22, ఫిబ్రవరి 2023, బుధవారం

కాటూరి వేంకటేశ్వర రావు - తెలుగు కవి, రచయిత, నాటక కర్త


సాహితీ హాలికుడు 'కాటూరి వేంకటేశ్వర రావు' (1895-1962) -

(pencil sketch - clarity బాగా తక్కువగా ఉన్న ఆనాటి reference ఫోటో నుండి సాధ్యమైనంత వరకూ పునరుధ్ధరణ)

సౌందర్య సస్యాన్ని సమృద్ధిగా పండించిన వెనుకటి తరం సాహితీ హాలికులలో శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు ఒకరు.

చెళ్ళపిళ్ళ వారి వద్ద చేసిన శుశ్రూషా ప్రభావం వల్ల కావచ్చు, కాటూరివారి కవితలో ప్రాచీనార్వాచీనతలు రెండూ సమ్మిళితమైనవి. వస్తువు కొత్తదైతే, పద్ధతి పాతది; పద్ధతి కొత్తదైతే, వస్తువు పాతది. కొత్త పాతల మేలుకలయికకు ఒక ఉదాహరణగా వారి కవిత్వం సాగింది. తెలుగులో ‘రొమాంటిక్’ కవిత్వంపై ఆకర్షణ ప్రబలంగా వున్న రోజులలో రచన ప్రారంభించినా, ఆయన దృష్టి ఎక్కువగా జాతీయవాదం వైపు, ధార్మిక ప్రబోధం వైపు ప్రసరించింది. గాంధీ సిద్ధాంతాలతో ఆయన ఎక్కువగా ప్రభావితులయ్యారు.

గురువులైన తిరుపతి వెంకట కవుల వలె కాటూరి, పింగళి జంటకవులుగా కవితావ్యాసంగం ప్రారంభించారు. వారుభయులు రచించిన తొలకరి, సౌందర్యనందం ఆంధ్ర భాషకు అమూల్యాలంకారాలు. ఆ తరువాత కాటూరివారు విడిగా రచించిన ఖండకావ్యాల సంఖ్యలోనే స్వల్పమైనవి కాని, గుణంలో అస్వల్పమైనవి. అస్పృశ్యతా నిర్మూలనాన్ని ప్రబోధించే ‘గుడి గంటలు’ భక్తితత్వాన్ని ఆవిష్కరించే ‘పౌలస్త్య హృదయం’ మొదలైన ఖండ కావ్యాలు కాక భాస నాటకాలకు, కొన్ని సంస్కృతాంగ్ల కృతులకు అనువాదాలు, ఇతర నాటికలు, సంగీత రూపకాలు వారి ప్రతిభకు నిదర్శనాలు.

కాటూరివారి వ్యాపకాలు బహుముఖమైనవి. కొన్నాళ్ళు కవిత్వం, కొన్నాళ్ళు కృష్ణాపత్రిక సంపాదకత్వం, మరి కొన్నాళ్ళు బందరు జాతీయ కళాశాల ప్రధానాచార్యత్వం, హిందీ ప్రచారం, సాహిత్య సమావేశాలు, గోష్ఠులు, ఇటువంటివి మరెన్నో! ఏ వ్యాపకంలో వున్నా తమంతటి సహృదయులు, రసజ్ఞులు, స్నేహపాత్రులు మరి లేరనిపించుకొన్న ఉదాత్త వ్యక్తిత్వం ఆయనది.

సౌజన్యం : (1962 డిసెంబర్ 27 ‘ఆంధ్రజ్యోతి’
సంపాదకీయం ‘శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు’ అంతర్జాలం నుండి సేకరణ)

కామెంట్‌లు లేవు:

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...