23, మార్చి 2024, శనివారం

యామిజాల పద్మనాభస్వామి - బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితుడు, స్వాతంత్ర్య సమర యోధుడు


నా పెన్సిల్ చిత్రం - (స్పష్టత లేని పురాతన  ఫోటో ఆధారంగా చిత్రీకరించిన చిత్రం)


యామిజాల పద్మనాభస్వామి బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితుడు, స్వాతంత్ర్య సమర యోధుడు.

ఇతడు విజయనగరం  జిల్లా, గరుగుబిల్లి మండలం, శివరాంపురం గ్రామంలో 1915జూన్ 12వ తేదీన కామేశ్వరి, లక్ష్మీనరసింహశాస్త్రి దంపతులకు జన్మించాడు. ఇతని తండ్రి లక్ష్మీనరసింహశాస్త్రి నిరతాన్నదాతగా ఆ ప్రాంతంలో ప్రసిద్ధుడు. యామిజాల పద్మనాభస్వామి చాలా చిన్నవయసులోనే ఇంటివద్ద ఉండి దేవులపల్లి సీతారామశాస్త్రి వద్ద కాళిదాస త్రయం అభ్యసించాడు. తన స్వగ్రామానికి సమీపంలో ఉన్న జామిలో మోతికుర్తి సత్యనారాయణశాస్త్రి వద్ద కౌముది నేర్చుకున్నాడు. 1930లో కడియం  వెళ్లి చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి వద్ద రెండు సంవత్సరాలు శిష్యరికం చేసి కవిత్వ రహస్యాలు తెలుసుకున్నాడు. 1933లో విజయనగరం ప్ర్రాచ్యకళాశాలలో చేరి 1938వరకు అక్కడే చదివి ప్రాచ్యభాషా పట్టాను పొందాడు. ఆ సమయంలోనే   ఆదిభట్ల నారాయణదాసును   సేవించి జ్యోతిష శాస్త్ర పట్టులెన్నో గ్రహించాడు.  వారు  ఇతడిని కావ్యకంఠ గణపతిమునికి పరిచయం చేయగా అతనికి శుశ్రూష చేసి మంత్రశాస్త్రం నేర్చుకున్నాడు. 

గాంధీజీ ప్రభావం, తెన్నేటి విశ్వనాథం బాంధవ్యం ఇతడిని స్వాతంత్ర్యోద్యమం వైపుకు ఆకర్షించింది. స్వయంగా రచించిన దేశభక్తి గేయాలను, పద్యాలను పాడుతూ స్వైరవిహారం చేస్తున్న ఇతడిని ప్రాచ్యకళాశాలనుండి తొలగించారు. కానీ ప్రతిభావంతుడిని పోగొట్టుకోవడ ఇష్టం లేక తిరిగి విద్యార్థిగా చేర్చుకున్నారు. విశ్వదాత కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఇతనికి నెలనెలా విద్యార్థివేతనం ఇచ్చాడు. ఇతని కవితాశక్తి గురించి విన్న జయపురం మహారాజా ఇతడిని ఆహ్వానించి తన సంస్థానంలో ఆస్థానకవిగా నియమించాడు. అమరజీవి పొట్టి శ్రీరాములు  వెంట కొంతకాలం తిరిగి హరిజనసేవకు నిధులు సేకరించాడు. 1948లో  మద్రాసులోని  శ్రీరామకృష్ణ విద్యాసంస్థలలో ఆంధ్రోపాధ్యాయుడిగా ప్రవేశించి 1974లో పదవీ విరమణ చేశాడు. ఇతని సంపాదకత్వంలో మద్రాసు  నుండి అమృతవాణి అనే సాహిత్యమాసపత్రిక కొన్నాళ్లు వెలువడింది.


సౌజన్యం : వికీపీడియా 



కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...