15, ఏప్రిల్ 2026, బుధవారం

మరుపురాని జ్ఞాపకాలకు మధుర ప్రయాణం

 

మరుపురాని జ్ఞాపకాలకు మధుర ప్రయాణం


రచన:కమల పరచ


 


సాయంత్రం వెలుతురు నెమ్మదిగా మసకబారుతోంది. ఉండీ ఉండీ మంచు తుంపరలు మల్లెపూల జల్లుల్లా పడుతున్నాయి.  చెట్ల మధ్యలో నుంచి మంచుతో గడ్డ కట్టిన సరస్సు తెల్లగా కనిపిస్తోంది. దాని మీద ఎవరో గూడారం వేసుకున్నట్లున్నారు, ఎరుపు రంగులో కనీకనిపించకుండా ఉంది.  అక్కడ మంచులోకి గాలం వేసి చేపలు పడతారట. ఇంకాస్త ఎక్కువ గడ్డ కడితే స్కేటింగ్ చేస్తారట.కిటికీకి దగ్గరగా ఉన్న రోడ్ మీద కార్ ఆగి ఉంది. ఈ అమెరికన్స్ ప్రతి సీజన్‌నూ భలే ఎంజాయ్ చేస్తారు అనుకుంది శ్రీలక్ష్మి.


 


కిటికీ దగ్గర కూర్చున్న శ్రీలక్ష్మి కొద్ది సేపు వాటిని గమనించి, ఏవో జ్ఞాపకాలను మదిలోకి రాగా లేచి, లాప్ టాప్ తీసి, అందులో ఏర్పరుచుకున్న ఫొటో ఆల్బం ను తీసింది. స్క్రీన్‌పై కనిపిస్తున్న చిత్రాలపై వేళ్లను మృదువుగా జరిపింది. ఆమె వయసు అరవై  దాటింది. కానీ ఆ ఆల్బమ్ తెరిచినప్పుడల్లా, ఆమె మనసు మాత్రం మళ్ళీ ఇరవై ఏళ్ల యువతిగా మారిపోతుంది.


 


“ఇదేమిటో... ఇవన్నీ ఎలా గుర్తొస్తున్నాయో!” అని ఇదేమిటో 


తనలో తానే సిగ్గుగా నవ్వుకుంది.


 


ఆల్బమ్ మొదటి పేజీ తిప్పగానే, ఆమె కళ్లు ఒక ఫోటో మీద ఆగిపోయాయి. తెల్లటి చీరలో, మెల్లగా తలవంచి నవ్వుతున్న ఆ అమ్మాయి… అది తనే. తన భుజం చుట్టూ చేయి వేసి, గొడుగుతో నిలబడి ఉన్నాడు ఓ అందమైన యువకుడు. 


 


 


ఆరోజు…


 స్నేహితులంతా కలిసి రాజ్ కపూర్ సినిమా "శ్రీ 420" కు వెళ్ళారు.


"ఫ్యార్ హూ, ఇక్రార్ హూ హై


ఫ్యార్ సే ఫిర్ క్యోన్ డర్ర్ తా హై దిల్."


 రాజ్, నర్గీస్ వానలో తడుస్తూ, పాడుకుంటూ వెళున్న దృశ్యం, అప్పుడే ఒక గొడుగు కింద ముగ్గురు పిల్లలు వెళుతుండటం, టీ పొయ్యి దగ్గర టీ అమ్ముతూ ఓ తాత, అబ్బా ఎంత బాగుందో ఆ సీన్!


 


 అదే పాటను కాలేజీ వార్షికోత్సవంలో, స్టేజ్ మీద తనూ, రామం కలిసి వేసి మొదటి బహుమతి గెలుచుకున్నారు.


 


“అది ఏమో నాటకం అనుకున్నాం… కానీ ఎంత మధురంగా ఉంది!” అని ఆమె గుండెలో ఒక మృదువైన అలజడి పుట్టింది.


 


అది తమ ఇద్దరినీ దగ్గరకు చేర్చింది. ఆ రోజులు ఎంత సిగ్గుగా, ఎంత అందంగా గడిచాయో! కాలేజీకి వెళ్ళే దారిలో చిన్న చిన్న చూపులు, ఎవరికీ తెలియకుండా పంచుకున్న మాటలు…


 


 ఒక్కసారి అతను పేరు పిలిచినా గుండె బలంగా కొట్టుకున్న రోజులు…


 


ఒకసారి వర్షంలో తడుస్తూ ఇద్దరూ ఒకే గొడుగు కింద నడిచిన రోజు గుర్తొచ్చింది.అప్పుడామె  గుండె ఎంత వేగంగా కొట్టుకుందో! ఆ జ్ఞాపకం ఇప్పుడు కూడా ఆమె చెంపలపై అరుణిమ పులుముకుంటోంది. 


 


 


కానీ జీవితం ఎప్పుడూ మనం ఊహించిన దారిలో నడవదు. యాభై సంవత్సరాలు మురిపించిన, ఆ ప్రేమ కథ  ఆగిపోయింది!


 


అయినా…


 


అది మర్చిపోలేని జ్ఞాపకం అయ్యింది.


 


శ్రీలక్ష్మి లాప్ టాప్ మూసేసింది.  ఒక మృదువైన చిరునవ్వు ఆమె పెదవులపై విరబూసింది.


 


“ఆ రోజులు తిరిగి రావు… కానీ వాటి మాధుర్యం మాత్రం నా గుండెలో ఎప్పటికీ ఉంటుంది.”


 


రామం జ్ఞాపకాలు ఆమెకు ఒక మధురమైన ప్రయాణంలా అనిపించాయి.  సిగ్గుతో కూడిన, ప్రేమతో నిండిన, మరుపురాని ప్రయాణం.


 


అవే… ఆమె ఊపిరులు.

కామెంట్‌లు లేవు:

నవ్వుల పుత్తడిబొమ్మా... రచన:మాలా కుమార్

 నవ్వుల పుత్తడిబొమ్మా... రచన:మాలా కుమార్ నవ్వుల పుత్తడిబొమ్మా... మా కలల రూపం నీవమ్మా... మా చిరు తోటలో కొమ్మా... చిగురించిన పూల వనమే నీవమ్మా....