21, ఫిబ్రవరి 2023, మంగళవారం

పల్లెల్లో చాకలి..


 పల్లెల్లో చాకలిది చాల ప్రధానమైన వృత్తి. ఈ చాకలి వృత్తి, వారి వారసత్వ హక్కు. రెండు, మూడు పల్లెలు కలిపి ఒక చాకలి కుటుంబం వుంటుంది. వారు తప్ప వేరే చాకలి ఆవూరి వారి బట్టలను వుతక రాదు. పల్లె వాసులకు కూడా వేరొక చాకలిని పెట్టు కోడానికి హక్కు లేదు. ఒక చాకలికి ఇద్దరు మగ పిల్లలుంటే వారు వేరు పోదలచు కుంటే, వారి అధీనంలో వున్న ఊర్లను పంచు కుంటారు. చాకలి లేనిదే పల్లెల్లో సాంప్రదాయమైన పనులు చాల జరగవు. వారి ముఖ్యమైన పని అందరి బట్టలను ఉతికి తేవడం. మధ్యాహ్నం ఒకరు వచ్చి ప్రతి ఇంటి వద్ద కొంత అన్నం కూర తీసుకుని వెళ్లి తింటారు. అలాగే రాత్రికి కూడా కొంత అన్నం పెట్టాలి. ఊరి వారి బట్టలి అన్ని కలిపి వున్నా సాయంత్రానికి ఎవరి ఇంటి బట్టలు వారివి వేరు చేసి వారి వారికిస్తారు. బట్టలను వారు అంత బాగా గుర్తు పట్టగలరు. అందుకే చదివిన వాడికన్న చాకలి మిన్న అన్న నానుడి పుట్టింది . వారు బట్టలను ఉతికే ముందు కొన్ని బట్టలను ఉబ్బకేస్తారుఉబ్బ అంటే మూడు పెద్ద మట్టి కుండలను త్రికోణాకారంలో పెద్ద పొయ్యి మీద పెట్టి వాతి చుట్టూ మట్టితో దిమ్మ కడ్తారు. ఆ కుండల మూతులు మాత్రమే కనిపిస్తుంటాయి. వాటిల్లో సగం వరకు నీళ్లు పోసి, ఆమూడు కుండల మీద ఉబ్బకు వేయాల్సిన బట్టలను సౌడు నీళ్లతో తడిపి చుట్టలు చుట్టలుగా రెండు మూడు అడుగులఎత్తు వరకు అమర్చుతారు. తర్వాత అ బట్టల కుప్పకు ఒక పెద్ద బట్టను కప్పుతారు. ఇప్పుడు కుండల క్రింద మంట పెడ్తారు. కుండలలోని నీరు ఆవిరై అది పైనున్న బట్టలన్నింటికి వ్యాపిస్తుంది. అలా ఒక గంట ఆవిరి పట్టాక వాటిని తీసి నీళ్లలో వుతుకుతారు. అప్పుడు ఆ బట్టలు చాల తెల్లగా వస్తాయి. వీటిలో రంగు బట్టలు వేయరు. ఎందుకంటే ఒకదాని రంగు మరొక దానికి అంటు తుంది. సౌడు అనగా సౌడు భూములలో పైకి తేలిన ఉప్పటి నున్నటి మట్టి. బట్టలు ఉతికినందుకు చాకలికి ఫలితానికి ఒక సారి మేర ఇవ్వాలి, మేర అంటే ఐదు బళ్ళ వడ్లు. అలాగే వరి కోతలప్పుడు అందరి పని వాళ్లతో బాటు చాకలికి కూడా ఒక మోపు వరిని కూడా వదిలి పెట్టాలి. దాన్ని చాకలి ఇంటికి తీసు కెళ్లతాడు. అలా అందరి రైతుల వద్దనుండి వచ్చిన వరి మోపులను ఒక్క రోజున నూర్చి వడ్లను తీసుకుంటాడు. పెళ్ళి పత్రికలు రాకముందు పెళ్ళి పిలుపులకు చాకలినే పంపే వారు. తమలపాకులువక్కలు ఇచ్చి ప్రతి ఇంటికి, వేరే వూర్లో వున్న బంధువులకు చెప్పిరమ్మని చాకలిని పంపేవారు. స్వంత గాళ్లు పిలిచిన పిలిపు కంటే చాకలి పిలుపుకే గౌరవం.... మర్యాద.... సాంప్రదాయం కూడ. ఏశుభ కార్యానికైనా వక్క ఆకు ఇచ్చి పిలిస్తేనె అది మర్యాద. లేకుంటే అయిష్టంగా పిలిచినట్లే భావించే వారు. ఆ సందర్భంగా పుట్టినదే ఈ నానుడి: నాకేమైనా ,వక్క ఆకు ఇచ్చి పిలిచారా నేను రావడానికి? అదేవిధంగా పిల్లలు పుట్టినపుడు పురుడుకు వూరివారి నందరిని చాకలే పిలవాలి నీళ్లు పోయడానికి. చాకలే ముందు నీళ్లు పోయాలి. ఆడ పిల్లలు సమర్తాడినప్పుడు (పుష్పవతి) విషయాన్ని ఊరి వారందరికి చాకలితో చెప్పి పంపుతారు. ఆడ పిల్లలు సమర్థాడి (పుష్పవతి) నప్పుడు వారి వంటి పైనున్న బట్టలు చాకలికే చెందుతాయి. దీనిని బట్టే ఒక సామెత పుట్టింది. అదేమంటే.... సరదాకి సమర్థాడితె చాకలి వచ్చి చీరపట్టు కెళ్లిందట. ఈ సామెతలో.. సరదాకి కూడా అబద్ధం ఆడ కూడదనే సందేశం ఉంది. ఎవరైనా ప్రయాణమై వెళుతున్నప్పుడు చాకలి ఎదురు పడితే శుభ చూచకంగా బావించేవారు. పెళ్ళిల్లలో చాకలి చేయాల్సిన సాంప్రదాయ పనులు చాల వుంటాయి. దీవిటి పట్టడం, చాకలి సాంగెం అనే ఒక కార్యక్రమం వుండేది. అది లేక పోతే చాల లోటు. పంతులు గారు కూడా కొన్ని సందర్భాలలో చాకలి ఎక్కడ అని పిలుస్తుంటాడు. పెళ్ళి సందర్భంగా చాకలికి ప్రత్యేకించి డబ్బులు ఇవ్వరు. కాని అక్కడ తలంబ్రాలు పోసిన బియ్యం చాకలికే చెందుతాయి. అలాగే మంగళ స్నానం తర్వాత విడిచిన బట్టలు కూడా చాకలికే చెందు తాయి. శోభనము నాడు కూడా చాకలికి ప్రధాన పాత్ర ఉంది. జాతరలు, గ్రామ దేవతల పూజలందు చాకలే పూజారి. ప్రతి పండక్కి ఊరి వారందరు ప్రతి రోజు అన్నం పెట్టినట్టే పిండి వంటలు ఇస్తారు. సమాజంలో ముఖ్యమైన పాత్ర వహించిన ఈ చాకలి వృత్తి ప్రస్తుతం పూర్తిగా కనుమరుగైనది. అప్పట్లో వంకల్లో వాగుల్లో ఎక్కడ పడితే అక్కడ నీళ్లు లభించేవి.బట్టలుతికే వారి పని సులువయ్యేది. రాను రాను నీటి లబ్యత తక్కువయ్యే కొద్ది నీటి కొరకు పొలాలలోని బావుల వద్దకు పరుగులు తీసి, అవికూడ అడుగంటగా వారికి దిక్కు తోచ లేదు. పైగా రైతులు వరి పండించడం మానేయగా.. వారికి రావలసిన మేర సరిగా రాక, ఇలా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని క్రమంగా ఆ వ్వవస్థ కనుమరుగైనది. చాల తక్కువగా వుండే చాకలి కులం సామాజిక మార్పులతో చెల్లా చెదురై అంతరించి పోయింది. తరతరాలుగా బట్టలుతికిన చాకిరేవులలో చాకి బండలు నునుపు దేలి చాకలి వృత్తికి సాక్షిభూతంగా నేటికి అక్కడక్కడా పడి ఉన్నాయి. పల్లె ప్రజలు ఎవరి బట్టలు వారే వుతుక్కుంటూ కాలం వెళ్ల దీస్తున్నారు. చాకలి, మంగలి లేకుండా శుభ, అశుభ కార్యక్రమాలు జరిగే అవకాశమే లేదు ఒకపుడు. కాని విధి లేని పరిస్థితిలో ప్రస్తుతం వారు లేకుండానే ఆ కార్యక్రమాలు జరిగి పోతున్నాయి. పట్టణాలలో కళ్యాణ మండ పాలలో జరిగే పెళ్ళిల్లలో వారి అవసరమే లేకుండా జరిగిపోతున్నాయి. కాక పోతే బట్టల మురికి అతి సులభంబా వదల గొట్ట డానికి అనాడు లేని డిటర్జెంటులు, పౌడర్లూ, సబ్బులు, బట్టలు ఉతికే యంత్రాలు ఇప్పుడొచ్చాయి. పైగా మురికి అంతగా అంటని, అంటినా సులభంగా వదిలిపోయే టెర్లిన్, టెరికాట్, పోలిస్టర్ వంటి బట్టలు ఎక్కువైనాయి. రాబోవు తరాల వారికి చాకలి అంటే పుస్తకాలలో చదువు కోవలసిందే.

చిత్రం: పొన్నాడ మూర్తి 


 సౌజన్యం:  Wikipedia 

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...