31, జనవరి 2025, శుక్రవారం

ముగ్ధ కన్నుల్లో ఎదురుచూపుల వాలు - కవిత



మిత్రులు శ్రీ మురళి పొన్నాడ గారు నా చిత్రానికి రచించిన కవిత. వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.


ముగ్ధ కన్నుల్లో ఎదురుచూపుల వాలు, 

భగ్న మనస్కులకవి ఉత్తేజితాలు    

ఉద్విగ్న మనస్కులకి ఉత్ప్రేరకాలు

లగ్న మనస్కుని ప్రేమకి సంతకాలు !!


స్నిగ్ధ సిగ నుండి జాలువారు శిరోజాలు

స్థితప్రజ్ఞులకి సైతం విసురును సవాలు

స్థిరచిత్తుల సైతం చిత్తుచేసే చిహ్నాలు

మన్మధుడిని సైతం మధించే మధురోహలు !!


పడతి పెదవుల విచ్చిన చిరు దరహాసం

పడగొట్టునవి పేరొందిన వీరుల సైతం

దడ పెంచు గుండెలచప్పుడు క్షణక్షణం

వడిగా వర్ణించు కుతూహలపడే నా కలం


చిత్రము కాదిది, చిత్తరువై, చిత్తై నిలిచానీ క్షణం   

చిత్రమీ కలకలం, మదిన నిలుచు నిధి కలకాలం !!

కామెంట్‌లు లేవు:

ముగ్ధ కన్నుల్లో ఎదురుచూపుల వాలు - కవిత

మిత్రులు శ్రీ మురళి పొన్నాడ గారు నా చిత్రానికి రచించిన కవిత. వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముగ్ధ కన్నుల్లో ఎదురుచూపుల వాలు,  భగ...