22, మే 2025, గురువారం

జయహనుమాన్ జయతి బలసాగర!

 




జయహనుమాన్ జయతి బలసాగర!

~~~~~~~~🌸🌸🙏🌸🌸~~~~~


1)

ఉ॥

పుట్టుకతోనె కర్ణముల భూషణముల్ యుప వీతమున్, మొలన్ 

బొట్టము, శీర్షమందు ఘన బొమ్మికమున్,కటి మేఖలన్ గనన్ 

పుట్టెను శంకరుండనుచు, పుణ్యమదంజనిదంచుమెచ్చుచున్ 

పట్టిని ముద్దులాడి కడు ప్రశ్రయమున్ గురిపించిరందరున్ ! 


2)ఉ॥ 

ఆకలివేయుచుండె గృహమందున నమ్మయు లేదు,పండదే 

యాకసమందునున్నది,రయంబున దెచ్చెదనంచుబోయియా

కాకవెలుంగుబట్టుటకు గాడ్పుకుమారుడు బోవుచుండగన్ 

చీకటి గాము తల్పడగ ఛెళ్ళున గొట్టెను తోకత్రిప్పుచున్!


3)

పుష్పమాలిక॥

శరణుగోరురాహువునకుశక్రుడంతయభయమి

చ్చి,రణమున్ యొనర్పుచు పవిచేత మారుతిఁజెనకెన్ 

సొరగినట్టిపుత్రునిగని శుష్మి యాగె విసరకన్ 

వరములీయ వచ్చిరపుడు వాయుపుత్రునకు సురల్ !


4॥మేఘరంజి

పవన పుత్ర! దలప నిన్ను బాయు నన్ని కష్టముల్ 

జవము నందు శరము కన్న చాలమిన్న వాడివే 

శివుని తేజమగుట  కార్యసిద్ధినిచ్చి

బ్రోవవా!

ప్లవనజాతి ఘనత పెంచి వఱలినావు  మారుతీ!! 

5)

శ్లాఘ్య॥

వాతాత్మజ! నీశక్తిని బ్రహ్మాదులెరుంగన్ గలరే

సీతమ్మను కన్గొంటివి, శ్రీరాముని వృత్తాంతముతో 

భీతిన్ తొలగన్ జేసిన వేద్యుండవు నీవే హనుమా!

భాతిన్ రవితుల్యుండవు ప్రాతస్మరణీయుండవయా!


6)

తారక॥

శివతేజుడవగు నీగుణ చింతనమది చాలున్ 

తవనామజపమహాత్మ్యము తామసమును బాపున్ !

దివినైనను భువినైనను దీటుగలరె తండ్రీ!

జవమందున బలమందున సాటి యెవరు స్వామీ!


7)కం॥

దానవ సంహా రమునకు

మానుష రూపంబునెత్త మాధవు డిలపై

వానికి తోడుగ రుద్రుడు 

వానర రూపం బునొందె వాయుసుతుండై !


8)ఉ॥

పట్టగ సూర్యునే దలచి పండుగ మారుతి పోవుచుండగన్ 

కొట్టెను నేమిచే హయుడు కూనని యెంచక హన్వుదాకగన్

తిట్టుచు వాయుదేవుడును  తెమ్మెర నిల్పగ నెల్లలోకముల్

తుట్టున కోర్వలేక  పరితోషణ నొందగ దీర్చిరర్థముల్ !

(నేమి - వజ్రాయుధం

తుట్టు- బాధ

పరితోషణ - సంతోషము)


9)సీ||

లంఘించి సంద్రమున్ లాఘవంబున,లంక

జేరి గన్గొనెకదా సీతజాడ !

మెప్పించు మాటలన్ మైధిలి శోకంబు

నుడిపియొసగెరాము నుంగరంబు ‘!

కుప్పించి యెగురుచు గూల్చెను వనమంత 

రావణునకెరిగింప రాక తనది !

దండింప నుంకింప దగ్ధంబు గావించె

కపివీరుడననేమొ గనుల బడగ ! 

ఆ.వె॥

చేరి రాఘ వునకు చింతామణినియిచ్చె 

సీత జాడ దెలిపి చింతదీర్చె

బంటు రీతి గొల్చి పవరము జరిపించె

స్వామి హత్తు కొనగ సంతసించె ! 


10)తే.గీ ।।

అసమ బలశాలి యంజన యాత్మ భవుడ!

సకల సద్గుణ వంతుడ! శౌర్యధనుడ! 

స్వర్ణ దేహుడ! సుగ్రీవ సచివ హనుమ !

రామభక్తాగ్ర గణ్యుడా రక్ష నీవె !


11)ఉ॥మాలిక 

వాలము ద్రిప్పి పైకెగిరి వార్థిని దాటిన వాయుపుత్ర నీ

వాలము జుట్టిగుండ్రముగ ప్రస్తరణంబున నిల్చిరావణున్

‘ఆలము జేయగా దగదు యారఘు రామునితో’ననంగ,  పో

గాలము దాపురింప దశకంఠుడు మెచ్చడు నీదు మాటలన్ 

చేలము జుట్టివాలమున చిచ్చును బెట్టగ నూరుకుందువే 

ఫాలుడ వైననీవపుడు పావకు డొందగ బ్రీతిఁజేయవే !

కూలగ జేసినావుగద గుండెన ధైర్యము దైత్యనాథుకున్ !


12)తే.గీ

జ్ఞాన పరిపూర్ణ హనుమంత జయము నీకు !

వాయుపుత్రుడ!భయహారి! భక్త సులభ !

గదను బట్టిన నీధాటి కెదురుగలదె !

దనుజ సంహారి! బ్రోవుమా దయతొ మమ్ము !


13)కం॥

గ్రహపీడదొల్గ జేసెడి

మహిమాన్వితుడైనవాడు మారుతి యనగన్ 

రహియింప జేయ భక్తుల 

వహియించునువానిభరము భక్తసు లభుడై 


14)కం॥

భయవిహ్వలులైనప్పుడు 

భయమును పోగొట్టియాత్మ బలమునొసంగున్ 

జయమునకు తగిన శక్తిని 

రయమున చేకూర్చుహనుమ ప్రస్తుతి సేయన్ ! 


15)సింధువు దాటిన వానికి 

సిందూరము నిష్టపడెడి  చిద్రూపునకున్ 

డెందమున నిలిపి రాముని

యందరికాదర్శమైన యనిలజు దలతున్ !

16)

నేడు పీడించు రాక్షసిన్ నేలగూల్చ 

ననిల తనయుని గొల్చెద నార్తితోడ

బ్రోవరావయ్య జగతిని మ్రుచ్చునుండి

నేటి వేడుక గుర్తుగ నింపు శుభము ! 


—————-

రచన- డా. ఉమాదేవి జంధ్యాల

చిత్రం

శ్రీ Pvr Murty గారిది. వారికి  కృతజ్ఞతలు


~~~~~,~~~~~~

డా. ఉమాదేవి జంధ్యాల

కామెంట్‌లు లేవు:

ఎన్నెన్ని చింతలో ఏమార్చ లేనులే ౹౹ కాలాన్ని నిలదీసి ఎదిరించ లేనులే - గజల్

 చిత్రానికి చిన్న ప్రయత్నం.... ఎన్నెన్ని చింతలో ఏమార్చ లేనులే ౹౹ కాలాన్ని నిలదీసి ఎదిరించ లేనులే ౹౹ చూపులో ధైర్యాలు చెలరేగు ప్రశ్నలూ సందిగ్ధ...