర్లో విడుదలైన తర్వాత, విజయవాడ, రాజ,మండ్రి తదితర ప్రాంతాలకు వెళ్ళి విజయవంతంగా ఆడింది. 1932 ఏప్రిల్ 2న మద్రాసులోని 'National Picture Palace' లో విడుదల చేసారు. ఈ చిత్ర దర్శకుడు H.M.Reddy , సురభి కళాకారులు సహా పలువురిని బొంబాయి తీసుకెళ్ళి అక్కడ స్టూడియోలో 20 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసారు. నిర్మాణానికి సుమారు 20 వేలు ఖర్చయ్యింది. చాలా రికార్డులు నమోదు చేసుకుంది. ఇందులో లీలావతిగా నటించిన 'సురభి' కమలాబాయి తొలి తెలుగు తెర 'కధా నాయిక'. ఈ చిత్ర గీత రచయిత 'చందాల కేశవదాసు'. (వీరిద్దరి చిత్రాలు నిన్న post చేసాను. చూడగలరు) ఆ విధంగా తొలి పూర్తి స్థాయి తెలుగు సినిమా తయారై సంచలనం సృష్టించింది. దురదృష్టవశాత్తూ ఈ ఫిల్మ్ ప్రింట్ ఇప్పుడు లభ్యం కావడం లేదు.
(సౌజన్యం : శ్రీ నరవ ప్రకాశరావు, గౌరవ కార్యదర్శి, Vizag Film Society)




ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...