12, మార్చి 2025, బుధవారం

ఈ తరం అమ్మాయి - కథ



 శీర్షిక : " ఈ తరం అమ్మాయి "

రచన:   భవానికుమారి బెల్లంకొండ


(ఇది నా స్వీయ రచన. PVR  మూర్తి గారి రెండు స్కెచెస్ మీ ఆధారంగా రాసిన కథ)  

 

"దబ్"మని చప్పుడు, ఆ వెంటనే అమ్మా" అంటూ భాదతో, రుక్మిణి అరిచిన అరుపువిని గాభరాగా బెడ్ రూమ్ లోకి పరుగెత్తారు రామ్ నారాయణ్, చిత్ర. రుక్మిణి బాత్రూం డోర్ దగ్గిర వున్న డోర్ మాట్ జారీ , బోర్లా పడిపోయింది రుక్మిణి. తల మంచం అంచుకి  తగిలిందేమో, రక్తం వస్తోంది. భయం తో చేష్టలుడిగి చూస్తుండి పోయారు తండ్రీ, కూతురు.


చిత్ర ముందుగా తేరుకుని," వరుణ్" అంటూ అరిచింది,

ప్రక్క గదిలో, తయారవుతున్న వరుణ్ కంగారుగా పరుగెత్తుకుని వచ్చాడు. క్రింద పడివున్న తల్లిని చూసి మొదట షాక్ అయినా, వెంటనే తండ్రీ, అక్క   సాయం తో తల్లిని మంచం మీద ఆడుకోబెట్టి, "అక్కా , బావకు ఫోన్ చేయి, అలాగే అన్నయ్యకు కూడా" అన్నాడు. 


రుక్మిణి ఏడుస్తోంది,"శుభమా అని  పెళ్ళిచూపులకు వెళుతుంటే, ఇలా అయ్యిందేమిటిరా నాన్నా" అంటూ ఏడవసాగింది. " "ఇప్పుడేమయ్యిందమ్మా, ఏడవకు,నీకంటే ఏదీ ముఖ్యం కాదు,  ముందుహాస్పిటల్ కి వెళ్ళాలి మనం" అంటూ ఓదార్చాడు. 

వరుణ్.

రామ్ నారాయణ్  మొదటినుండీ వ్యవసాయదారుడే.20  ఎకరాల వ్యవసాయ భూమి వుంది.  , అందులో వరి, అపరాలు కాక వాణిజ్య పంటలైన పత్తి ,మిరప     పండ్ల తోట, కూరగాయలు, ఆకుకూరలు పండిస్తాడు. పెద్ద కొడుకు సురేష్, అతని భార్య మంజుల బ్యాంకు ఉద్యోగులు, కూతురు చిత్ర భర్త ఆనంద్ బిజినెస్ మాన్. ఆఖరివాడు వరుణ్. అగ్రికల్చర్ M.Sc. చేసి  తన ఆధునిక విజ్ఞానం జోడించి,తండ్రికి చేదోడు, వాదోడుగా ఉంటున్నాడు.


వరుణ్  వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకోవటం తో   మ్యాచెస్ రావటం చాలా కష్టం అయ్యింది. ఆ రోజు అనుకున్నట్టుగా జరిగినట్లయితే , రిథిమ ని చూడటానికి వెళ్ళేవాళ్ళు.రిథిమ అతనికి ఒక అగ్రికల్చర్ ఎక్సపోలో పరిచయం అయ్యింది. రిథిమ ఆధునిక యువతీ, MSc  బాటనీ చేసింది. అతని ఆశయాలు, నచ్చి, ఇంట్లో తెలియ చేసింది. ఆమె తల్లి భానుమతికి ఈ మ్యాచ్ అస్సలు నచ్చలేదు. సిటీ నుండి టౌన్ కి వెళ్లడమేమిటి?, పైగా పల్లెటూరులో వ్యవసాయం చేసుకుంటన్న వరుణ్ని  ఇష్టపడటం ఇంట్లో ఎవరికీ నచ్చలేదు, ఒక్క తండ్రి బాబురావు కి తప్ప. 


రుక్మిణి కి కుడి కాలు తొడ ఎముక ఫ్రాక్చర్ అయ్యింది. హాస్పిటల్ కి, ఎక్కువ కదల్చకుండా,,అంబులెన్సు   లో తీసుకు  

వెళ్లారు. రుక్మిణి ఆరోగ్యం మంచిదే. రెండు రోజులుఅన్నిరకాల పరీక్షలు చేసి,  ఆ తరువాత మేజర్ సర్జరీ  అయ్యింది. . వారం తర్వాత, రిహాబిలేషన్   హోంలో చేర్చారు. రామ్ నారాయణ్  కి  నిస్సహాయంగా అలా బెడ్ మీద పడివున్న భార్యని చూసి దిగులు పడ్డాడు. డిస్చార్జ్ అయ్యాక, ఎవరింట్లో ఉంచినా, వాళ్లకి ఇబ్బందే. కొడుకు కోడలు ఉద్యోగాలు, కూతురి ఇంట్లో అత్త, మామగారు  వున్నారు. మంజుల. చిత్ర ఇద్దరికీ స్కూల్ కెళ్లే పిల్లలు వున్నారు. అందుకనే ,పూర్తిగా కోలుకునేదాకా రిహాబిలేషన్   హోంలో ఉంచాల్సి వచ్చింది.  


 రామ్ నారాయణ్ భార్య తో పాటే రూమ్ లోనే  ఉంటున్నాడు. హాస్పిటల్ కాంటీన్ లోనే తింటున్నాడు. అందుకే కోడలు, కూతురిని తన భోజనం గురించి శ్రమ పడవద్దని చెప్పేసాడు. వీలున్నప్పుడల్లా కొడుకూ, కూతురూ వచ్చి చూసి పోతూనే వున్నారు.వరుణ్ వారం తర్వాత వూరికెళ్ళిపోయాడు. రైతుకి సెలవులుండవు కదా! 


రుక్మిణికి శారీరక భాద కంటే, మానసిక భాద ఎక్కువయ్యింది. ముప్పయి  ఏళ్ళు వున్న కొడుకు పెళ్లి గురించి దిగులు ఉండేది.. రిథిమ గురించి చెప్పినప్పుడు చాలా సంతోషపడింది. తాను ఎప్పుడు కోలుకుంటుందో, పెళ్ళి ఎప్పుడు జరుగుతుందో అంతా అగమ్యంగా వుందామెకు. అమ్మాయి ఫోటో కూడా చూపకుండా, డైరెక్టుగా   పెళ్లి చూపులు, కేవలం కుటుంబ సభ్యుల కోసం ఏర్పాటు చేయించాడు వరుణ్. 


తన జీవన సహచరి అయిన రుక్మిణి అంటే రామ్ నారాయణ్ కి చాలా ప్రేమ. తనకు అన్ని విధాలా సహకరించి, పిల్లలని చక్కగా పెంచి, ప్రయోజకులని చేయటం లో ఆమె సహకారం ఎంతో వుంది. అందుకే మృదు స్వభావి అయిన రుక్మిణి అంటే ఆయనకు అలవికాని ప్రేమ. తన కోసం హాస్పిటల్ లోనే ఉంటూ, కాంటీన్ ఆహారం తో సరిపెట్టుకుంటున్న భర్తని చూసి చాలా దిగులు పడుతోంది.రుక్మిణి.


వారం తర్వాత వచ్చాడు వరుణ్. తండ్రి బాబురావుని  తీసుకుని వచ్చింది రిథిమ. మొదటిసారి ఆమెని చూసింది రుక్మిణి. వరుణ్ పొలం పనిలో తిరుగుతూ , సన్ టాన్  అయిన శరీరం,తో, నిరంతర శ్రమవల్ల కలిగిన ధృడమైన శరీరం తో, చూడగానే 'బావుంటాడు'అనిపిస్తాడు.


రిథిమ చక్కని శరీర సౌష్టవం తో ఆరడుగుల వరుణ్ కి దీటుగా 5" 6 అడుగుల ఎత్తు, పెద్దకాటుక కళ్ళు, తీరైన కనుముక్కు తీరుతో, చక్కగా చీర కట్టుకుని, రుక్మిణి దగ్గరగా వచ్చి కూర్చుంది. నవ్వు మొఖం, అచ్చమైన తెలుగింటి ఆడపిల్లలా వుంది రిథిమ. 

"ఎలా వున్నారు? మీకు ఆక్సిడెంట్ అవగానే వద్దామనుకున్నాను, వరుణ్ ఈ రోజు రమ్మన్నారు," అన్నది మృదువుగా ఆమె చేతి  మీద చేయి వేసి. 


దిగులుగా నవ్వింది రుక్మిణి," మీ ఇంటికి వద్దామని అందరం రెడీ అయ్యాము, నేనిలా హాస్పిటల్ పాలయ్యాను, ఎప్పటికి కోలుకుంటానో, అసలు నువ్విలా వస్తావని అనుకోలేదమ్మా" అన్నది దిగులు నిండిన స్వరం తో.


ఆపరేషన్ బాగా అయ్యింది కదా అత్తయ్యా, దిగులు పడకండి, మీరు డిశ్చార్జ్ కాగానే , పెళ్ళి ఏర్పాట్లు చేయమని నాన్నతో చెప్పాను, " అన్నది నెమ్మదిగా.


"నాకు వాడి పెళ్ళి చూసే అదృష్టం లేదు "అన్నది రుక్మిణి.


"లేదు అత్తయ్యా, పెళ్ళి మీఅందరికీ  ఇష్టమయితే, ఊళ్ళోనే , ఇంటిముందు చాలా స్థలముందని చెప్పారు వరుణ్, అక్కడే సింపుల్ గా పెళ్ళి చేసుకుందామని అనుకున్నాము నేను, వరుణ్. పెళ్ళి పేరిట ఆర్భాటాలు నాకు ఇష్టముండదు అత్తయ్యా,  మీరు వరండాలో కూర్చుని, చూడవచ్చు. మా వాళ్ళు ఒక ఇరవై మంది కంటే ఎక్కువుండరు. నాన్నని మామయ్యతో, వరుణ్ తో ఈ విషయమై   మాట్లాడిన  తర్వాత నాన్న వచ్చి ఏర్పాట్లు చూస్తారు " అన్నది. ఎంతో సౌమ్యంగా. 


" నువ్వు చెప్పేది నిజమేనా తల్లీ" అన్నది రుక్మిణి.


"నిజమే అత్తయ్యా, మీరు డిస్చార్జ్ అయి, ఇంటికెళ్లేలోపు, ఒక నర్సుని ఏర్పాటు చేస్తాను. ఆమె "ముంతాజ్" అని అదివరకు హాస్పిటల్ నర్సుగా పనిచేసిన అనుభవమున్న మనిషి, చాలా మంచిది, మా నాన్నమ్మ మంచం పట్టినప్పుడు సంవత్సరం సేవ చేసింది. మంచి మనిషి. మీరు త్వరగా లేచి తిరిగేలా చూస్తాను, ధైర్యంగా  వుండండి, ఇంకెంత ఒక్క పది రోజులు వదినా, అక్కావాళ్ళు మిమ్మల్ని చూసుకుంటే, తర్వాత నేను అన్నీ చూసుకుంటాను  దిగులు పడకండి " అన్నది.

ఒక గంట కూర్చుని, వెళ్ళింది రిథిమ.

 

*****

రుక్మిణి డిశ్చార్జ్ అయ్యేలోపు, ఓ రోజు రిథిమ. రామ్ నారాయణ్ కి ఫోన్ చేసింది. ," మామయ్యా, మీరు ఈ వారం ఊరెళ్ళి పోతారట కదా, నేను కూడా మీతో  వస్తాను, మీ కజిన్ us  వెళ్లారు, వాళ్ళ ఇల్లు పెళ్ళి అప్పుడు మమ్మల్ని వాడుకోమన్నారట కదా! ఇప్పుడు నాతో పాటు అత్తయ్యని చూసే ఆవిడను కూడా తీసుకు వస్తాను. అమ్మమ్మ  ఉంటుంది నాతో, నేనిలా పెళ్ళికి ముందే వస్తే , మీకేమైనా అభ్యంతరమా  " అన్నది.


నెత్తిన పాలు పోసినట్టయింది ఆయనకు. చాలా సంతోషం రిథిమా, రుక్మిణి ఇంటికి వచ్చేలోపు, ఏమి ఏర్పాట్లు చేయాలో , ఎలా చేయాలో అని చాలా కంగారుగా ఉందమ్మా, ఎవరో, ఏదో అనుకుంటారని నాకేమీ లేదు ," అన్నాడు. 


ఆయన గొంతులోని దిగులు రిథిమ. అర్ధం చేసుకోగలిగింది. రుక్మిణి ని సురేష్, మంజుల డిస్చార్జ్ అయ్యేవరకు చూసుకుంటామని చెప్పారు, అందుకే రామ్ నారాయణ్ రిథిమ.వాళ్ళతో కలిసి ఊరుకెళ్ళాడు.


ఇల్లాలు  లేని ఇల్లు  ఎలా ఉండాలో అలాగే వున్నది ఇల్లు. పనిమనిషి వెంకటమ్మను పిలిచి ఇల్లు శుభ్రం చేయమని చెప్పాడు. రిథిమ.ముంతాజ్, వెంకటమ్మ ఇంటిని ఒక దారికి తెచ్చారు.రిథిమ.అమ్మమ్మ వంట చేసింది. లంచ్ కొచ్చిన వరుణ్ కళ్ళు రిథిమను చూసి మెరిసాయి. 


రిథిమ,.రుక్మిణి కోసం అత్యాధునికమైన వీల్ చైర్ కొన్నది. లీవర్ తో పని చేసే హాస్పిటల్ బెడ్ ఆర్డర్ చేసాడు వరుణ్.అలాంటి మంచమయితే ఆమె లేచికూర్చోడానికి, సౌకర్యంగా ఉంటుందని ఆర్డర్ చేసాడు.  ఒక వాకర్, ఒక స్టిక్ కూడా రెడీగా పెట్టింది రిథిమ.పనిమనిషి వెంకటమ్మకు పెళ్ళికి ముందే వచ్చి, జీన్స్, కుర్తా వేసుకుని చక, చక పని చేసుకు పోతున్న రిథిమ.ను చూసి చాలా ఆశ్చర్యం కలిగేది.


రాత్రిళ్ళు, బాగా పొద్దు పోయేవరకు రిథిమ.వరుణ్ కబుర్లు చెప్పుకునేవారు.ఇద్దరికీ ఇలా ముందే కలుసుకోవటం గమ్మతైన అనుభవం లా వున్నది.


వారం తర్వాత రుక్మిణి ని  ఇంటికి. తీసుకువచ్చారు. సొంత గూటికి చేరుకున్న పక్షిలా సంతోషపడింది రుక్మిణి. నెమ్మది, నెమ్మదిగా వీల్ చైర్ స్వంతంగా ఉపయోగించటం మొదలెట్టింది.ముంతాజ్ చాలా సాయంగా ఉంటోంది.

బాత్రూం డోర్ వెడల్పు చేయించాడు  రామ్ నారాయణ్. టాయిలెట్ కి వెళ్ళినప్పుడు కూడా,   ఆ వీల్ చైర్ ఎంతో సౌకర్యంగా వుంటున్నది. రుక్మిణి కి మళ్ళీ మామూలు మనిషిని అవుతానన్న ఆశ కలిగింది.


పదిరోజుల తర్వాత, ఎటువంటి ఆర్భాటాలు లేకుండా, కొబ్బరి ఆకులతో అల్లిన పచ్చని పందిరి, రంగు, రంగుల పూలతో అలంకరించిన  పెళ్ళి మంటపం లో, కేవలం సన్నాయి వాయిద్యాల మధ్య రిథిమా , వరుణ్ ల  పెళ్ళి జరిగింది. వరండాలో కుర్చీలో కూర్చుని, పెళ్ళి నంతా,సంతోషంగా  చూసింది రుక్మిణి.


.ఒక నెల తర్వాత తనంతట తాను వీల్ చైర్ లో బాత్రూమ్ కి వెళ్లగలుగుతోంది రుక్మిణి. ముంతాజ్ సాయంతో, ఇంటిముందు, రోజూ వాకర్ సాయం తో నడుస్తోంది,రక,రకాల సూప్స్ .  బలానికి టోనిక్స్, శ్రద్దగా ఇస్తోంది రిథిమ.బలమైన దెబ్బ తగిలి, మేజర్ ఆపరేషన్ జరిగా,క ఒక మనిషికి, అందునా ఒక స్త్రీ కి కావలిసినదేమిటి? సానుభూతిచూపిస్తే,.వాళ్ళేప్పటికీ కోలుకోలేరని రిథిమకు తెలుసు. "నువ్వు కోలుకుంటావు, ప్రయత్నించు, తప్పక బాగవుతావు" అన్న భరోసా కల్పించి, రోజూ ఆమె ఎక్సర్ సైజస్ చేసేలా చూస్తోంది. ఇంట్లో మామగారు  కానీ, వరుణ్  కానీ ఆఖరికి ఇంట్లో పనివాళ్ళు కానీ ఆమెను పేషెంట్లా చూడకుండా జాగ్రత్త పడింది.

 

ఓ రోజు ఉదయం  రిథిమ    రూమ్ లోకి వచ్చేసరికి, రుక్మిణి , ముంతాజ్ నవ్వుతూ, మాట్లాడుకుంటూకనిపించారు.


" ఏమి అత్తయ్యా, , , ఎందుకలా నవ్వుతున్నారు, నా క్కూడా చెప్పండి" అన్నది నవ్వుతూ.రిథిమ 

 

ముంతాజ్" ఏమి లేదు చిన్నమ్మా, తెల్లవారకముందే , ఇదిగో నా వేలంత చిట్టి పిట్టలు " పిచ్చి, పిచ్చి" అని అరుస్తాయమ్మా"దానికి అమ్మగారు ఏమంటున్నారో చూడండి"


రుక్మిణి నవ్వుతూ చెప్పింది," ఈ పిట్ట పేరు "చిటికలెంకన్న" అంటారు గ్రామీణ భాషలో. దాని తోక దాని సైజు కంటే పొడుగు. ముక్కు, నల్లగా, సూదిలాగా ఉంటుంది, రెక్కల క్రింది భాగం అంతా లేత నిమ్మపండు రంగులో ఉంటుంది, తెల్లవారనీయదు"పిచ్చి, పిచ్చి " అని మనల్ని లేపేస్తుంది,అది నన్ను "నీ పిచ్చిగానీ  , ఇంత పెద్ద దెబ్బ తగిలిన నీ కాలుతో నువ్వు అదివరకులా నడవగలవా, నీ పిచ్చి గానీ" అంటోందని చెబుతున్నారా." అన్నది నవ్వుతూ. 

 

ముంతాజ్ అందుకుంది, " ఆ తర్వాత, బహుశా ఆడపిట్ట అనుకుంటా, చిరు గజ్జెల చప్పుడు చేస్తాయి"

 రుక్మిణిఅన్నది  తర్వాత ఇందాకా  పిచ్చి, "పిచ్చి "అన్న పిట్ట " చెప్పు, చెప్పు" అంటుంది," ఏమి చెప్పమంటోందో అస్సలు అర్ధం కాదు" అన్నది నవ్వుతూ.


  " అలా యెందుకను కోవాలి అత్తయ్యా , "ఆ పిట్ట," మీ పిచ్చిగానీ, పెద్ద, పెద్ద ఆక్సిడెంట్స్   అయిన వాళ్ళే, ఈజీగా లేచి తిరుగుతున్నారునువ్వెందుకు  నడవలేవు? చెప్పు, చెప్పు " అంటుందనుకోవచ్చుగా "అన్నది నవ్వుతూనే.


విస్మయంగా చూసింది రుక్మిణి, కోడలు అన్యాపదేశంగా ఇంకా  బాగా నడవయానికి  ప్రయత్నిచాలని చెబుతోందనిపించింది.

*****

చిత్ర తల్లిని చూడటానికి వచ్చింది. 


"పెళ్లవగానే అమ్మ భాద్యత నీ మీద పడింది" అంటూ మరదలి మీద సానుభూతి చూపింది చిత్ర

". అలాంటిదేమీ లేదు వదినా, జీవితమంతా ముందే వున్నది" అని చెబుతుంటే, వరుణ్ వచ్చి విజిల్ వేస్తూ 


ప్రేమ యాత్రలకు బృందావనం, నన్దనవనములేలనో 

కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గములేలనో" అంటూ పాడాడు.

 

ఉదయమే తండ్రీ, కొడుకులు పొలానికి వెళతారు. లంచ్ అయ్యాక వరుణ్, రిథిమ వెళతారు.

"ఓహో, అదా సంగతి" అంటూ నవ్వింది చిత్ర , కొత్త దంపతులు సంతోషంగా ప్ర కృతి ఒడిలో గడుపుతున్నారని తెలిసి.  

వింటున్న రామ్ నారాయణ్ కూడా  నవ్వుకున్నాడు.


ఇంటికొచ్చిన నాలుగు నెలల తరువాత, ముంతాజ్ వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆమెకు  జీతం కాక, ఆమె అడక్కపోయినా డబ్బు, రైస్, అపరాలు ఇచ్చి, సగౌరంగా , కార్లో పంపించారు.యూకిమినిరుక్మిణి తన బంగారు దిద్దుల జత ఒకటి ఇచ్చింది.

****


ఆ రోజు ఇంట్లో రామ్ నారాయణ్ తప్ప ఎవరూలేరు. రిథిమ  , వరుణ్ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. ఆయన సోఫాలో కూర్చుని, యేవో లెక్కలు చూసుకుంటున్నారు. తనముందు ఎవరో ఉన్నట్టు అనిపించి , తలెత్తి చూసారు. రుక్మిణి. ఎటువంటి స్టిక్ సాయం లేకుండా ఆయన ముందు నించుంది, ఆయన గబుక్కున లేచి, ఆమెని తన చేతుల్లోకి తీసుకున్నారు," రుక్మిణీ, నువ్వు మళ్ళీ ఇలా నడుస్తావని అనుకోలేదు, " అన్నారు ఆమెని హృదయానికి హత్తుకుంటూ.

రుక్మిణి కళ్ళలో కూడా నీళ్లు వచ్చాయి.

నెమ్మదిగా ఆమెని తన ప్రక్కన కూర్చోబెట్టుకున్నారు." నేను అందర్నీ ఎంత ఇబ్బంది పెట్టానా అనిభాదగా ఉందండి,,  ముఖ్యం గా రిథిమ ని, ఈ కాలం అమ్మాయి అయినా, ఎంత చక్కగా నన్ను మామూలు మనిషిని చేసింది" అన్నది రుక్మిణి.


"అవును, రుక్మిణి , రిథిమ నిజంగా నేటి తరానికి అచ్చమైన ప్రతినిధి. మోడరన్ అంటే చాలామంది డ్రెస్సింగ్ లో విపరీత ధోరణి చూపించడం, సహజీవనాలు అన్నీ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. స్వేచ్ఛకు విపరీత భాష్యాలు చెబుతున్నారు. 

రిథిమ తాను చదివిన చదువును సార్ధకం చేసుకుంది వరుణ్ సెలెక్ట్ చేసుకోవటం లో ఎంతో వివేకం చూపింది. పెళ్లి పేరిట జరుగుతున్న వ్యర్ధ ఖర్చులని కోరుకోకుండా, తన అభిప్రాయాన్ని, నిక్కచ్చిగా తెలియజేసింది. ఈ కాలం లో వంట రావటం, వంట చేసుకోవటం అరుదై పోతున్నది. 

రిథిమ నా దృష్టిలో ఒక ఐకాన్, ఈ తరానికి సరైన ప్రతినిధి, ఇలాంటి అమ్మాయిలు ఇప్పటి సమాజంలో చాలామంది వున్నారు. కానీ వెర్రిపోకడలు పోతున్న కొంతమందిఅమ్మాయిలు ఎక్కువైపోపోతున్నారు,  వాళ్ళ మధ్య ఇలాంటి మంచిని  ఎవరూ గ్రహించలేకపోతున్నారు. ఈ కోడలు మన అదృష్టం రుక్మిణీ, నాకు నిన్ను మళ్ళీ మామూలు మనిషిని చేసి ఇచ్చింది" అన్నారు రుక్మిణిని ఆప్యాయంగా హృయానికి హత్తుకుంటూ.. 


(సమాప్తం)

కామెంట్‌లు లేవు:

ఈ తరం అమ్మాయి - కథ

 శీర్షిక : " ఈ తరం అమ్మాయి " రచన:   భవానికుమారి బెల్లంకొండ (ఇది నా స్వీయ రచన. PVR  మూర్తి గారి రెండు స్కెచెస్ మీ ఆధారంగా రాసిన కథ)...