14, జనవరి 2017, శనివారం

నీ స్మరణ చేయమని - తెలుగు గజల్



Rajeswari Srimallik గారి  తెలుగు గజల్ కి నా పెన్సిల్ చిత్రం 

నీ స్మరణ చేయమని పదమునే వేడితిని
నీ దరికి చేర్చమని పథమునే వేడితిని
నా తపో ఫలము నీ మనసుతో సంగమం
నీ తోడు నివ్వమని వరమునే వేడితిని
మృదువైన మమతలను మదిలోన పేర్చాను
ఇరువురిని కలపమని జగమునే వేడితిని
తొలివలపు వర్ణింప నలవికా దెవ్వరికి
 చరితలో నిలపమని కలమునే వేడితిని
నీ తోటి జతగూడి ప్రణయాన్ని రచియిస్తు
తీయగా పాడమని గళమునే వేడితిని
ఎల్లలే ఎరగనీ సఖ్యతను ఎదనింపి
మనలనే వీడమని ఎడమునే వేడితిని
సహచరుని కవ్వింపు ఓ 'రాజి' మధురమే
కౌగిలిని అడగమని సుఖమునే వేడితిని
@
గజల్ కౌముది

13, జనవరి 2017, శుక్రవారం

నీ తలలో మల్లియలా మిగలాలని ఉంది





నా ఈ చిత్రానికి గజల్ రచించిన శ్రీ మాధవరావు కొరిప్రోలు గారికి ధన్యవాదాలు.

గజల్ 1326.*** Pvr Murthy గారికి ధన్యవాద చందనములతో..
నీ తలలో మల్లియలా మిగలాలని ఉంది..!
నీ కన్నుల తడిచాటున ఒదగాలని ఉంది..!
అలాతిరిగి ఉన్నాసరె అటే వత్తు నేను..
నీ పెదవుల మెఱుపుతీవ కావాలని ఉంది..!
ఆశకేమి తెలియదులే నా ప్రేమ అర్థం..
నీ కలలకు పానుపుగా మారాలని ఉంది..!
ఏ పూవులు బాణాలుగ వేయలేను చూడు..
నీ మౌనపు వెన్నెలలో ఆడాలని ఉంది..!
రాలుతున్న చెమటచుక్క గాలికలుసు కాదు..
పవిత్రతకు క్రొత్తర్థం చెప్పాలని ఉంది..!
ఈ చెలిమిని ఓ కలిమిగ నిలుపుతున్న దేమి..?!
మాధవుడా..నీ గజలై..వెలగాలని ఉంది..!!

10, జనవరి 2017, మంగళవారం

నా మౌన దీక్షనే చెరిపేసి వెళ్ళింది - గజల్


Pvr Murty గారి పిక్ కి ఒక గజల్ ప్రయత్నం ...
నా మౌన దీక్షనే చెరిపేసి వెళ్ళింది ||
తన ప్రేమ తెమ్మెరతొ తాకేసి వెళ్ళింది ||
ఓ స్వప్న కాంక్షనె నాలోన నింపేసి
మరు ధ్యాస లేకుండ చేసేసి వెళ్ళింది ||
ఏమాయ ఏమిటో అరుదైన పులకింత
తనరూపు మనసంత నింపేసి వెళ్ళింది ||
తడికాలి ముద్రలతొ ఇల్లంత చుట్టేసి
ప్రతి అడుగుపై పేరు చెక్కేేసి వెళ్ళింది ||
తానంటె నేననీ విడదీయ వద్దనీ
చెంపపై తాకుతూ చిటికేసి వెళ్ళింది ||
నిద్దురే మరిచాను తనలోన నిలిచాను
ఊహంత ఊపిరిగ ముడివేసి వెళ్ళింది ||
........వాణి, 09 Jan 17

7, జనవరి 2017, శనివారం

భాష - యాస


నా పెన్సిల్ చిత్రం.
(విశాఖపట్నం సిటీబస్ లో విన్న cell phone సంభాషణ ప్రేరణతో)
ఏటే మాలచ్చిమి. నిన్న ఎన్నిసార్లు ఫోన్ సేసినా ఫొన్ తియ్యనేదేటి..?
ఏటో, నా ఫోన్ సిఛాప్ (switch off) అయిపోనాదే. నిన్న మా కోడలు డెలివరి అయినాదే. మొగ పిల్లాడు పుట్టాడు.
ఓలమ్మో .. అయితే నానమ్మ అయిపోనావన్నమాట. ఎక్కడ డెలివరి సేయించినావ్ .. ?
సెవెనిల్స్ (Seven Hills)
ఆ.ఆ.. ఆ ఆస్పిటల్ బాగానే ఉంటదిలే.. ఏటి నార్మలా .. సిజిరియనా..(cesarean) బోలెడు కర్సయ్యుంటది. నీకేటి.. మీ ఈరకత్తె (వియ్యపురాలు) ఆల్లూ పెట్టుకునుంటరు.
సిజిరియనే .. ఇయ్యాల రేపు నార్మలెక్కడుందే..?
నీ పెనిమిటి ఎట్టాగున్నాడే .. ?
ఆడా .. ఆడికి రెండు రోజులకాడ్నుండి గొంతు నొప్పి.. తాగి తొంగున్నాడు.
ఇన్ఫ్లెక్సన్ (infection) అయ్యుంటాది. ఇయ్యాల రేపు అందరికీ ఇన్ఫ్లెక్శన్ లే. మన నూకోలని (New Colony) లో ఇరవై రూపాయల డాక్టరున్నాడు గందా.. అక్కడ సూదిమందు ఏయించవే.. తగ్గిపోద్ది.
అలాగేనే.. ఊంటానే మరి .. బై ..

5, జనవరి 2017, గురువారం

మొదటి వారం






Pencil sketch - మొదటి వారం -
కవిత - courtesy Sri Vemuri Mallik

ప్రతీ నెలా మొదటివారం..
ఇచ్చుకోళ్ళతో మాసారంభం..
తెచ్చుకోళ్ళకే తిరుగుడనంతం..
పాలబిల్లు..పేపరు బిల్లు..
కేబులు బిల్లు..నిర్వహణ బిల్లంటూ..
బిల బిలా బిల్లు బిల్లంటూ జనాలు..
మందుల చిట్టా కిరాణ చిట్టా..
కాఫీ పొడంటూ గాస్ బుక్కంటూ..
బియ్యానికి గడువంటూ ఇల్లాలు..
బాంక్ కెళ్ళి గీకి గీకి తెచ్చుకున్న డబ్బులు..
పెన్నుతో గీసి కొట్టేసే లెక్కలు..
పోదుపునేర్చుకొమ్మంటూ రంకెలు..
తినేప్పుడు సద్దుకోరు..
తెచేప్పుడు ఆరాలంటూ..
ముక్తాయింపులు..
నూని చూసి వాడంటూ భర్తగారి డబాయింపులు..
వేళ్ళమధ్య సిగరెట్టు కేసి ఇల్లాలి వంకర చూపులు..
అబ్బబ్బా మధ్యతరగతి జీవులు..
అమ్మోయ్ నెల మొదటివార పీడితులు..!!

4, జనవరి 2017, బుధవారం

హరికధా పితామహుడు - ఆదిభట్ల నారాయణదాసు


Sasikala Volety with Pvr Murty. - నేను చిత్రీకరించిన బహుముఖ ప్రజ్ఞాశాకు ఆదిభట్ల నారాయణదాసు గారి బొమ్మ కి శ్రీమతి శశికళ ఓలేటి గారు రచించిన పద్య కుసుమాలు. వారికి నా ధన్యవాదాలు.

యొజ్జై హరికధఁ గూరిచి
ముజ్జగములు, యబ్బుర పడ, మూల పురుషుడై.
కం**************
2. సంగీత, నాట్య మిళితము,
వాంగ్మయ భూషిత, పురాణ భరిత, హరికధన్,
వాగ్దేవి కరుణ, నిచ్చెన్,
భాగవతోత్తముని భంగిఁ, భక్తితొ, భువికిన్.
***************
ఆ.వె3.
ఆది భట్టు యదియె యాది నారాయుణౌ,
లయను బ్రహ్మ వలె కళలను విరిసె.
రాసె వాసి మీర, రామ చంద్ర శతకం,
హరి కధామృతమును యరయ ప్రీతి.
***************
4.ఆ.వె.
కాళ్ళ గజ్జె కట్టి, కంచు కంఠము తోడ,
చిడత గొట్టు లయకు చేవ గూర్చ.
సంస్కృతాంధ్ర మందు సరిలేరు వారికి,
రాగ నవతి వృతము వ్రాసె భళిగ.
***************
5. ఆ.వె.
వన్నె దెచ్చె బిరుదు సాహితీ స్వర బ్రహ్మ.
తాత గారు వారు, తనదు(దనర) వృత్తి.
కంచు కంఠ మదియె కంఠీరవుని గాంచ,
సరసి జాక్షి దయతొ సంగతించ.
***************
శీ. P.V..R. మూర్తి గారి అద్భుత పెన్సిల్ చిత్రానికి.

2, జనవరి 2017, సోమవారం

గజల్ - భావగీతి


నా చిత్రానికి స్పందించి జ్యోతి కంచి గారు రచించిన గజల్
గజల్ ॥భావగీతి॥
~~~~~~~~~~
సూత్రమొకటి నిన్నునన్ను కలుపుతుంటె బాగున్నది!!
జతవీడని మంత్రమొకటి పలుకుతుంటె బాగున్నది!!
అంబరాన మేఘమాల నీకన్నుల దాగెనులే
నీచూపులు చిరుజల్లై జారుతుంటె బాగున్నది!!
మదిదోచిన దొరవైనా చోరతనమె నేర్చెనులే
నీచేతులు పెనవేస్తూ వెతుకుతుంటె బాగున్నది!!
నెలరాజే నింగివీడి నాచెంతకు చేరెనులే
నీరూపున నామదిలో నిండుతుంటె బాగున్నది!!
దొండపండు పెదవిఅంచు హసితమధువు తాగెనులే
నీనవ్వులు మువ్వలుగా మోగుతుంటె బాగున్నది!!
ముంగురులను సవరిస్తూ వేలికొసలు తాకెనులే
నీఊసులు గుసగుసగా వేడుతుంటె బాగున్నది!!
శ్వాసలోన నిన్నునిలిపి శృతిచేసెను ప్రియ'జ్యోతి'
మనబంధమె భావగీతి పాడుతుంటె బాగున్నది!!
...Jk2-1-17(చిత్రం Pvr Murtyబాబాయ్ గారు..ధన్యవాదాలుబాబాయ్ గారు)

అమ్మకే అమ్మ అమ్మమ్మ

 ​ అమ్మకే అమ్మ అమ్మమ్మ (pen sketch) ఆ గుండె చప్పుడు వింటూ ఒదిగిపోతా, నీ దీవెనల నీడలో పెరిగి పెద్దవుతా. తరాలు దాటిన మన ప్రేమానుబంధం, ఈ సృష్టి...