28, ఫిబ్రవరి 2023, మంగళవారం

మెరుగు వంటిది అలమేలుమంగ - అన్నమయ్య కీర్తన





ఈ వారం అన్నమయ్య కీర్తన
పల్లవి:
మెరుగు వంటిది యలమేలుమంగ |
అరిమురి నవ్వీని అలమేలుమంగ ||
చరణం:
పలుచని యెలుగున బాడీ నీ మీది పాట |
మెలుపు గూరిమి నలమేలుమంగ |
చెలులతో నీ సుద్ది చెప్పిచెప్పి కరగీని |
అలయుచు సొలయుచు నలమేలుమంగ ||
చరణం:
ఈడుగా నీ రాకకు నెదురెదురుచూచీ |
మేడ మీద నుండి యలమేలుమంగ |
వాడు మోముతో నీపై వలపు చల్లి చల్లి |
ఆడీ నాట్యము సారె నలమేలుమంగ ||
చరణం:
పేరుకొని పిలిచీని ప్రియములు చెప్పి చెప్పి |
మేరమీర నిన్ను నలమేలుమంగ |


యీరీతి శ్రీవేంకటేశ నిన్ను గూడె నేడు |
ఆరితేరి నన్నిటాను అలమేలుమంగ ||
మెరుపులాంటి అలమేలు మంగమ్మ శ్రీనివాసుడిని చూడగానే ముగ్ధయై నవ్వుతోందని తన పదపల్లవిలో ప్రస్ఫుటం చేస్తున్నాడు. మెరుగు అంటే ఆకాశంలోని మెరుపు. ‘అరిమురి’ అంటే సంభ్రమంతో అని అర్ధాలు.
‘పలుచని యెలుగున’ అంటే సన్నని గొంతుతో అని, ‘మెలుపు కూరిమి’ అంటే గాఢమైన ప్రేమ అని అర్ధాలు. ఆ ప్రేమస్వరూపిణి పతిదేవుడిపై పలుచని స్వరంతో పాటలు పాడుతోందిట. ఆయన గురించి తన చెలికత్తెలతో కబుర్లు చెప్పి , చెప్పి పరవశించిపోతొందిట! అలా పాటలు పాడి, మాటలు చెప్పి అలిసిపోయిందిట!
అలమేలుమంగ ఆ అర్తత్రాణ పరాయణుడు కోసం మేడపై ఎదురుచూస్తూ ఉండేదట! కొన్నిసార్లు ఆ స్వామిపై ప్రేమతో ఆ శ్రీదేవి నాట్యమూ చేసేదట! అలా ఎదురుచూసి, నృత్యం చేసి ఎంతో అలసిపోయిన ఆమె ముఖాన్ని ఒక్కసారి పరికించవయ్యా! అని అన్నమయ్య ఆ పురాణపురుషుడిని ప్రార్ధిస్తూ..
ఈడుగా నీ రాకకు నెదురెదురు చూచీ
మేడమేద నుండి యలమేలు మంగ
వాడు మోముతో నీపై వలపు చల్లి చల్లి
అదే నాట్యము సారె నలమేలు మంగ … అంటున్నాడు.
‘ఎదురెదురు’ అంటే ఎదురుతెన్నులు. ‘సారెకు’ అంటే మాటిమాటికి, ‘వాడు మోముతో’ అంటే వాడిపోయిన ముఖంతో అని అర్ధం.
ప్రియములు చెప్పి చెప్పి ..
స్వామి పేరుని స్మరించడమే అమ్మకు సార్ధకత. అందుకే పలుమార్లు ఆయన నామాన్ని నెమరువేసుకునేవారట! అలా ఏడుకొండలవాడి పేరుని స్మరించి, స్మరించి ఆ పద్మావతి ఆయనలోని తన అర్ధభాగానికి న్యాయం చేసింది. ఆ సన్నివేశాన్నే స్ఫురింపజేస్తూ ‘నీ సాన్నిధ్యంతో ఆమె అన్నింటిలోనూ ఆరితేరిపోయింది స్వామీ!” అంటూ ఈ సంకీర్తనాచార్యులు ..
పేరుకొని పిలిచీని ప్రియములు చెప్పిచెప్పి
మేరమీర నిన్ను నలమేలు మంగ …
అంటూ పదామృతాన్ని ముగిస్తున్నారు. ‘మేరమీర” అంటే అమితంగా అని భావం. అయితే అన్నమయ్యలా ఆ పద్మావతిని ప్రస్తుతించాలంటే ముందు మనస్సు పసిపిల్లడిలా పవిత్రం కావాలి. ఆ మనోస్వచ్ఛత ఆ మనొజ్ఞను ఆరాధించడానికి ప్రధాన అర్హత్.
సౌజన్యం : శ్రీమతి బి. కృష్ణకుమారి గారి వ్యాసం ఆధారంగా. వారికి నా ధన్యవాదాలు.
చిత్రం ' Pvr Murty


కామెంట్‌లు లేవు:

దార అప్పలనారాయణ - కుమ్మరి మాస్టారు - బుర్రకధ కళాకారుడు

  charcoal pencil sketch (Facebook goup  The Golden Heritage of Vizianagaram గ్రూపు లో లభించిన ఫోటో ఆధారంగా చిత్రీకరించిన చిత్రం) వివరాలు వి...